31, మార్చి 2019, ఆదివారం

రామాయణం - కల్ప వృక్షం

మనకు ఉన్న అనేకములయిన పురాణములలో ఉత్తమమయినది రామాయణం. ఒక మానవుడు తన కర్మలతో, ధర్మ దీక్షతో పురుషోత్తముడు అవ్వవచ్చు అని మనకు నిరూపించిన ఉత్తమ గ్రంధం అది. అటువంతో ఈ అద్భుతమయిన గ్రంధమును మన పెద్దలు కల్పవృక్షం అని చెప్పారు. వృక్షం అనే పదమునకు రామాయణమును ఎందుకు, ఎలా అన్వయించ వచ్చో ఈ శ్లోకం లో చెప్పారు.

శ్రీమద్బ్రహ్మ తదేవ బీజ మమలం యస్యాంకుర శ్చిన్మయః 
కాండై స్సప్తభి రన్వితో తివితతో ఋష్యాలవాలోదితః 
పత్రై స్తత్త్వ సహాస్రకై  స్సువిలస ఛ్చ ఖా శతై పంచభి 
శ్చాత్మ ప్రాప్తి ఫల ప్రదో విజయతే రామాయణ స్వస్తారః     

రామాయణం ఒక కల్ప వృక్షం అయితే ఆ వృక్షం లో వివిధ భాగములు

  1. బీజం : బ్రహ్మ బీజం 
  2. వేర్లు : ఋగ్వేదం (ఇక్కడ చెప్పలేదు కానీ మరికొన్ని చోట్ల ఇలా చెప్పారు)
  3. అంకురం : చిన్మయము 
  4. కాండము : రామాయణములో 7 కాండలు ఉన్నాయి. రామాయణము 7 కాండములు గల మహా వృక్షం 
  5. చెట్టు పాదు : దండకారణ్యములో గల మునులు 
  6. ఆకులు : రామాయణము లోని అనేక సన్నివేశములు, సంఘటనలు 
  7. కొమ్మలు : సర్గలు, రామాయణములో 500 సర్గలు ఉన్నాయి 
  8. ఫలము : ఆత్మ తృప్తి 
శ్రీరామ తాపత్యుపనిషత్తులో ఈ విధం గా చెప్పారు 

యథైవ వట బీజస్థ ప్రాకృతస్థో మహాద్రుమః 
తదైవ రామబీజస్థం జగదేతచ్చరాచరమ్ !

ఎంతో పెద్దదయిన వట వృక్షం అత్యంత చిన్నదయిన బీజంలో ఉండి, కాలక్రమములో విస్తరించినట్లు  ఈ చరాచర జగత్తు మొత్తం శ్రీ రాముడను బీజంలో నిక్షిప్తమై ఉండి , అతని నుండే విస్తసించినది. 

29, మార్చి 2019, శుక్రవారం

రామాయణం - గాయత్రి మంత్రము

రామాయణం ని వాల్మీకి మహర్షి రచించినప్పుడు దానికి "సీతాయా చరితం మహత్" "పౌలస్య వధ" అని కూడా పేరు పెట్టారు. అంతే కాకుండా మన పెద్దలు ఈ  రామాయణం నకు గాయత్రీ మంత్రమునకు గల అవినాభావ సంబంధం అనేక రకములుగా చెప్పారు.
వారు చెప్పిన అనేక రకములయిన సంబంధములలో కొన్ని ఇక్కడ చెప్పుకుందాం!

  1. సంఖ్య : రామాయణం లోని శ్లోకముల సంఖ్య 24000, గాయత్రి మంత్రము లోని అక్షరముల సంఖ్య  24. కనుక ఈ గాయత్రి మంత్రములలోని ఒకొక్క అక్షరంతో ఒకొక్క వెయ్యి శ్లోకములను వ్రాసి , ఆ మంత్ర అర్థమును నిబంధించారని మన పెద్దలు చెప్తారు. అలాగే  గాయత్రీ రామాయణం అను పేరున రామాయణము 24 శ్లోకములతో లోకములో ప్రసిద్ధి లో ఉన్నది. 
  2. రామాయణం లో మనకు 7 కాండలు ఉన్నాయి. అవి 
బాలకాండ 
అయోధ్య కాండ 
అరణ్య కాండ 
కిష్కింద కాండ 
సుందరకాండ 
యుద్ధ కాండ 
ఉత్తర కాండ 

వీనిలో ఒక్కొక్క కాండ గాయత్రి మంత్రం లోని ఏ భాగాన్ని సూచించునో ఇప్పుడు చూద్దాం! 

  • బాలకాండ : తత్స వితృ 
  • అయోధ్య కాండ : వరేణ్య 
  • అరణ్య కాండ : భర్గో 
  • సుందరకాండ : దేవస్య 
  • యుద్ధ కాండ : ధీమహీ 
  • ఉత్తర కాండ : ధీయోయోనః  
3. గాయత్రి మంత్రమునకు ఆదిమంత్రము, మహామంత్రము అని పేరు. 
     అలాగే రామాయణమునకు ఆది కావ్యము, మహా కావ్యము అని పేరు 
4. గాయత్రి మంత్రమునకు మహర్షి విశ్వామిత్రుడు 
    రామాయణమున శ్రీరామునకు సర్వశాస్త్రములను నేర్పించింది కూడా విశ్వామిత్రుడే 
5. గాయత్రి మంత్రాధిదేవత సవిత 
    శ్రీ రాముని వంశమే సూర్య వంశము. 
6. గాయత్రి మంత్రమునకు ముఖము అగ్ని దేవుడు 
    శ్రీ రామావతారమునకు అగ్నియే మూలము 
7. గాయత్రి మంత్రమునకు హృదయం శ్రీవిష్ణువు, శిఖ రుద్రుడు 
    రామాయణం లో శ్రీ విష్ణు అవతారమయిన శ్రీరాముడు హృదయము, రుద్రుని అంశ కల్గిన            హనుమంతుడు రామాయణమునకు శిఖ వంటి వాడు. 

27, మార్చి 2019, బుధవారం

సీత - చిలుక శాపం

రామాయణములో ఉన్న అనేక ఘట్టములలో శ్రీరాముడుకి  ఇప్పటికి అపకీర్తిని తెచ్చి పెడుతున్న ఘట్టం సీతాపరి త్యాగం. కేవలం ఒక చాకలివాని మాటలకు శ్రీరాముడు సీతను పరిత్యజించాడు అని చెప్పుకుంటాం. అయితే ఇలా చాకలివాని ప్రస్తావన మూల రామాయణం అంటే వాల్మీకి రామాయణంలో లేదు. ఆ ప్రస్తావన పద్మపురాణంలో ఉంది. ఆ చాకలి వాడు ఆలా చేయటానికి కారణం కూడా పద్మ పురాణం పాతాళ కండములో వివరించారు.
ఆ కధ ప్రకారం 
సీతా దేవి తన చిన్నతనంలో ఉద్యానవనంలో ఆడుకుంటూ ఉండగా ఒక చెట్టు మీద జంటగా ఆనందముగా ఉన్న చిలుకల జంటను చూసింది. అప్పటికే ఆ చిలుకలు సీతను చూసి ఆనందముగా, ఈ సీతను శ్రీరాముడు వివాహం చేసుకుంటాడు, గొప్ప రాజుగా కీర్తిని గడిస్తాడు అని చెప్పుకుంటూ ఉంటారు. ఆ మాటలు విన్న సీత ఆ చిలుకలను పట్టించి పంజరంలో ఉంచి వారు ఇంతకు ముందు మాట్లాడుకుంటున్న విషయమములను గురించి విస్తారముగా చెప్పమని కోరుకున్నది.
ఆ మాటలు విన్న చిలుకలు తాము ఇంతకు ముందు వాల్మీకి ఆశ్రమములో ఉన్నప్పుడు ఆ మహర్షి రామాయణమును రచించారని, ఆ సమయములో వారు శ్రీ రాముడు భువిలో అవతరిస్తారని, మిథిలా రాజ పుత్రిక సీతను వివాహం చేసుకుంటారని, అనితరసాధ్యమయిన పనులు చేసి కీర్తిని గడిస్తారని, తమ రాజ్యమును సుభిక్షంగా పరిపాలిస్తారని చెప్పాయి. ఆ మాటలు విన్న సీత సంతోషించి ఆ జంటలోని మగ పక్షిని పంజరములోనుండి విడుదల చేసింది. కానీ గర్భవతి అయిన ఆడ చిలుకను పంజరంలోనే ఉంచింది. ఆడ చిలుక తనను తన భర్త వద్దకు పంపమని అర్ధించినా ఆమె బాల్య చాపల్యము వలన ఆ చిలుక ప్రసవించిన తరువాత మాత్రమే  బయటకు పంపుతాను అని చెప్పెను. తన భర్త వద్దకు వెళ్లలేకపోయిన బాధతో సీతకూడా గర్భవతిగా ఉన్నప్పుడు పతివియోగ బాధను అనుభవించగలదని శపించి ఆ అడా చిలుక మరణించెను. తన ప్రియమయిన భార్య అలా శపించటం వినిన మగ చిలుక ఆ శాపాన్ని నిజం చేయటానికి తన చిలుక శరీరమును గంగలో మునిగి పరిత్యజించి, అయోధ్యలో చాకలివానిగా జన్మించినది.

9, మార్చి 2019, శనివారం

108 మహేశ్వర మూర్తులు

మన వేద, పురాణ మరియు ఆగమముల ప్రకారం శివుడు అరూపరూపి. కానీ శివుడు చూపిన కొన్ని లీలలననుసరించి శివునికి కొన్ని రూపములు చెప్పారు. వానిని మనం ఇంతకు  ముందు మనం 23 శివలీలలుగా చెప్పుకున్నాం. వానితో పాటుగా మరికొన్ని రూపములను కలిపి ఈ 108 మహేశ్వర మూర్తులుగా చెప్తారు.
అవి


  1. బిక్షాటన మూర్తి
  2. నటరాజ మూర్తి
  3. అజ ఏకపాదుడు
  4. యోగ దక్షిణా మూర్తి
  5. లింగోధ్భవ మూర్తి
  6. కామదహనమూర్తి (కామారి)
  7. త్రిపురాంతక మూర్తి (త్రిపురారి )
  8. మహాకాళేశ్వర మూర్తి 
  9. జలంధరి 
  10. గజాంతక 
  11. వీరభద్ర 
  12. కంకాళ భైరవ మూర్తి 
  13. కళ్యాణ సుందర మూర్తి 
  14. వృషభారూఢ మూర్తి
  15. చంద్రశేఖర మూర్తి 
  16. ఉమా మహేశ్వర మూర్తి 
  17. హరిహర మూర్తి 
  18. అర్ధనారీశ్వర మూర్తి 
  19. కిరాత మూర్తి 
  20. చండీశ్వరానుగ్రహ మూర్తి 
  21. చక్రపాద స్వరూప మూర్తి 
  22. సోమస్కంద మూర్తి
  23. గజముఖానుగ్రహ మూర్తి 
  24. నీలకంఠ 
  25. సుఖాసన మూర్తి 
  26. పంచముఖ లింగ మూర్తి 
  27. సదాశివ మూర్తి 
  28. మహాసదాశివ మూర్తి 
  29. ఉమేష మూర్తి 
  30. వృషభాంతిక మూర్తి 
  31. భుజంగారలలిత మూర్తి 
  32. భుజంగత్రాస మూర్తి 
  33. సంధ్యాంరిత్త మూర్తి 
  34. సదానృత మూర్తి 
  35. చండ తాండవ మూర్తి 
  36. గంగాధర మూర్తి 
  37. గంగవిసర్జన మూర్తి 
  38. జ్వరభగ్న మూర్తి 
  39. శార్దూలహర మూర్తి 
  40. పశుపత మూర్తి 
  41. వ్యాఖ్యాన దక్షిణామూర్తి 
  42. విన దక్షిణామూర్తి 
  43. వాగులేశ్వర మూర్తి 
  44. ఆపాయుద్దరణ మూర్తి 
  45. వటుక భైరవ మూర్తి 
  46. క్షేత్రపాల మూర్తి 
  47. అఘోర మూర్తి 
  48. దక్షయజ్ఞహర మూర్తి 
  49. అశ్వారూఢ మూర్తి 
  50. ఏకపాద త్రిమూర్తి 
  51. త్రిపాద త్రిమూర్తి 
  52.  గౌరీవరప్రద మూర్తి 
  53. గౌరీలీలా సమన్విత మూర్తి 
  54. వృషభహారణ మూర్తి 
  55. గరుఢాంతిక మూర్తి 
  56. బ్రహ్మశిరఃచ్చేదక మూర్తి 
  57. కూర్మారి 
  58. మస్త్యారి 
  59. వరాహారి 
  60. శరభేశ్వర మూర్తి 
  61. రక్తబిక్షప్రధాన మూర్తి 
  62. గురుమూర్తి 
  63. ప్రార్ధన మూర్తి 
  64. శిష్యభావ మూర్తి 
  65. ఆనందతాండవ మూర్తి 
  66. శాంత తాండవ మూర్తి 
  67. సంహార తాండవ మూర్తి 
  68. కపాలీశ్వర మూర్తి 
  69. మహా మృత్యుOజయ మూర్తి 
  70.   త్రయాక్షర మృత్యుంజయ  మూర్తి 
  71. షడక్షర మృత్యుంజయ  మూర్తి 
  72. అంధాసురసంహార మూర్తి 
  73. జువాపరాజ్ఞాన మూర్తి 
  74. సింహాసన మూర్తి 
  75. ఇళాకేశ్వర మూర్తి 
  76. సత్యనాధ మూర్తి 
  77. ఈశాన మూర్తి 
  78. తత్పురుష మూర్తి 
  79. అఘోర మూర్తి 
  80. వామదేవ మూర్తి 
  81. అనంతేశ్వర మూర్తి 
  82. కుమారానుగ్రహ మూర్తి 
  83. హయగ్రీవానుగ్రహ మూర్తి 
  84. మహారుద్ర మూర్తి 
  85. నర్తన రుద్ర మూర్తి 
  86. శాంతరుద్ర మూర్తి 
  87. యోగ రుద్రమూర్తి 
  88. క్రోధ రుద్ర మూర్తి 
  89. వృంజి రుద్రమూర్తి 
  90. ముహుంట  రుద్ర మూర్తి  
  91. ద్విభుజ రుద్ర మూర్తి 
  92. అష్టభుజ రుద్ర మూర్తి 
  93. దశభుజ రుద్ర మూర్తి 
  94. త్రిముఖ రుద్ర మూర్తి 
  95. పంచముఖాభీషణ రుద్ర మూర్తి 
  96. జ్వాలకేశశద్భుజ రుద్ర మూర్తి 
  97. అఘోర రుద్ర మూర్తి 
  98. విష్ణుధర్మొత్తర రుద్ర మూర్తి 
  99. భీమా రుద్ర మూర్తి 
  100. స్వర్ణాకర్షణ రుద్ర మూర్తి
  101.  భీషణ భైరవ మూర్తి 
  102. కపాల భైరవ మూర్తి 
  103. ఉన్మత్త భైరవ మూర్తి 
  104. క్రోధ భైరవ మూర్తి 
  105. ఆశితంగ భైరవ మూర్తి 
  106. రురు భైరవ మూర్తి 
  107. చండ భైరవ మూర్తి 
  108. సంహార భైరవ మూర్తి 

7, మార్చి 2019, గురువారం

నటరాజ మూర్తి - ఆహార్యం

నటరాజ మూర్తి శివునికి గల అనేక రూపములలో ఒకటి అని మనం ఇంతకు ముందు చెప్పుకున్నాం కదా! అలాగే శివుని రూపం ఆహార్యం గురించి, వినాయకుని ఆహార్యం గురించి  దానిలో దాగి ఉన్న రూపాత్మకత గురించి కూడా ఇంతకు ముందు చెప్పుకున్నాం! ఇప్పుడు నటరాజ రూపం ఆహార్యం గురించి చెప్పు కుందాం.
ఇది నటరాజ స్వామి రూపం. ఇప్పుడు మనం ఈ రూపం, దీనిలోని విశేషములు గురించి తెలుసు కుందాం.

నటరాజ స్వరూపం పంచ కృత్యాత్మకం. ఇది శివుని సార్వభౌమత్వాన్ని సూచిస్తుంది.

  1. అపస్మారక పురుష : నటరాజు పాదముల కింద ఉన్న మానవుని రూపం అపస్మారక పురుషునిది. అపస్మారక స్థితిని నియంత్రణలో ఉంచితేనే జ్ఞానము ప్రకాశిస్తుంది అని దాని భావం 
  2. ఢమరు : పైన ఉన్న ఒక చేతిలో ఢమరు ఉంది. శివ రూప విశ్లేషణ లో మనం ఢమరు గురించి చెప్పు కున్నాం. ఇది నిరంతర జ్ఞాన ప్రవాహమునకు ప్రతీక 
  3. నిప్పు : పైన ఉన్న రెండవ చేతిలో నిప్పు ఉంది. ఈ నిప్పు లయమునకు ప్రతీక. అంతే కాకుండా మండపము వలే తన చుట్టూ అగ్ని కీలలు ఉంటాయి. ఇవి ప్రకృతి నటరాజ నాట్యమును సరిగా ప్రతిబింబిస్తాయి. 
  4. కింద ఉన్న ఎడమ చేయి పైకి లేచిన తన పాదమును చూపిస్తూ ఉంటుంది. తన పాదములను ఆశ్రయించమని దాని అర్ధం. 
  5. అభయ ముద్ర : క్రింద ఉన్న కుడి చేయి అభయ ముద్రలో ఉంటుంది. తన పాదములను ఆశ్రయించిన వారికి తన రక్ష సర్వదా ఉంటుంది అని ఈ అభయం. 
  6. జింక: కొన్ని చోట్ల నటరాజు చేతిలో జింక పిల్ల ఉంటుంది. జింక చంచలత్వమునాకు ప్రతీక. చంచలమయిన మనస్సును నియంత్రించుట అలవరచుకొమ్మని దాని అర్ధం. 
  7. పుర్రె : శివుని తలలో ఒక పుర్రె కనిపిస్తుంది. ఈ పుర్రె లయమునకు ప్రతీక 
  8. గంగ : నటరాజ సిగలోని గంగ కరుణకు ప్రతీక 
  9. నెలవంక : నటరాజ సిగలోని నెలవంక కాలమునకు ప్రతీక 
  10. భుజంగం : నటరాజు తలమీద ఉన్న పాము సహస్రార చక్రమును చేరుకొన్న కుండలిని శక్తి కి ప్రతీక
  11. మూడవ కన్ను : ఇది శివుని సర్వజ్ఞతకు ప్రతీక 
  12. మకర కుండలము: నటరాజ కుడి చెవికి మకర కుండలములు ఉంటాయి. ఇది పురుషత్వానికి ప్రతీక 
  13. తాటంకము: నటరాజు ఎడమ చెవికి తాటంకములు ఉంటాయి. ఇది స్త్రీత్వానికి ప్రతీక. 
  14.  పుఱ్ఱెల మాల: నటరాజు మెడలోని పుర్రెల మాల అనేక సృష్టి లయములకు ప్రతీకలు. 
  15. భస్మం : భస్మము స్వచ్ఛతకు ప్రతీక. ఈ వస్తువయినా అగ్నిలో పునీతమయితే మిగిలేది భస్మమే. అలాగే మానవుని జీవనానంతరం మిగిలేది కూడా భస్మమే. కనుక ఈ లోకములలోని ఆకర్షణలు చూసి దేవుని మరచిపోవద్దు అని హెచ్చరిక ఈ భస్మ దారుణం. 
  16. రుద్రాక్ష : ఈ రుద్రాక్షలు తన భక్తులు చేసిన పాపములు చూసి జాలితో దయతో శివుడు కార్చిన కన్నీరు అని చెప్తారు. కనుక రుద్రాక్షలు నటరాజు జాలి కి ప్రతీక 
  17. ఉపవీతం : నటరాజ స్వామి ఉపవీతంలో 96 పోగులు (దారపు వరుసలు) ఉంటాయట. ఇవి 96 తత్వములకు ప్రతీకలు అని చెప్తారు. ఇవి నటరాజు ధరించుట వలన వానికి అన్నింటికి తానే  అధిపతి అని అర్ధం. 
  18. పాము : నటరాజుని చుట్టుకుని ఉన్న పాము విశ్వశక్తి కి ప్రతీక 
  19. పులి చర్మం : పులి అహంకారమునకు, కామమునకు ప్రతీక. ఆ పులి చర్మమును ధరించుట వలన మన అహంకారమును, కామమును అదుపులో ఉంచగలను అని చెప్పుట. 



5, మార్చి 2019, మంగళవారం

త్రిశూలం

మనం ఇంతకు ముందు శివుని ఆహార్యం గురించి చెప్పుకున్నాం కదా! అక్కడ త్రిశూలం గురించి కొంచెం చెప్పుకున్నాం. ఇప్పుడు ఆ త్రిశూలం  గురించి మరికొంత తెలుసుకునే ప్రయత్నం చేద్దాం!

త్రిశూలం  అంటే మూడు శూలములు కలిగినది అని అర్ధం. ఈ త్రిశూలము
    • త్రి గుణములు - సత్వ, రజః తమో గుణములకు 
    • త్రికాలములు - భూత భవిష్యత్ వర్తమాన కాలములకు  
    • త్రిస్థితులకు - జాగృత్, స్వప్న, సుషుప్తి అనే మూడు స్థితులకు 
    • త్రితాపములను - ఆది దైవిక, ఆది భౌతిక, ఆధ్యాత్మిక అనే మూడు తాపములకు 
    • త్రి కార్యములకు - సృష్టి, స్థితి, లయము 
    •  ధర్మ, అర్ధ , కామములు 
శివుడు ఆది దేవుడు కనుక తన వద్ద ఉన్న శూలము ద్వారా మనలోని ఇన్ని చెడు గుణములను ఒకేసారి నియంత్రిOచ గలడు. వీనిని నియంత్రించటం ద్వారా తాను మాయకు అధిపతి అని మనకు తెలుస్తుంది. 
అయితే మరి ఉన్న మూడు శూలము లలో ఒకటి (మధ్యలోనిది) పొడవు కొంచం ఎక్కువగా ఉంటుంది కదా మరి అది ఎందుకు?
ఈ త్రిశూలం  మన మానవ దేహం లోని నాడీ వ్యవస్థను సూచిస్తుంది. అతి ముఖ్యమయిన ఇడా, పింగళ,  సుషుమ్న నాడులను ఇది సూచిస్తుంది. మన దేహంలో ఇదా పింగళ నాడులు భృకుటి మధ్యభాగం వరకు వస్తాయి (ఆజ్ఞా చక్రం వరకు మాత్రమే), కానీ సుషుమ్నా నాడి పైన ఉన్న 7 వ చక్రం (సహస్త్రార చక్రం) వరకూ వెళ్తుంది.

4, మార్చి 2019, సోమవారం

నటరాజు ఆరాధన - పంచ సభలు

పరమ శివుని అనేక రూపములలో అతి ముఖ్యమయినది నటరాజ రూపం. ఈ రూపం శివుని పంచ కృత్యములను సూచిస్తుంది. దేవాలయములలో నటరాజు ఆరాధన జరిగే ప్రదేశములను సభలు అంటారు. తమిళనాడు లోని వివిధ దేవాలయములలో ని అనేక సభలలో అతి ముఖ్యమయినవి పంచ సభలు. అవి

  1. కనక సభ - చిదంబరం 
  2. రజత సభ - మధురై 
  3. రత్న సభ - తిరువళంగడు
  4. తామ్రసభ -  తిరునెల్వేలి 
  5. చిత్రసభ - కుట్రాళం 
ఇవి కాక చెప్పుకోదగిన మరికొన్ని సభలు 
  1. అద్రి సభ - హిమాలయములు 
  2. ఆది చిత్ సభ - తిరువేంకాడు 
  3. పెరూర్ కనకసభ - పెరూర్ 

3, మార్చి 2019, ఆదివారం

శివుని అష్టమూర్తులు

 శివుని అష్టమూర్తి తత్వముల గురించి మన పెద్దలు అనేక రకములుగా చెప్తూ ఉంటారు. ఇప్పుడు వాని గురించి అవి మనం మన కళ్ళతో దర్శించుకోవటానికి  వీలుగా ఎక్కడ వెలిశాయో చెప్పుకుందాం. ఇంతకూ ముందు మనం శివుని పంచభూత లింగముల గురించి చెప్పు కున్నాం కదా ఇప్పుడు వానితో పాటు మిగిలిన మూడు లింగముల గురించి కూడా చెప్పు కుందాం.
శివుని అష్టమూర్తులు  సర్వప్రాణకోటి యొక్క సృష్టి, స్థితి మరియు లయములకు మూలమై ఉన్నాయి. అవి :

  1. శర్వ : భూ రూపము : శివుడు భూమి తన రూపముగా కలిగి ఉన్నాడు. మనం భూరూపమున ఉన్న శివుని కంచి (తమిళ నాడు) లో ఏకామ్రేశ్వరునిగా దర్శించ వచ్చు 
  2. భవ : జల రూపము . శివుడు జలమే తనరూపముగా కలిగి ఉన్నాడు. మనం జలరూపమున ఉన్న శివుని జలగండేశ్వరము/ జంబుకేశ్వరం  (తమిళనాడు) లో జలగండేశ్వరునిగా దర్శించ వచ్చు. 
  3. రుద్ర : అగ్ని రూపము. శివుడు అగ్నిని తన రూపముగా కలిగి ఉన్నాడు. మనం అగ్ని రూపమయిన శివుడ్ని అరుణాచలం(తమిళనాడు) లో అరుణాచలేశ్వరుని గా దర్శించవచ్చు 
  4. ఉగ్ర: వాయు రూపము . శివుడు వాయువే తన రూపముగా కలిగి ఉన్నాడు. మనం వాయురూపంలో ఉన్న శివుని శ్రీ కాళహస్తి (ఆంధ్రప్రదేశ్) లో శ్రీ కాళహస్తీశ్వరునిగా దర్శించవచ్చు. 
  5. భీమ : ఆకాశ రూపం . శివుడు ఆకాశమే తన రూపంగా కలిగి ఉన్నాడు. మనం ఆకాశ రూపంలో ఉన్న శివుని చిదంబరం (తమిళనాడు)లో చిదంబరేశ్వరుని గా దర్శించవచ్చు. 
  6. పశుపతి : క్షేత్రజ్ఞ రూపం. అంటే ప్రతి జీవిలో ఉండే జీవాత్మరూపం. మనం ఈ క్షేత్రజ్ఞుడయిన రూపమును  ఖాట్మండు (నేపాల్)లో పశుపతినాధ్ గా దర్శించవచ్చు. 
  7. ఈశాన : సూర్య రూపం. సూర్యుడు స్వయంగా సూర్యునిగా ఉన్నాడు. మనం ఈ సూర్య రూపంలోని శివుని కోణార్క్ (ఒరిస్సా) లో సూర్య లింగునిగా దర్శించవచ్చు. 
  8. మహాదేవ : సోమ రూపం. శివుడు చంద్ర రూపంలో ఉన్నాడు. మనం సోమరూపంలో శివుని చట్టగావ్ (పశ్చిమ బెంగాల్)లో సోమనాథుని గా దర్శించవచ్చు. 
శివుడు సర్వ ప్రాణులయందు సర్వదా ఉంటాడు అనటానికి, ప్రతిజీవి పరమాత్మ రూపం అని చెప్పటానికి ఈ ఎనిమిది రూపములలో ఉన్న శివుడే తార్కాణం. ఎందుకంటే ఈ ఎనిమిది కాకుండా మరొక రూపం/ వస్తువు/ స్థితి ఈ సమస్త సృష్టి లో మరొకటి లేదు. 
ఓం నమః శివాయ