6, మే 2020, బుధవారం

లంక- స్వర్ణలంక

 ఇంతకు ముందు ఎన్నిసార్లు మనం లంక  గురించి చెప్పుకున్న అది స్వర్ణ లంక  అని చెప్పుకున్నాం కదా! ఇంతకీ అది స్వర్ణ లంక ఎందుకు అయ్యింది? ఆ లంక త్రికూటాచల పర్వతంలో ఉన్నది అని చెప్తారు కదా! ఇంతకీ ఆ త్రికూటాచల పర్వతం ఏమిటి?

దీని గురించి ఆనంద రామాయణంలో సారకాండ - చతుర్దాశ్వాసం లో చెప్పారు.

మనం ఇంతకు  ముందు టపా లలో మహాభారతములోని ఆదిపర్వంలో గరుడుడు - ఆకలి  గురించి చెప్పుకున్నాం కదా!
ఆనంద రామాయణం ప్రకారం ఇలాంటి సందర్భం గురించి చెప్పారు కానీ అది  గజేంద్ర మోక్షం తరువాత  జరిగిన సంఘటన వలే చెప్పారు.
శ్రీ హరి గజేంద్రమునకు ముక్తిని ప్రసాదించిన తరువాత వైకుంఠానికి తిరిగి వెళ్ళిపోయాడు. కానీ గరుడుడు తిరిగి ఆ గజేంద్రమోక్షం జరిగిన ప్రదేశమునకు వచ్చాడు. అక్కడ ఉన్న ఏనుగు (ఆనంద రామాయణం ప్రకారం ఏనుగు కు అక్కడే మోక్షం ప్రాప్తించింది ) మరియు మొసలి కళేబరములు ఆరగించటానికి గరుడుడు తిరిగి వచ్చాడు. అతను వచ్చే సమయమునకు అక్కడ ఒక గ్రద్ద ఉంది దాని పేరు భృభంగం. గరుడుడు దానిని కూడా చంపి ఆ గ్రద్దను ఒక కాలితో, ఏనుగు మరియు మొసలిని మరొక కాలితో పట్టుకుని పైకి ఎగిరాడు. కూర్చొని తినటానికి మంచి స్థానం కోసం చూస్తుండగా, ఒక బంగారమును స్రవించే జంబూ వృక్షం యొక్క కొమ్మపై కూర్చునే ప్రయత్నం చేసాడు. కానీ ఆ కొమ్మ విరిగింది. అలా విరిగిన కొమ్మకు వాలఖిల్యులు ఉన్నారు, కనుక ముక్కుతో ఆ కొమ్మను పట్టుకుని ఎక్కడికి వెళ్లాలో తెలియక గంధమాధన పర్వతం మీద ఉన్న తన తండ్రి కశ్యపుని దగ్గరకు వెళ్ళి, వాలఖిల్యులను అక్కడ విడచి,  తనకు ఎవ్వరు నివశించని ఒక ప్రదేశం గురించి చెప్పమని అడిగాడు. దానికి సమాధానంగా తన తండ్రి కశ్యపుడు వంద యోజనముల సముద్రమునకు అవతల ఒక లంక ఉన్నది అని  అక్కడ ఎవ్వరూ  నివాసం ఉండరు కనుక అక్కడకు వెళ్లి  తినవచ్చును అని చెప్పాడు.   ఆ లంకకు చేరుకున్న గరుడుడు మూడు జంతువులను అక్కడే తిన్నాడు. అలా తిన్న సమయంలో ఆ మూడు జంతువుల ఎముకలు మూడు కొండలుగా ఏర్పడ్డాయి. ఆ మూడు కొండలను త్రికూటములు అంటారు. అంతే  కాకుండా అతను తీసుకు వచ్చిన  జంబూ వృక్ష కొమ్మను కూడా అక్కడే వదిలాడు. కనుక ఆ కొమ్మ నుండి స్రవించిన స్వర్ణం అక్కడ ఉన్న మూడు కొండలలో చేరి అవి గట్టిపడి, అత్యంత దృఢమయిన త్రికూటములుగా ఏర్పడ్డాయి. అప్పటి నుండి ఆ లంకను స్వర్ణ లంక / త్రికూటాచలం అని అంటారు.
కాల క్రమం లో ఈ లంకను రాక్షసులు , తరువాత ధనాధిపతి కుబేరుడు, ఆతరువాత రావణుడు స్వాధీనం చేసుకున్నారు.

కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి