21, మే 2020, గురువారం

ఋచీకుడు - పరశురాముడు - విశ్వామిత్రుడు

ఋచీకుడు నవబ్రహ్మలలో  ఒకరయిన భృగు మహర్షి యొక్క కుమారుడు. ఇతను తన తండ్రి వలెనే  అత్యంత తపస్సంపన్నుడు. ఆ తపస్సులో నిమగ్నమయ్యి ఉండుట వలన ఆటను వివాహం చేసుకోకుండానే వృద్దాప్యమును పొందాడు. అయితే ఒకసారి అతను సత్యవతి అనే రాజకుమారిని చూసి, వివాహం చేసుకోవాలని అనుకున్నాడు. ఆమె వివరములు కనుక్కున్నాడు. ఆమె జహ్నుని కులంలోని కుశనాభుని కుమారుడయిన గాధి పుత్రిక. కనుక ముందుగా తన తండ్రి అయినా భృగువు అనుమతి తీసుకుని, మహారాజు అయిన గాధి వద్దకు వెళ్ళి రాకుమార్తెను తనకు ఇచ్చి వివాహం చేయమని అడిగాడు. ఆ ప్రతిపాదన రాజుకు ఇష్టం కాలేదు.  ముసలివాడయిన ఒక ఋషికి తన కుమార్తెను ఇవ్వటం గాధికి ఇష్టంలేదు. ఆ విషయం తిన్నగా చెబితే ఆ మహర్షి శపిస్తాడేమో అని భయం. అందుకే అతి కష్టసాధ్యమయిన ఒక కోరిక కోరాలి అని తలచి, కన్యాశుల్కం / ఓలి కింద తనకు శరీరం మొత్తం తెల్లగా ఉండి, కేవలం ఒక్క చెవిమాత్రమే నల్లగా ఉండే వెయ్యి గుఱ్ఱములు ఇస్తే ఆమెను వివాహం చేసుకోవచ్చు అని చెప్పాడు.

ఆ మాటలు విన్న  ఋచీకుడు వరుణదేవుని ప్రార్ధించాడు. ఆ ప్రార్థనలకు మెచ్చి వరుణుడు ఋచీకుడు ఎక్కడ కావాలంటే అక్కడే ఆ అశ్వములు వస్తాయి అని చెప్పాడు. ఆ తరువాత ఋచీకుడు గంగానది ఉత్తరపు ఒడ్డున ఆ గుఱ్ఱములు రావాలి అని సంకల్పం చేసాడు. అలా వచ్చిన గుఱ్ఱములను తీసుకుని గాధి కి ఇచ్చి, అతను రాకుమారి సత్యవతిని వివాహం చేసుకున్నాడు.
వీరి వివాహమయిన కొంతకాలానికి ఋచీకునికి సంతానేచ్ఛ కలిగింది. ఆ మాట తన భార్యకి చెప్పగా, ఆ సత్యవతి తన తండ్రికి వంశోద్ధారకుడు లేదు కనుక తనతో పాటు తన తల్లి కోసం కూడా పుత్ర సంతానం కలిగేలా చూడామణి ప్రార్ధించింది. ఆ ప్రార్ధన విన్న ఋచీకుడు ఒక బ్రాహ్మణత్వం కలిగిన ప్రసాదమును, ఒక క్షత్రియత్వం కలిగిన ప్రసాదమును ఇచ్చి బ్రాహ్మణ ప్రసాదమును సత్యవతి ని స్వీకరించమని, క్షత్రీయ ప్రసాదమును ఆమె తల్లిని స్వీకరించమని , ఆ తరువాత వారు ఋతుస్నాతలు అయినా సమయంలో సత్యవతిని మేడిచెట్టును, ఆమె తల్లిని రావి చెట్టును కౌగలించుకోమని చెప్పాడు.
ఆ సమయం వచ్చినప్పుడు సత్యవతి , ఆమె తల్లి ఇద్దరూ తమతమ ప్రసాదమును, వారు కౌగలించుకోవలసిన చెట్టును తారుమారు చేశారు. ఆ విషయం గమనించిన ఋచీకుడు సత్యవతి వద్దకు వచ్చి బ్రాహ్మణుడయిన తనకు క్షత్రియ అంశతో, గాధి మహారాజుకు బ్రాహ్మణ అంశతో ఒక కుమారుడు కలుగుతాడు అని చెప్పాడు. ఆ మాటలు విన్న సత్యవతి బాధపడి, తనకు సద్బ్రాహ్మణుడు కుమారునిగా ప్రసాదించమని అడిగింది. అప్పుడు ఋచీకుడు తన తపో శక్తిని ప్రయోగించి, తమకు ఒక బ్రాహ్మణుడే కుమారునిగా పుట్టేలా, మనుమడు మాత్రం క్షత్రీయ లక్షణములతో పుట్టేలాగా మార్చాడు. ఆ విధంగా ఋచీకుడు, సత్యవంతులకు పుట్టిన పుత్రుడు జమదగ్ని, వారి మనుమడు క్షత్రియ లక్షణములు కలిగిన పరశురాముడు.
మహారాజు గాధికి బ్రాహ్మణ లక్షణములతో జన్మించిన వాడు విశ్వామిత్రుడు.

1 కామెంట్‌: