26, జనవరి 2022, బుధవారం

సంధ్యాదేవి - ఛాయ

 మనం ఇంతకు ముందు కశ్యపుడు  - కుటుంబం గురించి తెలుసుకున్నాం కదా! వారిలో అదితి పుత్రులు ఆదిత్యులు అని చెప్పుకున్నాం కదా! ఆ ద్వాదశ ఆదిత్యుల గురించి కూడ చెప్పుకున్నాం. ఇప్పుడు వారిలో వివస్వంతుని గురించి చెప్పుకుందాం!

వివస్వంతుడు దేవశిల్పి విశ్వకర్మ పుత్రిక అయిన సంధ్యాదేవిని వివాహం చేసుకున్నడు. సంధ్యాదేవికి వివస్వంతుని మీద అనురాగం ఉన్నా అతని వేడిని తట్టుకోలేక పోయేది. వారికి కొంతకాలమునకు సంతానం కలిగింది. వారు వైవస్వత మనువు , ధర్మరాజయిన యముడు మరియు యమున కవల పిల్లలు. 

అప్పటికీ ఆమె సూర్యుని వేడిని తట్టుకోలేక తన నీడ నుండి అచ్చం తనలాగే ఉండే ఛాయను తయారు చేసి తనలాగే అక్కడ ఉంటూ, తన భర్తను పిల్లలను చూసుకుంటూ ఉండమని, తను సంధ్యాదేవి కాదు అనే విషయం ఎవరికీ తెలియకుండా ప్రవర్తించమని చెప్పింది. ఆ మాటలు విన్న ఛాయ తన ప్రాణములకు హాని జరుగదు అన్న నమ్మకం ఉన్నంత కాలం ఆ విషయం ఎవరికి చెప్పనని మాట ఇచ్చింది. సంధ్యాదేవి నిశ్చింతగా తన పుట్టింటికి వెళ్ళింది. 

అలా అనుకోకుండా పుట్టింటికి వచ్చిన సంధ్యాదేవిని చూసి అమె తండ్రి కారణం అడిగాడు. ఆమె విషయం చెప్పింది. అతను ఆమెను సముదాయించి తిరిగి పంపించాలి అనుకున్నాడు. ఆమె ఎలాగూ తనవంటి ఛాయను ఆమె తయారు చేసింది కనుక ఆమె తిరిగి వెళ్ళాలి అనుకోలేదు. కనుక ఆమె తన తండ్రికి తన ఇంటికి వెళుతున్నానని చెప్పి, ఉత్తర కురుదేశమునకు వెళ్ళింది. ఆమె తన సొంత రూపంలో ఉంటే ఎవరయినా గమనిస్తారని ఆమె ఒక ఆడ గుర్రం రూపంలో తపస్సు చేస్తూ ఉంది. 

తరువాత ఏమి జరిగిందో తరువాతి టాపాలలో చూద్దాం!



కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి