20, మే 2020, బుధవారం

సుందోపసుందులు

పూర్వం దైత్య వంశంలో నికుంభుడు అనే దైత్యునకు సుందుడు, ఉపసుందుడు  అనే ఇద్దరు కుమారులు కలిగారు. వారిద్దరూ అత్యంత స్నేహభావంతో పెరిగి పెద్దవారయ్యారు. ఏ పని చేసినా కలిసే చేసేవారు. ఒకసారి ఇద్దరూ  కలిసి అనేక సంవత్సరములు బ్రహ్మదేవుని గురించి తపస్సు చేశారు. వారిని ఇంద్రుడు అనేక రకములుగా పరీక్షించినా వారు తపస్సును మానలేదు. ఇక తప్పని పరిస్థితిలో బ్రహ్మదేవుడు వారు ముందు ప్రత్యక్షం అయ్యి వరమును కోరుకొమ్మని అడిగాడు.
అందరు దైత్యులు లాగానే మరణం లేని వరం కోరుకున్నాడు. కానీ ఆ వరం ఇవ్వటం సాధ్యంకాదు అని బ్రహ్మదేవుడు చెప్పిన తరువాత, వారు ఒక విచిత్రమయిన కోరిక కోరారు.
వారు కోరిన వరం , వారు ఏ రూపం కావాలంటే ఆ రూపం ధరించగలిగేలాగా,అన్ని మంత్రములు, మాయలు వారి వశంలో ఉండేలాగా, ఎక్కడికి కావాలంటే అక్కడికి వెళ్లగలిగేలాగా, వారిని యుద్ధ రంగంలో ఎవరూ ఓడించకుండా, ఒకవేళ వారిద్దరూ ఒకరితో ఒకరు గొడవపడి యుద్ధం చేసుకుంటే మాత్రమే చనిపోయేలాగా వారు వరం కోరుకున్నారు.
బ్రహ్మదేవుడు తధాస్తు అని దీవించి వారికి ఆ వరములు ఇచ్చాడు.
వర గర్వితులయిన దైత్యులు అన్ని లోకముల మీద దండెత్తి వానిని స్వాధీన పరుచుకోవటం మొదలు పెట్టారు. వీరి ఆగడాలు సహించలేని దేవతలు బ్రహ్మదేవుని వద్దకు వెళ్లి మొరపెట్టుకోగా, బ్రహ్మదేవుడు అలోచించి, విశ్వకర్మను పిలిపించాడు. విశ్వకర్మ చేత తిలోత్తమ అనే అప్సరసను సృజింపజేసి ఆమె ను ఆ దైత్యుల వద్దకు పంపారు.
ఆ సుందోపసుందులు ఆమెను చూసి మోహించి, తనకు మాత్రమే సొంతం, తనకు మాత్రమే సొంతం అని గొడవ పడి, వారిలో వారే  యుద్ధం చేసుకుని , చివరకు మరణించారు.  

కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి