13, జూన్ 2020, శనివారం

గుణనిధి - దొంగ

మనం ఇంతకు ముందు యజ్ఞదత్తుడు - గుణనిధి గురించి తెలుసుకున్నాం కదా! మరి తండ్రి తనను వదిలేశాక గుణనిధి ఏమయ్యాడు? ఇప్పుడు తెలుసుకుందాం!
తానా తండ్రి తనను వదిలేసాడు అని తెలుసుకున్న గుణనిధి ఇంటికి వెళితే తన తండ్రి ఎం చేస్తాడో అనే భయంతో పారిపోయాడు. కొంతకాలం అలా తిరిగిన తరువాత ఒకరోజు అతనికి తినటానికి ఏమి దొరకక ఒక అడవిలో చెట్టుకింద కూర్చుని ఉన్నాడు. ఆ సమయంలో ఒక శివభక్తుడు తన పరివారంతో, అనేక తినుబండారములు తీసుకుని శివాలయమునకు వెళుతూ ఉండటం చూసాడు. ఆ తినుబండారముల సువాసనలు అతనిని ఎంతో ఆకర్షించాయి. ఎలాగయినా వానిని తినాలి అనే ఆలోచనతో గుణనిధి కూడా వారితో పాటుగా శివాలయంలోనికి ప్రవేశించాడు.  వారంతా వారు తెచ్చిన తినుబండారములను శివునకు నివేదించి, సందర్భానుసారంగా నృత్యగానములను ఆస్వాదించి అక్కడే పడుకుండిపోయారు.  వారి పూజలు అయ్యేంతవరకు గుణనిధి అక్కడే నక్కి కూర్చున్నాడు.అలావారంతా నిద్రపోయిన తరువాత గుణనిధి మెల్లిగా గర్భగుడిలోని ప్రవేశించాడు. అతనికి విపరీతమయిన ఆకలి కారణంగా కన్నులు సరిగా కనిపించలేదు. కనుక అక్కడ ఉన్న దీపములో తన ఉత్తరీయమును చించి ఒక వత్తి లా చేసి పెట్టి, దానిని వెలిగించాడు. ఆ తినుబండారాలు అన్ని మూటగట్టుకుని బయటకు రాబోతుండగా అక్కడ పడుకున్న భక్తులలో ఒకరికి మెలకువ వచ్చి దొంగా దొంగా  అని అరిచారు. ఆ అరుపులకు రక్షకభటులు వచ్చారు. అతని చేతిలోని తినుబండారాలు చూసి అతని దొంగ అని నిర్ణయించుకుని కొట్టారు. ఒక్క దెబ్బ పడగానే గుణనిధి ప్రాణములు వదిలేసాడు.  

కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి