దీనికి సమాధానం మనకు రామాయణంలో ఉత్తరకాండలో చెప్పారు.
బ్రహ్మ తాను సృష్టి మొదలుపెట్టిన సమయంలో మొట్ట మొదటగా ఉన్న జలంలో కొన్ని ప్రాణులను సృష్టించాడు. ఆలా పుట్టిన వారు బ్రహ్మను ఏమి చెయ్యాలి అని అడిగారు. అప్పుడు బ్రహ్మ వారిని ఆ జలమును రక్షించమని చెప్పాడు. వారిలో కొందరు "రక్షామ" అని కొందరు "యక్షామ" అని అన్నారు. రక్షామ అన్నవారిని రాక్షసులు అని, యక్షామ అన్నవారిని యక్షులు అని పేరుపెట్టారు.
రాక్షసులకు హేతి, ప్రహేతి అనే ఇద్దరు నాయకులు ఉన్నారు. వారిలో ప్రహేతి పరం ధర్మాత్ముడు. అతను గృహస్థధర్మమును స్వీకరించటానికి యముకుని చెల్లి అయిన భయ ను వివాహం చేసుకున్నాడు. వీరికి విద్యుత్కేశుడు అనే కుమారుడు కలిగాడు.
ఆ విద్యుత్కేశునికి యుక్త వయస్సు రాగానే అతనికి సంధ్యపుత్రికని ఇచ్చి వివాహం చేశారు. ఆమె కొంతకాలమునకు గర్భం ధరించింది. అయితే గర్భంధరించి ఉన్న ఆమె తన భర్తతో కొంతకాలం సుఖంగా గడపాలి అని కోరుకున్నది. ఆలా జరగటానికి అడ్డంగా ఉన్న నెలలు నిండని గర్భమును స్రావం చేసుకుని అక్కడి నుండి తన భర్త వద్దకు వెళ్ళిపోయింది.
అయితే బయటకు వచ్చిన నవజాత శిశువు ఏడుపు మొదలు పెట్టాడు. అదే సమయమునకు అటువైపుగా వెళుతున్న పార్వతీ పరమేశ్వరులు ఆ బిడ్డను చూసి, జాలి పడ్డారు. వారి జాలి చూపులు సోకిన ఆ బిడ్డ అప్పటికి అప్పుడే యుక్తవయస్కుడు అయ్యాడు.
అప్పుడు పార్వతీదేవి రాక్షస స్త్రీలకు ఒక వరం ఇచ్చింది. ఆ వరం ప్రకారం రాక్షస స్త్రీలు గర్బంధరించిన వెంటనే ప్రసవిస్తారు, ప్రసవించిన బిడ్డలు కూడా వెంటనే పెద్దవారు, తమ తల్లి వయస్సు కలిగినవారు అవుతారు.
అక్కడ ఉన్న శిశువు మీద ఆప్యాయత తో శివుడు అతను సుఖంగా నివసించటానికి వీలుగా ఒక గాలిలో ప్రయాణించే నగరమును నిర్మించి ఇచ్చాడు. ఆ రాక్షసుని పేరు సుకేశుడు.