28, జూన్ 2020, ఆదివారం

శరీరమును వదిలిన పితృదేవతలకోసం మనమెందుకు పిండ దానమును చేయాలి?

మనం ఇంతకు ముందు పితృదేవతల గురించి చెప్పుకున్నాం కదా! వారిలో మూర్త గణములు, అమూర్తగణముల గురించి కూడా చెప్పుకున్నాం! వారికి అమావాస్యతిధికి గల సంబంధం గురించి కూడా చెప్పుకున్నాం!!
మరి ఇంతకీ మానవులుగా జన్మించిన మనం పితృ కార్యములు ఎందుకు చెయ్యాలి? శరీరమును వదిలి వెళ్లినవారు మనం చేసే పిండ దానమును ఎలా స్వీకరిస్తారు?
ఈ ప్రశ్నను కరంధముడు స్వయంగా మహాకాళుని అడిగాడు. ఆ సంఘటన గురించి స్కందపురాణంలో చెప్పారు.
ఆ ప్రశ్నకు సమాధానంగా మహాకాళుడు ఈ విధంగా సమాధానం చెప్పాడు.
భౌతిక దేహమును వదలి, పితృగణములుగా మారినవారు, మనం నివేదించే పిండములు, తర్పణములు మొదలగు వానిని తిన్నగా తీసుకోక పోయినా వానిలోని సారమును గ్రహించగలరు.
వారికి సమయం , దూరము మొదలగు ప్రతిబంధకములు ఉండవు. 
తరువాత కరందముడు మహాకాళుని మరొక ప్రశ్న అడిగాడు.
ప్రశ్న: శరీరమును వదలి ఒక ఆత్మ వెళుతున్నప్పుడు అది కర్మలతో కట్టబడి ఉంటుంది కదా! మరి అలా బంధించి ఉన్నవారు కూడా మనకు దీవెనలు ఎలా ఇస్తారు? వారిని తృప్తి పరిస్తే మనకు కలిగే లాభం ఏమిటి?
మహాకాళుని సమాధానం: శరీరమును వదలిన పితరులు అందరూ వారి కర్మలకు బందీలుగా ఉండరు.
దేవతలు, అసురులు, మరియు యక్షులకు సంబందించిన పితరులు అమూర్త పితరులు. అలాగే భూమిమీద ఉన్న ప్రజలకు సంబందించిన పితరులు మూర్తపితరులు. ఈ ఏడూ రకముల పితరులను శాశ్వత పితరులుగా పరిగణిస్తాం.  అటువంటి గణములు కర్మ సిద్ధాంతములను కూడా అధిగమించి ఉంటాయి. ఈ ఏడు పితృగణములకు లోబడి  31 గణములు ఉంటాయి. మానవులుగా మనం అర్పించే పిండములు, తర్పణములు ఆ ఏడు శాశ్వతమయిన పితరులకు చెందుతాయి. మనకు ఆశీర్వాదములను ఇచ్చేది ఆ ఏడు పితృ గణములే. 

కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి