25, ఆగస్టు 2014, సోమవారం

వినాయకుడు - మహాభారతం

మహాభారతం మనకుగల అన్ని పురాణములలో, ఇతిహాసములలో అతి పెద్దదయిన గ్రంధము. మహాభారతములో ఒక లక్ష శ్లోకములు ఉన్నాయి. మహాభారతమును రచించినది వేదవ్యాసుడు అని మనకు తెలుసు. ఐతే అతను స్వయంగా ఘంటం పట్టుకుని వ్రాయలేదు. మరి ఎవరు రాసారు? ఎందుకు?
మహాభారత కధ వ్యాసుడు మహాభారత యుద్ధం జరిగిన తరువాత కొంతకాలానికి రాసాడు. వేదవ్యాసుడు మహాభారతంలో అనేక సందర్భములలో కనిపిస్తాడు. కనుక ఆ సంఘటనలు జరిగినప్పుడు అవి వ్యాసునికి బాగా తెలేసే అవకాశం ఉన్నది.  ఆయన స్వయంగా వేదవ్యాసుడు. కాని జరిగిన సంఘటనలను యధాతధంగా ఒక దృశ్యకావ్యంగా రూపొందించాలంటే ఎంతో శ్రమతో కూడిన విషయం. కనుక అతనికి ఎవరైనా అనుచరుని (లేఖకుని) సహాయంతో రచన ప్రారంభించాలి అనుకుంటున్న సమయంలో ఒకనాడు బ్రహ్మదేవుని దర్శన భాగ్యం కలిగినది.
అప్పుడు వ్యాసభగవానుడు తనమనస్సులోని భావనను చెప్పి తాను చెప్పినది చెప్పినట్లు రాయగలిగిన లేఖకుని గురించి సలహా ఇవ్వమని కోరాడు. అప్పుడు బ్రహ్మదేవుడు
" వ్యాసా! నీవు తలపెట్టిన ఈ బృహత్ కార్యమునకు విఘ్ననాయకుడైన గణపతి సరిఅయినవాడు. వెళ్లి అతనిని అర్ధించు." అని చెప్పారు. ఆ ప్రస్తావన విన్న వేదవ్యాసుడు అమిత అనందం పొందాడు.
వెంటనే కైలాసానికి వెళ్లి వినాయకునికి తన ప్రతిపాదన వివరించాడు. వినాయకునికి మహాభారత కధను వ్రాయుట సమ్మతమే అని చెప్పారు కాని ఒక షరతు విధించారు.
"ఒకసారి చెప్పటం మొదలుపెడితే, రాయటానికి ఒకసారి కదిలిన తన ఘంటం ఆగకూడదు, ఒకవేళ అలా ఆగినట్లయితే, తానూ ఇంక ఆ రచనకు సహాయం చేయడు."
ఆ షరతు విని వ్యాసుడు అంగీకరించాడు, మరో ప్రతిషరత్తు విధించాడు.
"తానూ చెప్పిన ప్రతి వాక్యాన్ని వినాయకుడు అర్ధంచేసుకున్న తరువాతనే రాయాలి."
ఆ షరతు విన్న విధ్యాదిపతి గణపతి ఆనందంగా ఒప్పుకున్నాడు.
పరశురామునితో జరిగిన యుద్ధంలో  విరిగిన తన దంతమును ఘంటముగా ధరించాడు. మహాభారత ఇతిహాసం వ్రాయటం మొదలుపెట్టారు. ఐతే వ్యాసభగవానునికి తరువాత చెప్పవలసిన శ్లోకం/ఘట్టం/సంఘటన గురించి కించిత్ ఆలోచించవలసి వచ్చినా సమయం తీసుకునే అవకాశం లేదు కనుక తనకు అటువంటి పరిస్థితి ఎదురైనప్పుడు క్లిష్టమైన ఒక శ్లోకం చెప్పేవాడు. గణపతి ఆ శ్లోకం అర్ధంచేసుకుని రాసేలోపు తాను తరువాతి కధను మనసులోనే సిద్ధంచేసుకునే వాడు. అలా చెప్పిన క్లిష్టమైన శ్లోకములను గ్రంధులు అంటారు. మహాభారం మొత్తం మీద ఇటువంటి గ్రంధులు 8800 ఉన్నాయి. అంటే అన్ని సార్లు వ్యాసునికి ఆలోచించవలసిన అవసరం వచ్చింది, వినాయకునికి చెప్పినది ఒక్కక్షణం అలోచించవలసిన అవసరం వచ్చినది. 

కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి