మనం ఇంతకుముందు మనం దశగ్రీవునికి నంది ఇచ్చిన శాపం గురించి తెలుసుకున్నాం కదా! ఆ తరువాత ఏమి జరిగింది? దశగ్రీవునికి రావణ అనేపేరు ఎలా వచ్చింది అని మనం ఇప్పుడు తెలుసుకుందాం!
నంది శాపం తరువాత దశగ్రీవుడు తన పుష్పక విమానమును ఆపిన ఆ పరమేశ్వరుని కోసం చూశాడు. కానీ నంది దశగ్రీవుని వెళ్ళనివ్వలేదు. అప్పుడు వారి మధ్య చిన్న యుధ్ధం జరిగింది. ఆ సందర్భంలో దశగ్రీవుని అహం, గర్వం మరింతగా పెరిగి, విచక్షణ కోల్పోయాడు. ఏ శిఖరం మీద అయితే పరమేశ్వరుడు ఉన్నాడని నంది చెప్పాడో ఆ శిఖర మూలమును, కొండనే ఎత్తాలని ప్రయత్నం చేసాడు. దానికోసం అతను తన పది తలల, ఇరవై చేతుల బలములను ఒడ్డాడు. అప్పుడు, ఆ కైలాస శిఖరం కొద్దిగా కంపించింది. ఆ కంపనమునకు పార్వతీదేవి తన భర్త చేతిని కొంచెం గట్టిగా పొదివి పట్టుకుంది. ఆమె భయమును పోగొట్టాలంటే ఆ కంపనను ఆపాలన్న ఉద్దేశంతో తన కాలి బొటనవేలుని కొద్దిగా నొక్కి ఉంచాడు.
పైనుండి వచ్చిన ఆ ప్రతిఘటనను అతని శక్తి తట్టుకోలేక అతను ఆ కొండకింద ఇరుక్కుపోయాడు. ఆ సమ్దర్భంలో అతను చాలా పెద్దగా అరవడం మొదలు పెట్టాడు. ఆ అరుపులకు ముల్లోకములు అల్లాడిపోయాయి. ఆ శబ్ధానికి దేవేంద్రుని దేవలోకం కూడా కంపించింది. ఆ సందర్భంలో దశగ్రీవుడు బ్రహ్మదేవుని సహాయం కోరాడు. కానీ ఆ సమయంలో అతనిని పరమేశ్వరుడు తప్ప ఎవ్వరూ కాపాడలేరని తెలుసుకుని, అతనినే ప్రార్ధించడం, స్తుతించడం మొదలుపెట్టాడు.
అతని గర్వం ఆ సందర్భాన్ని బట్టి కొంతవరకు తగ్గింది. అతను ఎంతో పెద్దగా అరుస్తూనే స్తుతించడం మొదలుపెట్టాడు. అలా కొంతకాలం గడచిన తరువాత, శివుడు సంతోషించి తన పట్టును సడలించాడు. అప్పుడు దశగ్రీవుడు తన చేతులను, కాళ్ళను ఆ పర్వతం క్రిందినుండి తీసుకుని, లేచి నిలబడ్డాడు.
అతనిని చూసి భోళాశంకరుడు అయిన పరమేశ్వరుడు దశగ్రీవునికి వరం ఇవ్వాలని అనుకున్నాడు. అంతేకాక అతని అరుపుల వలన అన్నిలోకములు అదిరిపోయాయి, భయమునకు గురి అయ్యాయి కనుక అతనికి "రావణ" అనే పేరు ఇచ్చాడు.
తరువాత రావణుడు అతనికి పరమేశ్వరుడు ఇస్తానన్న వరమును గుర్తు చేస్తూ, అతనికి ఇంతకుముందే బ్రహ్మదేవుడు అమరత్వాన్ని ప్రసాదించాడు కనుక తనకు అమరత్వమును గురించిన వరము అవసరములేదని, అయితే ఇంతకు ముందు తపస్సు కారణంగా, ఇప్పుడు కైలాస పర్వతమును ఎత్తేకారణంగా అతని ఆయుష్షు తగ్గిపోయినది కనుక అతని ఆయుష్షును తిరిగి ఇవ్వమని, అంతేకాకుండా ఆతనికి ఒక దివ్య ఆయుధం ఇవ్వవలసినదిగా కోరుకున్నాడు. అతను కోరుకున్న వరములను ఇచ్చిన పరమేశ్వరుడు అతనికి చంద్రహాసము అనే ఒక దివ్య ఖడ్గమును ఇచ్చాడు. ఆ ఖడ్గమును భక్తితో పూజించమని, ఒకవేళ దానికి అవమానం జరిగితే అప్పుడు ఆ ఖడ్గం అతని వద్దకు తిరిగి చేరుతుంది అని చెప్పాడు. ఆ షరతునకు అగీకరించిన రావణుడు పరమేశ్వరుని వరములను స్వీకరించి తిరిగి పుష్పక విమానం ఎక్కి తన లంకకు వెళ్ళిపోయాడు.
ఇక్కడ విషయం మనం చూస్తే, రావణునికి అతనికి అమరత్వం ఉన్నది అని గట్టి నమ్మకం లేదు. కారణం అతనికి అమరత్వం ఉన్నది అని నమ్మకం ఉంటే అతను తన తరిగిపోయిన ఆయుష్షు గురించి మాట్లాడవలసిన అవసరమే లేదు కదా! కానీ అతను అతని తరిగిపోయిన ఆయుష్షుని తనకు ఇవ్వమని కోరుకున్నాడు. అతని వివేకం పూర్తిగా పోయింది. అతని ముర్ఖత్వం, ఆవేశం, దురుసుతనం, అతను కోరుకున్నది చేయాలనుకునే పట్టుదల అతనికి పెరిగిపోయింది. అతని ఆలోచనలు మరింత క్రూరంగా మారిపోయాయి.
దశగ్రీవుడు రావణునిగా మారడం అతని పతనమునకు నాంది అని చెప్పవచ్చు.
కామెంట్లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి