29, మే 2020, శుక్రవారం

ఉడుతా భక్తి - ఆ భక్తికి కారణం పూర్వజన్మ!!

ఉడుతా భక్తి అనే మాట మన తెలుగు వారు సహజంగా మనం చేసి పని ఎదుటివారికి  అంత ముఖ్యమయినది కాకపోయినా మనం వారిమీద ఉన్న ప్రేమ అభిమానంతో చేసే పనిని  ఎదో ఉడుతా భక్తి గా చేసాం అని చెబుతూ ఉంటారు.  
శ్రీ రాముని కరుణకు సంబందించిన ఉదాహరణ చెప్పాలంటే ముందుగా చెప్పేది సేతు బంధన సమయంలో ఉడుత చేసిన చిన్న సహాయమునకు శ్రీరాముడు దానిని తన చేతులలోకి తీసుకుని దానిని నిమురుట, ఆ నిమిరినప్పుడు పడిన శ్రీరాముని వేళ్ళ గుర్తులు ఇప్పటికీ ఆ ఉడుతల వీపుపైన ఉన్నాయి అని చెప్తారు కదా! 
మరి ఇంతకీ అలా రాముని చేతులతో నిమిరించుకున్న ఉడుత ఏమి అయ్యింది? ఆ ఉడుతకు రాముని కార్యంలో సహాయం చేయాలన్న ఆలోచన ఎలా కలిగింది?  
దానికి కారణం ఆ ఉడుత పూర్వజన్మ.  ఆ పూర్వజన్మ కథను అద్భుత రామాయణంలో ప్రస్తావించారు. ఆ కథను ఇప్పుడు మన చూద్దాం!

పూర్వ కాలంలో ఒక బ్రాహ్మణ కుమారుడు కాశీ నగరమునకు వెళ్లి అక్కడ సకల విద్యలు నేర్చుకుని తిరిగి తన స్వగ్రామమునకు చేరుకున్నాడు. అతని పాండిత్యమును నిలిచి వాదములలో ఎవ్వరూ నిలువలేక పోయారు. అతని ఖ్యాతి నలుదిశలా వ్యాపించసాగింది. అతనితో పాటుగా అతని తండ్రిని కూడా ప్రజలు కీర్తించేవారు. అయితే ఆ పొగడ్తలను విన్న అతని తండ్రి ఆ పొగడ్తలను చాలా మర్యాదగా మా అబ్బాయి ఇంకా చిన్న పిల్లవాడు వాడు నేర్చుకోవలసినది చాలా ఉన్నది అని చెప్పే వాడు. ఆ మాటలు ఆ కుమారునికి రుచించలేదు. తన తండ్రి బ్రతికి ఉన్నంతకాలం తనను అలా చిన్న పిల్లవానిగానే వీచుస్తారు కనుక తన తండ్రి చనిపోతేనే బాగుండు అనుకోవటం మొదలుపెట్టాడు. 
అలా ఆలోచిస్తూ కొంతకాలానికి తానే తన తండ్రిని చంపెయ్యాలి అని అనుకున్నాడు. ఒక రోజు తన తండ్రి ఇంటిలోకి వస్తున్న సమయంలో అతని మీదకు ఒక కర్రను గురిచూసి విసిరాడు. ఆ దెబ్బకు మూర్ఛిల్లిన తండ్రి, కొంతసేపటికి తేరుకుని ఎంత విద్యా, జ్ఞానము ఉన్నా విచక్షణను కోల్పోయిన కారణంగా ఇంత క్రూరమయిన కార్యం చేసాడు కనుక , క్రూరమృగంగా జన్మించమని శపించాడు. కొడుకు తన తరువాతి జన్మలో ఒక పెద్దపులిగా అడవిలో జన్మించాడు 
ఒకసారి తండ్రి బ్రాహ్మణుడు వేరే ఉరికి వెళ్ళవలసి వచ్చి ఆ అడవిమార్గంలో వెళుతూ ఉండగా, పులిగా జన్మించిన కుమారుడు అతనిమీద దాడి చేయబోయాడు. మృగ జన్మలో ఉండికూడా ఇంకా క్రూరంగా ప్రవర్తిస్తున్నవు కనుక ఎవ్వరికీ హాని చేయని ఉడుత జన్మ ఎత్తు అని మరలా తండ్రి ఆ పులికి శాపం ఇచ్చాడు. అప్పుడు ఆ పులికి గత జన్మ, ఆ జన్మలో సంపాదించుకున్న జ్ఞానము జ్ఞాపకము వచ్చి, తన తండ్రి పాదములపై పడి క్షమాపణ కోరి, ఆ శాపమునకు విమోచనము చెప్పమని అడిగెను. అలా కుమారునిలో పశ్చాత్తాపం గమనించిన బ్రాహ్మణుడు, నీకు ఏమి ఉపకారామ్ జరుగక పోయినా నీవు ఏనాడయితే పక్క వారికి సహాయం చేస్తావో ఆనాడు సాక్షాత్తు శ్రీమహావిష్ణువు నిన్ను స్పర్శిస్తాడు. ఆ విధంగా నీకు శాప విమోచనం కలుగుతుంది అని చెప్పాడు. 
ఆ రోజు నుండి ఆ ఉడుత అలా సముద్రతీరంలో గడుపుతూ ఉంది. 
తాను చేయగలిగిన అతి చిన్న సహాయం రామునికి అందించింది. ఆ సాయమునకు బదులుగా రాముడు ఆ ఉడుతను పట్టుకున్న కారణంగా ఆ బ్రాహ్మణ కుమారునికి శాపవిమోచనం కలిగింది. 

కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి