14, మే 2020, గురువారం

ధర్మరాజు -- 16 కళలు

మనకు ఉన్న ముఖ్యమయిన గ్రంధాలు రెండు. రామాయణం, మహాభారతం. రామాయణం సూర్య వంశంలో జన్మించిన రాముని యొక్క చరితము. కానీ మహాభారతంలో చంద్ర వంశం గురించి చెప్పినా, ఏ ఒక్కరి గురించి మాత్రమే చెప్పిన కధ కాదు. కానీ ఈ కధలో ప్రధానుడు, ఇప్పటి మన భాషలో "హీరో" గా పిలువటానికి అర్హత  గలిగిన వాడు పాండవుల లో పెద్దవాడు అయిన ధర్మరాజు.
ఇంతకు  ముందు మనం రాముని గురించి  పదహారు కళల (లక్షణాల )గురించి చెప్పుకున్నాం కదా! అలాగే ధర్మ రాజు ని చంద్రునిలా  పదహారు కళలు కలిగిన వానిగా చెప్పిన సందర్భం మహాభారతం లో ఒకచోట కనిపిస్తుంది . అది విరాట పర్వం మొదటి భాగంలో, వారు విరాటుని కొలువులో పనిచేయవలసి ఉంటుంది  అని నిర్ణయించుకున్న తరువాత తన తమ్ములు ధర్మరాజు గురించి చెప్పిన సందర్భంలో ఈ పద్యం చెప్తారు.

సీ : మహనీయ మూర్తియు, మానవైభవమును, 
సౌకుమార్యంబును,సరసతయును  
మార్దవంబు, బ్రభుత్వ మహిమయు, నపగత 
కల్మషత్వంబును, గౌరవంబు 
శాంతియు, దాంతియు, జాగంబు, భోగంబు 
గారుణ్యమును, సత్యసారతయును 
ధర్మమయ క్రియా తత్పరత్వంబును 
గీర్తి, ధనార్జన క్రీడానంబు 

ఆ : గలిగి జనుల నేల గాని, యెన్నందును 
నొరులఁ గొల్చి తిరుగ వెరవు లేని 
యట్టి నీవు విరటు నెట్టి చందంబున 
ననుచరించు వాడ వధిప ! చెపుమ !

భావం : ఓ ధర్మరాజా! నీకు చక్కని రూపం, అభిమాన వైభవం, సౌకుమార్యం, సరసత, మృదుత్వం,ప్రాభవం, నిష్కల్మషత్వం, గౌరవం, శాంతి, దాంతి,  త్యాగం, భోగం, దయ , సత్యం, ధార్మిక క్రియాశీలత, కీర్తి , ధనము అనేవి నీకు ఉన్నాయి. ఇన్ని ఉన్నా ఇతరులను సేవించే నేర్పు నీకు లేదు, (ఇప్పటివరకు అటువంటి అవసరం నీకు రాలేదు), అటువంటి నీవు సామాన్యుడు అయిన విరాటుని ఎలా సేవించగలవు? చెప్పు!

కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి