2, మే 2020, శనివారం

వాలఖిల్యులు

బ్రహ్మాండ పురాణం మరియు భాగవతం ప్రకారం వాలఖిల్యులు నవబ్రహ్మలలో ఒకరయిన క్రతువు పుత్రులు. క్రతువు దేవహుతి, కర్ధముల పుత్రిక అయిన క్రియను వివాహం చేసుకున్నారు. ఈ క్రతువు మరియు క్రియలకు కలిగిన సంతానమే 60,000 మంది వాలఖిల్యులు.
వీరు బొటన వేలు పరిమాణంలో ఉండి నిరంతరం తపస్సులో ఉంటారు. వారి తపస్సు అత్యంత కఠినమయినది. వారు చెట్టు కొమ్మలకు తలక్రిందులుగా వ్రేళ్ళాడుతూ తపస్సు చేస్తారు.
వీరు తపస్యులు అయిన కారణంగా కశ్యప ప్రజాపతి పుత్రుల కోసం పుత్రకామేష్టి చేస్తున్నప్పుడు వీరిని ఆహ్వానించారు. ఆ ఇష్టి కి వెళ్లే వారు అందరూ  మోయగలిగినంత చెరువు (యాగం లో ఉపయోగించుటకు వీలు అయిన వస్తువులు, కర్రపుల్లలు వంటివి) తీసుకు రావటం పరిపాటి కనుక వీరు తాము మోయగలిగిన గడ్డి పరకలు తీసుకు వచ్చారు.
వారిని చూసి ఆ సమయంలో అక్కడ ఉన్న ఇంద్రుడు వెక్కిరింతగా నవ్వాడు. అలా నవ్విన ఇంద్రుని చుసిన వాలఖిల్యులు అత్యంత బలవంతుడు, అనితర సాధ్యుడు ఈ ఇంద్రుని కంటే వంద రెట్లు బలం కలిగిన వాడు అయిన మరో ఇంద్రుడు ఈ యాగ ఫలముగా పుట్టుగాక అని అన్నారు. అంటే వారి కోపము కూడా ఇతరులకు (ఇక్కడ కశ్యపునకు) మేలు చేసింది. ఇలా వాలఖిల్యులు చెప్పటం విన్న ఇంద్రుడు కశ్యపుని వద్దకు వెళ్లి జరిగింది చెప్పాడు. ఆ మాటలు విన్న కశ్యపుడు ఇది వరకు బ్రహ్మచే నియమించబడిన ఇంద్రుని కాదనుట సరి కాదు అని, తనకు కలగబోయే సంతానం పక్షి గా, ఆ పక్షులలో ఇంద్రునిగా ఉంటుంది అని వాలఖిల్యులను కోరాడు. దానికి అత్యంత దయగలిగిన వాలఖిల్యులు  ఒప్పుకున్నారు.
ఆ పుత్ర కామేష్టి కారణం గా కశ్యపునకు గరుడుడు జన్మించాడు. ఆ గరుడునకు పక్ష్మీంద్రుడు అనే పేరు కూడా ఉన్నది.
తరువాతి కాలంలో తన తల్లి దాస్య విముక్తి కోసం ప్రయత్నిస్తున్న గరుడుడు ఆకలి తీర్చుకోవటం కోసం తండ్రి ఆదేశం మేరకు గజమును, తాబేలును తినటానికి ప్రయత్నం చేసినప్పుడు విరిగిన రోహిణము అనే వృక్ష కొమ్మకు తల క్రిందులుగా వ్రేళ్ళాడుతూ తప్పస్సు చేసిన వారు వీరే.  

1 కామెంట్‌: