30, జులై 2014, బుధవారం

కౌరవులు

మనకు కౌరవులు గాంధారి, ద్రుతరాష్ట్రునికి పుట్టిన వంద మంది అని తెలుసు కాని వారి పేర్లు పెద్దగా అవసరం లేదు. కాని ఈనాడు పెరుగుతున్న కొత్త పేరుల పిచ్చి లో ఎవరూ ఈ పేర్లు పెట్టుకోకుండా ఉండాలని ఆశిస్తూ ఆ వందమంది పేర్లు ఇక్కడ ఇస్తున్నాను. 


  1. దుర్యోధనుడు
  2. దుశ్శాసనుడు
  3. దుర్దర్షుడు
  4. జలసంధుడు
  5. సహుడు
  6. సముడు
  7. విందుడు
  8. అనువిందుడు
  9. దుర్భాషుడు
  10. సుబాహుడు
  11. దుష్ట్రధర్షణుడు
  12. ధర్మధుడు
  13. చిత్రయోధి
  14. దుష్కర్ణుడు
  15. కర్ణుడు (కుంతీ పుత్రుడు కాదు)
  16. వివింశతి
  17. జయసంధి
  18. సులోచనుడు
  19. చిత్రుడు
  20. ఉపచిత్రుడు
  21. చిత్రాక్షుడు
  22. చారువిత్రూడు
  23. శతాననుడు
  24. ధర్మర్షణుడు
  25. దుర్ధర్షణుడు
  26. వివిర్సుడు
  27. కటుడు
  28. శముడు
  29. ఊర్ణనాధుడు
  30. సునాధుడు
  31. నందకుడు
  32. ఉపనందకుడు
  33. సేనాపతి
  34. సుషేణుడు
  35. కుండో
  36. ఉపకుండో
  37. మహోదరుడు
  38. చిత్రధ్వజుడు
  39. చిత్రరధుడు
  40. చిత్రభానుడు
  41. అమిత్రజిత్
  42. సువర్ముడు
  43. దుర్వియోచనుడు
  44. చిత్రసేనుడు
  45. విక్రాంతకుడు
  46. సుచిత్రుడు
  47. చిత్రత్రుడు
  48. చిత్రవర్మ
  49. భ్రుత్
  50. అపరాజితుడు
  51. పండితుడు
  52. శాలాక్షుడు
  53. దురావజితుడు
  54. జయంతుడు
  55. జయత్సేనుడు
  56. దుర్జయుడు
  57. దృఢహస్తుడు
  58. సుహాస్తుడు
  59. వాతవేగుడు
  60. సువర్చనుడు
  61. ఆదిత్యుడు
  62. కేతువు
  63. బహ్వంశి
  64. నాగదంతుడు
  65. ఉగ్రశాయి
  66. కవచి
  67. నశింగి
  68. దాసి
  69. దండధారుడు
  70. దనుర్గ్రహుడు
  71. ఉగ్రుడు
  72. భీముడు
  73. రథభీముడు
  74. భీమబాహుడు
  75. ఆలోపుడు
  76. భీమకర్ముడు
  77. సుబాహుడు
  78. భీమవిక్రాంతుడు
  79. అభయుడు
  80. రౌద్రకర్ముడు
  81. దృఢరధుడు
  82. అనానృదృడు
  83. కుండభేది
  84. విరావి
  85. దీర్ధలోచనుడు
  86. దీర్ఘధ్వజుడు
  87. దీర్ఘ భుజుడు
  88. అదిర్ఘుడు
  89. దీర్ఘుడు
  90. దీర్ఘబాహుడు
  91. మహాబాహుడు
  92. ప్యూడోరుడు
  93. కనకధ్వజుడు
  94. మహాకుండుడు
  95. కుండుడు
  96. కుండజుడు
  97. చిత్రజాసనుడు
  98. చిత్రకుడు
  99. కవి
  100. సోదరి దుస్సల.

26, జులై 2014, శనివారం

దశరధుడు

 దశరధుడు మనకు శ్రీరామచంద్రుని తండ్రిగా తెలుసు. తన చిన్న భార్యకు ఇచ్చిన మాట ప్రకారం శ్రీరాముడిని అడవికి పంపిన వానిగా మనకు బాగా తెలుసు. కాని అతని కి మరో రకమైన గుర్తింపు ఏమీ లేదా?

ఉంది. దశరధుడు మహావీరుడు. ధర్మ చరిత్రము కలిగినవాడు. ఇతని వీరత్వం,యుద్ధ కుశలతను చుసిన ఇంద్రుడు స్వయంగా తనకు రాక్షసులతో జరిగే యుద్ధం లో సహాయం కోసం దశరధుడిని పిలిపించే వాడు.
రాక్షసులు మాయా యుద్ధం లో ఆరితేరిన వాళ్ళు కనుక వారి తో యుద్ధం చేసే సమయం లో వారిని సైతం మోహింపచేసే విధంగా, ఒక అధ్బుతమైన రధాన్ని ఇంద్రుడు ప్రసాదించాడు. ఆ రధ విశిష్టత ఏమిటంటే ఆ రధం దశ దిశలకు ప్రయాణించగలదు. (4 దిక్కులు, 4 మూలలు, పైకి, క్రిందకి) మరియు దశరధుడు ఆ రధం లో నిలబడి ఉంటే అతను ఆ దశదిశలకు ఒకేసారి గమనించగలడు. ఆ రధంలో అతనిని దాడి చేయాలనుకున్న ఏ రాక్షసునికైన ఆటను తననే గమనిస్తున్నట్లు అనిపిస్తుంది. నిజమైన దశరధుడు ఎవరో, మాయ (ఛాయ) దశరధుడు ఎవరో తెలియని విధంగా కనిపిస్తాడు. రాక్షసులను సైతం మోసపరిపించగల ఆ అద్భుతమైన రధం ఉండుట వల్లనే అతని ని దశరధుడు అని అంటారు.  

23, జులై 2014, బుధవారం

అర్జునుని నామములు

 అర్జునుని నామములు మనం సహజంగా పిడుగులు పడుతున్నపుడు చదువుతాము. ఆ సమయం లో ఈ పది నామములు చదివితే మనకు దగ్గరలో పిడుగులు పడవు అని సక్షాత్తు ఇంద్రుడే చెప్పాడు అని చెప్తారు. ఇప్పుడు అట్టి పది నామముల గురించి తెలుసుకుందాం!


  1. అర్జున : కన్నులకు సొంపైన, సుందరమైన శరీర కాంతి కలవాడు 
  2. ఫల్గుణ : పూర్వ ఫల్గుణ, ఉత్తర ఫల్గుణ నక్షత్రముల మద్య సంధ్య కాలమున పుట్టినవాడు 
  3. పార్ధ     : పృధ (కుంతీదేవి అసలు పేరు) కు జన్మించిన వాడు 
  4. కిరీటి   : ఇంద్రుని చేత ప్రసాదించిన కిరీటం కలిగినవాడు
  5. శ్వేతవాహన : తన రధానికి ఎల్లప్పుడూ తెల్లని గుర్రములు కలిగిఉండే వాడు 
  6. భీభత్స : యుధం చేస్తున్నప్పుడు సర్వం మర్చిపోయి అతనిని చూడాలనిపించే కౌశలం కలవాడు 
  7. విజయ : ఓటమి తెలియని వీరుడు 
  8. జిష్ణ : తాను ఆయుధం పట్టి ఉండగా తన అన్నధర్మరాజు మీద ఎవరైనా బాణప్రయోగం చేస్తే వారిని సంహరిస్తాను అని ప్రతిజ్ఞ చేసాడు కనుక జిష్ణుడు 
  9. సవ్యసాచి : రెండుచేతులతో బాణ ప్రయోగం చేయగలిగిన వాడు 
  10. ధనుంజయ : రాజసూయ యాగ సమయం లో సర్వ రాజ్యములను గెలిచి ధనమును తెచ్చిన వాడు. 

22, జులై 2014, మంగళవారం

వజ్రాంగుడు

కశ్యప ప్రజాపతికి 13 మంది భార్యలు. వారిలో దితి, అదితి పుత్రులు దైత్యదేవతలు. వారిరువురి మద్య ఉన్న విభేదాల కారణoగా ఎల్లప్పుడూ దితిపుత్రులైన దైత్యులు మృత్యువాత పడుతూ ఉన్నారు.

ఇలా కొంతకాలం గడిచాక ఒకనాడు దితి తన భర్త ఐన కశ్యప ప్రజాపతి వద్దకు వెళ్లి తన భాదలు చెప్పుకోసాగింది. ప్రాణనాద! నా పుత్రులైన హిరణ్యకశిపుడను, హిరణ్యాక్షుడను శ్రీహరి నరసింహ, వరాహావతారములు ధరించి చంపాడు. ఇంద్రుని చంపే పుత్రుని కోసం నేను నిష్టగా వ్రతం చేస్తూ ఉన్న సమయం లో ఒకనాటి మద్యాహ్నం జరిగిన కించిత్ అపచారానికి ఇంద్రుడు నా గర్భం లో ప్రవేశించి ఆ పిండాన్ని ముక్కలు చేసాడు. ఆ ముక్కలు మరుత్తులుగా ఉన్నారు. నాకు ఇప్పుడు మరొక సంతానం కలిగించవలసినది అని కోరినది. 

అప్పుడు కశ్యపుడు ఆమెను బ్రహ్మ దేవుని గురించి తపస్సు చేయమని చెప్పారు. అప్పుడు ఆమె ఒక పది వేల సంవత్సరములు తపస్సు చేసింది. బ్రహ్మదేవుడు ప్రత్యక్షమై వరం కోరుకోమని అడుగగా, ఆమె అన్ని లోకములను గెలువగలిగిన పుత్రుడు కావలి అని కోరింది. బ్రహందేవుడు వరం ఇచ్చాడు. ఆ వర ప్రభావం తో ఆమె గర్భం దాల్చి ఒక బిడ్డను ప్రసవించినది. అతనికి వజ్రాంగుడు అని నామకరణం చేసారు.  

వజ్రాంగుడు పుట్టిన నాటి నుండి ఆమె అతనికి ఇంద్రుని గురించి, ఇతర దేవతలగురించి మనోవైకల్యం కలిగేటట్లు చెప్తూ ఉండేది. ఇలా పెరిగి పెద్దవాడయిన వజ్రాంగుడు దేవతలను గెలిచి, అందరిని ఇబ్బంది పెడుతూ ఉన్నాడు. సర్వదేవతలను బంధించి తన కారాగారం లో ఉంచాడు. 

అది గమనించిన బ్రహ్మదేవుడు, కశ్యపుడు వజ్రాంగుని వద్దకు వచ్చారు. వచ్చినవారిని చూసిన వజ్రాంగుడు వారికి అతిధి మర్యాదలు చేసాడు. వజ్రాంగుడు చేసిన అతిధి మర్యాదలను చూసి సంతోషించిన బ్రహ్మదేవుడు ఇంద్రుడిని, ఇతర దేవతలను వజ్రాంగుడు భందించటానికి గల కారణం తెలుపమని, వారిని కారాగారం నుండి విడుదల చేయమని కోరాడు. బ్రహ్మదేవుని మాటలు విన్న మరుక్షణం వజ్రాంగుడు వారిని విడుదల చేసాడు. తాను ఇంద్రాది దేవతలను భందిస్తే తనకు మనఃశాంతి కలుగుతుందని తన తల్లి ఐన దితి కోరిక మేర వారిని భందించాను అని చెప్పాడు. 
స్వతహాగా మంచివాడయిన వజ్రాంగుడిని చూసి బ్రహ్మదేవుడు అతనికి సత్వగుణమే ప్రమాణంగా ఇకముందు జీవించు అని చెప్పి, వరాంగి అనే ఒక కన్యను సృష్టించి అతనికి ఇచ్చి వివాహం చేసాడు. 

అలా వరాంగితో కలసి దైవచింతనతో, సత్వగుణం తో జీవనం సాగిస్తూ ఉండగా, ఒకరోజు వజ్రాంగుడు తనభార్య వద్దకు వచ్చి ఆమెకు పుత్రసంతానం కలిగేలా దేవిoచటానికి మనస్సు ఉవ్విళ్ళూరుతుంది కనుక ఆమెకు ఎటువంటి పుత్రుడు కావాలో కోరుకొమ్మని అడిగాడు. దానికి వరాంగి తనకు వజ్రాంగుడి తో సమానమైన బలపరాక్రమములు కలిగి, సర్వలోకములను తన అధినం లో ఉంచుకోగలిగిన పుత్రుడు కావలి అనికోరింది. ఇట్టి వరం ఆమె కోరుతుందని ఊహించని వజ్రాంగుడు నివ్వెరపోయి తన అంతఃపురానికి వెళ్లి బాగా అలోచించి, బ్రహ్మగురించి తపస్సు చేయ సాగాడు. అతని తపస్సుకు మెచ్చిన బ్రహ్మదేవుడు ఇట్టి తపస్సుకు కారణం ఏమని అడుగగా బ్రహ్మదేవునిచే సృష్టించబడిన తన భార్య వరాంగి కోరికని వివరించి ఆమెకు అట్టి పుత్రుడిని ప్రసాదించవలసినది అని కోరుకున్నాడు. తధాస్తు అని బ్రహ్మదేవుడు తన లోకానికి వెళ్ళిపోయాడు. 

ఆ వర ప్రాభవం వల్ల వరంగి కొంతకాలానికి ఒక మగబిడ్డను ప్రసవించినది. ఆ బిడ్డకు కశ్యపుడు తారకుడు అని నామకరణం చేసాడు. కాలాంతరంలో అతనే తారకాసురుడు అని లోకం చేత పిలిపించుకున్నాడు.  

20, జులై 2014, ఆదివారం

విశ్వామిత్రుడు - బ్రహ్మర్షి


విశ్వామిత్రుడు పుట్టుకతో క్షత్రియుడు. మహారాజయిన గాధి కి కుమారుడైన విశ్వామిత్రుడు చాలా కాలం రాజ్యాపాలన చేశాడు. ఒకసారి  ఆయన గొప్పదైన తన  సైన్యంతో భూమి అంతా తిరుగుతూ తన రాజ్యంలోనే ఉన్న వశిష్టమహర్షి ఆశ్రమం లోకి వెళ్లారు. ఆ ఆశ్రమంలోఅనేక వేల మంది శిష్యులు ఉన్నారు. ఆ ఆశ్రమం పర్ణశాలలతో, చెట్లతో, జంతువులతో శోభాయమానంగా ఉంది.అంత పరమ పవిత్రమైన ఆశ్రమం లోకి విశ్వామిత్ర మహారాజు తన సైన్యాన్ని బయట విడిచి వెళ్లారు. కుశలప్రశ్నలు గౌరవ మర్యాదలు ఇచ్చి పుచ్చుకున్న తరువాత విశ్వామిత్రుడు తానూ బయలుదేరుటకు అనుమతి ఇవ్వవలసినదిగా వశిష్టమహర్షిని కోరారు. అప్పుడు వశిష్టుడు అతిధిగా వచ్చిన విశ్వామిత్రుడు తమ  ఆతిధ్యం తీసుకోవాలి అన్నాడు. ఐతే విశ్వామిత్రుడు తానూ ఒక్కడినే రాలేదు, తనతో తన సైన్యం వచ్చింది కనుక వారు అంతా  అక్కలిగా ఉన్నప్పుడు తానూ భుజిoచలేను అని చెప్పాడు. అది విన్న వసిష్టుడు వారి సైన్యం ఎంతున్నా వారికి తానూ ఆతిధ్యం ఇవ్వగలను అని సర్వ సైన్యమును పిలచి నీటి ఏర్పాట్లు చేసారు.
అప్పుడు వశిష్ట మహర్షి నందినిని పిలిచి, "ఓ! నందిని, మన ఆశ్రమం లోకి ఈ రోజు విశ్వామిత్ర మహారాజు, వారి సైన్యం వచ్చారు. కనుక నువ్వువారికి ఉత్తమమైన భోజనం ఏర్పాట్లు చెయవలసినది . ఎవరికి ఏది కావాలో,  ఎవరికి ఏది ఇష్టమో అది ఏర్పాటు చెయగలవు" అనిచెప్పారు. ఆ నందిని ఎవరెవరు మనసులో ఏమీ ఏమి కావాలి అనుకుంటున్నారో గ్రహించి, చెరుకు కర్రలు, తేనే, పానీయములు, అన్నపు రాశులు, కూరలు, పాచ్చళ్లు, పులుసులు, పళ్లరసాలు, పాలు, తాంబూలాలు మొదలైన సర్వo సిద్ధం చేసింది.   ఆ భోజనాన్ని సైనికులందరు భుజించారు.
ఒక గోవు ఉత్తర క్షణంలో ఇన్‌న్టమందికి సరిపడా భోజనాన్ని సృస్టించింది అనే సరికి, విశ్వామిత్రుడు ఆశ్చర్యపోయాడు. ఆయనకి మెల్లగా ఆ నందినిని తన స్వంతం చేసుకోవాలి అనే కోరిక పెరిగింది. అప్పుడాయన వశిష్ట మహర్షి తో,ఒక లక్ష ఆవులకు ప్రతిగా నందినిని ఇవ్వమని అడుగగా వశిష్టుడు అంగీకరించలేదు. కోపించిన విశ్వామిత్రుడు " రాజ్యంలో ఎక్కడన్నా రత్నాలు ఉంటే అవి రాజుకే చెందుతాయి. రాజు దగ్గర విలువైనవి ఉండాలి. చాలా విలువైనది రత్నమైతే, ఈ నందిని కూడా రత్నమే. నా సొత్తు రత్నాన్ని నువ్వు ఉంచుకున్నావు. అందుకే ఇప్పుడు నేను ఈ రత్నాన్ని తీసుకెళ్తున్నాను" అని అన్నాడు.
నాయనా విశ్వామిత్రా! ఈ ఆవు ని నీవు వెలకడుతున్నావు, ఒక రత్నముగా దాచుకోవాలి అనుకుంటున్నావు. కానీ ఈ ఆవు మాకు ఆశ్రమo లో దేవతారాధనకి, పితృదేవతారాధనకి పాలు ఇస్తుంది. నా ప్రాణయాత్ర దీనితో జరుగుతుంది. ఈ ఆశ్రమo లోని యజ్ఞాలు, విధ్యాభ్యాసం సమస్తమూ ఈ నందిని మీద ఆధారపడి ఉంది. కాబట్టి, నేను ఈ గోవుని నీకు ఇవ్వాలేనని వశిష్ట మహర్షి అన్నారు. ఈ సారి విశ్వామిత్రుడు ఎంతో ధనాశచూపాడు. అయినా వసిష్టుడు అంగీకరించలేదు.
ఆగ్రహించిన విశ్వామిత్రుడు, కోపం తలకు ఎక్కినవాడయ్యి, నేను రాజును నాకు ఒకరు ఇవ్వటం ఏమిటి నేను ఆమిన తీసుకోగలను అని నందిని  మెడలో తాడు కట్టి, సైనికులకిచ్చి  తీసుకెళ్ళమన్నాడు. వాళ్ళు దాన్ని ఈడ్చుకెళుతుంటే, ఆ నందిని భాదపడి,  నిశ్శబ్దంగా ఉన్నవశిష్టుని అడిగింది. "ఓ వశిష్టమహర్షి! నన్ను నీవు ఎందుకు వద్దనుకుంటున్నావు!నన్ను ఇతనితో ఎందుకు పంపిస్తున్నావు?"
అప్పుడు వశిష్టుడు, "నందిని!నేను నిన్ను వదల లేదు ఆ విశ్వామిత్రుడే నిన్ను బలవంతంగా తీసుకెళ్తున్నాడు. నేను బ్రహ్మనుడను, అతను రాజు. నేను అతనిని ఎదిరించి నిన్ను దక్కించుకోలేను. నీవు నిన్ను రక్షిoచుకోగలిగితే రక్షిo చుకో!"
అప్పుడు నందిని సూర్య ప్రకాశం తో సమానమైన కాంభోజ వంశీయులని, తన పొదుగు నుండి కొన్ని వేల పహ్లావులని, యోని నుండి యావనులని, గోమయం పడే స్థానం నుంచి సాకులు, రోమకూపాల నుండి హారీతులు మరియు కిరాతకులని సృస్టించింది. వీరందరు కలిసి విశ్వామిత్రుని  సైన్యాన్ని సమూలంగా నాశనం చేసారు.
తన రధం నుండి కిందకు దిగి తన సైన్యాన్ని చూసిన విశ్వామిత్రుడు నిస్తేజుడు అయ్యాడు. ఆ ఆవు తలుచుకుంటే గొప్ప సైన్యాన్ని, అమోఘమైన భోజనాన్ని సృస్టించింది. తన సైన్యం ఎందుకు పనికి రాకుండా చనిపోయారు. కనుక రాచరికం కన్నా తపః శక్తి చాలా గొప్పది. ఈ వశిష్టుడిని నేను గెలవాలి అంటే నాకున్న శక్తి సరిపోదు. కావున నాకు ధనుర్వేదం లోని సమస్త అస్త్రశాస్త్రాలు తెలియాలి అనుకోని, ఒక కుమారుడిని సింహాసనం మీద కూర్చోబెట్టి, రాజ్యపాలన చెయ్యమని చెప్పి, తాను తపస్సు చేసుకోవటానికి హిమాలయ పర్వతాలకి వెళ్లాడు. 
హిమాలయ పర్వతాలమీద మహాదేవుని గూర్చి ఘోరమైన తపస్సు చేశాడు. తపస్సుకు మెచ్చి ప్రత్యక్షమైన పరమేశ్వరుడిని ఏగురు ఉపదేశం లేకుండానే ధనుర్వేదం ప్రసాదించమని కోరాడు.  శివుడు తధాస్తు అన్నాడు. ఇప్పుడు వచ్చిన అస్త్రశస్త్రములను చూసుకుని ఆత్మవిశ్వాసంతో రధమెక్కి వశిష్టుడి ఆశ్రమాన్ని చేరుకున్నాడు. కనీసం ఒక్క మాట కూడా చెప్పకుండా ఆ అస్త్రాలని ఆశ్రమం మీద ప్రయోగించాడు. అనుకోని ఈ పరిణామాలు ఏమిటో తెలియని ఆ ఆశ్రమం లోని శిష్యులు, జంతువులు ఒక్కసారిగా ఆక్రందనలు చేసారు. క్షణాలలో ఆశ్రమ వాతావరణం మారిపోయింది. ఆశ్రమంలో వశిష్టుడు ఒక్కడే మిగిలాడు. అప్పుడు విశ్వామిత్రుడు ఆగ్నేయాస్త్రాన్ని  ప్రయోగించాడు.  వశిష్టుడు తన బ్రహ్మాదండం పట్టుకుని కింద కూర్చున్నారు. ఆయన ఆ బ్రహ్మాదందాన్ని అలా పట్టుకుని ఉంటే ఆ ఆగ్నేయాస్త్రo చల్లారిపోయి ఆ బ్రహ్మాదండం లోకి వెళ్లిపోయింది.

అప్పుడు విశ్వామిత్రుడు ఒకేసారి వారూణాస్ట్రం, ఇంద్రాస్త్రం, పాశుపతాస్త్రం, గాంధర్వాస్త్రం,
బ్రహ్మపాశం, కాలపాశం, వారూణాపాశం, పిణాకాస్త్రం, క్రౌంచాస్త్రం, ధర్మచక్రం, కాలచక్రం, విష్ణుచక్రం, త్రిశులం, కపాలం అనే కంకణం, రకరకాల పిడుగులు, పెద్ద పెద్ద గధలు మొదలైన రకరకాల అస్త్రాలని వశిష్టుడి మీద వేశాడు. కానీ ఆయన వేసినవన్ని వశిష్టుడి బ్రహ్మాదండం లోకి వెళ్ళిపోయాయి.

ఇక తనదగ్గర ఉన్న ఒకేఒక్క అస్త్రమైన బ్రహ్మాస్త్రాన్ని అభిమంత్రించి వదిలాడు. అప్పటిదాకా ఎంతోమంది గొప్పవాల్ళని మట్టుపెట్టిన ఆ బ్రహ్మాస్త్రం నిశ్శబ్దంగావశిష్టుని బ్రహ్మాదండం లోకి వెళ్లిపోయింది.

వశిష్టుడు బ్రహ్మర్షి కనుక నేను ఆయనని ఓడించలేకపోయాను. కాబట్టి నేను బ్రహ్మర్షిని అవుతానని విశ్వామిత్రుడు దక్షిణ దిక్కుకి వెళ్లాడు. 

అక్కడ ఆయన తన పెద్ద భార్య తో 1000 సంవత్సరాలు ఘోరమైన తపస్సు చేశాడు. ఈ కాలంలోనే ఆయనకి హవిష్పాంధుడు, మధుశ్యంధుడు, ధృదనేత్రూడు, మహారధుడు అని నలుగురు కుమారులు పుట్టారు. ఆయన తపస్సుకి సంతోషించిన బ్రహ్మదేవుడు ప్రత్యక్షమై రాజర్షి విశ్వామిత్ర అని పిలిచారు. ఇన్ని సంవత్సరాలు తపస్సు చేస్తే రాజర్షి అయ్యాను, ఇంకా బ్రహ్మర్షి ఎప్పుడవుతానో అని విశ్వామిత్రుడు దిగులుపడ్డాడు.

విశ్వామిత్రుడు రాజర్షిగా ఉన్నప్పుడే త్రిశంకుడికి ప్రత్యేకమైన స్వర్గాన్ని నిర్మించాడు. 

బ్రహ్మర్షి గా మారటానికి ఇంకా ఘోరమైన తపస్సు చేయదలచి పశ్చిమ దిక్కునకు వెళ్లి తపస్సు చెయ్యటం మొదలుపెట్టాడు. అదే కాలంలో అయోధ్య నగరాన్ని అంబరీషుడు అనే రాజు పరిపాలన చేస్తుండేవాడు. ఆయన అశ్వమేధ యాగం చేసి వదిలిపెట్టిన గుర్రాన్ని ఇంద్రుడు తీసుకెళ్లిపోయాడు. అశ్వo  దొరకకపోతే తనకి మంచి జరుగదని మహర్షులు చెప్పారు. కానీ, అశ్వానికి బదులుగా ఒక మనుష్యుడిని న్యాయంగా తీసుకువస్తే యాగాన్ని పూర్తి చెయ్యవచ్చు అన్నారు. 
ఒక మనిషిని తీసుకురావటం కోసం అంబరీషుడు బయలుదేరగా ఒక చోట, భరుగూతూంగమనే ఒక పర్వత శిఖరం మీద, రుచీకుడు అనే ఒక ఋషి, భార్యా పిల్లలతో కూర్చుని ఉన్నాడు. అప్పుడు ఆ అంబరీషుడు వాళ్ళ దగ్గరికి వెళ్ళి, నా యాగాస్వాం అపహరణకి గురైనందున నాకు ఒక యాగపశువు కావాలి. మీకు ఉన్న పిల్లలలో ఒకడిని ఇచ్చి నన్ను అనుగ్రహించండి అన్నాడు. 

అప్పుడా రుచీకుడు ఇలా అన్నాడు," పెద్ద కొడుకు ధర్మాసంతానం, శాస్త్రం ప్రకారం చిట్టచివరి వాడిని ఇస్తే ఐశ్వర్యం పోతుంది కావున నేను వారిని ఇవ్వలేను. అప్పుడు మధ్య కొడుకైన శునఃశెవుడు అంబరీషుడితో వస్తానన్నాడు.

రాజు బ్రతికి ఉంటే రాజ్యం బాగుంటుంది. రాజు బ్రతికి ఉండాలంటే, యాగం పూర్తవ్వాలి. యాగం పూర్తి చెయ్యటానికి తన కొడుకుని పంపాడు ఆ రుచీకుడు. అంబరీషుడు ఆయనకి లక్ష గోవులని దానంగా ఇక్చాడు. శునఃశెవుడిని తీసుకువెళ్తున్న అంబరీషుడు కొంత దూరం ప్రయాణించాక, విశ్రాంతి తీసుకుందాం అని ఒక చోట ఆగాడు. అప్పుడు అక్కడికి దగ్గరలో ఉన్న విశ్వామిత్రుడి ఆశ్రమాన్ని శునఃశెవుడు చూసాడు. 

వెంటనే ఆశ్రమంలోకి వెళ్ళి విశ్వామిత్రుడి కాళ్ళ మీద పడి తాను విశ్వామిత్రుని కి మేనల్లుడను అని చెప్పి, జరిగిన సంగతి అoతా చెప్పి తనకు తప్పస్సు చేసి స్వర్గానికి వెళ్ళాలి అని ఉందని చెప్పాడు. అది విన్న విశ్వామిత్రుడు తన కొడుకులను పిలచి వారిలో ఒకరిని యాగ పశువుగా వెళ్ళమని చెప్పాడు. కాని అతని పుత్రులు దానికి నిరాకరించటం తో కోపించిన విశ్వామిత్రుడు వారిని కూడా వశిష్టుడి కుమారుల జాతిలో పుట్టి వెయ్యి సంవత్సరాలు వాళ్ళ లాగా కుక్క మాంసం తింటూ బ్రతకండని శపించాడు.

అప్పుడాయన శునఃశెవుడి కి రెండు మన్త్రములని చెప్పి అతనికి యూపస్తంభానికి కట్టినప్పుడు జపించమనీ, అల జపించుటవల్ల బలి ఇవ్వకుండానే యాగఫలం లభిస్తుంది కనుక అతనిని వధిoచరు అని చెప్పాడు. శునఃశెవుడు అంబరీషుని వెంట వెళ్ళిపోయాడు. అప్పుడు తాను  మరలా  తన తపఃశక్తి ని తన కుమారులను శపించుటకు దుర్వినియోగం చేశాను అని తెలుసుకుని ఇంకా ఎవరితో మాట్లాడకూడదు అని నిర్ణయించుకుని మళ్లీ తపస్సు చెయ్యటం ప్రారంభించాడు.
ఒకనాడు స్నాన నిమిత్తమై  పుష్కర క్షేత్రానికి వెళ్ళగా అప్పుడు అక్కడ స్నానం చేస్తున్న మేనక ను చూసి ఆమె సౌందర్యానికి  ముగ్ధుడైనాడు.
ఆమెను ఒప్పించి తన ఆశ్రమానికి తీసుకుని వెళ్లి ఆమెతో కాలం మరచిపోయాడు. కొంతకాలం తరువాత మళ్లీ తానూ తప్పస్సు మొదలుపెట్టిన విషయం గుర్తు వచ్చింది. తన తపస్సుని భంగం చేయటానికి దేవతలు ఈమెను పంపి ఉంటారు అని కోపం వచ్చినా అందులో ఆమె తప్పు ఏమిఉంటుంది అని భావించి ఈసారి ఉత్తర దిక్కుకి వెళ్ళి తపస్సు చెయ్యటం ప్రారంభించాడు.

ఉత్తర దిక్కున కౌశికి నది పక్కన కూర్చుని ఘోరాతిఘోర తపస్సు 1000 సంవత్సరాలు చేశాడు. అప్పుడు దేవతలతో కలిసి బ్రహ్మగారు ప్రత్యక్షమై మహర్షి వి అయ్యావు విశ్వామిత్రా అనిన్ చెప్పారు. కాని ఈ మాట విన్న విశ్వామిత్రుడికి ఏవిధమైన బాధ కానీ సంతోషం కానీ కలగలేదు. ఇన్ని వేల సంవత్సరాలు తపస్సు చేస్తే ఇప్పటికీ మహర్షిని అయ్యాను. ఇక బ్రహ్మర్శిని ఎప్పుడో అవుతానో అని బ్రహ్మగారిని, నేను నా ఇంద్రీయాలని గెలిచానా అన్నాడు. అప్పుడు బ్రహ్మదేవుడు, లేదు అని సమాధానం చెప్పారు.

ఇంతకాలం తపస్సు చేసిన కారణంగా విశ్వామిత్రుని పగ వశిష్టుడి మీద నుంచి తన ఇంద్రీయాల మీదకి వెళ్ళింది. తాను అనవసరంగా వశిష్టుడి మీద క్రోధాన్ని పెంచుకోవటానికి, మేనకతో కామానికి లొంగటానికి తన ఇంద్రీయాలే కారణమని గ్రహించాడు.మళ్లీ తపస్సు చెయ్యటం ప్రారంభించాడు. ఈ సారి పంచాగ్నుల మద్య తపస్సు చేశాడు. . విశ్వామిత్రుడు చేస్తున్న ఈ తపస్సుని చూసిన దేవేంద్రుడు ఆయనని పరీక్షించాలని రంభని పంపాడు. 
మరుసటి రోజు విశ్వామిత్రుడు స్నానం చేద్దామని వెళుతుంటే, ఆయనకి అప్పుడే స్నానం చేసి బయటకొస్తున్న రంభ కనిపించింది.  అయితే ఇదంతా ఇంద్రుడు తన తపస్సును భంగం చేయటానికి చేస్తున్న ప్రయత్నం అని గ్రహించి కోపంతో రంభను పదివేల సంవత్సరాలు రాయివై పడుండు అని శాపించాడు.తరువాత కొంతసేపటికీ  మళ్లీ క్రోధానికి లోనైయ్యాడని గ్రహించి రంభ అడగకుండానే, ఒకనాడు ఒక బ్రహ్మాణుడు నీకు శాపవిమోచనం కలిగిస్తాడు అని అన్నాడు. 

విశ్వామిత్రుడు ఈసారి తూర్పుకు వెళ్లి కుంభకం(యోగా లో ఒక క్రియ) ద్వారా తపస్సు చేయటం ప్రారంభించాడు. అలా వెయ్యి సంవత్సరాలు కుంభకంలో ఉండి తపస్సు చేసాడు. శరీరం లో బలం క్షీణించింది. కనుక దానిని నిలబెట్టుకోవటానికి ఒక్క ముద్ద ఏదైనా తినాలి అని అనుకుంటుండగా ఇంద్రుడు ఒక బ్రాహ్మణ రూపంలో వచ్చి, ఆకలిగా ఉంది కనుక ఏమైనా పెట్టమని అడిగాడు. వచ్చిన వాడు ఇంద్రుడు అని విశ్వామిత్రుడికి అర్ధం అయ్యింది. కానీ, ఈ సారి ఆయన ఇంద్రీయాలకి లొంగలేదు. ఇంద్రుడికి ఆ కబళాన్ని ఇచ్చి మళ్లీ కుంభకం లోకి వెళ్ళి తపస్సు చెయ్యడం ప్రారంభించాడు.
అలా విశ్వామిత్రుడు తపస్సు చేస్తుండగా తపోధూమo సమస్త లోకాలని కప్పేసింది. అప్పుడు దేవతలతో కలిసి బ్రహ్మగారు వచ్చి, "ఓ కౌశికా! నీ తపస్సుకి సంతోషించాను. నువ్వు బ్రహ్మర్షివయ్యావు. దేవతాలందరితో కలిసి నేను నిన్ను బ్రహ్మర్షి అని పిలుస్తున్నాను. నీకున్న సమస్త కోరికలు తీరుతాయి. నువ్వు దీర్ఘాయుష్మంతుడవై జీవిస్తావు" అన్నారు. 

అప్పుడు విశ్వామిత్రుడు బ్రహ్మ, "నేను బ్రహ్మర్షి అయిన మాట నిజమైతే, నాకు ఓంకారము, వశత్కారము వాటంతట అవి భాసించాలి అన్నాడు.అలాగే, ఎవరిమీద కోపంతో నేను బ్రహ్మర్షి అవ్వాలన్న పట్టుదలతో ఇన్ని సంవత్సరాలు తపస్సు చేసానో, ఆ వశిష్టుడితో బ్రహ్మర్షి అని పిలిపించుకోవాలని ఉందన్నాడు. బ్రహ్మసరే అన్నారు.

అప్పుడు దేవతలు వశిష్టుడిని తీసుకురాగా, ఆయన విశ్వామిత్రుడిని చూసి, బ్రహ్మర్షి విశ్వామిత్రా అని పిలిచారు. అప్పుడు విశ్వామిత్రుడు ఆ వశిష్టుడి కాళ్ళు కడిగి పూజ చేశాడు. ఏ  వశిష్టుడి మీద కోపం తో ప్రారంభించాడో, ఆ వశిష్టుడి కాళ్ళు కడగటంతో విశ్వామిత్రుడు బ్రహ్మర్షి అయ్యాడు. 

17, జులై 2014, గురువారం

నందిని

వసిష్టుని కామధేనువు పేరు నందిని. ఈ నందిని కారణం గానే వశిష్టుడు, విశ్వామిత్రులకు విబేధాలు వచ్చాయి. ఈ నందిని కారణం గానే వశిష్టుడు అష్టవసువులను మనుష్యజన్మను స్వీకరించండి అని శపించటం కుడా జరిగింది.

నందిని ఎవరు? వశిష్టునికి నందిని ఎలా లభించినది?

వశిష్టుడు వరుణ దేవుని పుత్రుడు. ఆతని ఆశ్రమం మేరుపర్వత ప్రాంతం లో ఉంది. అక్కడ అన్ని మృగ పక్షి జాతులు కుడా సహజమైన జాతి వైరం లేకుండా కలసి మెలసి ఉంటాయి. ఆ వనం సర్వఫల పుష్పములతో ఉంటుంది. ఆ వశిష్టుడు ఆ వనం లో గొప్ప తపస్సు చేసాడు.

దక్ష  ప్రజాపతి పుత్రికలలో ఒక అమ్మాయి పేరు సురభి. ఆ సురభి ని దక్షప్రజాపతి కస్యపునికి ఇచ్చి వివాహం జరిపించాడు. వారికి గోసంతానం కలిగింది. ఆ గోవుకు వారు నందిని అని నామకరణం చేసారు. కోరిన కోరికలు తీర్చే కామధేనువు. కొంతకాలానికి ఈ నందిని వశిష్టమహర్షి వద్దకు చేరింది. వశిష్టుడు ఈ నందినిని చాల ప్రేమగా చూసుకునేవాడు. నందిని అతనికి హోమధేనువుగా ఉంది. ఆ నందిని అతని ఆశ్రమం లో స్వేచ్చగా తిరుగుతూ ఉంటుంది.

అష్ట వసువులకు శాపం:
ఒక రోజు అష్టవసువులు వారి వారి భార్యలతో సహా విహారానికి వచ్చినప్పుడు వశిష్టుని ఆశ్రమంలో నందినిని చూసారు. వారు వసువులు కావటం వల్ల వారికి నందిని గొప్పతనం తెలిసింది. ఆమె కామధేనువు అని, ఆమె పాలు త్రాగినంతమాత్రాన నిత్యయవ్వనం కలుగుతుందని వారు మాట్లడుకుoటుండగా, చిన్నవాడయిన వసువు ప్రభాసుని (ద్యూ) భార్య అదివిని తనభార్తతో మాట్లాడింది.
"ఓ ప్రియా! నా స్నేహితురాలు జితవతి ఉసీనర రాజకుమార్తె. ఆమె మనిషికావున ఆమెకు ఈ నందిని ని మనం ఇస్తే ఈ నందిని పాలు త్రాగుటవల్ల ఆమెకు నిత్య యవ్వనం కలుగుతుంది, ఆమె సంతోషిస్తుంది. కనుక తమరు నాకు ఆ గోవును తెచ్చిఇవ్వగలరా!" 
భార్య కోరిక విన్న ప్రభాసుడు, తన ఆలోచన తప్పు అని కాని, దాని తర్వాత వచ్చే పరిణామాల గురించి కాని ఆలోచించక తన అన్నల సహకారం తో నందినిని అపహరించాడు. ఈ విషయం తెలుసుకున్న వశిష్టుడు వీరు ఎనిమిది వసువులూ కుడా లోభిత్వం ఎక్కువగా ఉండే మనుష్య జన్మలో జన్మించవలసినది అని శపించాడు. 
తమ తప్పు తెలుసుకున్న వసువులు శాపవిమోచనం తెలుపమనగా శాంతించిన మహర్షి తప్పు చేసిన చిన్నవాడయిన ప్రభాసుడు మాత్రం దీర్ఘయుర్దాయం కలిగి ఉండవలసినది అని, మిగిలినవారు ఒకొక్క సంవత్సరం తేడాతో తమతమ నిజ రూపములు పొందగలరు అని చెప్పాడు. 
ఆ అష్టవసువులు తరువాతి కాలం లో శంతనుడు, గంగలకు జన్మించారు. ఒక్క భీష్ముడు తప్ప మిగిలిన వారు పుట్టిన వెంటనే తమ తల్లి ఐన గంగ సహకారం తో శరీరాలను వదిలి నిజ రూపాన్ని పొందారు. 

16, జులై 2014, బుధవారం

శంతనుడు జన్మవృత్తాంతం

శంతనుడు పుర్వకాలo లో సుర్యవంశం లో జన్మించిన మహాభిషుడు అనే రాజు. ఇతను 1000 అశ్వమేధ యాగములు, 100 రాజసూయ యాగములు చేసిన కారణం చేత స్వర్గాలోకమునకు వెళ్ళాడు. ఒకసారి దేవతలంతా బ్రహ్మదేవుని దర్శనార్ధమై సత్యలోకం వెళుతుండగా ఈ   మహాభిషుడు కూడా వారితో వెళ్ళాడు. అక్కడకు దేవగంగ కూడా వచ్చింది. బ్రహమదేవుడు సభతీర్చి ఉండగా ఒక్కసారిగా వచ్చిన గాలివల్ల ఆ గంగాదేవి పైట కొంచెం చెదిరింది. అది గమనించిన దేవతలు తమ తలలను దించుకుని ఉన్నారు అయినా కూడా ఈ మహాభిషుడు రెప్పపాటు లేకుండా గంగాదేవిని చుస్తూ ఉన్నాడు. అది గమనించిన బ్రహ్మదేవుడు మహాభిషుడు ని ఉద్దేసించి, "ఓ మహాభిషా నీకు ఇంకా కోరికలు నశించినట్లు లేవు కనుక నీవు మరలా భూలోకం లో జన్మించు, నీవు ఇప్పుడు ఏ గంగ ను చూసి సభామర్యాదకు భంగం కలిగించావో అదే గంగను అక్కడ పొంది, ఆమె మీద నీకు కలిగిన కోపం కారణం గా మాత్రమే నీ శాప విమోచనం పొందగలవు" అని చెప్పాడు. అది విన్న మహాభిషుడు భూలోకం లో తానూ ఎవరికీ జన్మించాలి అని చూస్తుండగా అతనికి చంద్రవంశంవాడయిన ప్రతిశ్రవుడు (ప్రతీపుడు) సరిఐనవాదు అని నిర్ణయించుకుని అతనికి జన్మించాడు. ఆ పుట్టిన పిల్లవానికి ప్రతిశ్రవుడు శంతనుడు అని నామకరణం చేసారు.

శంతనుడు తరువాతి కాలం లో గంగాదేవిని వివాహం చేసుకుని భీష్ముని, సత్యవతి వల్ల చిత్రాoగదుడిని, విచిత్రవీర్యుని పుత్రులుగా పొందాడు. 

15, జులై 2014, మంగళవారం

వెనుక నుండి వాలిని బాణం తో కొట్టిన రాముడు ధర్మాత్ముడేనా?

వెనుక నుండి వాలిని బాణం తో కొట్టిన రాముడు ధర్మాత్ముడేనా?
నూటికి నూరు శాతం రాముడు ధర్మాత్ముడే అని తన చివరి క్షణంలో వాలే అంగీకరించాడు. అది ఎలానో చూద్దాం!
తన తమ్ముడు సుగ్రీవునితో యుధం చేస్తున్న తనమీద ఎవరో బాణ ప్రయోగం చేసారు అని ధ్వని విన్న వాలి వెనుకకు తిరిగేంతలో రామబాణం వాలి గుండెలో గుచ్చుకుంది. ఆ బాణం వేగానికి తట్టుకోలేకపొయిన వాలి కుప్పకూలిపోయాడు.
అప్పుడు వెనుక నుండి వస్తున్న రామలక్ష్మణులను చూసి,  వాలి రాముడిని కొన్ని ప్రశ్నలను అడిగాడు.

రామా! నువ్వు చాలా గొప్పవాడివి, ధర్మం తెలిసినవాడివి, పరాక్రమం ఉన్నవాడివి అంటారు. నా భార్య తార నీగురించి చెప్పింది, నీవు నాతమ్ముడైన సుగ్రీవునితో స్నేహం చేస్తున్నావ్ అని కుడా చెప్పి నన్ను ఈ యుద్దానికి వెళ్ళద్దు అని వారించింది. అవి అన్నీ విన్న నేను నీవు నిజంగా ధర్మాత్ముడవే అని నమ్మాను. నేను సుగ్రీవునితో యుధం చేస్తుండగా నీవు నన్ను ఎదిరిస్తావు అని అనుకున్నాను కాని నీవు నా వెనుక నుండి బాణ ప్రయోగం చేసావు. నేను చనిపోయాక నా తమ్ముడు రాజ్యం తీసుకోవటం సబబు గానే ఉంది కాని నీవు నన్ను చంపుట లో ధర్మం లేదు.  కనుక నీవు ధర్మం అనే తొడుగు కప్పుకున్న మహా పాపాత్ముడివి. కాదు అని నీవు చెప్పగలవా! ఐతే నా ఈ ప్రశ్నలకు సమాధానం చెప్పు.
  1. నీతో కాకుండా నేను ఇంకొకరితో అటువైపుకి తిరిగి యుద్ధం చేస్తుంటే నువ్వు చెట్టు చాటు నుండి నా మీద బాణం ఎందుకు వేసావు?
  2. యుద్ధం అంటూ వస్తే, బంగారం వల్ల, వెండి వల్ల, భూమి వల్ల రావాలి కానీ, నీకు నాకు ఈ విషయాల్లో తగాదా  లేదు. నేను నీ రాజ్యానికి కాని నీ పట్టణానికి కాని ఈ విధమైన విఘాతం కలిగించలేదు. 
  3. క్షత్రియులలొ పుట్టిన నీకు మంచి చెడు ఏదో తెలుసుకున్న తర్వాతనే శిక్ష విధించాలి అని తెలియదా? నీవు మా మద్య జరిగిన ఏ విషయాల మీద ఆధారపడి నేను దోషిని అని నిర్ణయించావు?
  4. నేను చెట్ల మీద ఉండే ఆకులని, పండ్లని తినే శాఖాహార మృుగాన్ని. నా చర్మం వలిచి వేసుకోవటానికి, మాంసం తినటానికి, నాగోర్లు మరొక ప్రయోజనానికి పనికిరావు కనుక నన్ను చంపుట లో  న్యాయం లేదు! దీనికి నీ సమాధానం?
  5. నీ భార్య కోసం అడవిలో వెతుక్కుంటున్నావు కదా! నీ భార్యని ఎత్తుకుపోయిన రావణాసురుడు నా కింకరుడు. నువ్వు నాతో స్నేహం చేసి ఉంటే, అసలు రక్తపాతం లేకుండా ఆ రావణాసురుడిని ఒక్క రోజులో నీముందు పడేసేవాడిని. అటువంటిది నాముందే నిలువలేని సుగ్రీవుడిని ఆశ్రయించి, నువ్వు సీతని ఎలా సాధించుకోగలవు? బలవంతుడిని వదిలి బలహీనునితో స్నేహం ఎందుకు చేసావు?
అప్పుడు రాముడు వాలికి సమాధానం చెప్పాడు

ఓ వాలి! నీకు అసలు ధర్మం గురించి కానీ, అర్ధం గురించి కానీ, కామం గురించి కానీ తెలుసా. నువ్వు అజ్ఞానివి. బాలుడు ఎలా ప్రవర్తిస్తాడో నువ్వు అలా ప్రవర్తించేవాడివి. నీకు ఏమీ తెలుసని నా మీద ఇన్ని ఆరోపణలు చేశావు. నువ్వు అజ్ఞానీవి కావటం వల్ల నీకు ఏమి తెలియకపోతే, ఆచారం తెలిసినవారిని, పెద్దలైన వారిని ఆశ్రయించి తెలుసుకోవలసినది.
నువ్వు ఈ వానరములకు ప్రభువువి. మంత్రుల చేత సేవింపబడుతున్న వాడివి. సంధ్యావందనం చేస్తున్నవాడివి. నువ్వు ధర్మం తప్పితే నీ వెనుక ఉన్నవారు కూడా ధర్మం తప్పుతారు. నేను క్షత్రియుడిని కనుక నిన్ను శిక్షించవలసిన అవసరం నాకు ఉంది. క్షత్రియ ధర్మం ప్రకారం ఒకడు చేసిన తప్పు ప్రభువైన వాడికి తెలిసి వాడిని శిక్షిస్తే, వాడి పాపం పోతుంది. కానీ ప్రభువు అలా శిక్షించకపోతే, ఆ పాపం రాజుకి వెళుతుంది.  ఇక్ష్వాకుల రాజ్యం లోకి ఈ భాగం కూడా వస్తుంది. ఆ ఇక్ష్వాకు వంశంలో పుట్టిన భరతుడు ఇప్పుడు రాజ్యం చేస్తున్నాడు. ఇక్ష్వాకు వంశం వారు రాజ్యం చేస్తుండగా ధర్మాధర్మములు జరిగిన చోట నిగ్రహించే అధికారం మాకు ఉంటుంది.
ఇక నీవు అడిగిన ప్రశ్నలకు సమాధానం చెప్తాను విను!
  1. నేను మానవుడిని, నువ్వు జంతువువి. క్షత్రియుడు ఒక మృగాన్ని కొట్టవలసి వస్తే, తాను చాటున ఉండి, వల వేసి,పాశం వేసి,అప్రమత్తంగా ఉన్నప్పుడు, పడుకుని ఉన్నప్పుడు,నిలబడి ఉన్నప్పుడు,  పారిపోతున్నప్పుడు ఎప్పుడైనా కొట్టొచ్చు. కానీ ఆ మృగo మరో మృగం తో సంగమిస్తున్నప్పుడు కొట్టకూడదు. నువ్వు మిధున లక్షణంలో లేవు కనుక నిన్ను కొట్టాను.
  2. తప్పు చేసినవానిని రాజు శిక్షిస్తే వాడి పాపం ఇక్కడితో పోతుంది. నేను నిన్ను ఛంపటం వల్ల నువ్వు ఏ పాపం లేని స్థితి కి చేరుకున్నావు. నీ పాపం ఇక్కడితో పోయింది. అందుకని నువ్వు ఉత్తమ లోకాలకి వెళ్ళిపోతావు. 
  3. తోడబుట్టిన తమ్ముడు, తన దగ్గర విద్య నేర్చుకున్న శిష్యుడు కుమారులతో సమానం. నీ తండ్రి మరణించటం చేత, నువ్వు పెద్దవాడివి అవటం చేత నువ్వు సుగ్రీవునకు తండ్రి తో సమానము. నీ తమ్ముడు భార్య అయిన రూమ నీకు కోడలితో సమానము. కానీ సుగ్రీవుడు బ్రతికి ఉన్నాడని తెలిసి, కోడలితో సమానమైన రుమతో, నీ భార్యగా కామ సుఖాలని పొందుతున్నావు.అందుచేత ఒక మామగారు కోడలితో కామభోగాన్ని అనుభవిస్తే ఎంత దోషమో, అంత దోషాన్ని నువ్వు చేశావు. ధర్మ శాస్త్రం లో దీనికి మరణ శిక్ష తప్ప వేరోక శిక్ష లేదు. అందుకని నేను నిన్ను చంపవలసి వచ్చింది. (దీనిలో పైన వాలి అడిగిన 2,3,4 ప్రశ్నలకు సమాధానం వచ్చేసింది) 
  4. నీలాంటి అధర్మాత్ముడితో నేను స్నేహం చెయ్యను. 
రాముడు మాటలు విన్న వాలి తన రెండు చేతులతో రాముడికి నమస్కారం చేస్తూ  "మహానుభావా! ధర్మాత్మా! రామచంద్రా! నువ్వు చెప్పినది యదార్ధం. దోషం నాయందే ఉన్నది. నీవు చేసిన ఈ పని నిజం గా నాయందు దయతో చేసావు అని నేను నమ్ముతున్నాను. శ్రీరాముడు ధర్మాత్ముడు అని నేను ఒప్పుకుంటున్నాను. ఇటువంటి నీ చేతిలో మరణమైనా నాకు స్వర్గమే రామా" ఆనాడు.


ఆనంద రామాయణం ప్రకారం శ్రీకృష్ణావతార సమాప్తసమయం లో శ్రీకృష్ణుడిని బాణం తో కొట్టినది ఆ కాలం లో కిరాతునిగా పుట్టిన ఈ వాలి. 

14, జులై 2014, సోమవారం

హనుమoతుడు వాయుపుత్రుడు, శివ అంశ రెండూ ఒకేసారి ఎలా అయ్యాడు?

హనుమoతుడు వాయుపుత్రుడు, శివ అంశ రెండూ ఒకేసారి ఎలా అయ్యాడు?

పూర్వకాలం లో పుంజికస్తల అనే అప్సరస ఒకసారి భూలోకానికి వచ్చి తిరుగుతుండగా ఒక కోతి ధ్యానమగ్నమై ఉండగా చూసి అతని తపస్సు కు భంగం కలిగే విధంగా ప్రవర్తించినది(పెద్దగా నవ్వుతూ అతని మీద రాళ్ళు వేసినది). అప్పుడు తపస్సు నుండి లేచిన ఆ తపస్వి ఆమెను మరు జన్మలో వానరo గా పుట్టమని శపించాడు. ఆమె చేసిన తప్పును గ్రహించి శాపవిమోచనం చెప్పమనగా ఇది దైవకార్య నిమిత్తమై ఆ పరమాత్మ తనతో ఈ విధమైన శాపాన్ని ఆమెకు వచ్చేలా చేసాడు అని, ఆమె వానరం గా ఉన్నపుడు అతివీరభయంకరమైన బలం కలిగిన పుత్రుడిని శివ అంశగా పొందుతావు అని ఉరడిoచాడు.

ఈ విషాదం తో స్వర్గానికి చేరిన ఆమెను తనను సంతోషింప చేయవలసినది అని ఇంద్రుడు కోరాడు. దానికి ఆమె అంగీకరించలేదు కనుక ఆమెను భూలోకం లో జన్మించమని శపించాడు.

ఆమె కుంజ అనే ఒక వానర యోదునికి కుమార్తె గా జన్మించింది. ఆమెకు అంజన అని పేరు పెట్టారు. కొంతకాలం తర్వాత ఆమెను కేసరి వివాహం చేసుకున్నాడు. ఒకనాడు కేసరి దక్షిణ సముద్రం ఒడ్డున తపస్సు లో ఉండగా వారి ఇంటికి అగస్త్య మహర్షి వచ్చారు. అప్పుడు అంజన ఆ  మహర్షికి సర్వ ఉపచారములు చేసింది. ఆమె అతిధి సత్కారానికి సంతోషించిన అగస్త్యుడు ఆమెను వరం కోరుకోమన్నాడు. అప్పుడు అంజన తనకు అతి బలవంతుడైన, బుధివంతుడైన పుత్రుడు, సర్వ లోకముల కు శాంతి  చేకూర్చే వాడు కావలి అని కోరుకుంది. అగస్త్యుడు మహాముని కనుక తధాస్తు అని దీవించి, ఆమెకు సాక్షాత్తు ఆ మహాదేవుని అంశతో పుత్రుడు కలుగబోతున్నాడు కనుక ఆమెను అందుకు సిధం చేయాలి అని తలచి ఆమెను వృషభాద్రి పై అకాశగంగ ప్రక్కన ధ్యానం చేయవలసినది గా చెప్పి వెళ్ళిపోయాడు. అప్పుడు అగస్త్యుడు చెప్పిన విధం గానే అక్కడ ధ్యానం చెస్తూ ఉంది.

ఒకరోజు ధ్యానం చేస్తున్న ఆమెను చూసి వాయుదేవుడు ఆమెను చేరాడు. ఆ సంఘటనకు ఆమె ధ్యానభంగం అయినది. అప్పుడు ఆమె  "ఎవడురా దుర్మార్గుడు! నా పాతివ్రత్యాన్ని చెరప చూస్తున్నాడు" అని కోపించింది. అప్పుడు వాయువు అన్నాడు "అంజనా! బ్రహ్మగారు మా సర్వ దేవతల తేజస్సులను వానర స్త్రీలందు ప్రవేశపెట్టి వానారాలని సృస్టించామన్నాడు. అందువాల్ల  నేను నీ పాతివ్రత్యాన్ని భంగం కలగకుండా గొప్ప పరాక్రమం ఉన్నవాడు, బుద్ధిమంతుడు, నాతో సమానం గా దూకగల వాడు, ఎగరగలవాడైన పుత్రుడు కేవలం నిన్ను మానసికముగా చూసినంత మాత్రాన నీ కడుపు నందు జన్మిస్తాడు" అన్నాడు.
అలాగే తీర్ధయాత్రలు చెస్తూ ఉన్న కేసరి గోకర్ణం మీదుగా వెళుతున్నపుడు అక్కడ శంబసదనుడు అనే రక్షసుడి గురించి, అతను పెడుతున్న భాదలగురించి అక్కడి ఋషుల,మునుల ద్వారా విని అతనిని ఎదుర్కొన్నాడు. భీకరమైన యుధం తర్వాత అతనిని మట్టుపెట్టాడు. అతని విజయాన్ని చుసిన ఋషులు మునులు అతనికి ఒక ప్రయోజకుడిన పుత్రుడు, లోకంలో ఏ విధమైన అవినీతిని ఒప్పుకోనివాడు జన్మించాలి అని దీవించి, కేసరికి మహాదేవుని యొక్క అతి శక్తివంతమైన ఒక మంత్రాన్ని ఉపదేశించారు. ఆ మంత్రాని కేసరి జపిస్తూ ఉండుటవల్ల అతని శరీరం దివ్య కాంతిని పొందింది.
కేసరి తీర్ధయాత్రల నుండి ఇంటికి వచ్చే సమయానికి అంజన వృషబాద్రి నుండి ఇంటికి వచ్చి ఉంది. వీరిద్దరికీ కలిగిన వరముల ప్రభావం వల్ల అంజని కొంతకాలానికి గర్భవతి అయింది. అప్పుడు ఆమెకు అతి బలవంతుడు, శివ అంశ, వాయుపుత్రుడు ఐన హనుమంతుడు జన్మించాడు.

13, జులై 2014, ఆదివారం

వాల్మీకి రామాయణం రచన, కారణం

రామాయణం రచించటానికి ముందు,

అసలు వాల్మీకి ఏమి కోరుకున్నారు? రామాయణం ఆయన ఎలా రాయగలిగారు? రాముని చరిత్ర వాల్మీకికి ఎవరు చెప్పారు? ఎందుకు?

లోకంలో మంచి గురువు దొరకటం అదృష్టం. కాని ఆ గురువు యొక్క విశిష్టత గొప్ప శిష్యుని వల్ల మాత్రమే గుర్తింపబడుతుంది.
అగ్నిశర్మ వాల్మికిగా మారి తపస్సు చేస్తూ ఉన్న సమయం లో ఒక రోజు నారద ముని వారి ఆశ్రమానికి వచ్చాడు. నారద మునిని చుసిన  వాల్మీకి మహర్షి వారికి సపర్యలు చేసి తన మనస్సు లో తిరుగుతున్న ప్రశ్నను ఆయన ముందు ఉంచారు.

మహానుభావా! ఈ కాలం లో నేను నా మాంసనేత్రం తో చూడగలిగేలా 16 సుగుణములు ఉన్న మహానుభావుడు ఎవరైనా ఉన్నారా?
  1. గుణవంతుడు 
  2. వీర్యవంతుడు
  3. ధర్మాత్ముడు 
  4. కృతజ్ఞుడు 
  5. సత్య వాక్య పరిపాలకుడు 
  6. సత్చరిత్ర 
  7. దృడసంకల్పం కలవాడు 
  8. సత్ప్రవర్తన 
  9. అన్ని జీవుల పట్ల సమదృష్టి కలవాడు 
  10. సర్వాంగ సుందరుడు 
  11. ధైర్య వంతుడు 
  12. కోపాన్ని గెలిచిన వాడు 
  13. అపార కంతి  కలవాడు 
  14. అసూయ లేనివాడు 
  15. కోపం నటించగల వాడు
  16. విధ్యావంతుడు 
ఆ ఆతురతతో, తెలుసుకో వలసిన విషయం గురించి వాల్మీకి లో ఉన్న ఉద్వేగం  గమనించి, నారదుడు రామాయణ రచనాసమయం ఆసన్నమైంది అని భావించి 100 శ్లోకములతో కూడిన సంక్షేప రామాయణాన్ని (దాన్నే మనం మాలా మంత్రం అని కూడా అంటాం)చెప్పాడు. 

 ఆ 100 శ్లోకాలని మననం చేసి చేసి వాల్మీకి రామాయణం రచన చేసారు. 

త్రిశంకుడు

 త్రిశంకుడు

ఇతనికి ఒక ప్రత్యేకమైన స్వర్గలోకం ఉంది. దానిని త్రిశంకుస్వర్గం అంటారు. కాని ఈయన ఆ స్వర్గం లో తలక్రిందులుగా ఉంటారు. ఈయన సశరీరం గా ఎలా స్వర్గం లో ఉన్నాడు? ఈయనకోసం ప్రత్యేకమైన స్వర్గాన్ని ఎవరు సృష్టించారు? ఎందుకు? తలక్రిందులుగా ఎందుకు ఉంటారు?


ఇక్ష్వాకు వంశం లో పృధు మహారాజు పుత్రుడు త్రిశంకుడు అనే రాజు ఉండేవారు. వారి వంశం లో అందరి మంచిని ప్రజలు శ్లాఘించుట  చూసిన త్రిశంఖునకు తన పుర్వీకుల కంటే  మరేదయినా విశిష్టమైన పనిని చేసి అమితమైన కీర్తి గడించాలి అని కోరిక కలిగింది. ఎంతగానో ఆలోచించిన మీదట ఇప్పటివరకు ఎవరూ శరీరం తో స్వర్గానికి వెళ్ళలేదు కనుక తను వెళితే బాగుంటుంది అని నిర్ణయానికి వచ్చాడు.

వెంటనే తమ కుల గురువైన వశిష్టునికి తన కోరిక చెప్పాడు. అది విని ఆశ్చర్య పోయిన వశిష్టుడు ఎంత గొప్ప మహారాజైనా కానీ, ఎంత గొప్ప యజ్ఞ యాగాలు చేసినా కానీ శరీరం తో స్వర్గానికి వెళ్ళడమనేది ధర్మశాస్త్రంలో లేదు. పంచ భూతములతో నిర్మితమైన ఈ శరీరo కొంత కాలానికి పడిపోవాల్సిందే. అది పడిపోయిన తరువాతే శరీరం లోని జీవుడు స్వర్గం లోకి ప్రవేశిస్తాడు. కావున శరీరంతో స్వర్గానికి వెళ్ళటం అనేది జరగదు అని ఖచ్చితంగా చెప్పాడు వశిష్టుడు. కుల గురువు వశిష్టుని మాటలకు సంతృప్తి చెందని  త్రిశంకుడు నూరుగురు గురుపుత్రుల వద్దకు వెళ్లి తన కోరికను వివరించాడు. ఐతే తమతండ్రి జరగదు అని చెప్పిన పనిని తాము ఎంత మాత్రమూ చేయము అని చెప్పారు. పైగా అన్ని శాస్త్రములు తెలిసిన తమ తండ్రి ఒక పని జరగదు అని చెప్తే అది ఎన్నటికీ  జరుగదు కనుక తాను  ఆ ఆలోచనను మానుకోవలసినది అని కూడా సూచిoచారు.
అయినా కూడా తన ఆలోచన మార్చుకోని  త్రిశంకుడు తాను మరొక గురువును ఆశ్రయిస్తాను అన్నాడు. ఆ మాటలకు ఆగ్రహించిన నూరుగురు గురుపుత్రులు ముక్తకంఠంతో ఆ  త్రిశంకుడు చేయతలచిన గురుద్రోహానికి అతనిని చండాలుడవు కమ్మని శపించారు.
 మరునాటి ఉదయం నిద్రలేచే సమయానికి  త్రిశంకుని ముఖంలో కాంతి పోయి నల్లగా అయ్యాడు. ఆయన వేసుకున్న బంగారు ఆభరణాలన్ని ఇనుము ఆభరణాలు అయ్యాయి. జుట్టు, కళ్ళు ఎర్రగా ఉన్నాయి. ఆయనని చూసిన ఆ మందిరంలోని వాళ్ళు, ఇతర మంత్రులు అందరు భయపడి పారిపోయారు. ఆ రూపంతో అలాతిరుగుతూ చివరికి  త్రిశంకుడు విశ్వామిత్రుడిని ఆశ్రయించాడు. 

అప్పటికి విశ్వామిత్రుడు వశిష్టుని మీద కోపంతో తప్పస్సు చేస్తూ రాజర్షి అయ్యారు. అప్పటికే తన దనుర్విధ్య వశిష్టుని మీద పనిచెయ్యదు అని కుడా తెలుసుకున్నారు కాబట్టి ఎలా వశిష్టుని మీద పై చేయి సాధించాలా అని ఆలోచిస్తున్న విశ్వామిత్రునికి  త్రిశంకుడు ఒక మార్గం గా కనిపించాడు. వసిష్టుడు చేయను అన్న పనిని విశ్వామిత్రుడు చేస్తే ఆది వశిష్టుని ఓటమే అవుతుందని ఆలోచించాడు. అందుకే  త్రిశంకుని కోరిక తాను తీరుస్తాను అని చెప్పాడు,
అప్పుడు విశ్వామిత్రుడు తన పుత్రులను, శిష్యులను పిలిచి వారందరిని ఈ సమస్త బ్రహ్మాండం తిరిగి వశిష్టుడు చేయలేని పనిని విశ్వామిత్రుడు చేస్తున్నాడు అని అందరికి చెప్పి అందరిని ఆహ్వానించమని చెప్పాడు. ఒకవేళ ఎవరైనా రాను అన్నా, ఈ పనిని తప్పు పట్టినా వారి వివరాలు తనకు చెప్పమని ఆజ్ఞ ఇచ్చాడు.
 ఆహ్వానం అందుకున్న అందరూ విశ్వామిత్రుడికి భయపడి వచ్చారు. ఆ తరువాత విశ్వామిత్రుని పుత్రులు వచ్చి వశిష్టుని పుత్రులు, మరొక బ్రాహ్మణుడు మహోదయుడు ఈ యజ్ఞానికి రాము అన్నారు అని చెప్పారు. వారు ఏమి కారణం చెప్పారని అడుగగా ఆ బ్రాహ్మణుడు "ఒక క్షత్రియుడు ఒక చండాలుని కోసం యజ్ఞం చేస్తుంటే దేవతలు ఎలా వచ్చి తమ తమ హవిస్సులను తీసుకుంటారు? అది జరిగే పని కాదు కనుక అక్కడకు వచ్చి మా సమయం ఎందుకు వృధా చేసుకోవాలి?" అని అన్నాడు అని చెప్పారు.

దానికి కోపించిన విశ్వామిత్రుడు వశిష్టుని నూరుగురు పుత్రులు ఇప్పుడే భస్మరాసులై పడిపోయి నరకానికి వెళ్లి తరువాత 700 జన్మల పాటు నరమాంస భక్షకులుగా,  ఆ తరువాత కొన్ని జన్మల పాటు ముష్టికులు అనే పేరుతొ పుట్టి కుక్కమాంసం తింటూ బ్రతుకుతారు, ఆ బ్రాహ్మణుడు మహోదయుడు సర్వలోకాలలొ జనాల చే ద్వేషింపబడే నిషాదుడై జీవిస్తాడు అని శపించాడు. 
అప్పుడు యాగం మొదలు పెట్టాడు. విశ్వామిత్రుడు యాగాగ్ని లో హవిస్సులు ఇస్తున్నాడు, కానీ వానిని తీసుకోవటానికి దేవతలు రావటం లేదు. ఇది చుసిన విశ్వామిత్రునికి కోపం వచింది. అహంకారం విజృంభించింది. తన తపోబలం తోనే  త్రిశంకుడిని స్వర్గానికి పంపాలని అనుకుని సంకల్పించాడు. అనన్య సామాన్య మైన అతని తపోబలం వల్ల  త్రిశంకుడు స్వర్గలోకం దిశగా ప్రయాణమయ్యాడు. ఈ విషయం దేవేంద్రడికి తెలిసి ఆయన  త్రిశంకునితో "  త్రిశంకుడా! నువ్వు గురు శాపానికి గురి అయ్యావు. నీకు స్వర్గలోక ప్రవేశం లేదు" అని తలక్రిందులుగా క్రిందికి పో అన్నాడు. అలా తలక్రిందులుగా భూమి మీదకి తోసివెయ్యబడ్డ ఆ  త్రిశంకుడు క్రిందకి  పడిపోతూ తనను రక్షిoచమని విశ్వామిత్రుడిని ప్రార్ధించాడు.
మరింత ఆగ్రహించిన విశ్వామిత్రుడు త్రిశంకుడిని ఆకాశం లో నిలిపాడు, త్రిశంకునకు స్వర్గం లో స్థానం లేదు అని కిందకు నెట్టేశారు కనుక తన మిగలిన మిగిలిన తపశక్తి తో దక్షిణ దిక్కున నక్షత్ర మండలాన్ని సృస్టించాడు. సప్తర్షులని సృస్టించాడు. ఇక దేవతలను దేవాధిపతి  ఇంద్రుడిని సృష్టించే ప్రయత్నం లో ఉండగా దేవతలందరు వచ్చారు.

మహానుభావా! శాంతించు. ఎంత తపహ్శక్తి ఉంటే మాత్రం ఇలా వేరే స్వర్గాన్ని సృస్తిస్తావా! మీకు శాస్త్రం తెలుసు, సశరీరంగా ఎవ్వరినీ స్వర్గానికి పంపాలేము, పైగా ఈ త్రిశంకుడు గురుశాపo పొందినవాడు కనుక స్వర్గ ప్రవేశం లేదు. కానీ మీరు మీ తపశక్తి ని ధారపోసినతపహ్శక్తిని ధారపోసి సృస్టించిన ఈ నక్షత్రమండలం జ్యోతిష్య చక్రానికి ఆవల వైపున ఉంటుంది. అందులో త్రిశంకుడు ఇప్పుడు ఉన్నట్లుగానే తలకిందకు, కాళ్ళు పైకి ఉంది సేవింపబడుతూ ఉంటాడు అని వరం ఇచ్చారు. శాంతించిన విశ్వామిత్రుడు సరే అన్నాడు.

విరాధుడు

విరాధుడు

సీతారామలక్ష్మణులు అరణ్య వాసం చేస్తుండగా వారు అనేక ఋషి ఆశ్రమాలను దర్శించారు. అలాగే ఒక ఆశ్రమాన్ని దర్శిస్తున్న సమయం లో ఆ ఆశ్రమం లోని ఋషులు ఆ చుట్టుప్రక్కల ఉన్న రాక్షసుల వాల్ల తమకు ఇబ్బంది కలుగుతోoది అని చెప్పి, రామ చంద్రుడే వారిని ఈ భాధనుండి తప్పించాలని కోరారు.  రాముడు అంగీకరించి, వారు ఇచ్చిన ఆతిధ్యాన్ని స్వీకరించి సీతాలక్ష్మణ సమేతుడై బయలుదేరారు.
అలా కొంతదూరం వెళ్ళాక, ఒక చోట చీకూరువాయువులు పులిసిపోయిన రక్తాన్ని తినే ఈగలు కనపడ్డాయి. దానిని బట్టి అక్కడికి దగ్గరలోనే ఎవరో ఒక రాక్షసుడు ఉండి ఉంటాడు అని రాముడు లక్ష్మణుడితో అన్నాడు. ఇంతలోనే లోతయిన కళ్ళతో, భయంకరమైన పెద్ద కడుపుతో, పర్వతమంత ఆకారంతో, పెద్ద చేతులతో, అప్పుడే చంపిన పెద్ద పులి తొలు నెత్తురోడుతుండగా తన వంటికి చుట్టుకుని,ఓ శూలానికి 3 సింహాలు, 4 పెద్ద పులులు, 2 తోడేళ్లు, 10 జింకలతో పాటు ఒక ఏనుగు గుచ్చుకుని, వొంటి నిండా మాంసం అంటుకున్న ఒక రాక్షసుడు వాళ్ళ వైపు పరిగెత్తుకుంటూ వచ్చి, అమాంతం సీతమ్మని తన వోళ్ళో కూర్చోబెట్టుకుని, రామ లక్ష్మణులతో ఇలా అన్నాడు.

"మీరు అధర్ములు, పాపమైన జీవితం కలవాళ్ళు. ముని వేషాలు వేసుకుని భార్యతో ఎందుకు తిరుగుతున్నారు. అందుకే మీ భార్యని నేను తీసుకున్నాను. ఇకనుంచి ఈమె నాకు భార్యగా ఉంటుంది. అందుకని మీరు ఈ ప్రాంతాన్ని విడిచిపెట్టి వెళ్ళిపొండి. నన్ను విరాధుడు అంటారు. నేను ఈ అరణ్యంలో తిరుగుతూ ఉంటాను. నాకు ఋషుల మాంసం తినటం చాలా ఇష్ట మైన పని" అన్నాడు.

అప్పుడు రాముడు లక్ష్మణుడితో " చూసావా లక్ష్మణా  ఎంత తొందరగా కైకమ్మ కోరిక తీరిపోతుందో! నాకు ఎంత కష్టం వచ్చిందో చూసావా. నా కళ్ళ ముందే పరాయివాడు నా భార్యని ఎత్తుకుని తీసుకెళ్ళి, తన వొళ్లో కూర్చోపెట్టుకున్నాడు. నాకు చాలా భాదగా ఉంది" అని. ఆ విరాధుడి వైపు చూసి "మమ్మల్ని ఎవరు అని అడిగావు కదా. మేము దశరధ మహారాజు పుత్రులము. మేము రామ లక్ష్మణులం. మా తండ్రిగారి మాట మీద అరణ్యాలలో సంచరిస్తున్నాము. అసలు నువ్వు ఎవరు?" అని రాముడు అడిగాడు.
అప్పుడా విరాధుడు " నేను జావుడు అనే ఆయన కుమారుడను.మా అమ్మ పేరు శతహ్రద.  నేను అరణ్యాలలో తిరుగుతూ అన్ని తింటూ ఉంటాను" అని చెప్పి, సీతమ్మని తీసుకుపోయే ప్రయత్నంలో ఉండగా, రామ లక్ష్మణులు అగ్నిశిఖల వంటి బాణములను ప్రయోగించారు. అప్పుడా విరాధుడు కేవలం ఆవులించేసరికి, ఆ బాణములు కింద పడిపోయాయి. అప్పుడు వాళ్ళు అనేక బాణములతో ఆ విరాధుడిని బాధపెట్టారు. ఆగ్రహించిన వీరాదుడు రాముడి మీదకి తన శూలo తో దాడి చేసాడు. అప్పుడు రాముడు తన బాణముల చేత ఆ శూలాన్ని గాలిలో ముక్కలు చేశాడు.

అప్పుడా విరాధుడు సీతమ్మని విడిచిపెట్టి, రామ లక్ష్మణుల ఇద్దరిని పట్టుకుని, తన భుజం మీద వేసుకుని అరణ్యం లోకి పరుగెత్తాడు. ఆది చూసిన సీతమ్మ కు ఏమి చెయ్యాలో తెలియక గట్టిగా ఆక్రందన చేసింది. అప్పుడు రాముడు తన బలం చేత ఆ విరాధుడి యొక్క చేతిని విరిచేసాడు. లక్ష్మణుడు మరో చేతిని ఖండించేసరికి విరాధుడు క్రిందపడ్డాడు. క్రిందపడ్డ వీరాదుడిని రామ లక్ష్మణులు తీవ్రంగా కొట్టారు. పైకి కిందకి పడేశారు. అయినా వాడు చావలేదు. ఇలా లాభం లేదు, ఇక వీడిని పాతిపెట్టాల్సిందే అని, రాముడు లక్ష్మ ణుడితో, ఏనుగుని పట్టటానికి తవ్వే లాంటి  ఒక పెద్ద గొయ్యి తవ్వమని, ఆ విరాధుడి కంఠం మీద తన పాదాన్ని తొక్కిపెట్టి ఉంచాడు. అప్పుడు విరాధుడు వేసిన కేకలకి అరణ్యం అంతా కదిలిపోయింది. కొంతసేపాటికి  లక్ష్మణుడు గోతిని తవ్వేశాడు.

అప్పుడా విరాధుడు మాట్లాడటం మొదలు పెట్టాడు. ఓ రఘునందనా! నేను తపస్సు చేసి బ్రహ్మ గారి వరం పొందాను కనుక నన్ను ఏ అస్త్ర శస్త్రములు ఏమీ చెయ్యలేవు. నేను ఒకప్పుడు తుంబురుడు అనే పేరు కలిగిన గాంధర్వుడిని. నాకు రంభ అనే అప్సరస మీద కలిగిన కామం వలన కుబేరుడి సభకి వెళ్లలేదు. ఆగ్రహించిన కుబేరుడు నన్ను భయంకరమైన రాక్షసుడిగా జన్మించమని శాపించాడు. అప్పుడు నేను కుబేరుడిని నాకు శాపవిమోచనం ఎలా కలుగుతుంది అని అడిగాను. నీవు ఏనాడు  దశరధుడి కుమారుడైన రాముడి చేతిలో నిహతుడవు అవుతావో ఆనాడు నువ్వు శాపవిముక్తుడవై మళ్లీ స్వర్గాన్ని పొందుతావు అని కుబేరుడు చెప్పాడు. కాబట్టి, నన్ను ఈ గోతిలో పూడ్చేసి సంహరించండి అని అడిగాడు. తరువాత రామ లక్ష్మణులు ఆ విరాధూడిని ఆ గోతిలో వేసి, మట్టితో పూడ్చేసి, శరభంగ ముని ఆశ్రమమానికి వెళ్లారు.

ఈ విరాదునికి కర్కటి అనే భార్య ఉంది. విరాధుడు చనిపోయిన తర్వాత ఆమెను కుంభకర్ణుడు బలాత్కారం చేయగా ఆమెకు ఒక పుత్రుడు కలిగాడు అతనిని భీమ అని ఆమె పిలిచింది. ఆ భీముని వల్లనే భీమశంకర జ్యోతిర్లింగం వచ్చినది. 

11, జులై 2014, శుక్రవారం

శ్రీకృష్ణుడిని కొడుకుగా లాలించగలగటానికి నoద యశోదలు ఏమి పుణ్యం చేసారు?

శ్రీకృష్ణుడిని కొడుకుగా లాలించగలగటానికి నoద యశోదలు ఏమి పుణ్యం చేసారు?

అష్ట వసువులలో ప్రధానుడు ద్రోణుడు, అతని భార్య ధర.

 శ్రీమన్నారాయణుడు భూలొకంలో అవతరిoచబోతున్నాడు కనుక సర్వ దేవతలు, ఋషులు భూమిపై  పుట్టాలి అని బ్రహ్మదేవుడు చెప్పినప్పుడు అందరు దేవతలు సరే అని చెప్పి వెళ్ళిపోయారు కానీ ద్రోణుడు, ధర మాత్రం ఇంకా అక్కేడే ఉన్నారు. వారిని చుసిన బ్రహ్మ దేవుడు ఏమి మీకోరిక అని అడుగగా వారు ఆ పరమాత్మను తమ బిడ్డగా సేవిస్తూ అతని అన్ని బల్యోపచారాలను ఆనుభవిస్తూ ఆ పరంధాముని పై అమిత భక్తీ కలిగి తమ అన్ని జన్మల దుర్గతులనూ పోగొట్టుకోవాలని అనుకుంటున్నాం అని చెప్పారు. వారి మాటలు విన్న బ్రహ్మ వారి మాటలలోని ఆర్ద్రత చూసి అలాగే అని చెప్పారు.  ఆ ద్రోణుడు నందునిగా, అతని భార్య ధర యశోదగా జన్మించారు.

ఐతే వీరు ఆ పరమాత్మను తమకు జన్మించాలీ అని కోరలేదు, కేవలం అతని బాలోపచారాలను చేయాలి అని కోరుకున్నారు కనుక దేవకీ వసుదేవులకు జన్మించిన శ్రీకృష్ణుడు నంద వ్రజానికి వచ్చి నంద యశోదలకు పుత్రునిగా పెరిగాడు. 

10, జులై 2014, గురువారం

అశ్వసేనుడు

అశ్వసేనుడు 
అశ్వసేనుడు తక్షకుని పుత్రుడు. అశ్వసేనుడు ఖాండవ వనదహనం నుండి తప్పించుకున్న వారిలో ఒకడు. అప్పుడు ఖాండవ వనదహనానికి సహాయం చేసిన అర్జునిని మీద పగతో కురుక్షేత్రo లో పదిహేడవ రోజు యుధం లో కర్ణుడు అర్జునుని మీదకు సర్పముఖాస్త్రం ప్రయోగించగా ఆ అస్త్రం యొక్క ముందు భాగం లో ఉండి అర్జునుని చంపే ప్రయతం చేసాడు. ఐతే శ్రీకృష్ణుడు ఇది  గమనించి తన కాలి బొటన వేలితో రధమును భుమిలోకి నాలుగు అంగుళములు కుంగిoపచేయగా  ఆ అస్త్రం అర్జునుని కిరీటాన్ని కొట్టేస్తుంది. అది చుసిన అశ్వసేనుడు కర్ణుని వద్దకు వెళ్లి మరలా అదే బాణ ప్రయోగం చేస్తే తాను ఈ సారి ఖచితంగా అర్జునుని సంహరిస్తాను అని చెప్తాడు. అది విన్న కర్ణుడు తాను ఒకసారి ప్రయోగించిన అస్త్రాన్ని మరలా ప్రయోగించను అని, తను ఇంతకు ముందు బాణo  ప్రయోగించినప్పుడు అశ్వసేనుడు తన అస్త్ర శీర్ష భాగాన ఉన్నట్లు తెలియదని, తనకు ఎవరి సహాయం అవసరం లేదని చెప్తాడు. అప్పుడు వెళ్లి పోతున్న అశ్వసేనుడిని  అర్జునకు చూపించి శ్రీకృష్ణుడు వధించమని చెప్పగా,  అర్జునుడు అతని మీద బాణ ప్రయోగం చేస్తాడు. అర్జునుని అస్త్రములకు ఆ అశ్వసేనుని శరీరం ముక్కలు  ముక్కలు అవుతుంది. ఆ తరువాతి కాలం లో తక్షకుడు  పరిక్షిత్తుని చంపటానికి ఇది ఒక కారణం. 

కుమారస్వామి పుట్టుక

కుమారస్వామి పుట్టుక 

పార్వతి పరమేశ్వరులు జగత్తుకు ఆది దంపతులు. వారు కైలాసాంలో నివాసం ఉంటారు. వారు ఒకసారి 100 దివ్య సంవత్సరాలు క్రీడించారు. ఈ విషయం విని ఆశ్చర్యపోయిన దేవతలు పార్వతిదేవి, శంకరుడి తేజస్సులు అసమానమైనవి కాబట్టి వాళ్ళ కలయిక వల్ల జన్మించే సంతానాన్ని మనం తట్టుకోలేము అని భావించారు. దేవతలంతా బయలుదేరి కైలాసానికి వెళ్ళి శంకరుడిని ప్రార్ధించారు. అప్పుడు శంకరుడు బయటికి వచ్చాడు . అప్పుడు వాళ్ళు ఆయనతో, స్వామి! మీరు పార్వతిదేవి తో 100 దివ్య సంవత్సరాల నుండి క్రీడిస్తున్నారు. మీ తేజస్సు కనుక మరో ప్రాణి రూపంలో బయటకు వస్తే వాని యొక్క తేజస్సును మేము భరించలేము కనుక తమరి తేజస్సుని తమలోనే ఉంచుకుని, సంతాన ఆలోచన లేకుండా పార్వతిదేవి తో తపస్సు చేసుకోండి అన్నారు. ఏ  వికారములు లేని శంకరుడు వాళ్ళు చెప్పినదానికి అంగీకరించాడు, కానీ ఇప్పటికే తన నుండి కొంత తేజస్సు కదిలింది కనుక దానిని భరించే వారు ఉంటే దానిని వదలిపెడతాను అని చెప్పాడు. అప్పుడు దేవతలు అన్నీ భరించగల భూమి దీనిని కూడా భరించగలదు అని చెప్పారు. శంకరుడు అలానే భూమి మీద తన తేజస్సుని వదిలిపెట్టాడు. వదిలిన ఆ తేజస్సు భూమి అంతా వ్యాపించింది. వ్యాపించిన ఆ శంకరుడి తేజస్సుని భూమి కూడా తట్టుకోలేకపోయింది. అప్పుడు దేవతలు అగ్నిదేవుడిని వాయువుతో కలిసి ఈ రుద్ర తేజస్సుని తనయందు పెట్టుకోమన్నారు. అప్పుడు అగ్ని ఆ తేజస్సుని తనలో పెట్టుకున్నాడు.
ఇంతలో జరుగుతున్నదానిని తెలుసుకున్న పార్వతిదేవి బయటికి వచ్చి, తనకు సంతానం కలుగ కుండా చేసిన దేవతలమీద కోపంతో వారెవరికీ తమతమ భార్యల ద్వారా ఇకమీద సంతానం కలుగదు అని శపించినది. తరువాత తను భరిoచ వలసిన శివ తేజస్సును, భూమి భరించటానికి ఒప్పుకుంది కాబట్టి ఇకనుండి భూమి అనేక రూపాలు పొందుతుంది, ఒకే కాలం లో భూమికి అనేకులు  భర్తలుగా ఉంటారు. భూమి తన కొడుకుల వలన సిగ్గు తో తల వంచుకుంటుందని శాపించింది. ఇక అగ్నిని సర్వభక్షకుడవు అవ్వమని శపించినది.
శంకరుడు పార్వతిదేవి తో తపస్సు చేసుకోవటానికి పశ్చిమ దిక్కుకి వెళ్ళిపోయాడు.
అదే సమయంలో తారకాసురుడు అనే రాక్షసుడు బ్రహ్మ గురించి ఘోరమైన తపస్సు చేసి, తాను పార్వతి పరమేశ్వరుల కు జన్మించే బిడ్డ చేతిలోనే చనిపోయేట్టు వరం పొందాడు. ఇది తెలిసిన దేవతలకి ఏమీ చెయ్యాలో తెలియలేదు. ఇప్పుడు ఈ తేజస్సుతో పుట్టిన బిడ్డ మాత్రమే ఆ తారకాసురిడిని అంతమొందించగలడు, సాక్షాత్తు భూమి కూడా ఈ తేజస్సును భరించలేక పోయింది ఇక ఈ తేజస్సును ఎవరు తట్టుకోగలరు? ఎవరైనా తట్టుకోగలిగినా మరలా పార్వతీదేవి శాప భయం కూడా  ఉంటుంది. కనుక ఏమీ  తోచని దేవతలు బ్రహ్మగారి దగ్గరికి వెళ్లారు. అప్పుడు బ్రహ్మ గారు ఆలోచించి, హిమావంతుడు మనోరమాల కుమార్తెలైన గంగా పార్వతులకి తేడా లేదు. కావున పార్వతిదేవి అక్క అయిన గంగలో తేజస్సుని విడిచిపేడితే, పార్వతిదేవికి కోపం రాదు. కాబట్టి ఆ శివ తేజస్సుని గంగలో విడిచిపెట్టమన్నారు.

అప్పటికి అగ్ని శక్తి క్షీణించసాగింది. ఆ తేజస్సును అగ్నికూడ భరించలేక ఉన్నాడు.

అప్పుడా దేవతలు గంగమ్మ దగ్గరికి వెళ్ళి, దైవకార్య నిమిత్తము నువ్వు అగ్ని దగ్గరనుంచి శివ తేజస్సుని స్వీకరించి గర్భం ధరించాలి అన్నారు. దేవతా కార్యము కనుక గంగా సరే అన్నది. అప్పుడు గంగ ఒక అందమైన స్త్రీ రూపం దాల్చి, ఆ తేజస్సుని అగ్ని నుండి స్వీకరించింది. శివ తేజస్సు గంగలో ప్రవేశించగానే గంగా భరించలేక కేకలేసింది. ఈ తేజస్సుని నేను భరించలేను, నన్ను ఏమీ చెయ్యమంటారు అని అడిగింది. అప్పుడు అగ్నిడేవుడు చెప్పిన విధంగా గంగ ఆ తేజస్సుని కైలాస పర్వతం పక్కనున్న భూమి మీద వదిలింది.   
అలా భూమి మీద పడ్డ ఆ తేజస్సు యొక్క కాంతివంతమైన స్వరూపం నుంచి బంగారం, వెండి పుట్టాయి. ఆ తేజస్సు యొక్క క్షారం నుంచి రాగి, ఇనుము పుట్టాయి. మిగిలిన పదార్ధం నుంచి మిగతా ధాటువులు పుట్టి గనులుగా ఏర్పడ్డాయి. కొంత తేజస్సుఅక్కడే ఉన్నతటాకం లో పడింది, ఆ వీర్యం ఆరు భాగాలుగా పది మల్లి ఒకటి ఐంది. ఆ ఒకటి ఐన వీర్యం నుండి ఒక బాలుడు జన్మించాడు. తటాకం నుండి ఒక పిల్లవాడి ఏడుపు దేవతలకు వినిపించింది.
ఆకలికి ఏడుస్తున్న ఆ పిల్లవాడిని చూసి దేవతలు పార్వతీపరమేశ్వరులకు పుత్రుడు కలిగినందుకు సంతోషించారు కానీ ఇప్పుడు ఈ బిడ్డ ఆకలి  తీర్చటానికి ఎవరూ లేరే అని విచారిస్తున్న సమయం లో అక్కడకు కృత్తికలు వచ్చారు. ఆ బిడ్డను చుస్తే తమకు మాతృవాత్సల్యం కలుగుతుంది కనుక ఆ బిడ్డను తమ పేరు మీద కార్తికేయుడు
అని పిలిచినట్లయితే తాము అతనికి ఆకలి తీర్చగలము అని దేవతలకు చెప్పారు. అందుకు అంగీకరించిన దేవతలు సరే అన్నారు. ఈ మాట విన్న కృత్తికలు ఆనందంగా పాలు పట్టారు. ఆ పుట్టిన పిల్లవాడు 6 ముఖాలతో పుట్టాడు. ఏక కాలం లో 6 కృత్తికల స్తన్యమునందు 6 ముఖాలతో పాలు తాగాడు కనుక ఆయనకి షాడాననుడు, షణ్ముఖుడు అనే పేర్లు వాచ్చాయి. అలాగే అగ్నిదేవుడి నుండి బయటకి వచ్చిన శివ తేజస్సు కనుక ఆయనకి పావక, అగ్నీసంభావహ అని నామాలు. అలాగే పరమేశ్వరుడి కుమారుడు కనుక ఆయనని కుమారస్వామి అని పిలిచారు. అలాగే శివుడి వీర్యము స్ఖలనమైనందున  పుట్టినవాడు కనుక, స్కందుడు అని పిలిచారు. పార్వతిదేవి లా అందంగా ఉంటాడు కనుక మురుగన్ అని పిలిచారు. పరమశివుడికి ప్రాణవార్ధాన్ని వివరించాడు కనుక స్వామిమలై అన్నారు

9, జులై 2014, బుధవారం

ఋష్యశృంగుడు

ఋష్యశృంగుడు 

పూర్వకాలంలో విభండక మహర్షి చాలా కాలం తపస్సు చేసాడు. ఒక రోజు స్నానం చేయటానికి ఒక సరస్సు దగ్గరికి వెళ్ళగా, అక్కడ అటుగా వెళ్తున్న ఉర్వశిని చూసేసరికి ఆయనకు వీర్య స్కలనం జరిగి, ఆ వీర్యం సరోవరం లో పడింది. ఆ వీర్యాన్ని అప్పుడే దాహం తీర్చుకోవటానికి అక్కడకి వచ్చిన ఒక జింక త్రాగిoది. ఆ జింక గర్భం దాల్చి కొంతకాలానికి శిరస్సు మీద ఒక కొమ్ము ఉన్న పిల్లవాడికి జన్మనిచ్చింది.  అలా శిరస్సు మీద కొమ్ముతో పుట్టాడు కాబట్టి, అతనికి ఋష్యశృంగుడు  అని పేరు పెట్టారు. ఆ విభండక మహర్షి, ఋష్యశృంగునికి సమస్త వేదాలు, శాస్త్రాలు, యజ్ఞ యాగాదులు అన్ని చెప్పాడు. కానీ ఆ ఋష్యశృంగుడు పుట్టినప్పటి నుండి ఆ అరణ్యంలో లోకం తెలియకుండా పెరిగాడు. ఆయనకి అసలు ఈ సృష్టి లో స్త్రీ పురుషులని ఇద్దరు ఉంటారని కూడా తెలియదు. ఎప్పుడూ ఆ ఆశ్రమములోనే తండ్రి పక్కనే ఉండి నిత్యనుస్టానమును  ఆచరిస్తూ ఉండేవాడు. 

అదే కాలం లో అంగారాజ్యాన్నిరోమపాదుడు పరిపాలిస్తూ ఉన్నాడు. ఐతే ఒకసారి రోమపాదుడు ధర్మం తప్పడం వల్ల ఆ రాజ్యంలో వర్షాలు పడటం మానేశాయి. దేశంలో క్షామం వచ్చింది. తన ప్రజల వెతలు చూసిన  రాజు దీనికి నివారణోపాయాన్ని తెలుపమని కొందరు మహర్షులను సంప్రదించగా వారు ఋష్యశృంగుడు వారి రాజ్యం లో అడుగు పెడితే తప్పక వర్షాలు కురుస్తాయి అని చెప్పారు. 
వెంటనే రోమపాదుడు తన మంత్రులని పిలిచి విషయం చెప్తే, ఋష్యశృంగుడిని తీసుకురావటం వీలు కాదు,  ఏవిధమైన కోరికలు లేని వాడు, అసలు ప్రపంచం అని ఒకటి ఉన్నది అని కూడా తెలియని వాడు  రాజ్యానికి ఎందుకు వస్తాడు? కానీ మంత్రులు మేధో సంపన్నులు కనుక తప్పు మార్గం అని తెలిసి కూడా ఒక సలహా ఇచ్చారు. ఋష్యశృంగునికి కూడా ఇంద్రియాలు, మనస్సు ఉంటాయి, కాకపొతే ఇప్పటివరకు అతనికి లోకం తెలియదు, కనుకనే విషయసుఖాల గురించి కూడా తెలియదు. ఋష్యశృంగునికి అవి కొంచెం రుచి చూపిస్తే తమ రాజ్యం లోకి రప్పించవచ్చు అని. 

అప్పుడు రాజు కొంతమంది అందంగా అలంకరించుకున్నవేశ్యలని అడవికి పంపించాడు. వారు విభండక మహర్షి ఆశ్రమం లో లేని సమయం లో ఆ ఆశ్రమానికి కొంతదూరం లో ఆటపాటలు ప్రారంభించారు. వీరి ఆహ్లాదకరమైన మాటలు పాటలు విన్నఋష్యశృంగుడు వారి వద్దకు వెళ్లి ఇప్పటి వరకు చూడని వారు ఇక్కడ ఎందుకు ఉన్నారో తెలియక వారిని అడిగారు. "ఓ మహానుభావులారా! మీరు ఏ ఆశ్రమం నుండి వచ్చారు? ఇక్కడ అమీ చేస్తున్నారు? మా ఆశ్రమానికి వచ్చి మా ఆతిధ్యం స్వీకరించండి"

ఆ ప్రశ్నకు ఆ వేశ్యలు సమాధానం చెప్తూ వారి ఆశ్రమం కొoత దూరo లో ఉంది అని, మరొక సారి వచ్చినప్పుడు ఋష్యశృంగుడి ఆశ్రమాన్ని దర్సిస్తము అని వారి ఆటపాటలతో అప్పటికి అతనిని అలరించారు. కొంతసేపటి తరువాత విభండక మహర్షి ఆశ్రమానికి వచ్చేస్తారేమో అని భయం తో ఆ వేశ్యలు వెనుకకు బయలుదేరబోతు ఋష్యశృంగుడిని ఒకసారి కౌగలించుకుని వెళ్లారు. అప్పటి వరకు స్త్రీలు, వారి స్పర్స తెలియని ఋష్యశృంగునికి ఆ సంఘటన ఒక వింత అనుభూతిని కలిగించింది. మరలా వారు ఎప్పుడు వస్తారో అన్న ఆలోచన కూడా కలిగింది.
మరొక రోజు వారు రాగానే ఋష్యశృంగుడు వారిని తమ ఆశ్రమానికి ఆహ్వనించాడు. వారు వస్తూ తమవెంట కొన్ని తినుబండారాలు తెచ్చి, అవి వారి ఆశ్రమం లోని ఫలములు అని చెప్పి ఋష్యశృంగునికి ఇచ్చారు. కొంత సమయం తరువాత వారు తెరిగి వెళుతూ మరోసారి వారు వచ్చినప్పుడు ఋష్యశృంగుడు తమతో తమ ఆశ్రమానికి రావాలి అని ఆహ్వానించి వెళ్ళిపోయారు.
 ఈసారి వారు వచ్చినప్పుడు ఋష్యశృంగుడు వారి వెంట బయలుదేరాడు. ఋష్యశృంగుడు అంగదేశంలో అడుగుపెట్టిన మరుక్షణం బ్రహ్మాండమైన వర్షం కురిసింది. వెంటనే రోమపాదుడు ఋష్యశృంగుడికి నమస్కారం చేసి, ప్రార్ధించి, వారి అంతఃపురానికి తీసుకెళ్ళి తన కుమార్తె అయిన శాంత ని ఇచ్చివివాహం జరిపించారు.

తరువాత కొంతకాలానికి ఈ ఋష్యశృంగుడే దశరధుని చేత పుత్రకామేష్టి  జరిపించాడు.

మన ఈ కాలం లో శంకరాచార్యుడు సంపూర్ణ భారతదేశ యాత్ర చేస్తున్న సమయం లో ఋష్యశృంగుడు తపస్సు చేసిన ప్రదేశాన్ని గుర్తించి అక్కడే ఈనాటి శ్రుంగగిరి పీఠం స్థాపించారు.  

8, జులై 2014, మంగళవారం

కబందుడు

కబందుడు

కబంద హస్తములు అని మనం ఎప్పుడు వింటూ ఉంటాం. కాని ఎవరీ కబందుడు? అతని హస్తముల విశిస్టత ఏమిటి?

కబందుని గురించి మనకు రామాయణం లో వాల్మీకి మహర్షి చెప్పారు.

రామలక్ష్మణులు సీతాదేవి ని ఎవరో రాక్షసుడు  అపహరించాడు అని జఠాయువు ద్వారా  తెలుసుకుని ఆమె కోసం వెతుకుతూ తిరుగుతున్న సమయం లో లక్ష్మణ స్వామికి ఎడమ భుజం అదిరింది. అది అశుభ సూచన. మనసు అకారణం గా చంచలం గా ఉంది. జరగకూడనిది  ఏదో జరగబోతున్నది అని మనస్సు చెప్పుతున్నది. కాని ఆ జరగబోయే అశుభం నుండి మనం తప్పించుకోగలo అని ఆ వంచులకం అనే పక్షి కూత చెపుతోంది. ఆ పక్షికూత విన వస్తే ఆ శబ్దం విన్నవారు త్వరలో యుధం చేయబోతున్నారు, కాని ఆ యుధం లో వారికి విజయం లభిస్తుంది, అని లక్ష్మనుడు రామునకు చెపుతూ ఉన్న ఆ సమయం లో వారికి ఒక భయంకరమైన శబ్దం వినిపించింది. అది ఏమి శబ్దమో వారు తెలుసు కోవాలని ప్రయత్నించే లోగా ఒక విచిత్రమైన,వికృతమైన ఆకారం వారికి ఎదురుగా కనిపించింది.
ఆ ఆకారానికి తల లేదు, కాళ్ళు లేవు. నుదురు వంటి భాగం చాతి లోనూ, ముఖం వంటి ఒక భాగం పొట్ట వద్ద, అక్కడే ఒక కన్ను వంటి ఆకారం ఆ కంటికి ఒక పెద్ద రెప్ప, ఆ రెప్పకు పచ్చటి పొడవైన వెంట్రుకలు ఉన్నాయి. ఆ కన్ను అగ్నిజ్వాల లాగ ఎర్రగా ఉంది. ఆ ఆకారం యొక్క చేతులు ఒక యోజనం (సుమారు గా 12 కిలోమీటర్లు) పొడవుగా ఉన్నాయి. ఆ ఆకారాన్ని చూస్తె అది ఆ చేతులతో జంతువులను ఈడ్చి లాగుతుంది అని అర్ధం అవుతుంది. వారు ఇలా ఆలోచిస్తున్నoతలోనే ఆ ఆకారం తన రెండు చేతులతో వారిని పట్టుకుంది. ఆ ఆకారం తన చేతికి దొరికిన ప్రతిదాన్ని తన ఆహారం లానే భావిస్తుంది కనుక వారిని కూడా తినుటకు సంసిధం అయింది. ఆ పరిస్తితిలో లక్ష్మనుడు రామునితో "అన్నయ్యా!  ఈ విచిత్రమైన ఆకారం కదలలేదు కనుక మనం ఇతనిని మనం చంపకూడదు, ఇది ఇప్పుడు మనకు అపకారం చేయబోతోంది కనుక శిక్షించాలి. కనుక వీనికి కల ఈ చేతులను మనం త్రుంచివేయాలి" అని అన్నాడు. వెంటనే రాముడు ఆ ఆకారం యొక్క కుడి చేతిని, లక్ష్మనుడు ఎడమ చేతిని ఖండించి వేసారు.  చేతులు ఖండించగానే ఆ ఆకారం పరమానందం పొందింది.
ఆహా మహానుభావులారా! ఇంతకాలంగా  నా ఈ చేతులు ఖండించే వారికోసమే ఇటు వచ్చిన వారిని పట్టుకుంటూ ఉన్నాను. ఇంతకాలానికి మీరు ఈ కార్యానికి వచ్చారు. దయచేసి మీరు ఎవరు?ఇక్కడకి  ఎలా వచ్చారో  చెప్పండి? అని అడిగాడు.

దానికి లక్ష్మనుడు " ఈ యన మా అన్నగారయిన శ్రీరాముడు, నేను వారి తమ్ముడు లక్ష్మనుడిని. మేము ఇక్ష్వాకు వంశమునకు చెందిన వారము. మా అన్నగారి ధర్మపత్ని ఐన మాతల్లి సీతమ్మను ఎవరో రాక్షసుడు అపహరించాడు అని తెలిసి ఆమెను వెతుకుతూ ఇటు వచ్చాము. తమరు ఎవరు?" అని అడిగాడు.
దానికి ఆ వింత ఆకారం సమాధానం చెప్తూ "నేను శ్రీ అనే వాని యొక్క మద్యముడైన పుత్రుడను, నా పేరు దనువు.నేను చంద్రునివలె, ఇంద్రునివలె అత్యంత సుందరమైన, ఆహ్లాదకరమైన శరీరం కలిగిన వాడిని. ఆ అందం వల్ల అతిశయించిన గర్వంతో నావద్ద ఉన్న కామరూప శక్తి చేత విచిత్రమైన, భయంకరమైన రూపములు ధరించి అనేక ప్రాంతములలో ఉన్న ఋషులను, మునులను భయకంపితులను చేస్తూ ఉండేవాడిని. ఒకరోజు కoద మూలములు ఏరుకుంటున్న స్థూలసిరస్కుడు అనే ఒక ఋషికి ఈరోజు నేను ఉన్నఈ రూపం తో ఒక్కసారిగా కనిపించాను. నన్ను చుసిన ఆ ఋషి ఉలిక్కిపడి, నిజమును గ్రహించి నీకు ఇటువంటి  భయంకరమైన, జుబుక్త్సాకరమైన రూపం ఇష్టం లా అనిపిస్తున్నది కనుక నువ్వు ఈరూపం తోనే ఉందువు గాక అని నాకు శాపవాక్కు విడచాడు.అప్పుడు సిగ్గు పడిన నేను శాపవిమోచనం చెప్పమని కోరగా, ఆ ఋషి కొంతకాలం అరణ్యంలో నేను ఈ రూపం తో పడిఉండగా రామచంద్రుడు వచ్చి నా చేతులు ఖండించి నన్ను అగ్నిలో దాహిoచిన  తర్వాత నాకు నిజరూపం వస్తుంది అని సెలవిచ్చారు.
ఆ ఋషి  శాపం కార్యరూపం నాకు సంక్రమించేలోపు బ్రహ్మగురింఛి ఘోర తపస్సు చేస్తే, ఆయన నన్ను దీర్ఘాయుష్మాన్భవ అని దీవించి వెళ్ళిపోయాడు. అప్పుడు మరలా గర్వం అతిశయించిన నేను ఇంద్రుని మీదకు యుధానికి వెళ్ళాను. ఐతే ఇంద్రుడు తన వజ్రాయుధం తో నా తలను ఖండించి, తలను, కాళ్ళను పొట్టలోకి తోచి వేసాడు. దీర్ఘయుషు ఉన్ననేను ఈ రూపం తో ఎలా ఉండగలను బ్రతకటానికి ఆహారం కావలి కదా అని నేను ఇంద్రుని అడిగాను. అప్పుడు ఇంద్రుడు నాకు కన్ను కనిపించేలాచేసి, యోజనం ప్రమాణం లో చేతులను ఇచ్చి వాటితో తడుముకొని దొరికినవి తినమని చెప్పి వెళ్ళిపోయాడు. శ్రీరామా అప్పటినుండి నేను మీకోసం ఎదురు చుస్తూ ఉన్నాను. మీరు నా శరీరాన్ని అగ్నికి ఆహుతి చేస్తే, నాకు నిజరూపం వచ్చిన తర్వాత నాకు గల శక్తి చేత మీరు సీతమ్మను వెతకుటకు నేను మార్గం చెప్పగలను అని అన్నాడు.
సూర్యాస్తమయం సమీపిస్తున్నది కావున లక్ష్మనుడు ఒక పెద్ద గొయ్యి తీసాడు. అతనిని ఆ గోతిలోకి నెట్టి వేసారు. ఎనుగులచేత విరచి, ఎండినటివంటి కర్రలను వేసి అగ్ని సంస్కారం చేసారు. ఇంతకాలం గా కదలకుండా తినుటవల్ల బాగా కొవ్వుపట్టిన శరీరం అవుటవల్ల మెల్లగా కాలింది. ఆ శరీరం పూర్తిగా కాలిన తర్వాత ఒక సుందరమైన ఆకారం కల దివ్యపురుషుడు రధంలోకనిపించాడు. ముగ్ధమనోహరమైన, కృతజ్ఞతతో కూడిన  చిరునవ్వుతో వారికి నమస్కరించి, ఒక్క క్షణం కన్నులు మూసుకుని, తర్వాత ఇలామాట్లాడాడు.
" రామా! మీరు దుర్ధశాఫలితాన్ని అనుభవిస్తూ ఉన్నారు. కనుక భార్యావియోగం కలిగింది. మీరు ఈ విధంగా వెతికితే మీకు కలిగే ప్రయోజనం చాల తక్కువ. ఈ సమయం లో ఈ భూమండలం అంతా తిరిగిన మిత్రుని వల్ల  మీకు ఎంతో మేలు జరుగుతుంది. మీకు ఇప్పుడు అటువంటి ఒక మిత్రుడు అవసరం.అటువంటి ఒక వానరరాజు ఉన్నాడు. అతని పేరు సుగ్రీవుడు. ఆతను సూర్యుని ఔరస పుత్రుడు. కొన్ని కారణముల వాళ్ళ తన అన్నగారయిన వాలితో విభేదించి తన నలుగురు మంత్రులతో ఋష్యమూక పర్వతం మీద ఉన్నారు. సుగ్రీవుడు అత్యంత బలవంతుడు, ఈ భూమిమీద ఎక్కడ ఏమి ఉన్నదో తెలిసిన వాడు. కావున నీవు అతనితో అగ్ని సాక్షిగా స్నేహం చేసుకో మని చెప్పాడు. అక్కడికి ఎలావేళ్ళాలో కుడా చెప్పి రాముని అనుమతి తీసుకుని వెళ్ళిపోయాడు.

6, జులై 2014, ఆదివారం

అద్రిక

అద్రిక 
అద్రిక ఒక అప్సరస. ఆమె తన అందానికి అతిహసించి ప్రవర్తించగా బ్రహ్మదేవుడు ఆమెను చేపగా పుట్టమని శపించాడు. అప్పుడు పశ్చాతాపం పొందిన అద్రిక తనకు శాపవిమోచనం చెప్పమనగా అప్పుడు బ్రహ్మ సృష్టిలో ఇప్పటి వరకు లేని విధంగా ఎప్పుడైతే చేపగా ఉన్న నీ కడుపులోనుండి ఇద్దరు మానవ సంతానం కలుగుతుందో అప్పుడు శాపవిమోచనం కలుగుతుంది అని చెప్పాడు.

ఎంతో  కాలం చేపగా ఉన్నతర్వాత ఒకసారి ప్రమాదవశాత్తు ఉపరిచరవసువు యొక్క వీర్యం మింగుట  వల్ల ఆమె గర్బం ధరించింది. చేపగా ఉన్న ఆమెను జాలరులు పట్టుకుని పొట్ట కోసి చూడగా ఒక ఆడపిల్ల, ఒక మగపిల్లవాడు ఆమె గర్భం నుండి జన్మించారు, ఆమెకు శాప విమోచనం జరిగింది.

ఈమెకు జన్మించిన ఈ ఆడపిల్ల పితృదేవల మానసపుత్రి, అమావస్య. ఆమె తన తండ్రులు ఇచ్చిన శాపం కారణంగా అద్రికకు జన్మించింది. కాలాంతరం లో ఆ ఆడపిల్ల మస్త్యగంధి గా, యోజనగంధిగా, సత్యవతి గా పేరుపొంది వ్యాసమహర్షికి తల్లి అయింది. తరువాతి కాలం లో ఈమె కురురాజైన శoతనుడిని వివాహం చేసుకుంది.

ఆ మగ పిల్లవాడు మస్త్యరాజ్యానికి రాజు అయినాడు. 

ఉపరిచర వసువు

ఉపరిచర వసువు

చేది దేశాధిపతి వసువు, ధర్మాత్ముడు, ఇంద్రునితో సమానమైన బల పరాక్రమములు కలవాడు. ఒకసారి అతడు వేటకు వెళ్లి  ఒక ముని ఆశ్రమమునకు వెళ్లి తపస్సు మొదలు పెట్టాడు. అతని తపస్సుకు మెచ్చి ఇంద్రుడు దేవతా గణములతో ప్రత్యక్షమయి అతనికి ఒక దివ్య విమానం, వాడని పద్మములు కల మాల, దుష్ట  శిక్షణ , శిష్ట రక్షణ  కొరకు ఒక వేణు ఇష్టి ని ఇచ్చాడు.  దేవాధిపతి ఐన తనకి భూలోకం లో ఉన్న వసువుకు మంచి స్నేహ సంబంధాలు ఉంటాయి అని మాట ఇచ్చాడు. ఈ వసువు విమానం లో తిరుగుతూ ఉండుటవల్ల ఈ వసువుని ఉపరిచర వసువు అన్నారు.

ఇంద్రుడు ఇచ్చిన వరం తో వసువు కు బృహగ్రధుడు, మణివాహనుడు, సౌభలుడు, యదువు మరియు రాజన్యుడు అనే ఐదుగురు పుత్రులు కలిగారు.

వారి రాజధాని దగ్గరే కోలాహలం అనే ఒక పర్వతానికి అక్కడే ప్రవహిస్తున్న శుక్తిమతి అనే నది మీద కోరిక కలిగి ఆ నది దారిని అడ్డగించాడు. అప్పుడు ఆ నది భాదను వసువు గమనించి ఉపరిచర వసువు తన కాలితో ఆ పర్వతాన్ని తన్ని దాన్ని తొలగించాడు. ఐతే అప్పటికే ఆ నదికి ఒక కొడుకు, ఒక కూతురు ఆ పర్వతం వల్ల జన్మించారు. అప్పుడు వారు ఆ పిల్లలని ఉపరిచర వసువుకి ఇచ్చారు. అప్పుడు వసువు ఆ నది పుత్రుడైన సుపదుని తన సైన్యాధికారి గా నియమించి అమ్మాయి ఐన గిరికను తానె వివాహం చేసుకున్నాడు.

ఒకసారి ఉపరిచర వసువు వేటకు వెళ్ళగా అక్కడ ఉన్న్న ప్రకృతి సౌందర్యాన్నిచూసి తన ఋతుస్నాత ఐన భార్య గుర్తురాగ వీర్య స్కలనం జరిగింది. తన వీర్యం నిష్ఫలం కాగూడదు కనుక దాన్నిఒక ఆకు దొన్నెలో ఉంచి, తన భార్యకు పంపదలచాడు. దాని కోసం అక్కడే ఉన్న ఒక శీఘ్రగామిని  అనే ఒక డేగ ని ఆ పనికి కేటాయించి దాని మేడలో ఆ దొన్నెను కట్టాడు. ఆ డేగ వెళుతూ ఉండగా, దానికి కట్టి ఉన్నదొన్నెచుసిన మరొక డేగ అది మాంస ఖండమని భావించి దానికోసం వచ్చింది. అప్పుడు జరిగిన హడావిడి లో ఆ దొన్నె జారి యమునా నదిలో పడిపోయింది. దాని లోని వీర్యం ఒక చేప నోటిలో పడింది. ఒక అద్రిక అనే అప్సరస శాపకారణం గా ఆ చేప రూపo లో అక్కడ ఉంది. కొన్నినెలల తర్వాత జాలరులు ఆ చేపను పట్టుకున్నారు. అప్పుడు దాని పొట్ట లో వారికి ఒక మగ పిల్లవాడు, ఒక ఆడపిల్ల కనిపించారు. వారిద్దరిని ఆ జాలరులు వారి రాజుకి సమర్పించారు. అప్పుడు ఆ రాజు ఆ పిల్లవాడికి మస్త్యరాజ్య పట్టాభిషేకం చేసాడు. ఇక ఆ ఆడపిల్ల మస్త్య వాసనతో ఉంది. కనుక ఆమెను మస్త్య గంధి  అని పిలిచి,ఆమెను జాలరులకు అధిపతి ఐన దాశరాజుకు  ఇచ్చాడు.

ఆమే కాలాంతరం లో వ్యాసునికి తల్లి అయ్యి, తన చేపల వాసన పోగొట్టుకుని యోజన గoధి గా మారి, కురు రాజయిన శంతనుడిని వివాహం చేసుకుoది. 

వేదవ్యాస జననం

మనం ప్రస్తుతం ఉన్న వైవస్వత మన్వంతరంలో 28 వ మహాయుగంలో మనకొరకు వేదవిభాగం చేసిన వేదవ్యాసుడు పరాశర మహర్షి కుమారుడు అయిన కృష్ణ ద్వైపాయనుడు (ఈ వైవస్వత మన్వంతరం లో వచ్చిన 28వ వ్యాసుడు). వ్యాసుడు నారాయణ స్వరూపంగా చెప్పబడతాడు. అతని జననం దాగి ఉన్న రహస్యములతో కూడినది. దానిని గురించి ఇక్కడ మనం చెప్పుకుందాం.

సంభవం:
మస్త్యగంధి దాశరాజుకుమార్తెగా పెరుగుతూ ఉంది. ఆమెనే సత్యవతి అని కూడ అంటారు. ఆమె యుక్త వయస్సు కు వచ్చాక తన తండ్రికి సాయంగా తాను ఆ యమునా నది మీద పడవ నడుపుతూ ఉంది. ఒక రోజు శక్తి మహర్షి కుమారుడైన పరాశర మహర్షి తీర్ధయాత్రల నిమిత్తమై యమునను దాటవలసి వచ్చింది. అప్పుడు అతనికి ఈ మస్త్యగంధి పడవ కనిపించగా దానిలో ఎక్కాడు. పడవ నదిలో కొంత దూరం వెళ్ళాక పరాశర మహర్షి కి మస్త్యగంధి పై కామవాంఛ  కలిగింది. అది ఆమెతో ప్రస్తావించగా దానికి ఆమె ఇందరి మహానుభావుల మద్య ఇంత జ్ఞానులయిన మీరు ఇలా ఎలా ప్రవర్తించగలరు? అని అడిగింది. దానికి సమాధానం గా పరాశర మహర్షి ఒక మాయాతిమిరాన్ని(దట్టమైన మంచు పొరను) తాము ఉన్న పడవ చుట్టూ సృష్టించాడు.
పరాశర మహర్షితో సంగమిస్తే తన కన్యత్వం భంగం అవుతుంది, తిరిగి తన తండ్రివద్దకు ఎలా వెళ్ళాలి? అని అడిగింది
తనతో సంగమించిన తరువాత కూడా ఆమె కన్యత్వం చెడదు అని చెప్పి ఏమైనా మరోవరం కోరుకో మని చెప్పాడు.
ఆమె తన శరీరం నుండి వస్తున్న ఈ మస్త్యగంధం తనకు నచ్చలేదు కనుక దానిని దూరం చేయమని కోరింది.
దానికి పరాశర మహర్షి ఈ చేపల వాసన పోవటమే కాదు ఇక మీద ఆమె శరీరం నుండి గంధపు వాసన ఒక యోజనం దూరం వరకు వ్యాపిస్తుంది, దాని వల్లనే ఆమెను ఇక మీద అందరూ యోజన గంధి అని పిలుస్తారు అని వరం ఇచ్చాడు.
అప్పుడు వారి కలయిక లో సధ్యగర్భం లో అప్పటికి అప్పుడే వ్యాసుడు జన్మించాడు. వ్యాసుడు సుర్యసమాన తేజస్సు కలిగి, సర్వ వేద జ్ఞానo తో పుట్టాడు. పుట్టిన వ్యాసుడు తన తల్లితో తానూ తపస్సుకు వెళ్తున్నాను అని, తన తల్లి ఎప్పుడు తనను పిలిస్తే అప్పుడు తాను తప్పక వస్తాను అని మాట ఇచ్చి తన తల్లి అనుమతి తో తపస్సు కు వెళ్ళాడు.
వ్యాసుడు చిన్నప్పుడే ఆ యమునా నది ద్వీపం లో వదిలి వేయబడుటవల్ల అతనిని ద్వైపాయనుడు అని, శరీరం నల్లగా ఉండుటవల్ల కృష్ణద్వైపాయనుడు అని అన్నారు.

ఈ ఘట్టాన్ని చదువుతున్న మనకు ఇక్కడ  కొన్ని ప్రశ్నలు తలెత్తుతాయి.

1. పరాశర మహర్షి కి ఒక చేపల వాసన కల స్త్రీ మీద కామవాంఛ ఎందుకు కలిగింది?
2. తన ఇంద్రియాలను నిగ్రహించుకో లేని పరాశరుడు ఋషి అని ఎలా చెప్పారు?
3. ఆమె అడిగిన అన్ని వరాలు ఇచ్చి మరీ ఆమెతో ఎందుకు సంభోగించాడు?

సామాజిక వివరణ: 
ఈనాటి మన శాస్త్రముల ప్రకారం కుడా తల్లి తండ్రుల జన్యువులు, సంగమ సమయం లో వారి మనసులలో కలిగిన భావాలు పుట్టబోయే పిల్లల ప్రవర్తనకు సోపానాలు వేస్తాయి. (అందుకే ఎప్పటికి గర్భవతి కావాలనుకున్న, ఐన స్త్రీని మనసుకు ఆహ్లాదం కలిగించే ప్రదేశాలను, బొమ్మలను చుస్తూ ఉండమని చెప్తాం)

కాబట్టి వ్యాసుడు వంటి ఒక గొప్ప ఆద్యాత్మిక వేత్త జన్మించాలి అంటే అంతే తేజస్సు కలిగిన ఒక మహర్షియొక్క సంగమం ఒక అద్వితీయమైన స్త్రీ తో సహజం గా మనస్సు చలించి జరగాలి. అప్పుడే ఆ తల్లి తండ్రులలోని మంచి గుణములు, జ్ఞానము ఆ పుట్టబోయే బిడ్డకు కలుగుతుంది.
పరాశర మహర్షి మహాజ్ఞాని, మహా తపస్సంపన్నుడు. భూత భవిష్యత్ వర్తమాన కాలముల గురించి తెలిసిన వాడు. కాబట్టి పరాశర మహర్షి సత్యవతిని ని చూసినప్పుడు, వారికి ఒక లోకోత్తరమైన సంతానం కలుగ వలసిన సమయం ఇదే అని తెలిసి ఉండాలి.
మస్త్యగంధి,  ఉపరిచర వసువు తన భార్య ఐన గిరిక (ఒక నది, పర్వతముల కుమార్తె) ను తలుచుకొనుట వల్ల స్కలనం అయిన వీర్యం తో శాపగ్రస్తమైన అప్సరస ఐన అద్రిక కు జన్మించింది.
వీరిద్దరూ వ్యాస జననానికి కలిసి తీరాలి.
కాబట్టి మస్త్యగంధి ని చుసిన పరాశరునికి కామవాంఛ కలిగింది.

తనకు పేరు తీసుకు వచ్చే పుత్రుడిని ఇచ్చే స్త్రీ కి ఆ పురుషుడు సంతోషం గా ఏమి అడిగినా ఇస్తాడు. కాబట్టి సత్యవతి అడిగిన అన్ని కోరికలు పరాశర మహర్షి తీర్చాడు. పైగా ముందు ముందు ఆమె కురు వంశానికి చేరవలసినది, శంతనుడిని వివాహం చెసుకో వలసినది కనుక ఆమె మస్త్యగంధిగా ఉండకూడదు. కాబట్టి ఆమెను యోజనగంధి ని చేసాడు.


ఆద్యాత్మిక వివరణ:
  • సత్యవతి: సత్యస్వరూపుడైన భగవంతుని గురించి తెలుసుకో తలచిన సాధకురాలు/ సాధకుడు  
  • దాశరాజు:ఐదు జ్ఞానేంద్రియాలు, ఐదు కర్మేంద్రియాలు కలిపి పది. సంస్కృతం లో దశ, వాటి అధిపతి రాజు కలిపి దాశరాజు 
  • పరాశరుడు: పరమాత్మ చే విడువబడిన శరం, సద్గురువు. 
  • యమునా నది పై పడవ: యమునా నది నీరు తమో గుణానికి, పడవ  దాన్ని దాటాలి అనే ఆలోచనకి గుర్తు. 
  • పరాశరునికి సత్యవతి పై సంగమ వాంఛ : ఒక సద్గురువు, ఒక సాధకుడిని అనుగ్రహించి జ్ఞాన భోద  చేయాలి అనుకోవటం. 
  • సత్యవతి చుట్టూ అందరూ  ఉన్నారు అని చెప్పటం: గురువు గారు భోధనలు విని ఈ లోకం లో ఉన్నఆకర్షణలు ఉండగా మీ జ్ఞానోపదేశం ఎలా నిలబడుతుంది అని అడుగుట. 
  • మాయా తిమిరం: ఈ లోకం లోని ఆకర్షణలు సాధకునికి అడ్డు రాకుండా గురువు చేసే జ్ఞానబోధ 
  • కన్యత్వం పోతే తండ్రి వద్దకు ఎలా వెళ్ళను: గురువు గారు , తమరు వైరాగ్యబోధ చేస్తారు. మరి నేను నా గృహ సంబంధం ఐన దశ జ్ఞానేంద్రియాలకు సంబంధించిన అన్ని భాద్యతలు వదిలి వేయాలా?
  • కన్యత్వం పోకుండా బిడ్డను కనుట: విషయ సాంగత్యం చెడకుండానే గురువు సాధకునకు జ్ఞానోపదేశం చేయగలరు, సాధకుడు పొందగలడు. 
  • మస్త్యగంధం పోయి సుగంధం: సాధకుడి గతజన్మ దుర్వాసనలు నశింపచేసి కొత్త సుగుణాలని ఆవిష్కరింప చేయుట 
  • సధ్యగర్భం: గురువు చేస్తున్న భోదల వాల్ల అప్పటికి అప్పుడే జ్ఞానం పొందుట 
  • వ్యాసుడు తల్లి ఎప్పుడు పిలిస్తే అప్పుడు వస్తాను అనుట: గురు బోధ తో వచ్చిన జ్ఞానం సాధకునకు మనసులో నిలిచి పోవాలంటే ఆ విషయాన్ని మననం చెస్తూనే ఉండాలి. మననం చేసినప్పుడు మాత్రమే ఆ జ్ఞానం మనకు ఉపయోగపడుతుంది. 

5, జులై 2014, శనివారం

శ్రీ కృష్ణుడు దేవకి, వసుదేవులకే ఎందుకు జన్మించాడు?

దేవకి, వసుదేవుడు మూడు  జన్మలు ఆ శ్రీహరిని పుత్రుని గా పొందారు.

వారు పృశ్ని,సుతప ప్రజాపతి గా జన్మించినప్పుడు వారి వివాహం అయిన కొద్ది కాలానికే తపస్సు మొదలు పెట్టారు. 4 యుగాల పాటు తీక్షణమైన తపస్సు చేసారు. వారికి శ్రీహరి ప్రత్యక్షo ఐనప్పుడు వారు శ్రీహరి వంటి బిడ్డ తమకు కావాలని కోరారు. శ్రీహరి అలాగే అన్నారు. కాని తనవంటి వాడు ఇంకొకడు లేడు కనుక తానే స్వయంగా వారికి జన్మించాడు.

మొదటి జన్మలో శ్రీహరి వారి కి జన్మించారు. ఆ జన్మలో అతనిని పృశ్నిగర్భుడు అన్నారు.

రెండవ జన్మలో కశ్యప ప్రజాపతి, అదితి లకు ఉపేంద్రుని గా జన్మించాడు. అతనినే మనం వామనుని గా చెప్తున్నాం.
మూడవ జన్మ లో దేవకి, వసుదేవుడు లకు శ్రీ కృష్ణుడి గా జన్మించారు.

ఐతే జన్మించి నప్పుడు 3 జన్మలలో తను నిజరూపం తోనే జన్మించారు. పీతాంబరం, శంఖ, చక్ర , గధ, పద్మములతో జన్మించారు. వారు తమకు జన్మించమని కోరారు కనుక తానూ జన్మించారు. కానీ  తన బల్యోపచారాలను వారు కోరలేదు  కనుక వామన అవతారం లో వెంటనే వడుగు వయస్సు కలవానిగా మారిపోయారు. ఇక శ్రీ కృష్ణ అవతారం లో నందుని ఇంటికి చేరారు. 

ఖాoడవ వన దహనం

ఖాoడవ వన దహనం 

ఒకరోజు శ్రీకృష్ణుడు, అర్జునుడు కలిసి యమునా నది తీరం లో విహరిస్తూ ఉండగా వారికి  ఒక ఆజానుబాహుడు, అమిత తేజోసంపన్నుడు ఐన ఒక బ్రాహ్మణుడు కనిపించాడు. అతనిని చూడగానే శ్రీకృష్ణుడు, అర్జునుడు అతనికి ఎదురు వెళ్లి స్వాగతించి, ఒక ఉన్నత ఆసనం మీద కూర్చోబెట్టారు. కుశల ప్రశ్నలు ఐన తర్వాత శ్రీకృష్ణుడు, అర్జునుడు ఆ బ్రాహ్మణుని తో తమరు ఎవరు, ఈ ప్రాంతానికి రావటానికి గల కారణం ఏమిటి అని అడుగగా ఆ బ్రాహ్మణుడు తాను ఎక్కువగా భుజించే అలవాటు కలవాడను అని, ఎంత తిన్నా కుడా అరిగించుకో గల శక్తి కలవాడను అని తనకు తృప్తి కలిగించగల భోజనాన్ని కోరి ఈ ప్రాంతానికి వచ్చాను అని చెప్పాడు. ఆ మాట విన్న శ్రీకృష్ణుడు, అర్జునుడు మీ వంటి సత్ బ్రాహ్మనునికి ఆతిధ్యం ఇవ్వగలగటం మా అదృష్టం, మీకు ఏవిధమైన భోజనం తృప్తి కలిగిస్తుందో సెలవిస్తే అట్టి భోజనాన్నే ఏర్పాటు చేయగలము అన్నారు.  ఖాoడవ వన దహనం 

ఆ మాటలు విని సంతోషించి ఆ బ్రాహ్మణుడు తాను అగ్నిదేవుడను అని, తనకు తగిన భోజనాన్ని ఇవ్వవలసినది గా కోరాడు. అది విన్న శ్రీకృష్ణుడు, అర్జునుడు తమకు ఏమీ కావాలో దయచేసి చెప్పండి అని అడుగగా అప్పుడు అగ్ని దేవుడు తాను ఈ ఖాoడవ వనాన్ని దహించాలని ఎంతో కాలంగా ప్రయత్నిస్తున్నాను, కానీ ఈ వనాన్ని,ఇందులో ఉంటున్న తక్షకుని దేవేంద్రుడు కాపాడుతున్నాడు కనుక ఇంతకాలం కుదరలేదు అని ఇప్పుడు తాను ఈ వనాన్ని దహించటానికి శ్రీకృష్ణార్జునులు సహాయం చేయవలసినది గా కోరాడు. అది విని కృష్ణార్జునులు అగ్నిదేవుడు ఈ వనాన్నే ఎందుకు దహించాలని కోరుకుంటున్నాడో, దాని కోసం ఇంత కాలం వేచి ఎందుకు ఉన్నారో అన్న కుతూహలం కలిగింది. అప్పుడు అగ్నిదేవుడు వారికి జరిగిన విషయాన్ని ఇలా చెప్పరు. 

పూర్వం శ్వేతకి అనే ఒక రాజర్షి ఎన్నో యజ్ఞములు చేసాడు,దానములు చేసాడు. ఎన్ని యజ్ఞములు చేసినా ఇంకాఇంకా చేస్తూనే ఉండేవాడు. యజ్ఞములు ఎంతగా చేసాడంటే ఆ యజ్ఞం చేయించే ఋత్విజులకు కుడా పొగాసూరి పోయేoతగా. ఒకరోజు అతనికి వేయి సంవత్సరములు చేసే సత్రయాగం చేయాలి అని కోరిక కలిగింది.  
కోరిక కలిగినదే ఆలస్యం  ఋత్విజులకు కబురు పంపి తన కోరిక చెప్పాడు. ఐతే ఏ  ఋత్విజు కుడా ఈ యజ్ఞము చేయటానికి అంగీకరించలేదు. ఐనా తన కోరిక బలంగా ఉండుట చేత పరమ ఖటోరమైన నియమాలతో ఆ పరమశివుని గురించి తపస్సు చేసాడు. తపస్సుకు మెచ్చిన భోళాశంకరుడు వరం కోరుకోమనగా తన కోరికను విన్నవించాడు, శంకరుడినే ప్రధాన ఋత్విజు గా ఉండి తనతో యాగం చేయిo చ వలసినదిగా కోరాడు. దానికి  శంకరుడు యజ్ఞం చేయించే పని బ్రాహ్మణులది కనుక ఈ యాగాన్ని తన అంశ ఐన దుర్వాసుడు చేయిస్తాడు కాని దానికోసo నీవు పన్నెండు సంవత్సరముల పాటు ఎడతెగని ఆజ్య ధారలతో అగ్నికి ఆహుతి ఇవ్వాలి అని చెప్పాడు. చెప్పిన విధంగానే పన్నెండు సంవత్సరముల పాటు ఆ రాజర్షి ఎడతెగని ఆజ్య ధారలతో అగ్నికి ఆహుతి ఇచ్చాడు. పరమేశ్వరుడు చెప్పిన మాటప్రకారం దుర్వాసుడు సేతకి తో సత్రయాగాన్ని చాలా గొప్పగా చేయించాడు. 
ఇన్ని సంవత్సరాలపాటు ఎడతెరిపి లేకుండా ఆ రాజర్షి ఇస్తూ వచ్చిన ఆజ్య ధారలు త్రాగి త్రాగి నాకు అగ్నిమాoధ్యం ఆవరించింది. హవిర్వాహనుడనైన నేను దేవతలకు హవిస్సు కుడా తీసుకు పోలేక శక్తి హీనుడను ఐయి పితామహుడైన బ్రహ్మ దేవుడిని శరణు వేడగా ఆ బ్రహ్మదేవుడు నాకు ఈ  ఖాoడవ వనo లో గల ఔషదముల వల్ల, సర్వ జంతు క్రొవ్వు వల్ల  నా పరిస్తితి చక్కబడుతుందని సలహా ఇచ్చారు. నేను అలాగే వచ్చి ఈ వనాన్ని దహించాలని ప్రయత్నించగా తక్షకుడిని కాపాడేనిమిత్తమై ఇంద్రుడు వర్షధారలు కురిపించగా నేను ఈ వనాన్ని దహించలేక మళ్ళీ వెళ్లి ఆ బ్రహ్మను కోరగా, అప్పుడు బ్రహ్మదేవుడు ఈ భూమి మీద నరనారాయణులు మరలా జన్మించ బోతున్నారు, వారు నీ కోరిక తీర్చగలరు అని సెలవిచ్చారు. మహానుభావులార అప్పటి నుండి నేను మీ కొరకు వేచి చూస్తున్నాను అని చెప్పాడు.

ఈ వృత్తాంతం అంతా విన్న అర్జునుడు అగ్నిదేవునితో ఇలా అన్నాడు "ఓ అగ్నిదేవా,మేము నీకు తప్పక సహాయం చేయగలము. కానీ ఈ సమయం లో మేము విహారానికి వచ్చాము. మా వద్ద ఇంద్రుని తో యుధం చేయుటకు కావలసిన శ్రేష్టమైన ధనస్సు, తూణీరములు,రధములు లేవు కనుక వీనిని నీవు మాకు ప్రసాదిస్తే మేము నీకు తప్పక సహాయము చేస్తాము."

ఆ మాటలు విన్న అగ్నిదేవుడు వరుణ దేవుని ప్రార్ధించాడు "ఓ వరుణ  దేవా, ఈ నాడు నాకు ఈ కృష్ణార్జునుల అవసరం ఎంతో  ఉన్నది. అందువల్ల సోముడు మీ వద్ద ఉంచిన గాంఢీవం అనే ధనుస్సును, అక్షయ బాణ తూణీరములను, కపి ధ్వజంతో ఉన్న దివ్య రధమును, తెల్లని గంధర్వ హయాలను ఈ పాండవమధ్యముడైన అర్జుననుకు ఇవ్వవలసినది. అలాగే ఈ శ్రీకృష్ణునకు అపురూపమైన సుదర్శన చక్రం, గంధర్వహయసహితమైన దివ్య రధమును,కౌమోదకిని ఇవ్వవలసినది"

అప్పుడు వరుణుడు అర్జునునకు  గాంఢీవము గురించి చెప్తూ అర్జునా ఈ గాంఢీవం చాల విశిష్టమైనది. ఏ అస్త్రశస్త్రములనైనా ఎదిరించగలదు,అనేక వత్సరములపాటు దేవ, దానవ, గంధర్వ గణాలచే పూజలందుకున్నది. ఈ అక్షయబాణ తూణీరాలు అక్షయమైన బాణములను ఇస్తూనే ఉంటాయి. అని చెప్పి గాంఢీవం,అక్షయబాణ తూణీరాలు, కపి ధ్వజంతో ఉన్న దివ్య రధమును, తెల్లని గంధర్వ హయాలను అర్జుననుకు ఇచ్చాడు.

ఇక శ్రీకృష్ణునకు వజ్ర సమానమైన నాభి కల సుదర్శన చక్రమును, శత్రుభయం కరమైన కౌమోదకి అనే గధను, దివ్య రధమును, తెల్లని గంధర్వ హయాలను ఇచ్చాడు

అప్పుడు అర్జునుడు యుధానికి సిధమౌతూ  గాంఢీవానికి నారి బిగించాడు, అప్పుడు వచ్చిన టంకారానికి ఆ వనం లోని క్రూరమృగాలు దిక్కులకు పారిపోయాయి. అర్జునుడు తాము సర్వ సంసిధులుగా ఉన్నాం అని అగ్ని ఇక తన దహనాన్ని మొదలుపెట్టవలసినదిగా చెప్తే అప్పుడు అగ్నిదేవుడు తన ఏడు తేజోరూపాలతొ ఆ వనాన్ని అన్ని వైపులనుండి ఆక్రమించాడు.

అప్పుడు అందులో కల జంతువులు ఎటూ పారిపోలెక పెద్దగా అరుస్తూ ఉన్నాయి, ఎగిరి పారిపోదమనుకున్న పక్షులను అర్జునుడు తన బాణాలతో ముక్కలుచేసి మళ్ళి  ఆ మంటలలో పడవేస్తున్నాడు. ఆ అగ్నికీలల వేడిమికి తట్టుకోలేని దేవతలు, ఋషులు ఇంద్రుని వద్దకు వెళ్లి మొరపెట్టుకోగా ఇంద్రుడు వర్షం కురిపించాడు. ప్రచండం గా వ్యాపిస్తున్న ఆ అగ్ని ని వర్షం ఏమీ  చేయలేక పోయింది. అప్పుడు ఇంద్రుడు పెద్ద పెద్ద మేఘాలను సృష్టించి నిరంతరాయంగా వర్షం కురిపిస్తుండగా, అర్జునుడు తన శస్త్రనైపుణ్యం తో ఆ ఖాoడవ వనానికి అంతా  ఒక గొడుగులా తన బాణాలను ప్రయోగించాడు. ఒక్క వర్షపు చుక్కకూడా వనం చేరలేకపోయింది.

ఈ ఖాoడవ వనదహన సమయం లో తక్షకుడు  ఆ వనం లోలేడు కానీ  అతని భార్య, పుత్రులు అక్కడే ఉన్నారు. తమపుత్రుడైన అశ్వసేనుడిని  రక్షిo చుకోవాలని  తక్షకుని భార్య తనపుత్రుని శరీరం చుట్టూ తన శరీరం ఉంచుతూ ప్రయత్నిస్తూ తన ప్ర్రాణాలను కోల్పోయింది. ఇది  చుసిన ఇంద్రుడు ఎలా  ఐనా  తన మిత్రుని యొక్క పుత్రుడిని కాపాడతలచి  ఒక్కసారిగా విపరీతమైన గాలి వానలను సృస్టించాడు. కృష్ణార్జునులు ఆ గాలివానను నిలువరించే  ప్రయత్నంలో ఉండగా ఈ అశ్వసేనుడు తప్పించుకున్నాడు.

అశ్వసేనుడు  తప్పించుకూవటం చూసిన అర్జునుడు ఇంద్రునితో యుధానికి సిధమైనాడు. ఇంద్రుడు ఐoద్రాస్త్రాన్ని ప్రయోగించాడు, దానికి బదులుగా అర్జునుడు వాయువ్యాస్త్రాన్ని ప్రయోగించాడు. రాక్షస, యక్ష, నాగ సైన్యం కృష్ణార్జునులమీద  ఒక్కసారిగా విజృంభించారు. అర్జునుడు అందరిని నిలువరించాడు. సర్వదేవతలు వారి వారి ఆయుధాలను ప్రయోగించగా కృష్ణార్జునులు అందరిని ఎదిరించారు. కృష్ణుని చక్ర ధాటికి దేవతలు నిలువ లేక తమ ఓటమిని అంగీకరించి , వారి వారి లోకాలకు వెళ్ళిపోయారు.

వన దహనం సాగుతుండగా తక్షకుని ఇంటిలో ఉన్న మయుడు అనే రాక్షస శిల్పి అగ్నికీలల నుండి తప్పించుకోవాలని ప్రయత్నిస్తుండగా శ్రీకృష్ణుడు చూసి చక్రప్రయోగం చెయబోవటాన్ని చూసి ఆర్జునుడిని శరణు వేడాడు. శరణాగత వత్సలత్వం క్షత్రియ ధర్మం కావున అర్జునుడు మయునికి అభయం ఇచ్చాడు.

ఈ విధంగా అగ్ని ఖాoడవ వనాన్ని పదిహేను రోజులపాటు నిర్విరామం గా దహించిన తర్వాత ఒక ఆరు రోజులు విశ్రాంతి తీసుకున్నాడు.

ఆనాటి ఖాoడవ వన దహనం నుండి తప్పించుకున్న వారు మొత్తం ఆరుగురు. అశ్వసేనుడు, రాక్షస శిల్పి మయుడు, మందపాలుని నలుగురు పుత్రులు. 

గధ

గధ 

పూర్వం గధ అనే ఒక రాక్షసుడు ఉండే వాడు. అతడు దైవ, మానవుల కు భయం కలిగిస్తూ ఉండే వాడు. ఐతే అతనిలో కల మంచి సుగుణం సత్యవాక్య పరిపాలన. తన వద్దకు వచ్చి ఎవరు ఏది అడిగినా వెంటనే ఇచ్చే వాడు. 

దేవ, మానవుల కష్టాలు గమనించిన ఆ శ్రీ మహా విష్ణువు గధ వద్దకు వెళ్లి తన ఎముకలు కావలసినది గా కోరారు. అప్పుడు ఆ గధ తన ఎముకలు తానే విరచి ఆ శ్రీమహావిష్ణువు చేతిలో పెట్టారు. ఆ ఎముకలను తీసుకున్న విష్ణువు పరమ దయతో ఆ ఎముకలకు ఒక ఆకారాన్ని ఇచ్చి ఎల్లప్పుడూ తనతో నే ఉంచుకున్నరు. అప్పుడు ఆ మహావిష్ణువు ఆ ఎముకలకు ప్రసాదించిన ఆకారాన్ని మనం ఈ నాటికీ గధ అనే పిలుస్తున్నాం. 

ఒక వ్యక్తి  ఎంత రాక్షసుడైన తనలో ఉన్న ఏదో ఒక చిన్న మంచి తనం తో, చేసిన త్యాగం తో అంతకు ఎన్నో రెట్ల భగవత్ అనుగ్రహాన్ని పొందగలడు అనటానికి ఇది ఒక ఉదాహరణ. 

కౌమోదకి

శ్రీ మహావిష్ణువు గధ : కౌమోదకి 


శ్రీ మహావిష్ణువు తన ఎడమ కింది చేతిలో గధను ధరించి ఉంటారు. ఈ గధ  స్వామివారికి ఎలా చేరిందో తెలియ చెప్పే వివిధ ఘట్టాలు మనకు కనిపిస్తాయి. 

1. గధ అనే పేరు ఎలా వచ్చింది?

పూర్వం గధ అనే ఒక రాక్షసుడు ఉండే వాడు. అతడు దైవ, మానవుల కు భయం కలిగిస్తూ ఉండే వాడు. ఐతే అతనిలో కల మంచి సుగుణం సత్యవాక్య పరిపాలన. తన వద్దకు వచ్చి ఎవరు ఏది అడిగినా వెంటనే ఇచ్చే వాడు. 

దేవ, మానవుల కష్టాలు గమనించిన ఆ శ్రీ మహా విష్ణువు గధ వద్దకు వెళ్లి తన ఎముకలు కావలసినది గా కోరారు. అప్పుడు ఆ గధ తన ఎముకలు తానే విరచి ఆ శ్రీమహావిష్ణువు చేతిలో పెట్టారు. ఆ ఎముకలను తీసుకున్న విష్ణువు పరమ దయతో ఆ ఎముకలకు ఒక ఆకారాన్ని ఇచ్చి ఎల్లప్పుడూ తనతో నే ఉంచుకున్నరు. అప్పుడు ఆ మహావిష్ణువు ఆ ఎముకలకు ప్రసాదించిన ఆకారాన్ని మనం ఈ నాటికీ గధ అనే పిలుస్తున్నాం. 

ఒక వ్యక్తి  ఎంత రాక్షసుడైన తనలో ఉన్న ఏదో ఒక చిన్న మంచి తనం తో, చేసిన త్యాగం తో అంతకు ఎన్నో రెట్ల భగవత్ అనుగ్రహాన్ని పొందగలడు అనటానికి ఇది ఒక ఉదాహరణ. 

2. కౌమోదకి శ్రీ కృష్ణునికి ఎవరు ఇచారు ? ఎందుకు?

శ్రీకృష్ణునికి కౌమోదకి ని అగ్ని దేవుడు ఖాండవ వన దహన సమయం లో ఇచ్చాడు.