19, సెప్టెంబర్ 2014, శుక్రవారం

ఉత్తానపాదుడు

స్వయంభుమనువునకు శతరూప యందు జన్మించిన పుత్రుడు ఉత్తానపాదుడు(పాదములు ఎత్తిన వాడు, సర్వ సిద్దంగా ఉన్నవాడు).
ఉతానపాదునకు ఇద్దరు భార్యలు ఉన్నారు. మొదటి భార్య సునీతి, రెండవ భార్య సురుచి. వారి ఇరువురి యందు ఇద్దరు పుత్రులు కలిగారు. పెద్ద భార్య అయిన సునీతికి దృవుడు పెద్దవాడు, రెండవ భార్య కుమారుడు ఉత్తముడు చిన్నవాడు. ఉత్తనపాదునకు తన రెండవ భార్య అంటే ఉన్న అమితమైన ప్రేమ కారణంగా అతను సర్వదా మొదటి భార్య అయిన సునీతిని నిరాదరిస్తూ వచ్చాడు. ఆమె పుత్రుడయిన కారణంగా దృవునికి కూడా తండ్రి ప్రేమ దొరకలేదు.
ఒకనాడు ఉత్తానపాదుడు తన విశ్రామ సమయంలో చిన్న భార్య కుమారుడయిన ఉత్తముడిని ఒడిలో కూర్చోబెట్టుకుని ముద్దు చేస్తూ ఉండగా, తండ్రి ప్రేమను పొందాలన్న కోరికతో బాలుడయిన దృవుడు తండ్రి వద్దకు పరుగెత్తాడు. ఐతే తన చిన్న భార్య చూస్తున్నది అని భావించిన ఉత్తానపాదుడు దృవుని దగ్గరకు తీసుకోలేదు. అది సురుచి అహంకారమును పెంచినది. ఆమె చిన్న పిల్లవానితో ఏమి మాట్లాడుతున్నదో కూడా తెలియని భావోద్వేగములకు లోనయినది.
"నీ తండ్రి ఒడిలో కూర్చోటానికి వచ్చావా? నీకు ఆ అర్హత లేదు, ఒకవేళ ఉన్నట్లయితే నీవు నా కడుపున నా పుత్రునిగా జన్మించేవానివి. ఇప్పుడయినా మార్గం ఒకటి ఉన్నది. నీవు ఆ మహావిష్ణువుని ప్రార్ధించి, అతని వరములను పొంది నా గర్భంలో జన్మించు, అప్పుడు తప్పకుండా నీ తండ్రి ఒడిలో కూర్చునే అధికారం పొందగలవు"

సురుచి అంటున్న ఈ మాటలను విన్న తరువాత కూడా ఉత్తానపాదుడు ఏమి మాట్లాడలేదు. తన పుత్రుడిని అతని భార్య అవమానిస్తూ మాట్లాడినా, ఆ పిల్లవానికి ఆమె చెప్తున్న విషయం అర్ధంకాదు అని తెలిసినా, ఆమె అతని ప్రేమ వలెనే ఆమె ఇంతగా అతిశయించినది అని తెలిసినా ఆమెను ఏమీ  అనలేదు.
సవతి తల్లి అనిన మాటలు, ఆ మాటలు వింటూ కూడా బదులు చెప్పని తన తండ్రి వలన అవమానంగా భావించి, తన తల్లి అయిన సునీతి ఆ తరువాత నారదుని ఉపదేశం మీద అడవులకు వెళ్లి తపస్సు చేయసాగాడు.
అప్పుడు ఉత్తానపాదునికి అతని తప్పు తెలిసివచ్చినది. అడవుల పాలయిన తన పుత్రుని కోసం ఎదురు చూడసాగాడు. తపస్సు ముగించుకుని రాజ్యమునకు తిరిగి వచ్చిన దృవునకు రాజ్యాభిషేకం చేసాడు. 

కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి