23, మే 2020, శనివారం

రామ, హనుమల తొలి పరిచయం! హనుమంతుని వేషం!

రామాయణంలో కథను మలుపు తిప్పే ఘట్టములలో ముఖ్యమయినది హనుమంతుడు శ్రీరాముని కలుసుకునే ఘట్టం. 
రాముని, లక్ష్మణుడిని కలుసుకునే సమయమునకు హనుమంతుడు సుగ్రీవుని వద్ద మంత్రిగా ఉన్నాడు. ఆ సమయమునకు సుగ్రీవుడు తన రాజ్యమును కోల్పోయి, తన సొంత అన్నగారయిన వాలితో శత్రుత్వం వలన ప్రాణ భయంతో ప్రపంచం మొత్తం తిరిగి, చివరకు వాలి రాకుండా ఉండగలిగిన ప్రాంతం ఋష్యమూకం అని తెలుసుకుని ఆ పర్వతం మీద నివాసం ఉంటున్నాడు. ఆ సమయమునకు అతనితో హనుమంతుడు, జాంబవంతుడు మొదలయిన ముఖ్యులు ఉన్నారు. 
ఆ సమయంలో ఋష్యమూక పర్వత ప్రాంతంలో కొత్తగా కనిపించిన, ముని వేషదారులయిన రామలక్ష్మణులను చూసి సుగ్రీవునికి వాలి తనకోసం వారిని పంపించాడేమో అన్న భయం కలిగింది. ఆ భయమును తననుండి దూరం చేయవలసినదిగా తన మంత్రి అయినా హనుమంతుని కోరాడు. దానికోసం హనుమంతుడు ఆ ఇద్దరు ముని వేషదారుల పూర్వాపరముల గురించి తెలుసుకోవలసిన అవసరం ఉంది. ఆ విధమయిన విషయములు తెలుసుకోవాలంటే ముందు ఆ ఇద్దరికీ  ప్రశ్నలు అడుగుతున్నా వారి మీద నమ్మకం కలగాలి . ఒక వేళ ఆ వచ్చినవారు వాలి తరపున వచ్చి ఉంటే వారిని అక్కడే నిలువరించే సాహసం కలవాడు హనుమంతుడు కనుక సుగ్రీవుడు హనుమంతుడిని ఆ పనికోసం పురమాయించాడు.  
ఇప్పుడు సమస్య హనుమంతుడు ఏ వేషంలో వారి ముందుకు వెళ్ళాలి అని!
అనేక రామాయణములలో ఈ ఘట్టం లో హనుమంతుడు 
  1. భిక్షకుని/ సన్యాసి వేషం  అని  చెప్తారు.  
  2. వటువు / బ్రహ్మచారి వేషం అని చెప్తారు. 
మరి ఇంతకూ హనుమంతుడు ఈ వేషంలో వెళ్ళాడు?
  1. భిక్షకుని/ సన్యాసి వేషం ః ఒకవేళ హనుమంతుడు సన్యాసి వేషంలో వెళ్ళినట్లయితే, కథప్రకారం హనుమంతుడు ఆ సోదరుల వద్దకు చేరగానే వారికి నమస్కరించాడు. ఒక భిక్షకుడు / సన్యాసి గృహస్తుకు నమస్కారం చేయడు. హనుమంతుడు భిక్షకుని/ సన్యాసి వేషం లో కనుక అలా చేస్తే రామ లక్ష్మణులకు ముందుగా అతని మీద అనుమానం కలుగుతుంది. తరువాతి ఘట్టములు మన ఊహకు అందని విధం గ ఉండేవి. సుగ్రీవ రాముల మైత్రి ప్రారంభం కూడా అనుమానాస్పదంగానే ఉండేది కదా! 
  2. వటువు / బ్రహ్మచారి వేషం: ఈ వేషం అయితే ఎవరికీ అయినా నమస్కారం చేయవచ్చు. అంటే కాకుండా ఇతను ఆ ఇద్దరినీ ఎన్నో ప్రశ్నలు అడిగి సమాధానాలు తెలుసుకోవాలి అనే సంకల్పంతో వచ్చాడు కనుక వటువు వేషం అయితే అతను ఈని ప్రశ్నలు అడిగినా వటువుకు కలిగిన సహజసిద్దమయిన జిజ్ఞాస వలన అడుగుతున్నాడు అని అనుకోవటానికి ఆస్కారం దొరుకుతుంది. 
కనుక హనుమంతుడు తొలిసారిగా రామలక్ష్మణులను కలసినప్పుడు ఆటను బ్రహ్మచారి వేషంలో కలిసాడు. 







కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి