26, మే 2020, మంగళవారం

సుమిత్ర, కైక విష్ణు అంశలకు తల్లులు ఎలా కా గలిగారు?

మనం ఇంతకు ముందు శ్రీకృష్ణుడు దేవకీ వసుదేవులకు ఎందుకు పుట్టాడు అని  చెప్పుకున్నాం  కదా! అయితే ఇంతకూ ముందు చెప్పినట్లు కొన్ని కధలలో అవి చెప్పిన గ్రంధం/పురాణం ను బట్టి ఆ సంఘటనలలో కొంత మేరకు మార్పులు ఉంటాయి.
ఒక జన్మలో ఆ కశ్యపుడు, అదితి లు శ్రీరాముని తన కుమారునిగా పొందుటకు దశరధునిగా మరియు కౌసల్య గా జన్మించారు. ఆ సమయంలో రామునితో పాటుగా శ్రీమహావిష్ణు అంశలు అయిన ఆదిశేషువు, శంఖ , చక్రములు కూడా లక్ష్మణ భరత శత్రుజ్ఞులుగా జన్మించారు. వీరికి తండ్రి దశరధ మహారాజు కాగా లక్ష్మణ, శత్రుజ్ఞులకు తల్లి సుమిత్ర, భరతుని కి తల్లి కైకేయి.
ఇంతకూ ముందు మనం చెప్పుకున్నట్లు శ్రీ మహావిష్ణువును పుత్రునిగా పొందుటకు కశ్యపుడు, అదితి తమ ముందు జన్మలో తపస్సు చేశారు. మరి సుమిత్ర, కైకేయి ఏమి చేశారు? వారికి శంఖం - భరతునిగా, ఆదిశేషుడు - లక్ష్మణుడిగా, చక్రం - శత్రుజ్ఞుడుగా ఎలా జన్మించారు? దానికి కారణం ఏమి అయ్యి ఉంటుంది?

మనం ఇంతకూ ముందు అసూయ గురించి, మదం మరియు క్రోధం గురించి చెప్పుకున్నప్పుడు కశ్యపుని భార్యలు అయిన వినత, కద్రువల మధ్య మాత్సర్యం గురించి చాలా వివరంగా చెప్పుకున్నాం కదా!
కశ్యపునికి దక్షుడు తన 13 మంది కుమార్తెలను ఇచ్చి వివాహం చేసాడు. ఆ 13 మందిలో అదితి, వినత కద్రువ కూడా ఉన్నారు. ఐతే కశ్యప ప్రజాపతి తన భార్యలందరికి సమానమయిన సమయమును కేటాయిస్తూ, ఎవరి సమయమునకు వారి వద్ద ఉండేలా ప్రణాళిక ప్రకారం నడచుకునేవాడు.
అయితే ఒకసారి కశ్యపుడు వినత దగ్గర ఉండగా, కద్రువ కోపంగా వచ్చింది. ఆ సమయంలో కశ్యపుడు కద్రువ వద్ద ఉండాల్సింది. ఆ కోపం మొత్తం వినత మీద తీర్చుకోవటానికి కద్రువ వినతకు శాపం ఇచ్చింది. ఆమె శాపం ప్రకారం వినత గర్భంలో సర్పము, మంట జన్మించాలి. అయితే ఆ శాపం విన్న వినతకు కూడా కోపం వచ్చింది, ఆ కోపంలో కద్రువకు అత్యంత అపకీర్తికలగాలని శపించింది. ఆ సమయంలో అక్కడకు వచ్చిన తమ అక్క, కశ్యపుని మొదటి భార్య అయిన అదితి వారిని వారించ ప్రయత్నించగా తన కోపం ఇంకా చల్లారని కద్రువ తన భర్త అయినా కశ్యపుడు, వినత మరియు అదితి కూడా మానవ జన్మ ఎత్తవలసినది అని శపించింది.
అయితే ఆ కోపములు శాంతించిన తరువాత వినత కద్రువతు తమ తప్పు తెలుసుకుని, ఆ జరిగిన పొరపాటుకు పశ్చాత్తాపం చెంది శ్రీమహా విష్ణువు గురించి అద్భుతమయిన తపస్సు చేశారు. ఆ తపస్సుకు మెచ్చిన శ్రీమహా విష్ణువు, వారు మానవ జన్మ ఎత్తిన సమయంలో తానూ స్వయంగా వివిధ రూపములలో వారికి పుత్రునిగా జన్మిస్తాను అని వరం ఇచ్చారు. ఆ వరం ప్రకారమే కౌసల్య (అదితి) కి రాముని(విష్ణువు)గా, సుమిత్ర (వినత) కు లక్ష్మణుడు (సర్పం-ఆదిశేషుడు), శత్రుఘ్నుడు (అగ్ని-చక్రం - సుదర్శనం) గా, కైక (కద్రువ) కు భరతుని (శంఖం) గా జన్మించాడు.  కైక, రాముని వనవారం పంపుట వలన తనకు అనంత కాలంవరకు  తరగని అపకీర్తి ప్రాప్తించింది. 

కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి