1, ఆగస్టు 2014, శుక్రవారం

కోదండ రామాలయం-చుంచున్ కట్టే

ఈ రామాలయం ఎంతో విశిష్టమైనది.

అక్కడి స్థలపురాణం ప్రకారం సీతారామలక్ష్మణులు అరణ్యవాసం చేస్తున్న సమయం లో వారు అనేక ప్రదేశములు తిరుగుతూ ఈ ప్రాంతానికి వచ్చారు. అక్కడి సహజ సంపదను, ముగ్ధమనోహరమైన ప్రకృతి సౌందర్యాలను చూసి కొన్ని రోజులు అక్కడే ఉండాలి అని నిర్ణయించుకున్నారు. ఐతే నివసించుటకు నీరు అవసరం కనుక రామచంద్ర ప్రభువు లక్ష్మణునికి ఆ భాద్యతను అప్పగించారు. లక్ష్మణుడు తన బాణాన్ని ఒక రాతి మీద ప్రయోగించగా అక్కడ అధ్బుతమైన జలధార ఉద్భవించినది. సీతాదేవి ఆ నీటిలో స్నానం చేసింది అని ఆమె తనశరీరనికి అలదుకున్న కుంకుమ కూడా లక్ష్మణ స్వామి బ్రద్దలు చేసిన రాతిలో నుండే వచ్చింది అని చెప్తారు.
సీతారాములు నిద్రకు ఉపక్రమించే సమయంలో అతి సుకుమారి ఐన సీతమ్మకు ఆ జల ప్రవాహ శబ్దం ఇబ్బందికరంగా ఉండేది. ఆమె రామునికి చెప్పగా అప్పుడు వారు నిదురిస్తున్న ఆ ప్రాంతానికి ఆ శబ్దం వినిపించదు అని తీర్మానం చేసారు. (వారు నిదురించిన స్థలమే ఇప్పుడు గర్భాలయం.  గుడి ఆవరణలో, పరిసర ప్రాంతాలలో నీటి ఒరవడి చక్కగా వినిపిస్తుంది కాని గర్భగుడి వద్ద వినిపించదు. గుడి నదీ ప్రవాహానికి కేవలం కొద్ది అడుగుల దూరంలో ఉంటుంది).
కొంతకాలానికి అక్కడకి ఒక ముని వచ్చారని, అతని ధర్మనిష్టను చూసి సంతోషించిన రామచంద్రుడు వరం కోరుకోమని అడుగగా అతనే రామచంద్రుడికి కుడివైపున సీతాదేవిని  ఉంచుకోమని, అలా అక్కడ వెలసి తనతో పూజలు అందుకోమని కోరాడు కనుక అక్కడ సీతారాములు ఆవిధంగా వెలిశారు అని అక్కడి స్థల పురాణం.
ఐతే సీతారాములకు చుంచ, చుంచి అనే చెంచు దంపతులు  ఆతిద్యం ఇచ్చారు కనుక ఈ ప్రాంతానికి చుంచున్ కట్టే అని పేరువచ్చింది అనికూడా స్థల పురాణం చెప్తున్నది.

విశేషములు: 

  1. సీతాదేవి రామచంద్రునికి కుడివైపున ఉంటుంది 
  2. గుడి పక్కనే నది ప్రవహిస్తున్నా గర్భగుడిలోకి కొంచెం కుడా నీటి శబ్దం వినిపించదు 

ఎలా చేరుకోవచ్చు:


చుంచున్ కట్టే కర్నాటక రాష్ట్రంలో మైసూరు జిల్లలో ఉంది. మైసూరు నుండి 57 కిలోమీటర్ల దూరo లో ఉంది. ప్రతిరోజూ మైసూరు నుండి చుంచున్ కట్టే కు బస్సు సదుపాయము కలదు. 

కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి