17, మే 2020, ఆదివారం

హనుమంతుడు- దశరధుని పుత్రకామేష్టి

మనం ఇంతకు ముందు హనుమంతుడు శివుని అంశ , వాయుపుత్రుడు ఒకేసారి ఎలా అయ్యాడు అని తెలుసుకున్నాం కదా! అలాగే హనుమంతుని జన్మకు సంబందించిన మరొక విచిత్ర మయిన విషయం ఇప్పుడు తెలుసుకుందాం! ఈ విచిత్రమయిన సంఘటన ఆనందరామాయణం లో చెప్పారు. మూల వాల్మీకి రామాయణంలో ఈ ఘట్టం చెప్పలేదు.

దశరథమహారాజు తనకు పుత్రులు కలగాలని, తన భార్యలతో కలిసి ఋష్యశృంగుని అద్వర్యం లో పుత్రకామేష్టి చేశారు. ఆ యాగంలో యజ్ఞపురుషుడు ప్రత్యక్షమయ్యి దశరధుని చేతికి ఒక కలశమును అందించారు. ఆ కలశంలో ఉన్న పాయసమును దశరధుడు తన ముగ్గురు భార్యలకు సమానంగా పంచాడు. అప్పుడు దశరధుని మూడవ భార్య అయినా కైక చేతిలోని పాయసం నిండిన పాత్రను ఒక గద్ద తన ముక్కుతో పట్టుకుని వేగంగా వెళ్లి పోయింది. ఆ హఠాత్ సంఘటనతో దిగులు చెందిన కైకకు దశరధుని మిగిలిన భార్యలు అయినా సుమిత్ర, కౌసల్య తమతమ పాయసమునందలి కొంత కొంత భాగములు ఇచ్చారు.
అలా ఆ పాయసపాత్రను పట్టుకుని వేగంగా పైకి ఎగిరిన గ్రద్ద ఆ పాయసము తనను తాకగానే ఒక అప్సరసగా మారి వెళ్లి పోయింది. అలా అప్సరసగా మారిన గ్రద్ద వదిలేసిన ఆ పాయసపాత్రను
వాయుదేవుడు అంజనాద్రి పై పుత్రుని కొరకు పరమ శివుని ప్రార్ధిస్తున్న అంజనాదేవి వొడిలో పడేవిధంగా చేసాడు. పరమేశ్వర ప్రసాదంగా భావించి అంజనాదేవి దానిని స్వీకరించి, ఏకాదశమ రుద్రుని అంశగా శ్రీ హనుమంతునికి జన్మను ఇచ్చింది.



కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి