30, ఆగస్టు 2014, శనివారం

అంధకాసురుడు-శివుని 108 నామములు

అంధకాసురుడు మహాదేవుని త్రిశూలం మీద ఉండగా శివుని జఠాజూటం చూస్తూ శివుని 108 నామములను కీర్తించాడు. ఆ నామములు :
  1. మహాదేవ 
  2. విరూపాక్ష 
  3. చంద్రశేఖర 
  4. అమృతుడు 
  5. శాశ్వతుడు 
  6. స్థాణువు 
  7. నీలకంఠుడు 
  8. పినాకి 
  9. వృషభాక్షుడు 
  10. మహాజ్ఞేయుడు 
  11. పురుషుడు 
  12. సర్వకామదుడు 
  13. కామారి 
  14. కామదహనుడు 
  15. కామరూపుడు 
  16. కపర్ది 
  17. విరూపుడు 
  18. గిరిశుడు 
  19. భీముడు 
  20. స్రుక్కి 
  21. రక్త వస్త్రుడు 
  22. యోగి 
  23. కామదహనుడు 
  24. త్రిపురజ్ఞుడు 
  25. కపాలి 
  26. గూఢవ్రతుడు 
  27. గుప్తమంత్రుడు 
  28. గంభీరుడు 
  29. భావగోచరుడు 
  30. అణిమాది గుణాధారుడు 
  31. త్రైలోకైస్వర్యదాయకుడు 
  32. వీరుడు 
  33. వీరహనుడు 
  34. ఘోరుడు 
  35. ఘోరహణుడు 
  36. విరూపుడు 
  37. మాంసలుడు 
  38. పటువు 
  39. మహామాంసాదుడు 
  40. ఉన్మత్తుడు 
  41. భైరవుడు 
  42. మహేశ్వరుడు 
  43. త్రైలోక్య ద్రావణుడు 
  44. బుద్ధుడు 
  45. లుబ్ధకుడు 
  46. యజ్ఞసూదనుడు 
  47. ఉన్మత్తుడు 
  48. కృత్తివాసుడు 
  49. గజకృత్తిపరిధానుడు 
  50. క్షుబ్దుడు 
  51. భుజంగభూషణుడు 
  52. దత్తాలoబుడు 
  53. వీరుడు 
  54. కాసినీపూజితుడు 
  55. అఘోరుడు 
  56. ఘోరదైత్యజ్ఞుడు 
  57. ఘోరఘోషుడు 
  58. వనస్పతి రూపుడు 
  59. భాస్మాoగుడు 
  60. జటిలుడు 
  61. సిద్ధుడు 
  62. భేరుండక తసేవితుడు 
  63. భూతేస్వరుడు 
  64. భూతనాధుడు 
  65. పంచభూతాస్రితుడు 
  66. ఖగుడు 
  67. క్రోధితుడు 
  68. విష్ణురుడు 
  69. చండుడు 
  70. చండీసుడు 
  71. చండికాప్రియుడు 
  72. తుంగుడు 
  73. గరుక్మంతుడు 
  74. అసమభోజనుడు 
  75. లేవిహానుడు 
  76. మహారౌద్రుడు 
  77. మృత్యువు 
  78. మృత్యుఅఘోచరుడు 
  79. మృత్యుమృత్యువు 
  80. మహాసేనుడు 
  81. శ్మాసాన వాసి
  82. అరణ్యవాసి 
  83. రాగస్వరూపుడు 
  84. విరాగస్వరూపుడు
  85.  రాగాంధుడు 
  86. వీతరాగశతార్చితుడు 
  87. సత్వగుణుడు 
  88. రజోగుణుడు 
  89. తమోగుణుడు 
  90. అధర్ముడు 
  91. వాసవానుజుడు 
  92. సత్యుడు 
  93. అసత్యుడు 
  94. సద్రూపుడు 
  95. అసద్రూపుడు
  96. ఘోరహనుడు 
  97. ఆహేతుకుడు 
  98. అర్ధనారీస్వరుడు 
  99. భానువు 
  100. భానుకోటి శతప్రభుడు
  101. యజ్ఞస్వరూపుడు 
  102. యజ్ఞపతి 
  103. రుద్రుడు 
  104. ఈశానుడు 
  105. వరదుడు 
  106. నిత్యుడు 
  107. శివుడు 
  108. శంకరుడు 

28, ఆగస్టు 2014, గురువారం

వినాయక ఆకారం - విశ్లేషణ

వినాయక ఆకారం చూడగానే మనస్సును ఆకట్టుకునే విధంగా ఉంటుంది. ఐతే ప్రతి విషయానికి ఎంతో విశేషార్ధం ఉండేలా మన పూర్వికులు వినాయకునికి ఈ ఆకారాన్ని సూచించారు. ఆ విశేషాలు ఏమిటో చూద్దామా!

  1. అతి పెద్దదయిన తల - పెద్దగా ఆలోచించమని చెపుతుంది 
  2. అతి పెద్ద చెవులు - ఎదుటివారు చెప్పేది కూలంకషంగా వినమని 
  3. అతి చిన్న కన్నులు - దృష్టి నిశితం గా ఉండాలి, ఏకాగ్రతగా ఉండాలి 
  4. నోటిని కప్పుతూ ఉన్న తొండం - నీ మాటలను అదుపులో ఉంచుకో 
  5. ఒక విరిగిన దంతం, ఏకదంతం - సర్వదా మంచిని నీతో ఉంచుకుని చెడును విరిచి పడేసే ప్రయత్నం చేయి 
  6. వంపుతిరిగిన తొండం - పరిస్థితులను తట్టుకునేవిధంగా తనను తాను మలచుకొంటూ, తనదైన వ్యక్తిత్వాన్ని వదలకుండా చూసుకో మని చెపుతుంది 
  7. యజ్ఞోపవీతంగా సర్పం - సర్పం కుండలిని శక్తికి ప్రతీక, ప్రతి ఒక్కరు తమ కుండలిని శక్తిని వృద్ధి చేసుకోవటం కోసం ప్రయత్నించాలి అని 
  8. లంబోదరం - జీవితం లో ఎదురయ్యే మంచిని చెడుని సమన్వయము చేసుకుంటూ ముందుకు సాగమని, (వినాయకుని ఉదరంలో సమస్త లోకములు ఉన్నాయి అని మరో అర్ధం చెప్పుకోవచ్చు) 
  9. అభయ ముద్ర - భక్తులకు భయపడనవసరం లేదని చెప్పుట 
  10. వరద ముద్ర - కోరిన కోరికలు తీర్చగలను అని చెప్పుట 
  11. పాశం (పై ఎడమ చేతిలో) -  భక్తులను ఆధ్యాత్మిక విషయముల వైపునకు లాగుతాను అని 
  12. గొడ్డలి (పై కుడి చేతిలో) - కర్మబంధములనుండి విముక్తిని కలిగించగలను అని 
  13. మోదకము/ కుడుము - సాధన ద్వారామత్రమే అతి మధురమైన మోక్షం లభిస్తుంది అని 
  14. పాదముల వద్ద ఉన్న ఫలములు - ఈ ప్రపంచములో కావలసినవి అన్ని ఉన్నాయి, కేవలం నీవు శ్రమించి వాటిని సాధించుకోవాలి 
  15. ఎలుక - ఎక్కడి, ఏమూలకు అయిన చేరగలిగిన, తనకు అడ్డంగా ఉన్నదానిని దేనిని అయిన నాశనం చేయగలిగిన సామర్ధ్యం ఉండాలి, కాని అది మన ఆధీనంలో ఉండాలి 
  16. ఇద్దరు భార్యలు  సిద్ధి ,బుద్ధి వారి పుత్రులు శుభము, లాభము మరియు పుత్రిక సంతోషి - మన బుద్ధి (మనస్సు) మన ఆదీనం లో ఉంటే మనం కోరుకున్న కోరికలు సిద్ధిస్తాయి. దానితో పాటుగా మనకు మంచి జరుగుతుంది, లాభము కూడా లభిస్తుంది 
  17. మరి సంతోషి ని కుమార్తె అని ఎందుకు చెప్పారు?  మనకు జరిగిన మంచిని కాని శుభమును కాని మరొకరికి పంచటానికి మనం ఆలోచించ వచ్చు కాని వాని వల్ల కలిగిన ఆనందాన్ని అందరికి పంచుతాము. కనుకనే సంతోషి ని కుమార్తెగా చెప్పారు. 

వినాయక ఆవిర్భావం - రహస్యం

మన శాస్త్ర, పురాణములలో మన పూర్వికులు, ఋషులు, మునులు చెప్పిన కధలు, సంఘటనలు మనస్సుకు హత్తుకునే విధంగా, ఆలోచింప చేసే విధంగా ఉంటాయి. వారు చెప్పిన ప్రతి విషయం లో ఎంతో ఖటినమైన, జటిలమైన విషయాన్ని క్రోడీకరించి చిన్న కధగా చెప్తారు, మనం అలోచించి తెలుసుకో గలిగితే, మన జన్మ ధన్యం అవుతుంది. ఇటువంటి ఒక అధ్బుతమైన విషయాన్ని వినాయక ఆవిర్భావం లో కూడా చెప్పారు.

పార్వతీదేవి శక్తి స్వరూపిణి.

  1. ఆమె నలుగుపెట్టుకున్న తరువాత వచ్చిన నలుగు పిండితో ఆమె ఒక రూపాన్ని చేసింది. అంటే ఆమె శరీరంలోనుండి వచ్చిన మలినములు (కేవలం శక్తి వల్ల వచ్చే అతిశయం) ఒక రూపాన్ని తీసుకున్నది. 
  2. అతనికి వినాయకుడు అని పేరు పెట్టారు. - నాయకుడు : తండ్రి , వినా: సంభందం లేని వాడు (తండ్రితో నిమిత్తం లేకుండా జన్మించిన వాడు) అంటే శివుని నిమిత్తం లేకుండా జన్మించినవాడు. 
  3. మహాదేవుడు తిరిగి వచ్చినపుడు ఆ బాలుడు శివుని గుర్తించలేదు. - అంటే కేవలం అతిశయించిన శక్తి సామర్ద్యములు ఉండుటవల్ల రజోగుణం ప్రజ్వరిల్లి, జ్ఞానమును లోనికి రానివ్వకుండా అడ్డుకుంటారు. 
  4. శివుడు ఆ బాలుని శిరస్సు ఖండించి లోనికి ప్రవేశించారు - అంటే రజోగుణ అతిశయమును ఖండించి జ్ఞానము లోనికి ప్రవేశించినది. 
  5. ఇక్కడ మరో విషయం గుర్తుంచుకోవాలి తల్లి తన పుత్రునిలో లోపములను, దోషములను కూడా ప్రేమించగలదు, కానీ తండ్రి అతని పుత్రుల లోని అజ్ఞానాన్ని చూసి ఊరుకోలేడు, ఊరుకోకూడదు కూడా. అది అతని ధర్మం. కనుకనే పుత్రుని దండించవలసిన అవసరం ఆదిపిత అయిన శివుని భాద్యత. 
  6. ఉత్తరం వైపునకు తల పెట్టి పడుకున్న జీవి తల - మనకు శాస్త్రముల ప్రకారం, చనిపోయిన లేదా తాము మరణమును ఆహ్వానిస్తున్నాము అనే వారు తప్ప ఎవరూ ఉత్తర దిశకు తలపెట్టి పడుకోరు. కాబట్టి తామంత తాము శిరస్సు ఇవ్వటానికి సిధమైన వారి నుండి శిరస్సుని తీసుకురమ్మని ఆజ్ఞ. 
  7. ఏనుగు తల - ఏనుగు తల మనకు జ్ఞాన శక్తి, క్రియాశక్తి (కర్మశక్తి) కి ప్రతీక, 
  8. ఆ తలను బాలుని శరీరమునకు అతికించే పని స్వయంగా శివుడు చేసాడు కనుక ఇప్పుడు వినాయకుని జననం లో శివునికి కూడా భాగం కలిగినది. అంటే శక్తితో పాటు జ్ఞానం కూడా వినాయకునికి ప్రాప్తించినది. 
  9. ఇప్పుడూ అతనిని వినాయకుడు అనే పిలిచారు. వినాయకుడు : విచిత్రమైన నాయకుడు 


  

27, ఆగస్టు 2014, బుధవారం

వినాయక ఆవిర్భావం

వినాయక జననం గురించి అనేక పురాణములలో అనేక విధములుగా చెప్పబడినది.

లింగపురాణం :
రాక్షసులు సర్వత్రా మహాదేవుని గురించి తపస్సు చేసి అమితమైన బల, పరాక్రమములను పొంది, సర్వదేవతలను కష్టముల పాలుచేయసాగారు. వారి భాదలు తట్టుకోలేక ఆ దేవతాగణములు దేవదేవుని వారి కష్టములను తొలగించే ఉపాయం చెప్పమని ప్రార్ధించారు. అప్పుడు మహాదేవుడు తన మనోబలంచేత వినాయకుని సృష్టించి ఆ రాక్షసులకు అన్ని రకముల విఘ్నములు కలిగించేవిధంగా ఆజ్ఞ ఇచ్చి పంపారు.

సుప్రభేదాగమము :
ఈ ఆగమము ప్రకారం, పార్వతీ పరమేశ్వరులు ఒకసారి హిమాలయములో విహరిస్తూ ఉండగా, వారికి సృష్టికార్యములో నిమగ్నమైన ఒక గజద్వయం కనిపించినది. ఆ దృశ్యమును చూసిన పార్వతీదేవి సిగ్గుతో పరమశివుని  చూసినది, ఆమె ఆంతర్యమును గ్రహించిన శివుడు, పార్వతీదేవి కూడా గజరూపం ధరించారు. అప్పుడు వారి ఆనందమునకు ప్రతిగా గజముఖం కలిగిన వినాయకుడు జన్మించాడు.

శివ పురాణం: 
ఇక మనం సర్వదా వినాయక చవితి రోజు అనుసంధానం చేసే వినాయక సంభవ కధ శివపురాణంలోనిది. 

విష్ణుదేవుని ద్వారపాలకులు ఒకసారి శివపార్వతుల దర్శనార్ధం కైలాసానికి వచ్చారు. దేవిని దర్శించుకునే సమయంలో వారు పార్వతీదేవికి ఒక విజ్ఞాపన చేసారు. 
" దేవీ! పార్వతీమాతా! మహాదేవునకు నంది, భ్రుంగి వంటి ద్వారపాలకులు ఉన్నారు. జగన్మాతవైన నీకు కనీసం ఒక్కరైనా ఉండాలికదా, అలా ఉండుట ఎంతయినా అవసరం" అని చెప్పారు. 
వారి మాటలు విన్న పార్వతీ దేవి చిరునవ్వుతో ఆ కార్యం త్వరలోనే నెరవేరుతుంది అని వారికి చెప్పినది. 

గజాసురుని కోరికమీద, అతని పొట్టలో నివాసముంటున్న మహాదేవుని, శ్రీహరి ఒక గంగిరెద్దులవాని రూపంలో వెళ్లి తీసుకువస్తున్నాడని తెలిసిన పార్వతీదేవి అమిత సంతోషాన్ని పొందినది. మహాదేవుడు తిరిగి వచ్చేలోపు ఆమె సర్వాంగసుందరంగా ఎదురు వెళ్ళాలి అని భావించినది. ఆమె నలుగుపెట్టుకున్న పిండిని ముద్దగా చేసి సంతోషంతో ఆ ముద్దకు ఒక బాలుని ఆకారం ఇచ్చినది. ఆ మూర్తిని చుసిన ఆమె లో మాతృత్వపు భావన కలిగినది. వెంటనే ఆ మూర్తికి ప్రాణం పోసినది. ఆ బాలునికి వినాయకుడు అని పేరు పెట్టినది. ఆ బాలుని ద్వారపాలకునిగా ఉంచి ఎవరినీ లోనికి రానివ్వవద్దని చెప్పి స్నానాధికములు చేయుటకు లోపలకు వెళ్ళినది.
అప్పుడు ఎంతో కాలం తరువాత కైలాసానికి వచ్చిన శివుడు ఉమను చూడాలన్న కోరికతో ఆతృతగా వచ్చాడు. కాని శివుడే తన తండ్రి అని తెలియని వినాయకుడు అతనిని అడ్డగించాడు. వారి మధ్య వాదోపవాదములు జరిగిన తరువాత శివుడు స్వయంగా తన త్రిశూలంతో ఆ బాలుని కంఠమును ఉత్తరింఛి లోనికి ప్రవేశించారు.
ఎంతో కాలంతరువాట తనపతిదేవుని చుసిన పార్వతి ఎంతో సంతోషించినది. కొంతసమయం తరువాత వారి మాటలలో ద్వారపాలకునిగా ఉన్న బాలుని ప్రస్తావన వచ్చినది. శివుడు తానూ బాలుని శిరచ్చేదంచేసిన విధంవిన్న పార్వతీదేవి శోకితురాలయినది.
అప్పుడు మహాదేవుడు తన గణములను ఉత్తరాదిశగా తలను ఉంచి పడుకుని కనిపించిన మొదటి ప్రాణి యొక్క శిరస్సును తెమ్మని ఆదేశించారు. అన్ని గణములు వెళ్లి వెతుకగా వారికి ఒక ఏనుగు కనిపించినది. వారు ఆ ఏనుగు యొక్క తలను తెచ్చి శివునకు ఇచ్చారు. అప్పుడు మహాదేవుడు ఆ బాలునకు ఏనుగు తలను ఉంచి బ్రతికించారు. అప్పటినుండి వినాయకునకు గజముఖుడు అని నామాంతరం వచ్చినది.

కాని ఇక్కడ మనకు ఎన్నో ప్రశ్నలు తలెత్తుతాయి.

  1. శివునికి ఒక బాలుడిని శిరచ్చేదం చేసి సంహరించేంత కోపం ఉంటుందా?
  2. సర్వాంతర్యామి ఐన మహాదేవునికి తన పుత్రుని గురించి తెలియదా? 
  3. ఒక ఏనుగు తల నిర్ధక్షిణ్యం గా ఒక చిన్న బాలునకు ఎందుకు అమర్చవలసి వచ్చినది?

ఈ ప్రశ్నలకు సమాధానం ఇక్కడ చుడండి. 

26, ఆగస్టు 2014, మంగళవారం

వినాయకుడు - గోకర్ణం

గోకర్ణం లో ని శివలింగమును అక్కడ ప్రతిష్టించినది బాలగణపతి అని చెప్తారు. ఐతే అక్కడే ఎందుకు ప్రతిష్టించారు?

ఒకానొక సమయంలో రావణాసురుడు శివుని గురించి తీవ్రమైన తపస్సు చేసాడు. తన తపస్సుకు మెచ్చి తనముందు ప్రత్యక్షమైన శివుని తనతో తన పురమైన లంకకు రమ్మని అడిగాడు. దానికి శివుడు ప్రతిగా తన ఆత్మలింగాన్ని ఇచ్చాడు. తనకు, తన ఆత్మలింగమునకు అభేదం అని చెప్పారు. ఐతే ఆ లింగమును ఎక్కడ భూమిమీద పెడితే అది అక్కడే ప్రతిష్టితమైనట్లు, దానిని మరలా కదిలించుట అసాధ్యం అని కూడా చెప్పారు.
రావణాసురుడు ఆనందంగా ఆ ఆత్మలింగమును స్వీకరించి తన లంకాపురమునకు దక్షిణదిశగా ప్రయాణం సాగించాడు.
అల కొంత దూరం  వెళ్ళాక (గోకర్ణం వద్ద) సంధ్యా సమయం అయినది. ఆటను స్వయంగా బ్రాహ్మణుడు కావటం వల్ల ఆటను సంధ్యావందనం చేసి తీరాలి. కనుక ఎవరైనా ఆ ఆత్మలింగాన్ని పట్టుకుంటే ఆటను సంధ్యావందనం చెయ్యొచ్చు అని చూడసాగాడు.
ఈ సమయం కోసం ఎదురుచూస్తున్న గణపతి అక్కడకు ఒక బ్రాహ్మణ యువకుని రూపంలో అక్కడకు వచ్చాడు. ఆ బాలకుని చూసిన రావణాసురుడు ఆ ఆత్మలింగమును ఆ బాలకునికి ఇచ్చి దానిని జాగ్రత్తగా పట్టుకోమని చెప్పారు. ఒకవేళ ఆ బాలుడు దానిని పట్టుకోలేకపోతే తనను పిలువమని, ఆ బాలుడు 3సార్లు పిలచేలోపు ఆటను వచ్చి స్వయంగా ఆ లింగమును తీసుకుంటాను అని చెప్పాడు. బాలకుని రూపంలో ఉన్న వినాయకుడు అలాగే అని ఒప్పుకున్నాడు. రావణాసురుడు సంధ్యావందనం చేసుకోనుతకోసం కొంచెం దూరంగా వెళ్ళాడు. ఆటను అలా వెళ్ళగానే బాలుడు వెంటవెంటనే 3సార్లు రావణాసురుని పిలిచాడు. రావణాసురుడు అతని పిలుపు విని అక్కడకు వచ్చేంతలో ఆ బాలుడు ఆ ఆత్మలింగాన్ని అక్కడ ఉంచేశాడు. ఆ తరువాత రావణాసురుడు ప్రతిష్టించబడిన ఆ లింగమును కదిలించే ప్రయత్నం చేసాడు. కాని ఆ ప్రయత్నం విఫలమైనది. చేసేది ఏమిలేక రావణాసురుడు మరలి వెళ్ళిపోయాడు.   

ఈ కధను మరోవిధంగా కూడా చెప్తారు.
గణపతి అక్కడ గోపాలకుని వేషంలో అక్కడ ఉన్నారని, రావణాసురుడు లఘుశంక కు వెళ్ళవలసి వచ్చినందున అతనికి ఆత్మలింగమును ఇచ్చారని, అప్పుడు ఆ బాఉదు లింగమును కింద ఉంచారని.

25, ఆగస్టు 2014, సోమవారం

త్రిశంకు

 త్రిశంకుడు

ఇతనికి ఒక ప్రత్యేకమైన స్వర్గలోకం ఉంది. దానిని త్రిశంకుస్వర్గం అంటారు. కాని ఈయన ఆ స్వర్గం లో తలక్రిందులుగా ఉంటారు. ఈయన సశరీరం గా ఎలా స్వర్గం లో ఉన్నాడు? ఈయనకోసం ప్రత్యేకమైన స్వర్గాన్ని ఎవరు సృష్టించారు? ఎందుకు? తలక్రిందులుగా ఎందుకు ఉంటారు?

ఇక్ష్వాకు వంశం లో పృధు మహారాజు పుత్రుడు త్రిశంకుడు అనే రాజు ఉండేవారు. వారి వంశం లో అందరి మంచిని ప్రజలు శ్లాఘించుట  చూసిన త్రిశంఖునకు తన పుర్వీకుల కంటే  మరేదయినా విశిష్టమైన పనిని చేసి అమితమైన కీర్తి గడించాలి అని కోరిక కలిగింది. ఎంతగానో ఆలోచించిన మీదట ఇప్పటివరకు ఎవరూ శరీరం తో స్వర్గానికి వెళ్ళలేదు కనుక తను వెళితే బాగుంటుంది అని నిర్ణయానికి వచ్చాడు.

వెంటనే తమ కుల గురువైన వశిష్టునికి తన కోరిక చెప్పాడు. అది విని ఆశ్చర్య పోయిన వశిష్టుడు ఎంత గొప్ప మహారాజైనా కానీ, ఎంత గొప్ప యజ్ఞ యాగాలు చేసినా కానీ శరీరం తో స్వర్గానికి వెళ్ళడమనేది ధర్మశాస్త్రంలో లేదు. పంచ భూతములతో నిర్మితమైన ఈ శరీరo కొంత కాలానికి పడిపోవాల్సిందే. అది పడిపోయిన తరువాతే శరీరం లోని జీవుడు స్వర్గం లోకి ప్రవేశిస్తాడు. కావున శరీరంతో స్వర్గానికి వెళ్ళటం అనేది జరగదు అని ఖచ్చితంగా చెప్పాడు వశిష్టుడు. కుల గురువు వశిష్టుని మాటలకు సంతృప్తి చెందని  త్రిశంకుడు నూరుగురు గురుపుత్రుల వద్దకు వెళ్లి తన కోరికను వివరించాడు. ఐతే తమతండ్రి జరగదు అని చెప్పిన పనిని తాము ఎంత మాత్రమూ చేయము అని చెప్పారు. పైగా అన్ని శాస్త్రములు తెలిసిన తమ తండ్రి ఒక పని జరగదు అని చెప్తే అది ఎన్నటికీ  జరుగదు కనుక తాను  ఆ ఆలోచనను మానుకోవలసినది అని కూడా సూచిoచారు.
అయినా కూడా తన ఆలోచన మార్చుకోని  త్రిశంకుడు తాను మరొక గురువును ఆశ్రయిస్తాను అన్నాడు. ఆ మాటలకు ఆగ్రహించిన నూరుగురు గురుపుత్రులు ముక్తకంఠంతో ఆ  త్రిశంకుడు చేయతలచిన గురుద్రోహానికి అతనిని చండాలుడవు కమ్మని శపించారు.
 మరునాటి ఉదయం నిద్రలేచే సమయానికి  త్రిశంకుని ముఖంలో కాంతి పోయి నల్లగా అయ్యాడు. ఆయన వేసుకున్న బంగారు ఆభరణాలన్ని ఇనుము ఆభరణాలు అయ్యాయి. జుట్టు, కళ్ళు ఎర్రగా ఉన్నాయి. ఆయనని చూసిన ఆ మందిరంలోని వాళ్ళు, ఇతర మంత్రులు అందరు భయపడి పారిపోయారు. ఆ రూపంతో అలాతిరుగుతూ చివరికి  త్రిశంకుడు విశ్వామిత్రుడిని ఆశ్రయించాడు. 

అప్పటికి విశ్వామిత్రుడు వశిష్టుని మీద కోపంతో తప్పస్సు చేస్తూ రాజర్షి అయ్యారు. అప్పటికే తన దనుర్విధ్య వశిష్టుని మీద పనిచెయ్యదు అని కుడా తెలుసుకున్నారు కాబట్టి ఎలా వశిష్టుని మీద పై చేయి సాధించాలా అని ఆలోచిస్తున్న విశ్వామిత్రునికి  త్రిశంకుడు ఒక మార్గం గా కనిపించాడు. వసిష్టుడు చేయను అన్న పనిని విశ్వామిత్రుడు చేస్తే ఆది వశిష్టుని ఓటమే అవుతుందని ఆలోచించాడు. అందుకే  త్రిశంకుని కోరిక తాను తీరుస్తాను అని చెప్పాడు,
అప్పుడు విశ్వామిత్రుడు తన పుత్రులను, శిష్యులను పిలిచి వారందరిని ఈ సమస్త బ్రహ్మాండం తిరిగి వశిష్టుడు చేయలేని పనిని విశ్వామిత్రుడు చేస్తున్నాడు అని అందరికి చెప్పి అందరిని ఆహ్వానించమని చెప్పాడు. ఒకవేళ ఎవరైనా రాను అన్నా, ఈ పనిని తప్పు పట్టినా వారి వివరాలు తనకు చెప్పమని ఆజ్ఞ ఇచ్చాడు.
 ఆహ్వానం అందుకున్న అందరూ విశ్వామిత్రుడికి భయపడి వచ్చారు. ఆ తరువాత విశ్వామిత్రుని పుత్రులు వచ్చి వశిష్టుని పుత్రులు, మరొక బ్రాహ్మణుడు మహోదయుడు ఈ యజ్ఞానికి రాము అన్నారు అని చెప్పారు. వారు ఏమి కారణం చెప్పారని అడుగగా ఆ బ్రాహ్మణుడు "ఒక క్షత్రియుడు ఒక చండాలుని కోసం యజ్ఞం చేస్తుంటే దేవతలు ఎలా వచ్చి తమ తమ హవిస్సులను తీసుకుంటారు? అది జరిగే పని కాదు కనుక అక్కడకు వచ్చి మా సమయం ఎందుకు వృధా చేసుకోవాలి?" అని అన్నాడు అని చెప్పారు.

దానికి కోపించిన విశ్వామిత్రుడు వశిష్టుని నూరుగురు పుత్రులు ఇప్పుడే భస్మరాసులై పడిపోయి నరకానికి వెళ్లి తరువాత 700 జన్మల పాటు నరమాంస భక్షకులుగా,  ఆ తరువాత కొన్ని జన్మల పాటు ముష్టికులు అనే పేరుతొ పుట్టి కుక్కమాంసం తింటూ బ్రతుకుతారు, ఆ బ్రాహ్మణుడు మహోదయుడు సర్వలోకాలలొ జనాల చే ద్వేషింపబడే నిషాదుడై జీవిస్తాడు అని శపించాడు. 
అప్పుడు యాగం మొదలు పెట్టాడు. విశ్వామిత్రుడు యాగాగ్ని లో హవిస్సులు ఇస్తున్నాడు, కానీ వానిని తీసుకోవటానికి దేవతలు రావటం లేదు. ఇది చుసిన విశ్వామిత్రునికి కోపం వచింది. అహంకారం విజృంభించింది. తన తపోబలం తోనే  త్రిశంకుడిని స్వర్గానికి పంపాలని అనుకుని సంకల్పించాడు. అనన్య సామాన్య మైన అతని తపోబలం వల్ల  త్రిశంకుడు స్వర్గలోకం దిశగా ప్రయాణమయ్యాడు. ఈ విషయం దేవేంద్రడికి తెలిసి ఆయన  త్రిశంకునితో "  త్రిశంకుడా! నువ్వు గురు శాపానికి గురి అయ్యావు. నీకు స్వర్గలోక ప్రవేశం లేదు" అని తలక్రిందులుగా క్రిందికి పో అన్నాడు. అలా తలక్రిందులుగా భూమి మీదకి తోసివెయ్యబడ్డ ఆ  త్రిశంకుడు క్రిందకి  పడిపోతూ తనను రక్షిoచమని విశ్వామిత్రుడిని ప్రార్ధించాడు.
మరింత ఆగ్రహించిన విశ్వామిత్రుడు త్రిశంకుడిని ఆకాశం లో నిలిపాడు, త్రిశంకునకు స్వర్గం లో స్థానం లేదు అని కిందకు నెట్టేశారు కనుక తన మిగలిన మిగిలిన తపశక్తి తో దక్షిణ దిక్కున నక్షత్ర మండలాన్ని సృస్టించాడు. సప్తర్షులని సృస్టించాడు. ఇక దేవతలను దేవాధిపతి  ఇంద్రుడిని సృష్టించే ప్రయత్నం లో ఉండగా దేవతలందరు వచ్చారు.

మహానుభావా! శాంతించు. ఎంత తపహ్శక్తి ఉంటే మాత్రం ఇలా వేరే స్వర్గాన్ని సృస్తిస్తావా! మీకు శాస్త్రం తెలుసు, సశరీరంగా ఎవ్వరినీ స్వర్గానికి పంపాలేము, పైగా ఈ త్రిశంకుడు గురుశాపo పొందినవాడు కనుక స్వర్గ ప్రవేశం లేదు. కానీ మీరు మీ తపశక్తి ని ధారపోసినతపహ్శక్తిని ధారపోసి సృస్టించిన ఈ నక్షత్రమండలం జ్యోతిష్య చక్రానికి ఆవల వైపున ఉంటుంది. అందులో త్రిశంకుడు ఇప్పుడు ఉన్నట్లుగానే తలకిందకు, కాళ్ళు పైకి ఉంది సేవింపబడుతూ ఉంటాడు అని వరం ఇచ్చారు. శాంతించిన విశ్వామిత్రుడు సరే అన్నాడు.

వినాయకుడు - మహాభారతం

మహాభారతం మనకుగల అన్ని పురాణములలో, ఇతిహాసములలో అతి పెద్దదయిన గ్రంధము. మహాభారతములో ఒక లక్ష శ్లోకములు ఉన్నాయి. మహాభారతమును రచించినది వేదవ్యాసుడు అని మనకు తెలుసు. ఐతే అతను స్వయంగా ఘంటం పట్టుకుని వ్రాయలేదు. మరి ఎవరు రాసారు? ఎందుకు?
మహాభారత కధ వ్యాసుడు మహాభారత యుద్ధం జరిగిన తరువాత కొంతకాలానికి రాసాడు. వేదవ్యాసుడు మహాభారతంలో అనేక సందర్భములలో కనిపిస్తాడు. కనుక ఆ సంఘటనలు జరిగినప్పుడు అవి వ్యాసునికి బాగా తెలేసే అవకాశం ఉన్నది.  ఆయన స్వయంగా వేదవ్యాసుడు. కాని జరిగిన సంఘటనలను యధాతధంగా ఒక దృశ్యకావ్యంగా రూపొందించాలంటే ఎంతో శ్రమతో కూడిన విషయం. కనుక అతనికి ఎవరైనా అనుచరుని (లేఖకుని) సహాయంతో రచన ప్రారంభించాలి అనుకుంటున్న సమయంలో ఒకనాడు బ్రహ్మదేవుని దర్శన భాగ్యం కలిగినది.
అప్పుడు వ్యాసభగవానుడు తనమనస్సులోని భావనను చెప్పి తాను చెప్పినది చెప్పినట్లు రాయగలిగిన లేఖకుని గురించి సలహా ఇవ్వమని కోరాడు. అప్పుడు బ్రహ్మదేవుడు
" వ్యాసా! నీవు తలపెట్టిన ఈ బృహత్ కార్యమునకు విఘ్ననాయకుడైన గణపతి సరిఅయినవాడు. వెళ్లి అతనిని అర్ధించు." అని చెప్పారు. ఆ ప్రస్తావన విన్న వేదవ్యాసుడు అమిత అనందం పొందాడు.
వెంటనే కైలాసానికి వెళ్లి వినాయకునికి తన ప్రతిపాదన వివరించాడు. వినాయకునికి మహాభారత కధను వ్రాయుట సమ్మతమే అని చెప్పారు కాని ఒక షరతు విధించారు.
"ఒకసారి చెప్పటం మొదలుపెడితే, రాయటానికి ఒకసారి కదిలిన తన ఘంటం ఆగకూడదు, ఒకవేళ అలా ఆగినట్లయితే, తానూ ఇంక ఆ రచనకు సహాయం చేయడు."
ఆ షరతు విని వ్యాసుడు అంగీకరించాడు, మరో ప్రతిషరత్తు విధించాడు.
"తానూ చెప్పిన ప్రతి వాక్యాన్ని వినాయకుడు అర్ధంచేసుకున్న తరువాతనే రాయాలి."
ఆ షరతు విన్న విధ్యాదిపతి గణపతి ఆనందంగా ఒప్పుకున్నాడు.
పరశురామునితో జరిగిన యుద్ధంలో  విరిగిన తన దంతమును ఘంటముగా ధరించాడు. మహాభారత ఇతిహాసం వ్రాయటం మొదలుపెట్టారు. ఐతే వ్యాసభగవానునికి తరువాత చెప్పవలసిన శ్లోకం/ఘట్టం/సంఘటన గురించి కించిత్ ఆలోచించవలసి వచ్చినా సమయం తీసుకునే అవకాశం లేదు కనుక తనకు అటువంటి పరిస్థితి ఎదురైనప్పుడు క్లిష్టమైన ఒక శ్లోకం చెప్పేవాడు. గణపతి ఆ శ్లోకం అర్ధంచేసుకుని రాసేలోపు తాను తరువాతి కధను మనసులోనే సిద్ధంచేసుకునే వాడు. అలా చెప్పిన క్లిష్టమైన శ్లోకములను గ్రంధులు అంటారు. మహాభారం మొత్తం మీద ఇటువంటి గ్రంధులు 8800 ఉన్నాయి. అంటే అన్ని సార్లు వ్యాసునికి ఆలోచించవలసిన అవసరం వచ్చింది, వినాయకునికి చెప్పినది ఒక్కక్షణం అలోచించవలసిన అవసరం వచ్చినది. 

ఏకదంతుడు

విఘ్నరాజు వినాయకునికి ఏకదంతుడు అనే పేరుకూడా ఉన్నది. ఆ పేరు అతనికి ఎలావచ్చింది అనేవిషయం గురించి పురాణములలో అనేకవిధాలుగా చెప్పబడింది. 

1. బ్రహ్మాండ పురాణం:
వేయిచేతులు కలిగిన కార్త్యవీర్యార్జునుని సంహరించిన తరువాత పరశురాముడు ఆదిదంపతులైన శివపార్వతుల ను దర్శించుకొనుటకు కైలాసపర్వతానికి వచ్చాడు. ఆ సమయంలో ఏకాంతంలో ఉన్న పర్వతిపరమేస్వరులు తమ ఏకాంతమునకు ఎటువంటి భంగం కలుగకుండా చూడమని బాలగణపతిని నియమించారు. 

పరశురాముని రాకనుగమనించిన వినాయకుడు అతనికి నమస్కరించి ఈ సమయంలో ఆదిదంపతుల దర్శనం కుదరదు అని చెప్పారు. మహర్షి పరశురాముడు అప్పటికే భూమండలం అంతా 21సార్లు తిరిగి క్షత్రియుల నాశం చేసి ఉన్నారు. అతనిలో కొంత గర్వంప్రవేసించి ఉన్నది. ఆ సమయలో అతనికి వినాయకుని మాటలు నచ్చలేదు. ఈ బాలకుడు తనను ఎదిరిస్తున్నాడు అని భావించారు. మహాదేవునకు భక్తుడనైన నన్ను ఇలా ఆపివేసే అధికారం నీకు ఏడూ అని వినాయకుడిని ఎదిరించాడు. అతనిలోని గర్వమును గమనించిన వినాయకుడు ఆ గర్వమును తొలగించాలని భావించాడు. ఎట్టి పరిస్థితులలోనూ పరశురాముని లోపలకు అనుమతించలేనని స్పష్టంచేసాడు. కోపగించిన పరశురాముడు పరమశివప్రసాదమైన తన పరశువును వినాయకుని మీద ప్రయోగించాడు. అతనికి వినాయకుడు కూడా అతనికి ఆయుధములతో సమాధానం చెప్పటం ప్రారంభించారు. వారిద్దరి మద్య జరిగిన యుద్ధంలో పరశురాముడు తన పరశువుతో వినాయకుని ఎడమవైపు దవడమీద చేసిన దాడి వల్ల అతని ఎడమ దంతం విరిగిపోయినది. 
బయట జరుగుతున్న ఈ కోలాహలం విన్న శివపార్వతులు బయటకు వచ్చారు. తన పుత్రుని విరిగిన దంతమును చూసిన పార్వతీదేవి ఆగ్రహించి పరశురాముని శపించదలచినది. ఆ ఆపదను ముందే గమనించిన నారద మహాముని పార్వతిమాతను వారించారు. ఈ పొరపాటు జరుగుటకు కారణం పరశురామునికి వినాయకుడు ఆదిదంపతుల పుత్రుడు అని తెలియక పోవుట  అని, విరిగిన ఈ వినాయక దంతం మునుముందు కాలంలో ఎన్నో తరములకు, సకల మానవకోటికి ఉపయోగపడుతుంది అని చెప్పి పార్వతిదేవిని సంతోషపరచారు. 

కాలాంతరంలో ఆ దంతంతోనే విఘ్నేశ్వరుడు వ్యాసభగవానుడు చెప్తూ ఉండగా మహాభారత ఇతిహాసాన్ని రచించారు. 
      
2. వేరే పురాణములలో వినాయకుడు యుధం చేసినది శనిదేవుడు అని చెప్పబడినది.

3. వినాయకుడు ముషికాసురుని నియంత్రించే సమయంలో తన దంతమును వినియోగించారు అని మరొక కధ  ప్రచారంలో ఉన్నది.


21, ఆగస్టు 2014, గురువారం

స్వయంభు మనువు

స్వయంభు మనువు, మనకు ఉన్న పదునాలుగు మంది మనువులు  అందరిలో మొదటివాడు. అతని పేరు మీదుగానే మనకు మానవులు (ఆంగ్లంలో Man కూడా ఇక్కడి నుండే వచ్చింది) అని పేరు వచ్చింది.

బ్రహ్మదేవుడు తన సృష్టి కార్యమును మొదలు పెట్టినప్పుడు అతనికి సృష్టి చాలా నిదానంగా జరుగుతుంది అని అనిపించసాగింది. అందుకని బ్రహ్మదేవుడు కుమారులను సృష్టి కార్యక్రమములను కొనసాగిన్చావలసినదిగా కోరాడు. కానీ వారు నిరాకరించారు. ఆ పరిస్థితులలో బ్రహ్మదేవుడు ఒక యోచన చేసారు. మొదటిసారి స్త్రీ పురుషులను సృష్టిస్తే, మిగిలిన సృష్టి కార్యం తనంత తానుగా జరుగుతుంది అని భావించారు. తన ఆలోచనను అమలులో ఉంచుతూ బ్రహ్మదేవుడు తన శరీరాన్ని రెండుగా విభజించారు. ఒక బాగం స్వయంభుమనువు, మరొక భాగం శతరూప అనే ఒక స్త్రీ.
అప్పుడు బ్రహ్మదేవుడు వారిని సృష్టి కార్యం చేయమని చెప్పారు. అప్పుడు స్వయంభు మనువు తాము నివసించుటకు భూమి లేదు అని బ్రహ్మదేవునకు గుర్తుచేశారు. అప్పుడు పరిసరములను గమనించిన బ్రహ్మదేవుడు భూమి మరలా గర్భొదక జలములలో మునిగి ఉండుట చూసాడు. ఆ సమయంలోనే శ్రీ మహావిష్ణువు వరాహవాతారం ధరించి భూమిని ఉద్దరించారు.

శతరూప, స్వయంభు మనువులకు
పుత్రికలు
  1. ఆకూతి 
  2. దేవహూతి 
  3. ప్రసూతి 
పుత్రులు 
  1. ఉత్తానపాదుడు 
  2. ప్రియవ్రతుడు 

19, ఆగస్టు 2014, మంగళవారం

అరుంధతి నక్షత్రము

 హిందూ వివాహ ప్రక్రియలో అత్యంత ముఖ్యమైన ఘట్టం అరుంధతి దర్శనం. మనం ఆ నక్షత్రాన్ని ఎందుకు చూడాలి? ఆ నక్షత్ర విశిష్టత ఏమిటి?

అరుంధతి సప్తఋషులలో ఒకరైన వసిష్టమహర్షి యొక్క భార్య. వారిది అన్యోన్యమైన దాంపత్యం. ఆమె మహా పతివ్రత. తన పాతివ్రత్య మహిమ వల్ల సప్తర్షులతో పాటు నక్షత్ర మండలంలో తానూ స్థానాన్ని పొందగలిగింది. వారి అన్యోన్యత కు సాక్షిగా ఆమె నక్షత్రరూపములో తన భర్త వసిష్ఠ నక్షత్రమునకు దగ్గరగా ఉంటుంది.
సహజంగా రెండు నక్షత్రములు దగ్గరగా ఉన్నప్పుడు ఒక నక్షత్రము స్థిరం గా ఉండి రెండొవ నక్షత్రము దాని చుట్టూ తిరుగుతుంది. కాని వసిష్ఠ, అరుంధతి నక్షత్రములు రెండూ ఒకదాని చుట్టూ ఒకటి తిరుగుతాయి. అది భార్యాభర్తలు ఒకరినొకరు అర్ధంచేసుకుని, ఒకరికి తగినట్లు మరొకరు మెలగాలనే చక్కని సందేశం. అటువంటి ఆదర్శ దంపతులను ఉదాహరణ గా పెళ్లి అవ్వగానే నూతన దంపతులకు చూపించటం ఒక అధ్బుతమైన ఆచారం.

అందులోనూ వరుడు వధువుకు స్వయం గా చూపించుటలో తానూ స్వతంత్రించి ఆమెతో అలా మసలుకునే పరిస్థితి ని కలిగిస్తాను అని చెప్పటం మన ఆచారంగా ఉంది. 

జయ మంత్రం

హనుమంతుడు సీతామాతను వెతుకుతూ సముద్ర లంఘనం చేసి లంకాపురికి చేరుకున్నాడు. అక్కడ అతి కష్టం మీద సీతామాత జాడ తెలుసుకుని, పది నెలలుగా ఆమె పడుతున్న భాదను తొలగించి, రావణాసుర బలాబలములను చూడాలన్న కోరికతో అశోక వనాన్ని ద్వంసం చేయుట మొదలుపెట్టాడు. అది చూసిన రావణ సేవకులు రావణునికి విషయం చెప్పగా, హనుమంతుని భందించమని తన సైన్యాన్ని పంపించాడు. అప్పుడు హనుమ తోరణం మీద కూర్చుని చెప్పిన ఈ మంత్రాన్ని జయ మంత్రం అంటారు.


జయ త్యతిబలో రామో లక్ష్మణశ్చ  మహాబాలః 
రాజా జయతి సుగ్రీవో రాఘవేణాభిపాలితః  
దాసోహం కోసలేంద్రశ్య రామస్యాక్లిష్ట కర్మణః  
హనుమాన్ శతృుసైన్యానాం నిహంతా మాఱుతాత్మజః

న రావణ సహాస్రం మే యుద్ధే ప్రతిబలం భవేత్ 
శిలాభిస్తూ ప్రహారతః  పాదపైశ్చ సహస్రశః  
అర్ధాయిత్వా పురీమ్ లంకా అబీవాద్య చ మధిలీం  
సమృద్ధర్ధో గమిష్యామి మిషాతాం సర్వరక్షసాం 

భావం : 
"రాముడు, లక్ష్మణుడు, విశేషమైన బలం తో వర్ధిల్లుతున్నారు. ఆ రాముడి చేత రక్షింపబడిన వానర రాజైన సుగ్రీవుడు జయము చేత శోభిల్లుతున్నాడు. అటువంటి రాముడికి దాసానుదాసుడిని నేను. నా పేరు హనుమ. నేను యుద్ధంలో వేరే ఆయుధములు వాడను. ఈ రావణ సైన్యాన్ని నా అరీకాళ్ళ కింధ పెట్టి తొక్కేస్తాను. నా పిడి గుద్దులతో ఛంపేస్తాను. పెద్ద పెద్ద చెట్లతో, రాళ్లతో, కొడతాను. వెయ్యిమంది రావణాశురులు నా భుజాల కింధ ఒక కీటకం తో సమానం. నన్ను ఆపగలిగేవాడు ఈ లంకా పట్టణం లో లేదు. సీతమ్మకి నమస్కరించి ఎలా వచ్చానో, అలా ఈ సముద్రాన్ని దాటి వెళ్లిపోతాను. నన్ను పట్టగలిగే మోనగాడు ఈ లంకాపట్టణంలో లేడు. 

చిరంజీవులు

మన పురాణాల ప్రకారం మనకు ఏడుగురు చిరంజీవులు ఉన్నారు. వారికి మృత్యువు లేదు.

వారిని ప్రతి పుట్టినరోజు నాడు తలుచుకోవాలి. ఈ క్రింది శ్లోకం సంస్కృతం లో ఉంది.
अश्वत्थामाबलिर्व्यासोहनुमांश्च विभीषण:कृपश्चपरशुरामश्च सप्तैतेचिरंजीविन:।

అశ్వద్ధామబలివ్యాసోహనుమాంశ్చవిభీషణః కృపర్ పరుశురామశ్చ సప్తయితే చిరజీవినః 

వారు
  1. అశ్వద్ధామ 
  2. బలి
  3. వ్యాసుడు 
  4. హనుమంతుడు
  5. విభీషణ
  6. కృపాచార్యుడు 
  7. పరశురాముడు 

ఉపపాండవులు - మరణ కారణం

ఉపపాండవులు మహాభారత యుద్ధం ముగిసిన సమయంలో ఒక అర్ధరాత్రి వేళ అశ్వద్ధామ చేతిలో పాశవికంగా చంపబడ్డారు. వారు అలా వివాహం కాకుండా, స్పృహలో లేని సమయంలో చనిపోవటానికి కారణం ఉన్నది.

త్రేతాయుగ కాలంలో విశ్వామిత్రుడు  హరిశ్చంద్రుడుని పరిక్షిస్తున్న సమయంలో ఒకసారి అతని మీదకు కర్రను ఎత్తాడు. ఆ సమయం లో ఆ సంఘటనను చుసిన ఐదుగురు  విశ్వేదేవతలు విశ్వామిత్రునిపై కోపించి అతనిని ఎదిరించారు.

ఓ విశ్వామిత్రా! ఇది అన్యాయం కదా! ఒక మానవుని నీవు ఇంతగా భాదపెడుతున్నావు. ఇది నీకు ధర్మమా?

ఆ మాటలు విన్న విశ్వామిత్రుడు వారి అజ్ఞానానికి చింతించి, " ఓ విశ్వేదేవతలారా! మీకు ఏమి తెలుసని  ఇలా నాగురించి తప్పుగా అనుకుంటున్నారు? నేను ఈ విధంగా ఎందుకు ప్రవర్తిస్తున్నానో తెలియకుండానే మీరు అనవసరంగా నా పనికి అడ్డు పడుతున్నారు. ఈ క్రియకు మీకు తప్పని సరిగా శిక్ష విధించ వలసినదే! మీరు ఈ బులోకం లో మానవులుగా జన్మించండి"
తమ తప్పు తెలుసుకున్న విశ్వేదేవతలు విశ్వామిత్రుని ఈ సంసార జంఝాటం తమకు వద్దు అని కోరగా, విశ్వామిత్రుడు వారికి వివాహం కాక మునుపే ఒక అర్ధరాత్రి వేళ ముక్తి లభిస్తుంది అని చెప్పారు.

కాలాంతరంలో వారే ఉపపాండవులుగా జన్మించారు అని చెప్తారు.

ఉపపాండవులు

పాండవులైన ధర్మరాజు, భీముడు, అర్జునుడు, నకులుడు, సహదేవుడు లకు ద్రౌపది యందు జన్మించిన ఐదుగురు పుత్రులను మనం ఉపపాండవులు అంటాము.  వీరు ఒకొక్క సంవత్సరo వయో భేదం తో జన్మించారు. వీరు మహారధులు.


  1. ధర్మరాజు పుత్రుడు ప్రతివింధ్యుడు
  2. భీమసేనుడి పుత్రుడు సుతసోముడు
  3. అర్జునుని పుత్రుడు శృతకర్ముడు 
  4. నకులుని పుత్రుడు శతానీకుడు
  5. సహదేవుని పుత్రుడు శ్రుతసేనుడు


ప్రతివింధ్యుడు: శత్రువులను వింధ్య పర్వతం వలే ఎదుర్కొనగలడు గనుక ఇతనికి ప్రతివింధ్యుడు అని పేరు పెట్టారు.

సుతసోముడు: భీముడు వెయ్యి సోమయాగాలు చేసిన తర్వాత సూర్యచంద్రుల తేజస్సు తో కలిగిన పుత్రుడు కనుక ఇతనికి సుతసోముడు అని పేరు పెట్టారు.

శృతకర్ముడు: అర్జునుడు తాను ఎన్నో ఘనకార్యములు చేసిన తర్వాత పుట్టిన వాడు కనుక ఇతనికి శృతకర్ముడు అని పేరు పెట్టారు.

శతానీకుడు : తమ కౌరవవంశ రాజర్షి ఐన శతానీకుని పేరు నకులుడు తన పుత్రునికి అనందం గా పెట్టుకున్నారు.

శ్రుతసేనుడు: ఇతను కృత్తిక నక్షత్రం లో జన్మించాడు కనుక శ్రుతసేనుడు అని  పేరు పెట్టారు. 

అత్రి,అనసూయ- సంతానం


అత్రి మహాముని ధర్మ పత్ని అనసూయ. వారిది ఆదర్శ దాంపత్యం. అత్రి మహామునికి సంతానం కావని కోరిక కలిగినది. సంతానం కోసం జగత్తుని నిండిన పరమాత్మ గురించి తపస్సు చేసాడు. అతని పరిక్షించదలచిన త్రిమూర్తులు అతని ముందు ప్రత్యక్షమై తమలో ఎవరి గురించి తపస్సు చేస్తున్నావు అని అడిగారు. సర్వం తెలిసిన అత్రి మహర్షి పరమాత్మ గురించి అని సమాధానం చెప్పాడు. అతని జ్ఞానానికి సంతోషించిన బ్రహ్మ,విష్ణు,మహేశ్వరులు ఏమి వరం కావాలి అని అడుగగా వారి అంశలతో తనకు పుత్రులు కావాలని కోరాడు. త్రిమూర్తులు తధాస్తు అని వెళ్లిపోయారు.

కొంతకాలానికి అనసూయకు ముగ్గురు పుత్రులు జన్మించారు.
వారు

  1. చంద్రుడు - బ్రహ్మ అంశ 
  2. దత్తాత్రేయుడు - విష్ణు భగవానుని అంశ 
  3. దుర్వాసుడు - మహాదేవుని అంశ 
బ్రహ్మాండ పురాణం ప్రకారం వీరు మనం ఇప్పుడు ఉన్న వైవస్వత మన్వంతరంలో నే 10 వ మహాయుగం, త్రేతాయుగకాలంలో సంభవించారు. 

18, ఆగస్టు 2014, సోమవారం

28 మంది వ్యాసులు

మనం ప్రస్తుతం ఉన్నది వైవస్వత మన్వంతరం. అందులో 28వ మహాయుగం. ప్రతి మహాయుగంలో వ్యాస భగవానుడు ద్వాపరయుగాంత సమయం లో వేదములను విభాగం చేస్తాడు. ఇప్పటి వరకు జరిగిన 28 మహాయుగములలొ 28 మంది వ్యాసులు జన్మించారు. 
వారు 

  1. స్వయంభు 
  2. ప్రజాపతి 
  3. ఉషన 
  4. బృహస్పతి 
  5. సవిత 
  6. మృత్యు 
  7. ఇంద్ర 
  8. వసిష్ఠ 
  9. సారస్వత 
  10. త్రిధామ 
  11. త్రివ్రిష 
  12. భరద్వాజ 
  13. అంతరిక్ష 
  14. వప్రి 
  15. త్రయారుణ 
  16. ధనుంజయ 
  17. కృతంజయ 
  18. రినజయ 
  19. భరద్వాజ 
  20. గౌతమ 
  21. హర్యాత్మ 
  22. వేణ 
  23. త్రిణవింధు 
  24. రిక్ష 
  25. శక్త్రి 
  26. పరసర 
  27. జాతుకర్ణ 
  28. కృష్ణ ద్వైపాయన 
మనం ఉన్న ఈ మహాయుగంలో వేద విభాగం చేసిన కృష్ణ ద్వైపాయనుడు నాలుగు వేదములను తన నలుగురు శిష్యులకు చెప్పి వాటిని ప్రచారం చేసాడు. ఆ వేద విభాగాన్ని ప్రచారం చేసిన శిష్యులు 
  • ఋగ్వేదం - పైల మహర్షి 
  • యజుర్వేదం - వైశంపాయన 
  • సామవేదం - జైమిని 
  • అధర్వణ వేదం - సుమంతుడు 
  • పురాణములు - రోమహర్షనుడు 
  • భాగవతం - శుక మహర్షి 

17, ఆగస్టు 2014, ఆదివారం

మన్వంతరములు - యుగములు

మన్వంతరములు - యుగములు

మన పురాణముల ప్రకారం మనకు 14 మన్వంతరములు ఉన్నాయి.
అవి
  1. స్వయంభు  మన్వంతరము
  2. స్వారోచిష మన్వంతరము
  3. ఉత్తమ మన్వంతరము
  4. తామస మన్వంతరము
  5. రైవత మన్వంతరము
  6. చాక్షుస మన్వంతరము
  7. వైవస్వత మన్వంతరము
  8. సావర్ణి మన్వంతరము
  9. దక్ష సావర్ణి మన్వంతరము
  10. బ్రహ్మ సావర్ణి మన్వంతరము
  11. ధర్మ సావర్ణి మన్వంతరము
  12. రుద్ర సావర్ణి మన్వంతరము
  13. దేవ సావర్ణి మన్వంతరము
  14. ఇంద్ర సావర్ణి మన్వంతరము
ప్రతి మన్వంతరములోనూ కొన్ని మహాయుగములు ఉంటాయి. 
ఒక్కోమహాయుగానికి నాలుగు యుగములు ఉంటాయి. ఆ యుగములు వాని కాలములు (సంవత్సరములలో)

  • కృతయుగం - 17280000
  • త్రేతాయుగం - 1296000
  • ద్వాపరయుగం - 864000
  • కలియుగం  - 4320000

  • Click here if you want to read the same in English.

    మరుత్తులు

    కశ్యప ప్రజాపతికి 13 మంది భార్యలు. వారిలో దితి, అదితి అని ఇద్దరు. దితికి పుట్టిన
    హిరణ్యకశిపుడు, హిరణ్యాక్షుడు అని ఇద్దరు కొడుకులను శ్రీమహావిష్ణువు (నరసింహ,
    వరాహ అవతారములలో) సంహరించాడని తెలిసి చాలా దుఃఖితురాలయ్యింది.
    ఆమె కశ్యపప్రజాపతి వద్దకు వెళ్లి ప్రణమిల్లి, తనకు ఈసారి జన్మించే కుమారుడు
     ఇంద్రుణ్ణి జయించగల వాడు కావాలని కోరినది. అందుకు కశ్యపుడు విష్ణువు 
    గురించి 1000 సంవత్సరములు నియమ, నిష్టలు తప్పకుండా తపమాచరిస్తే 
    ఇంద్రుణ్ణి జయించగల కొడుకు పుడతాడని బదులిచ్చాడు. ఆమె నియమంతో, 
    నిష్ఠతో తొమ్మిది వందల తొంబై సంవత్సరాలు  తపస్సు చేసింది. కొంత కాలానికి 
    దితి గర్భం దాల్చింది. 
    దితి గర్భం గురించి, ఆమెకు కలుగబోయే శక్తివంతమైన పుత్రుని గురించి తనతల్లి 
    అదితి ద్వారా విన్న ఇంద్రుడు తన పినతల్లి దితివద్దకు వచ్చి ఆమెకు సేవలు చేస్తాను 
    అని ఆమె దగ్గర చేరాడు. అతని దృష్టి సదా ఆమె ఎప్పుడైనా నియమం 
    తప్పుతుందేమో అనే ఉంది.ఇంద్రుడు అవకాశం కోసం ఎదురు చూస్తూ ఉన్నాడు. 
    ఒక రోజు ఆమె మధ్యాహ్న సమయం లో తల విరబోసుకొని గడప వద్ద నిద్రపోతూ ఉంది. 
    ఆ సమయములో కాళ్ళకు ఆమె విరబోసుకొన్న జుత్తు తగులుతూ ఉంది. ఇది 
    చూసి ఇంద్రుడు ఆమె అపవిత్రురాలయ్యిందని తెలుసు కొని సూక్ష్మ రూపములో ఆమె 
    గర్భములోకి ప్రవేశించించి గర్భస్థ శిశువుని ఏడు ముక్కలుగా నరికాడు. లోపలి శిశువు 
    "నన్ను నరికివేయ వద్దు " అంటూ ఏడుస్తూ ఉంది.. ఇంద్రుడు " మారుదో మాదదస్యేసి 
    (ఏడవకు ఏడవకు) " అంటూ నరకుతున్నాడు. ఇంతలో దితికి మెలుకువ 
    వచ్చింది. తన గర్భంలో జరుగుతున్న సంగతిని గ్రహించింది. "ఇంద్రా! నా బిడ్దను 
    చంపకు!" అని అంది.  ఆమెకు తన బిడ్డని చంపుతున్న ఇంద్రునిపై కోపం వచ్చింది. 
    ఆమె ఇంద్రుడిని శపించింది. 
    "ఇంద్రా! నీ త్రైలోక్య ఆధిపత్యం కోసం నవ్ నా గర్భస్థ శిశువు పై దాడికి పునుకున్నావు 
    కనుక నీకు ఆ ఆధిపత్యం సదా కంటకప్రాయమై, నీకు ప్రశాంతంగా పరిపాలించే పరిస్థితి 
    ఉండకుండా ఉండు గాక!" ఇంద్రుని శపించిన తరువాత కూడా ఆమె కోపం తగ్గలేదు. 
    "ఇంద్రునికి ఈ సమాచారాన్ని చెప్పి నా బిడ్డను సంహరించమని చెప్పినది అదితి కనుక 
    మరుజన్మలో ఆమె కన్నుల ముందే తన పుత్రులను చంపుతున్న ఏమి చేయలేని 
    నిస్సహాయ స్థితిలో నేను ఎలా ఉన్నానో అలాగే ఆమె కూడా తన పుత్రులను పోగొట్టుకుంటుంది!
    (కాలాంతరం లో అదితే దేవకిగా జన్మించినది అని చెప్తారు, ఆ సమయం లో ఆమె తన 6 గురు 
    పుత్రులను తన అన్న కంసుడు చంపుట చూడవలసి వచ్చినది)
     ఇంద్రుడు" తల్లీ! నీవు అపవిత్రురాలివైనావు, కాబట్టి నేను శిశువుని నరికివేయ గలిగాను" 
    అని అన్నాడు.
    ఆ సమయానికి అక్కడకు వచ్చి పరిస్థితి చూసిన కశ్యప ప్రజాపతి, దితి కోపాన్ని తగ్గించుకోమని, 
    ఒక్కపుత్రుడికి బదులుగా ఇంద్రుదిసు నరుకబడిన 7 ముక్కలు 7 రు పుత్రులుగా జ
    న్మిస్తారు అని ఉరడించాడు. 
    ఇంద్రునిచే "మారుదః" అనిపించుకున్నారు కనుక వారిని "మరుత్తులు" అని పిలిచారు.  
    ఒకరు బ్రహ్మ లోకములో, ఒకరు ఇంద్రలోకములో, ఒకరు అంతరిక్షములో, మిగిలిన నలుగురు 
    నాలుగు దిక్కుల వాయువుకి అభిమాన దేవతలుగా సంచరించి, ఇంద్రునితో కలిసి ఉంటారు. 

    16, ఆగస్టు 2014, శనివారం

    శ్రీలక్ష్మీ కళ్యాణం ద్విపద

    శ్రీ ముదివర్తి కొండమాచార్యులవారు రచించిన ఈ శ్రీలక్ష్మీ కళ్యాణం ద్విపద, ఆనాటి సాగరమధన సమయంలో జరిగిన ఇతివృత్తాన్ని మన కన్నులకు కట్టినట్లుగా చెపుతుంది. 

    పాల మున్నీటిలో పవడంపు లతగ
    పసి వెన్న ముద్దగా ప్రభవంబు నొంది
    కలుములు వెదజల్లు కలికి చూపులకు
    మరులంది మధువుకై మచ్చిక లట్లు
    ముక్కోటి వేల్పులు ముసురుకొనంగ
    తలపులో చెర్చించి తగ నిరసించి
    అఖిలలోకాదారు నిగమ సంచారు
    నతజనమందారు నందకుమారు
    వలచి వరించిన వరలక్ష్మి గాధ
    సకలపాపహరంబు సంపత్కరంబు
    ఘనమందరాద్రిని కవ్వంబుగాను
    వాసుకి త్రాడుగా వరలంగ చేసి
    అమృతంబు కాంక్షించి అసురులు సురలు
    చిలుకంగ చిలుకంగ క్షీరసాగరము
    పరమ పావనమైన బారసినాడు
    మెలుగారు తొలకరి మెరుపుల తిప్ప
    ఒయ్యరముల లప్ప  ఒప్పులకుప్ప
    చిన్నారి పొన్నారి శ్రీమహాదేవి
    అష్టదళాబ్జమం దావిర్భావించె
    నింగిని తాకెడు నిద్దంపుటలలు
    తూగుటుయ్యాలలై తుంపెసలార
    బాల తా నటుతూగ  పద్మమ్ముచాయ
    కన్నెతా నిటుతూగ కలువపూచాయ
    అటుతూగి ఇటుతూగి అపరంజి ముద్ద
    వీక్షిoచు చుండగా వెదురు మోసట్లు
    పెరిగి పెండిలియీడు పిల్లయ్యె నంత
    కల్పద్రుమంబున కళికలం బోలి
    తనువున పులకలు దట్టమై నిగుడ
    బారజాచి ప్రమోద భాష్పముల్ రాల
    రావమ్మ భాగ్యాల రాశి రావమ్మ
    రావమ్మ ఇందిరారమణి రావమ్మ
    లోక శోకము బాపు లోలాక్షి వీవు
    నాకు కూతురు వౌట నా పుణ్యమమ్మ
    అంచు మురిసిపోయి అంబుధిస్వామి
    ఉప్పొంగి ఉప్పొంగి ఉప్పరం బంటె
    సకియను మంగళ స్నాన మాడింప
    వాసవుoడర్పించే వజ్రపీఠమ్ము
    పూతనదీజల పూర్ణపుణాహ
    కలశాలతోడ దిగ్గజము లవ్వేళ
    జలజాతగంధికి జలకమ్ములార్చే
    బంగారు సరిగంచు పట్టు పుట్టమ్ము
    కట్టంగ సుతకిచ్చె కలశవారాశి
    వెలలేని నగలిచ్చె విశ్వకర్ముండు
    రాజీవముఖులైన రంభాదులంత
    కురులు నున్నగ దువ్వి కుప్పెలు పెట్టి
    కీల్జడ సవరించి కింజల్క ధూళి
    చెదరని క్రొవ్విరుల్ చిక్కగ ముడిచి
    కళల పుట్టినయిండ్లు కనుదమ్ములకు
    కమ్మని కవ్రంపు కాటుక దిద్ది
    వెన్నెల తేటయౌ వెడద మోమునకు
    గుమ్మడి విత్తంత కుంకుమ పెట్టి
    అత్తరు జవ్వాజి అగరు చందనము
    హత్తించి,తనువెల్ల ఆమె ముందటను
    నిలువుటద్డంబును  నిలిపి రంతటను
    తన రూపు శ్రీలక్ష్మి దర్పణమ్మందు
    కనుబొమ్మ నిక్కగా కనుగొని నవ్వి
    సింహాసనము డిగ్గి చెంగల్వ దండ
    చేదాల్చి యచ్చరల్ చేరి కొల్వంగ
    కుచ్చెళ్లు మీగాళ్ళ గునిసియాడంగా
    గరుడ గంధర్వ రాక్షస యక్ష దివిజ
    సంఘ మధ్యమునకు సరుగున వచ్చె
    చెప్పచోద్యం బైన శృగారవల్లి
    మొలకనవ్వుల ముద్దుమోమును జూచి
    సోగకన్నుల వాలు చూపులు జూచి
    ముదురు సంపెంగ మొగ్గ ముక్కును జూచి
    అమృతంబు దొలకెడు నధరంబు జూచి
    సిగ్గులు సుడివడు చెక్కిళ్ళు జూచి
    ముత్యాలు మేచని మునిపండ్ల జూచి
    పాలిండ్ల పై జారు పయ్యెద జూచి
    జవజవ మను కౌసుసౌరును జూచి
    గుండ్రని పిరుదుల కుదిరిక జూచి
    కమనీయ కలహంస గమనంబు జూచి
    మొగమున కందమౌ మొటిమను జూచి
    మధుసూదనుడు దక్క మగవారలెల్ల
    వలపు నిక్కాకకు వసవర్తులైరి
    కన్నుల కెగదన్ను కైపున తన్ను
    తిలకించు చున్నట్టి దిక్పాలకాది
    సురవర్గమును గాంచి సుదతి భావించె
    ఒకడంటరాని వాడు ఒకడు జారుండు
    ఒకడు రక్తపిపాసి యొకడు జడధి
    ఒకడు తిరిపిగా డొకడు చంచలుడు
    కాయకంటి యొకండు కటికవాడొకడు
    ఒక్కటి తరకైన యింకొక్కటి తాలు
    ఈ మొగంములకటే యింతింత నునుపు
    శ్రీవత్సవక్షుoడు శ్రితరక్షకుండు
    పుండరీకాక్షుoడు భువనమోహనుడు
    శంఖ చక్రధరుండు శారంగ హస్తుండు
    తప్త చామీకర ధగ ధగ ధగిత
    పీతాంబరధరుoడు ప్రియ దర్శనుండు
    మణిపుంజ రంజిత మంజుల మకుట
    మకర కుండల హార మంజీర కటక
    కాంచికా కేయూర కమ్రభుషణుడు
    అనుపమ జ్ఞాన బలైశ్వర్య వీర్య
    మాధుర్య గాంభీర్య మార్ద వౌదార్య
    శౌర్య ధైర్య స్థైర్య చాతుర్య ముఖ్య
    కళ్యాణ గుణ గణౌఘ మహార్ణవుండు
    విశ్వమoతయునూ తానైన వాడు
    శేషాద్రినిలయుండు శ్రీనివాసుండు
    పతియైన సుఖములు పడయంగ వచ్చు
    తులలేని భోగాల తులతూగ వచ్చు
    ఏడేడు లోకాల నేలంగ వచ్చు
    అంచు శౌరికి వైచె అలమేలు మంగ
    చెంగల్వ విరిదండ చిత్త ముప్పొంగ
    సకల జగంబులు జయవెట్టు చుండ
    శచియు గౌరియు వాణి సర్వేశ్వరునకు
    తలయంటి పన్నీట తానమాడించి
    తడియోత్తి వేణుపత్రము లంత చేసి
    నామంబులను దిద్ది నవ భూషణముల
    గై సేయ దివిజవర్గముల గొలువ
    కదల నై  రావణగజము పై స్వామి
    కేశవా యంచును కీరముల్ పలుక
    నారాయణా యంచు నెమళులు పలుక
    మాధవా యమ్చును మధుపముల్ పలుక
    గోవిందా యనుచును కోయిలల్ పలుక
    తయితక్క దిమితక్క తధిమిత కిట
    ఝణుత తకఝణుత  ఝణుత యటంచు
    అచ్చరా విరిబోణు లాడి పాడంగ
    ముత్తైదువులు సేస ముత్యాలు చల్ల
    చల్లగా వేంచేయు జలదవర్ణునకు
    అగ్రంబునన్ వేద ఆమ్నాయ ఘోష
    వెనుక మంత్రధ్వని వినువీధి ముట్టె
    అదేవచ్చె ఇదివచ్చెను అల్లుడటంచు
    మామగారెదురేగి మధుపర్క మిచ్చె
    పందిటి లోనికి పట్టి తోడ్తెచ్చె
    పుణ్య తీర్ధంబులు ప్రోక్షించి ఋషులు
    మంగళాశాసన మంగళమ్మిడగా
    కమలచేతికి చక్రి కట్టె కంకణము
    దివ్య శంఖములు తిరుచిన్నములును
    వేణు మర్దల రుద్రవీణలు మొరయ
    తలవంచి కూర్చున్న తన్వి కంఠమున
    మధువైరి గీలించె  మాంగళ్యమపుడు
    చేతుల తలబ్రాలు చేకొని గూడ
    పోయగా వెనుకాడు పూబోడి ముందు
    శిరము వంచిన యట్టి శ్రీధరుజూచి
    పకపక నవ్విరి పల్లవాధరులు
    పదునాల్గు భువనముల్ పాలించునట్టి
    చల్లని విభునకు జయమంగళంబు
    పదము మోపిన చోట పసిడి పండించు
    చూడికుత్తుకకు శుభమంగళంబు
    అంచు హారతులెత్త అంగనామణులు
    సాగే బువ్వముబంతి సంతోషముగను
    కలిత కంకణఝణాత్కారమ్ము లెసగ
    కటకటలంఘలాత్కారముల్ పొసగ
    పిఱుదలపై వేణి పింపిళ్ళు కూయ
    మొగమున తిలకంబు ముక్కున జార
    చిరుచెమ్మటల దోగి చెదరు గంధమ్ము
    ఘమఘమ వాసనల్ గ్రుమ్మరింపంగా
    చురుకు జూపుల కోపు చూపర గుండె
    వలపుచిచ్చు రగుల్ప వగలాడి యొకతె
    కోడిగమ్మడెను గోపాలునిట్లు
    మన పెండ్లికొడుకెంతో మహనీయుడమ్మా
    మహిళలన్ వలపించు మంత్రగాడమ్మ
    మచ్చుమందులు చల్లి మది దోచకున్న
    కఱివాని నెవ్వారు కామిoతురమ్మ
    సుకియలు పొలిలు సొగియవు గాని
    పురపుర మట్టిని బొక్కెడు నంట
    పట్టె మంచము వేసి పాన్పమరింప
    పాముపై తాబోయి పవళించునంట
    అంబారియేనుగే అవతలకంపి
    గద్ద మీద వయాళి గదలెడు నంట
    వింతవేషములెన్నో వేసెడు నంట
    రాసిక్య మితులుంఛి రంగటులుంచి
    ఆకారసౌందర్య మరయుదమన్న
    కనులు చేతులు మోము కాళ్ళు మొత్తమ్ము
    తామరకలిమికి స్థానమ్ము సుమ్ము
    ఈ యంటు మనబాల కెపుడు అంటకుండా
    తామర సిరిగల ధన్యాత్మునకును
    నలచి నల్లెరుతో నలుగిడవలెను
    కంద నీటను నొడల్ కడుగంగ వలెను
    గంధక లేపమ్ము కడుబూయ వలెను
    వాడ వాడల ద్రిప్పి వదలంగ వలెను
    ఆ మాట లాలించి హరుపట్టమహిషి
    మాధవుచెలియ ఆ పడతి కి ఇట్లాడే
    అతి విస్తరంబేల అందాలచిలుక
    నీవు నేర్చిన తెల్గు నేర్తురే యొరులు
    వెన్నుని నలుపంచు వెక్కిరించితివి
    నెలతుక ఎరుపంచు నిక్కుచూపితివి
    కలువపూవు నలుపు కస్తూరి నలుపు
    కందిరీగ ఎరుపు కాకినోరోరెరుపు
    ఈ రెండు రంగులందే రంగు మెరుగో
    సొడ్డువేయుట కాదు సూటిగా జెప్పు
    వరుని జూచిన కంట వధువును జూడు
    మాయ మర్మము వీడి మరి బడులాడు
    కలికి కాల్సేతులు కన్నులు మోము
    తామర విరిసిన తావులు గావో
    తామరలో బుట్టి తామర పెరుగు
    కొమ్మిమేనికి దూలగొoడి రాచేదవో
    కందనీటి చికిత్స గారవిoచెదవో
    ఇంతింత కన్నుల నెగదిగజూచి
    సిగ్గుతో నెమ్మోము చేత గప్పికొని
    అనలు కొనలు వేయు అనురక్తితోడ
    రసికత లేని మా రంగని మెడను
    పూలమాలను వేసి పొలుపుగా నతని
    గుండెల పై జేరి కులుకంగ దలచు
    రంగనాయకి ఎంత రసికురాలమ్మ
    శఫరలోచన ఎంత చపలురాలమ్మ
    ఆ నవ్వు లీ నవ్వు లరవిరిమల్లే
    అందాలు చిందించు లలరింప మదులు
    సకల వైభవముల జరిగెను పెండ్లి
    ఆంపకమ్ముల వేళ యరుదెoచెనంత
    పశుపు కుంకుమ పూలు పండు టెంకాయ
    తాంబూల మోడి దాల్చి తరళాక్షి లక్ష్మి
    తలపు లోపల గ్రుంగు తండ్రిని జేరి
    నాయనా యని పిల్చి నవదుఃఖబాష్ప
    కమణులు జలజల కన్నుల రాల
    గుండె పై తలవాల్చి కుములు చుడంగ
    కడివెడు బడబాగ్ని కడుపులో నణచి
    శిరమును మూర్కొని చెక్కిళ్ళు నిమిరి
    పాలపూసల తల్లి భాగ్యాలవెల్లి
    వేడ్క అత్తింటికి వెళ్లి రావమ్మ
    ఆడపిల్లకు తండ్రి అయ్యెడు కంటే
    మతి గతి లేనట్టి మానౌట మేలు
    వీనుల నీ పాట వినిపించు చుండ
    కన్నుల నీ యాట కనిపించు చుండ
    నూరటతో నెట్టు లుందు నే అమ్మ
    గడియలో నిను వచ్చి కనకుందున
    అని సాగరుడు పుత్రి ననునయింపంగా
    బుద్దులు గరపిరి పుణ్యకామినులు
    ఏమి నోము ఫలంబొ ఏమి భాగ్యంబో
    వేదాంత వేద్యుడు విభుడాయే నీకు
    ఆముదాలన్నియు ఆణిముత్యములె
    చిగురు బోడ్లందరు సింధుకన్యకలే
    తల్లి నీ వెరుగని ధర్మముల్ గలవే
    నెలత నీ వెరుగని నీతులున్నవియే
    పదుగురు నడచిన బాటయే బాట
    మందికి నచ్చిన మాటయే మాట
    మంచిని విత్తిన మంచి ఫలించు
    జొన్నలు విత్తిన చోళ్ళేల పండు
    పోయి రాగదమ్మ పుత్తడిబొమ్మ
    నీదు పుట్టింటిపై నెనరుంప వమ్మ
    కని పెంచకున్నను కళ్యాణి నిన్ను
    కన్నులు జాడక ప్రొద్దు గడచునే మాకు
    చిలుకలు పల్కిన చివురుమామిళ్ళ
    కోయిలల్ గూసిన గుండెలెట్లాడు
    పొగడచెట్లకు వ్రేలు పూదోట్ల గన్న
    నిమ్మళంబుగ నెట్లు నిలుతుమే కన్నా
    కాటుకకాయను  కాంత నేనిత్తు
    కుంకుమ భరిణను కొమ్మ నేనిత్తు
    జోడుసెమ్మెలు నీకు జోటి నేనిత్తు
    పట్టిన దంతయు బంగారు గాగ
    ముట్టినదెల్లయు ముత్యంబు గాగ
    కడుపుసారెకు వేగ గదలి రావమ్మ
    మదిలోన మమ్ముల మరచిపోకమ్మ
    అంత మహాలక్ష్మి యనుగు నెచ్చెలుల
    చెక్కిళ్ళు ముద్దాడి చుబుకంబులంటి
    కంఠమ్ము నిండిన కన్నీళ్ళనాపి
    బంగారు చెలులారా! ప్రాణంబులారా!
    నేనయ్యి మీరెల్ల నెగడి మాయింట
    అయ్య కన్నుల ముందు ఆడుకోరమ్మ
    పట్టుకుచ్చులు నావి పరికిణీలు నావి
    పందిట తూగాడు పయిటలు నావి
    కాళ్ళగజ్జెలు నావి కడియాలు నావి
    పొలుపైన బొచ్చెన బొమ్మలు నావి
    బొమ్మలకును పెట్టు భూషణాలు నావి
    స్వేఛ్చగా మీరెల్ల చేకొనరమ్మ
    అప్పుడప్పుడు లచ్చి తలుచుకోరమ్మ
    అని బుజ్జగములాడి అందలంబెక్కి
    కమలాక్షునిo టికి కదిలె శ్రీలక్ష్మి
    కనుపాపలో క్రాంతి క్రందుకొన్నట్లు
    కండచెక్కెర పాలు కలసియున్నట్లు
    అంజనాచాలవాసుడలమేలు మంగ
    జంటవాయక సుఖ సంతోష లీల
    సాదు రక్షణమును సలుపుచున్నారు
    అరుగని మంగళసూత్రమ్ము
    చెరుగని కుంకుమ పసుపు
    చెదరని సిరులున్
    తరుగని సుఖము లొసంగును
    హరిసతీ యీ పాట విన్న యబలల కెపుడున్


    శ్రీచాగంటి కోటేశ్వరరావు గారు చదివిన యీ ద్విపద ఇక్కడ వినవచ్చు. 

    13, ఆగస్టు 2014, బుధవారం

    తిరునారాయణ దేవాలయం - మెలుకోటి

    తిరునారాయణ/ చెలువనారాయణ దేవాలయం ఎంతో ప్రాముఖ్యమైనది. ఆ దేవాలయం విసిస్టత అంతా  ఆ దేవతాముర్తులదే అని చెప్పటం లో ఎటువంటి అతిశయోక్తి లేదు. మనకు కొన్ని దేవాలయములలో స్వయంభుదేవతా విగ్రహములగురించి చెప్తారు. కాని ఈ దేవాలయం ప్రత్యేకత ఇక్కడి మూలవిరాట్టుతో పాటు ఇక్కడి ఉత్సవమూర్తి కూడా స్వయంభువ మూర్తే.

    మూలవిరాట్టు:

    బ్రహ్మదేవుడు  ఒకసారి తాను నిరంతరం పూజించుకోవటానికి స్వామివారి మూర్తి కావాలని అనుకున్నారు. అనుకున్నదే తడవుగా బ్రహ్మదేవునిముందు శ్రీమన్నారాయణుడు తిరునారాయణమూర్తిగా కనిపించారు. పరమానందభరితుడైన బ్రహ్మదేవుడు ఆ మూర్తిని ఆరాధించటం మొదలుపెట్టాడు. కొంతకాలానికి బ్రహ్మమానస పుత్రుడైన సనత్ కుమారుడు అతను భూలోకంలో ఆరాధించుకొనుటకు ఆ మూర్తిని ఇవ్వమని కోరాడు. బ్రహ్మదేవుడు ఆ మూర్తిని  తన కుమారునికి ఇచ్చాడు. ఆ మూర్తిని తీసుకున్న సనత్ కుమారుడు భూలోకానికి వచ్చి ఆ మూర్తిని ఉంచటానికి తగిన ప్రాంతం కోసం ఎంతో వెతికిన తరువాత చివరకు మేల్ కోటి ఆ పుణ్యస్థలం అని నిర్ధారించుకుని అక్కడ ప్రతిష్టించారు. ఈనాటికి మనం ఆ ముర్తినే మూలవిరాట్టుగా దర్శించవచ్చు.

    ఈ మూలవిరాట్ మూర్తి ఎంతో ప్రత్యేకమైనది. ఈ మూర్తికి హృదయభాగంలో, పాదముల చెంత శ్రీమహాలక్ష్మి కొలువై ఉంటుంది.

    పాదముల వద్ద వేంచేసి ఉన్న శ్రీదేవి


    ఉత్సవమూర్తి :

    మూలవిరాట్టు తన స్థానానికి తేలికగానే వచ్చి చేరింది కాని ఉత్సవమూర్తి ఇక్కడకు చేరటానికి ఎంతో కాలం పట్టింది. స్వయంగా ద్వాపర యుగంలో శ్రీకృష్ణుడే ఆ పనికి పూనుకోవలసి వచ్చినది.

    కృతయుగం:
    బ్రహ్మదేవుడు తన సత్యలోకంలో తాను నిరంతరం ఆరాధించే తిరునారాయణమూర్తి ని తన పుత్రునికి ఇచ్చినతరువాత అతనికి ఎంతో  వెలితి గా అనిపించినది. మరలాతనకు అటువంటి మూర్తికి ఆరాధన చేయాలి అనిపించగానే మరలా శ్రీమన్నారాయణుడు అతని ముందు శ్రీదేవి, భూదేవిలను హృదయం లో ఉంచుకున్న మూర్తిగా దర్సనం ఇచ్చారు. బ్రహ్మదేవుడు సంతోషించి ఆ మూర్తిని ఆరాధించటం మొదలుపెట్టారు. ఈ మూర్తిని సెల్వనారాయణ అని పిలిచారు.

    త్రేతాయుగం:
    రావణసంహారానంతరం శ్రీరాముడు తన నిత్యపూజామూర్తిఐన రంగనాధుని విభీషనుడికి ఇచ్చేసాడు. తరువాత రాముడు నిత్యం ఆరాధించుకొనుటకు ఒక మూర్తి కావాలని బ్రహ్మదేవుడిని కోరాడు. అప్పుడు బ్రహ్మదేవుడు తానూ పూజించే సెల్వనారాయణమూర్తి ని రామునికి ఇచ్చాడు. రామునికి ఎంతో ఇష్టమైన ఆ మూర్తిని రామప్రియ అని పిలిచారు. శ్రీరాముడు తన అవతారం చాలించవలసిన సమయం ఆసన్నమైనప్పుడు ఆముర్తిని తన కుమారుడైన కుసునకు ఇచ్చాడు.
    అలా బ్రహ్మదేవుని నుండి సూర్యవంశానికి ఆ మూర్తి చేరుకున్నది.

    ద్వాపరయుగం:
    కాలాంతరంలో కుశుడు రామప్రియను తన కుమార్తె అయిన కనకమాలినికి పుట్టింటి కానుకగా ఇచ్చాడు. కనకమాలిని యాదవకులానికి చెందిన యాదవకుమారుని వివాహం చేసుకోవటం వల్ల రామప్రియ యాదవ వంశాన్ని చేరుకున్నది. అలా తరాలు మారి శ్రీకృష్ణ బలరాముల వరకు రామప్రియ యాదవుల కులదేవతగా ఉన్నది.
    కొంతకాలానికి బలరాముడు తన స్నేహితులతో కలిసి తీర్ధయాత్రలకు వెళుతూ ఉండగా మెలుకోటిలో తిరునారయణుని చూసి తమ కులదైవానికి, తిరునారాయణునికి ఉన్న సారూప్యతను గమనించాడు. తిరిగి ఇంటికి వెళ్ళినప్పుడు శ్రీకృష్ణునికి ఈ విషయం చెప్పారు. ఆశ్చర్యపోయిన శ్రీకృష్ణుడు బలరామునితో కలిసి మరలా మెలుకోటికి వచ్చి చూసి, రామప్రియ మెలుకోటిలో ఉండటమే సరి అయినది అని నిర్ణయించి రామప్రియను మెలుకోటిలోనే ఉంచారు.






    12, ఆగస్టు 2014, మంగళవారం

    మేలుకోటి - తిరునారాయణపురం

    మేలుకోటి ని తిరునారాయణపురం అని కుడా అంటారు. శ్రీవైష్ణవ సంప్రదాయం లో అతి ముఖ్యమైన సoదర్శన క్షేత్రo. బీబీ నాంచారమ్మ శ్రీవారిని చేరిన క్షేత్రo కూడా ఇదే. యుగ యుగాలుగా ఎంతో ప్రాముఖ్యతను పొందిన క్షేత్రo.

    ఈ క్షేత్రాన్ని ఒక్కో యుగం లో ఒక్కో పేరుతో పిలిచారు. అవి
    1. కృతయుగం - నారాయణాద్రి 
    2. త్రేతాయుగం - వేదాద్రి 
    3. ద్వాపరయుగం - యాదవగిరి 
    4. కలియుగం - యతిశైలం 
    తిరునారాయణపురం లో ముఖ్యంగా రెండు దేవాలయములు ఉన్నాయి. 
    1. చెలువనారాయణ దేవాలయం (తిరునారాయణ దేవాలయం) (పంచ నారాయణులలో ఒకటి )
    2. యోగనారాయణ దేవాలయం 
    చూడవలసిన ప్రదేశములు 
    1. రాయగోపురం 
    2. కళ్యాణి 
    3. ధనుష్కోటి 
    4. బదరి నారాయణ దేవాలయం 
    5. సాక్షి గణపతి దేవాలయం 
    6. అక్క, చెలెళ్ళ కోనేర్లు 
    7. రామానుజాచార్య తీర్ధం 
    ఎలా చేరుకోవాలి?

    మేలుకోటి కర్ణాటక రాష్ట్రం లో ఉంది. ఈ క్షేత్రo బెంగళూరు నుండి 133, మైసూరు నుండి 51 కిలోమీటర్ల దూరం లో ఉంది. 

    11, ఆగస్టు 2014, సోమవారం

    పంచ నారాయణులు

    పంచ నారాయణులు

    విశిష్ట అద్వైత మత స్తాపనాచార్యులు శ్రీ రామానుజాచార్యులు. వారు కర్ణాటకలో ఐదు నారాయణ దేవాలయాలను పునరుద్ధరించారు. అవి


    1. తిరువనారాయణ - మేలుకోటె 
    2. నంబి నారాయణ - తొండనురు 
    3. కీర్తి నారాయణ - తలకాడు 
    4. శ్రీ విజయనారాయణ (చెన్న కేశవ) - బేలూరు 
    5. శ్రీ వీరనారాయణ - గడగ్ 

    నవవిధ భక్తులు

    మనకు భగవంతుడిని ఆరాధించుట తెలుసు. ఆ ఆరాధన నమ్మకంతో కూడినది ఐతే దానిని మనం భక్తి అంటాం. మన శాస్త్రముల ప్రకారం భక్తి తొమ్మిది రకములు. అవి ఏమిటో ఈ రోజు తెలుసుకుందాం. 
    1. శ్రవణం : భగవంతుని కధ లను శ్రద్దగా వినుట 
    2. కీర్తనం  : భగవంతుని గురించి పాటలు పాడుట 
    3. స్మరణం : సర్వకాల సర్వావస్థల యందు భగవంతుని తలుచుకొనుట 
    4. పాదసేవనం : నిరంతరం భగవంతుని పాదములయందు మనసునిలుపుట 
    5. అర్చన : పూజాది విధుల ద్వారా భగవంతుని నిరంతరం సేవించుట 
    6. నమస్కారము : మనస్పూర్తిగా భగవంతునికి నమస్కారము చేయుట 
    7. దాస్యము : భగవంతుని దాసునిగా నిరంతరం తనను తాను భావించుకొనుట 
    8. సఖ్యము : అన్ని కష్టములలో భగవంతుని తన స్నేహితునిగా భావించుట 
    9. ఆత్మ నివేదనం : భగవంతునికి తనను తాను సమర్పించుకొనుట 
    మనకు పురాణములలో, చరిత్రలో ఒక్కో భక్తికి అనేక ఉదాహరణలుగా అనేక మంది కనిపిస్తారు. వారిలో కొందరిని ప్రస్తావించే ప్రయత్నం చేస్తాను. 

    1. శ్రవణం : పరిక్షిత్తు 
    2. కీర్తనం  : రామదాసు  
    3. స్మరణం : ప్రహ్లాదుడు 
    4. పాదసేవనం : లక్ష్మీదేవి  
    5. అర్చన : అదితి  
    6. నమస్కారము : అక్రూరుడు 
    7. దాస్యము : హనుమంతుడు, నందీశ్వరుడు  
    8. సఖ్యము : అర్జునుడు, ఉద్ధవుడు, గుహుడు, సుగ్రీవుడు 
    9. ఆత్మ నివేదనం : గోపికలు, మీరభాయి  

    8, ఆగస్టు 2014, శుక్రవారం

    అరిషడ్వర్గములు

    మనిషికి తనలోనే కొన్ని శత్రువులు ఉన్నారు అని చెప్తారు. ఆ శత్రువులనే అరిషడ్వర్గములు అంటాము. అవి ఆరు.

    1. కామము : కంటిని ఆకర్షించిన ప్రతిదీ సొంతం చేసుకోవాలన్న కోరిక 
    2. క్రోధము : కోరినది తనకు దక్కలేదన్న కోపం తీవ్ర స్థాయిలో యుండుట 
    3. లోభము : తనదగ్గర ఉన్న ప్రతిదీ ఎవ్వరికి ఇవ్వకుండా దాచుకొనుట 
    4. మోహము : తనవారు అనుకున్నావారే తన ప్రపంచం అన్నట్లు ఇతరులను ద్వేషించుట 
    5. మదము : అందరికన్నా తాను ఉన్నతుడను అనే అహంభావం 
    6. మత్సరము : తన వద్దలేనిది మరొకరి వద్ద ఉన్నదనే అసూయ 
    మానవడు ఒకసారి వీనిలో ఏ  ఒకాదానికి వశుడు అయినా మిగతావి అతనిలో కి వచ్చి చేరుతాయి. ఆటను క్రమంగా తన విచక్షణా శక్తిని కోల్పోతాడు. 

    6, ఆగస్టు 2014, బుధవారం

    నీలలోహిత రుద్రుడు


    బ్రహ్మదేవుడు తన సృష్టి కార్యమును మొదలుపెట్టి మొదటగా సనకుడు, సనందుడు, సనత్కుమారుడు, సనక సుజాతియుడుని సృష్టించాడు. వారిని తనకు సృష్టి కార్యములో సహాయం చేయవలసినదిగా కోరాడు. కాని వారు భగవంతుని గురించి తెలుసుకోవాలన్న తమ కోరికను తండ్రికి చెప్పిరి. పరిస్థితి గమనించిన బ్రహ్మదేవునికి కోపం వచ్చింది. ఆ కోపం కారణంగా కనుబొమ్మలు ముడిపడి ఉన్న సమయం లో అతని కనుబొమ్మల మధ్య నుండి ఒక బాలుడు జన్మించాడు.జన్మించిన మరుక్షణం ఏడవటం మొదలుపెట్టాడు. అతని ఏడుపు చూసిన బ్రహ్మదేవుడు అతనికి రుద్రుడు అని నామకరణం చేసాడు. ఆ బాలుడు నల్లగా ఉన్నాడు కనుక నీలలోహిత రుద్రుడు అన్నారు.

    నీలలోహిత రుద్రుడు ఉండు స్థానములు

    1. హృదయము 
    2. ఇంద్రియములు 
    3. ప్రాణము 
    4. ఆకాశము 
    5. వాయువు 
    6. అగ్ని 
    7. జలము 
    8. భూమి 
    9. సూర్యుడు 
    10. చంద్రుడు 
    11. తపస్సు  

    5, ఆగస్టు 2014, మంగళవారం

    శరీరం లోని పది వాయువులు

    మన శరీరం పని చేయుటకు దానిలో తిరుగుతున్న వాయువే కారణం. మన శాస్త్రముల ప్రకారం మన శరీరం లో పది వాయువులు ఉంటాయి. వాని పేర్లు, అవి చేసే పనులు మీకోసం

    1. ప్రాణము : మన ఉచ్ఛ్వాసనిశ్వాసములతో మనం ఉన్నాము అని తెలియచేస్తుంది 
    2. అపానము : తిన్న ఆహారములను విసర్జించుటకు (బయటకు నెట్టుటకు) ఉపయోగపడుతుంది  
    3. వ్యానము  : శరీరం వంగుటకు కారణం 
    4. ఉదానము : శరీరం లో కామ ప్రచోదనం చేస్తుంది (శరీర భాగాలు అదురుటకు కూడా కారణం)
    5. సమానము : జీర్ణం ఐన ఆహారం రక్తం, పిత్తం, శ్లేష్మంగా మార్చి, శరీరం అంతా సమానం గా ప్రసరింపచేస్తుoది 
    6. నాగము : జీర్ణాశయం లో అధిక వాయువు ఉండకుండా సహాయం చేస్తుంది (త్రేపు)
    7. కూర్మము : కన్నులు తెరుచుటకు ఉపయోగించునది 
    8. కృకరము : ఆహారం మింగుటకు  సహాయపడుతుంది (తుమ్ము)
    9. దేవదత్తము : ఇంద్రియములు పనిచేయుటకు సహకరిస్తుంది (ఆవులింత)
    10. ధనుంజయము : శరీరం లో ప్రాణం పోయినా దహనం అయ్యేవరకు ఉంటుంది. (హృదయ స్పందనకు కారణం)

    1, ఆగస్టు 2014, శుక్రవారం

    అంధకాసురుడు-శివుని 108 నామములు

    అంధకాసురుడు మహాదేవుని త్రిశూలం మీద ఉండగా శివుని జఠాజూటం చూస్తూ శివుని 108 నామములను కీర్తించాడు. ఆ నామములు :

    1. మహాదేవ 
    2. విరూపాక్ష 
    3. చంద్రశేఖర 
    4. అమృతుడు 
    5. శాశ్వతుడు 
    6. స్థాణువు 
    7. నీలకంఠుడు 
    8. పినాకి 
    9. వృషభాక్షుడు 
    10. మహాజ్ఞేయుడు 
    11. పురుషుడు 
    12. సర్వకామదుడు 
    13. కామారి 
    14. కామదహనుడు 
    15. కామరూపుడు 
    16. కపర్ది 
    17. విరూపుడు 
    18. గిరిశుడు 
    19. భీముడు 
    20. స్రుక్కి 
    21. రక్త వస్త్రుడు 
    22. యోగి 
    23. కామదహనుడు 
    24. త్రిపురజ్ఞుడు 
    25. కపాలి 
    26. గూఢవ్రతుడు 
    27. గుప్తమంత్రుడు 
    28. గంభీరుడు 
    29. భావగోచరుడు 
    30. అణిమాది గుణాధారుడు 
    31. త్రైలోకైస్వర్యదాయకుడు 
    32. వీరుడు 
    33. వీరహనుడు 
    34. ఘోరుడు 
    35. ఘోరహణుడు 
    36. విరూపుడు 
    37. మాంసలుడు 
    38. పటువు 
    39. మహామాంసాదుడు 
    40. ఉన్మత్తుడు 
    41. భైరవుడు 
    42. మహేశ్వరుడు 
    43. త్రైలోక్య ద్రావణుడు 
    44. బుద్ధుడు 
    45. లుబ్ధకుడు 
    46. యజ్ఞసూదనుడు 
    47. ఉన్మత్తుడు 
    48. కృత్తివాసుడు 
    49. గజకృత్తిపరిధానుడు 
    50. క్షుబ్దుడు 
    51. భుజంగభూషణుడు 
    52. దత్తాలoబుడు 
    53. వీరుడు 
    54. కాసినీపూజితుడు 
    55. అఘోరుడు 
    56. ఘోరదైత్యజ్ఞుడు 
    57. ఘోరఘోషుడు 
    58. వనస్పతి రూపుడు 
    59. భాస్మాoగుడు 
    60. జటిలుడు 
    61. సిద్ధుడు 
    62. భేరుండక తసేవితుడు 
    63. భూతేస్వరుడు 
    64. భూతనాధుడు 
    65. పంచభూతాస్రితుడు 
    66. ఖగుడు 
    67. క్రోధితుడు 
    68. విష్ణురుడు 
    69. చండుడు 
    70. చండీసుడు 
    71. చండికాప్రియుడు 
    72. తుంగుడు 
    73. గరుక్మంతుడు 
    74. అసమభోజనుడు 
    75. లేవిహానుడు 
    76. మహారౌద్రుడు 
    77. మృత్యువు 
    78. మృత్యుఅఘోచరుడు 
    79. మృత్యుమృత్యువు 
    80. మహాసేనుడు 
    81. శ్మాసాన వాసి
    82. అరణ్యవాసి 
    83. రాగస్వరూపుడు 
    84. విరాగస్వరూపుడు
    85.  రాగాంధుడు 
    86. వీతరాగశతార్చితుడు 
    87. సత్వగుణుడు 
    88. రజోగుణుడు 
    89. తమోగుణుడు 
    90. అధర్ముడు 
    91. వాసవానుజుడు 
    92. సత్యుడు 
    93. అసత్యుడు 
    94. సద్రూపుడు 
    95. అసద్రూపుడు
    96. ఘోరహనుడు 
    97. ఆహేతుకుడు 
    98. అర్ధనారీస్వరుడు 
    99. భానువు 
    100. భానుకోటి శత 
    101. యజ్ఞస్వరూపుడు 
    102. యజ్ఞపతి 
    103. రుద్రుడు 
    104. ఈశానుడు 
    105. వరదుడు 
    106. నిత్యుడు 
    107. శివుడు 
    108. శంకరుడు 

    కోదండ రామాలయం-చుంచున్ కట్టే

    ఈ రామాలయం ఎంతో విశిష్టమైనది.

    అక్కడి స్థలపురాణం ప్రకారం సీతారామలక్ష్మణులు అరణ్యవాసం చేస్తున్న సమయం లో వారు అనేక ప్రదేశములు తిరుగుతూ ఈ ప్రాంతానికి వచ్చారు. అక్కడి సహజ సంపదను, ముగ్ధమనోహరమైన ప్రకృతి సౌందర్యాలను చూసి కొన్ని రోజులు అక్కడే ఉండాలి అని నిర్ణయించుకున్నారు. ఐతే నివసించుటకు నీరు అవసరం కనుక రామచంద్ర ప్రభువు లక్ష్మణునికి ఆ భాద్యతను అప్పగించారు. లక్ష్మణుడు తన బాణాన్ని ఒక రాతి మీద ప్రయోగించగా అక్కడ అధ్బుతమైన జలధార ఉద్భవించినది. సీతాదేవి ఆ నీటిలో స్నానం చేసింది అని ఆమె తనశరీరనికి అలదుకున్న కుంకుమ కూడా లక్ష్మణ స్వామి బ్రద్దలు చేసిన రాతిలో నుండే వచ్చింది అని చెప్తారు.
    సీతారాములు నిద్రకు ఉపక్రమించే సమయంలో అతి సుకుమారి ఐన సీతమ్మకు ఆ జల ప్రవాహ శబ్దం ఇబ్బందికరంగా ఉండేది. ఆమె రామునికి చెప్పగా అప్పుడు వారు నిదురిస్తున్న ఆ ప్రాంతానికి ఆ శబ్దం వినిపించదు అని తీర్మానం చేసారు. (వారు నిదురించిన స్థలమే ఇప్పుడు గర్భాలయం.  గుడి ఆవరణలో, పరిసర ప్రాంతాలలో నీటి ఒరవడి చక్కగా వినిపిస్తుంది కాని గర్భగుడి వద్ద వినిపించదు. గుడి నదీ ప్రవాహానికి కేవలం కొద్ది అడుగుల దూరంలో ఉంటుంది).
    కొంతకాలానికి అక్కడకి ఒక ముని వచ్చారని, అతని ధర్మనిష్టను చూసి సంతోషించిన రామచంద్రుడు వరం కోరుకోమని అడుగగా అతనే రామచంద్రుడికి కుడివైపున సీతాదేవిని  ఉంచుకోమని, అలా అక్కడ వెలసి తనతో పూజలు అందుకోమని కోరాడు కనుక అక్కడ సీతారాములు ఆవిధంగా వెలిశారు అని అక్కడి స్థల పురాణం.
    ఐతే సీతారాములకు చుంచ, చుంచి అనే చెంచు దంపతులు  ఆతిద్యం ఇచ్చారు కనుక ఈ ప్రాంతానికి చుంచున్ కట్టే అని పేరువచ్చింది అనికూడా స్థల పురాణం చెప్తున్నది.

    విశేషములు: 

    1. సీతాదేవి రామచంద్రునికి కుడివైపున ఉంటుంది 
    2. గుడి పక్కనే నది ప్రవహిస్తున్నా గర్భగుడిలోకి కొంచెం కుడా నీటి శబ్దం వినిపించదు 

    ఎలా చేరుకోవచ్చు:


    చుంచున్ కట్టే కర్నాటక రాష్ట్రంలో మైసూరు జిల్లలో ఉంది. మైసూరు నుండి 57 కిలోమీటర్ల దూరo లో ఉంది. ప్రతిరోజూ మైసూరు నుండి చుంచున్ కట్టే కు బస్సు సదుపాయము కలదు.