మనం ఇంతకు ముందు విక్రమాదిత్యుని ఆస్థానం లోని నవరత్నాలలో ఒకరయిన వరరుచి రామాయణంలోని విశిష్టమయిన శ్లోకాన్ని తెలుసుకోవటానికి దేశాటన చేసాడని, ఆ శ్లోకం గురించి కొందరు వనదేవతలు మాట్లాడుకుంటున్నప్పుడు వినిని విక్రమాదిత్యునితో చెప్పగా అతను సంతోషించి బహుమానం కూడా ఇచ్చాడు అని తెలుసుకున్నాం! ఆ శ్లోకానికి ఉన్న కొన్ని అర్ధాలనుకూడా మనం తెలుసు కున్నాం కదా!
ఇప్పుడు వరరుచి ఆరాత్రి అడవిలో చెట్టు కిందపడుకున్నప్పుడు ఏం జరిగిందో మనం తెలుసుకుందాం!
దేశాలు అన్ని తిరిగి అనేక పండితులని కలసి, రామాయణంలోని ముఖ్యమయిన శ్లోకం ఏది అని చర్చలు జరిపిన వరరుచికి అన్ని చోట్ల నిరాశ ఎదురయ్యింది. దానికి కారణం ఏ యిద్దరు పండితులూ ఓకే శ్లోకాన్ని చెప్పలేదు. అలా అతని యాత్ర చివరికి చేరుకున్న సమయంలో అడవి మార్గం గుండా ప్రయాణిస్తూ ఒక చెట్టుకిందకు చేరి, అలసట వల్ల నిద్రపోయాడు.
కొంతసేపటికి అతనికి కొన్ని మాటలు వినిపించి మెలకువ వచ్చింది. ఆ మాటలు అతని నిద్రిస్తున్న చెట్టుమీద ఉన్న వానదేవతలవిగా అతనికి అర్ధం అయింది.
ఒక వనదేవి ప్రక్క ఊరిలో ఒక పంచమజాతి స్త్రీ ఒక ఆడపిల్లకు జన్మను ఇచ్చింది అని మాట్లాడుకుంటున్నారు. వారిలో ఒక వనదేవత మాట్లాడుతూ తనకు తెలిసిన జ్యోతిష్యశాస్త్రం ప్రకారం ఆ చంటిపిల్ల ఈ చెట్టుకింద పడుకున్న రామాయణంలో ప్రామూఖమయిన శ్లోకం మామ్ విద్ధి అని తెలియని ఈ పండితునికి భార్య అవుతుంది అని చెప్పింది.
ఆ మాటలు విన్న వరరుచి ఎంతో ఆశ్చర్యపోయాడు. ఆ శ్లోకం గురించి తనకు తెలిసినా దానికి ఉన్న ప్రాముఖ్యతను తెలుసుకోలేక పోయినందుకు చింతిస్తూ, భవిష్యత్తు లో తను ఆ పంచమ కన్యను వివాహం చేసుకోకుండా ఎలా విధిని మార్చుకోవాలా అని ఆలోచిస్తూ అక్కడినుండి తన రాజ్యానికి బయలుదేరాడు.
తన రాజ్యమునకు చేరుకున్న వరరుచి ఆ శ్లోకాన్ని మహారాజు విక్రమాదిత్యుని చెప్పి, దానికి ఉన్న 18 రకముల అర్థాలను చెప్పాడట. అతని ప్రతిభకు ఆశ్చర్యపోయిన మహారాజు అతనికి సన్మానం చేసి, బహుమానంగా ప్రకటించిన 1000 బంగారు నాణేలతో పాటుగా ఇంకా ఏమి కోరుకున్నా చేస్తాను అని మాట ఇచ్చారు. వరరుచి ఆమాటకు సాంతోషించినా అతని కోరికను బయట పెట్టకపోవటం వల్ల రాజుగారు వరరుచిని విందుకు ఆహ్వానించారు.
విందుకు వెళ్లిన వరరుచి ఏమి కోరుకున్నాడు? రాజుగారి మాటని వరరుచి తన విధిని మార్చుకోవటానికి వాడుకున్నాడా? నిజంగా విధి నుండి తప్పించుకోగలిగాడా? తరువాతి టపాలలో చూద్దాం!
కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి