4, మే 2020, సోమవారం

గరుడుడు-- ఆకలి

గరుడుడు తన తల్లిని దాస్యం నుండి విముక్తురాలిని చేయుటకు బయలుదేరాడు. తన తల్లి ఆశీర్వాదం తర్వాత తన తండ్రి ఆశీర్వాదం కోసం వెళ్ళాడు. తల్లి చెప్పిన నిషాదులని తినిన తర్వాత కూడా అతని ఆకలి తీరలేదు కనుక తినుటకు ఏమయినా దొరుకుతుందా అని ఆటను తండ్రిని ఆడిగాడు. అప్పుడు కశ్యపుడు విభావసుడు - సుప్రతీకుడు అనే అన్నదమ్ముల గురించి, వారు ఈ జన్మలో ఏనుగు, తాబేలు గా పుట్టుట గురించి చెప్పి వానిని తినమని చెప్పాడు. అవి ఉండే చోటు గురించి తెలుసుకుని గరుడుడు అక్కడికి వెళ్లి ఆ రెండింటిని తన రెండు కళ్ళతో పట్టుకుని అత్యంత  వేగంగా పైకి ఎగిరాడు.
ఎక్కడయినా కూర్చుని తినాలని ఒక స్థలం కోసం వెతుకుతూ  అలంబం అనే శిఖరం ఉన్న క్షేత్రానికి చేరుకున్నాడు. ఆ క్షేత్రం లో రోహిణము అనే వృక్షం అతనికి ఆతిధ్యం ఇవ్వటానికి సిద్ధపడి తన అతిపెద్ద కొమ్మను అతని కోసం చూపింది. దాని మీద గరుడుడు కూర్చోగానే ఆ కొమ్మ విరిగింది. అలా విరిగిన ఆ కొమ్మకు వాలఖిల్యులు ఉండుట గమనించిన గరుడుడు ఆ కొమ్మను తన ముక్కుతో పట్టుకున్నాడు. అలా రెండు కాళ్లతో ఏనుగు,  తాబేలు మరియు ముక్కుతో ఆ విరిగిన కొమ్మను తీసుకుని తిరిగి తండ్రి వద్దకు వెళ్ళాడు. కశ్యప ప్రజాపతి గరుడుని నోటిలో ఉన్న కొమ్మను దానికి వేళ్ళాడుతున్న వాలఖిల్యులను చూసి వారికి నమస్కరించగా వారు వారి తపస్సును కొనసాగించుటకు  హిమాలయాలకు వెళ్లిపోయారు.
ఆ తరువాత గరుడుడు తనకు లభించిన ఆహారం తినుటకు వీలుగా ఒక స్థలం చూపమని అడుగగాదానికి కశ్యపుడు తాని నివసిస్తున్న గంధమాదన పర్వతానికి లక్ష ఆమడల దూరంలో నిష్పురుషం అనే కొండ ఉన్నది అని , అక్కడ ఎవరూ ఉండరు కనుక అక్కడకు వెళ్లి తినమని చెప్పాడు. అక్కడకు వెళ్లి గరుడుడు తన ఆకలి తీర్చుకున్నాడు. అక్కడి నుండి అమృతమును తీసుకు రావటానికి స్వర్గానికి బయలుదేరాడు. 

కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి