29, మే 2023, సోమవారం

భాస్కర శతకం -2

మన తెలుగు సామెతలలో ఓడలు బండ్లు, బండ్లు ఓడలు అవుతాయి అని నానుడి కదా ! మరి ఇంతకూ ఆ మాట ఎక్కడనుండి తీసుకున్నారో చూద్దామా!

అక్కర పాటు వచ్చుఁ సమయంబున జుట్టములొక్కరొక్కరి 

న్మక్కువ నుద్ధరించుటలు మైత్రికి జూడగ యుక్తమేసుమీ 

యొక్కట నీటిలో మెరక నోడలబండ్లును బండ్లనోడలున్ 

దక్కకవచ్చుఁచుండుట నిదానముగా దెలంప భాస్కరా!

అర్ధం: భాస్కరా = ఓ సూర్యాదేవా !, అక్కర = తగిన, పాటు = అవసరము, వచ్చుఁ = వచ్చిన , సమయంబునన్ = సమయంలో, చుట్టములు = బంధువులు, ఒక్కరొకరి = ఒకరు మరొకరి , మక్కువన్ = ఇష్టంగా , ఉద్ధరించుట = కాపాడుట , చూడగా = ఆలోచిస్తే , మైత్రికి = స్నేహమయునకు , యుక్తము= సరియైనది , =అవును, సుమీ = సుమా! ఒక్కటన్ = ఒకవేళ , నీటిలో = నీటిలోపల , ఓడలన్ = పడవలమీద , బండ్లును = బండ్లు , మెరకన్ = భూమిమీద , బండ్లన్ = బండ్ల మీద , ఓడలున్ = పడవలు , తక్కక = ఆగకుండా , వచ్చుఁచుండుట = రావడం, తలంపన్ = ఆలోచించగా , నిదానం= నిదర్శనము, కాదె= కదా !

తాత్పర్యం : ఈ ప్రపంచంలో చుట్టములు, బంధువులు ఒకరికి అవసరమయినప్పుడు మరొకరు చక్కగా సహాయం చేసుకుంటారు అది ఎంత సహజం అంటే నీటిపైన ఉన్నప్పుడు బండ్లు పడవలమీద , భూమిమీద ఉన్నప్పుడు అవే పడవలు బండ్లమీద ప్రయాణం చేస్తాయి కదా!






28, మే 2023, ఆదివారం

భాస్కర శతకము - 1

తెలుగులో అనేక నీతి శతకములు ఉన్నాయి. వానిలో మనం ఈ టపాలో భాస్కర శతకము లోని ఒక పధ్యము నెర్చుకుందాం!

శ్రీగలభాగ్యశాలి గడు జేరగవత్తురు తారుదారె దూ

రాగమున ప్రయాసమున కాదట నోర్చియునైన నిల్వను

ద్యోగముచేసి రత్ననిల యుండనికాదె సమస్తవాహినుల్

సాగరు జేరుటెల్ల ముని సన్నుత మద్గురు మూర్తిభాస్కరా

అర్ధంః మునిసన్నుత = మునిలచే మన్ననలు పొందే, మత్ = నాకు, గురుమూర్తి = గురురూపుడు అయినట్టి, భాస్కరా = ఓ సూర్య భగవానుడా! దూర = దూరము నుండి, ఆగమన= వచ్చుట వలన కలిగిన, ప్రయాసమునన్ = శ్రమకు, ఓర్చియున్= భరించి, నిల్వన్= నిలుచుటకు, ఉద్యోగము = ప్రయత్నము , చేసి , తారుదారె= తమకుతమే, అదటన్ = అనురాగంతో, శ్రీ = సంపదలు, గల =కలిగిన, భాగ్యశాలి = అదృష్టవంతుని, కడు= చాలా/ ఎక్కువగా, చేరగవత్తురు = దగ్గరకు చేరుతారు. సమస్త = సకలమైన, వాహినుల్ = నదులు, సాగరున్= సముద్రమును, రత్న= రత్నముల కోసం,  ఎల్లన్ = సమీపించునది

తాత్పర్యం : ఎక్కడెక్కడో పుట్టిన అనేక నదులు రత్నములు కలిగి ఉన్నాడు అనే ఆశతో సముద్రమును చేరినట్లు ప్రజలుకూడా అనేక వ్యయ ప్రయాశలకు ఓర్చుకుని తమంతట తామే ధనవంతుల ఇంటికి వస్తూ ఉంటారు.