22, ఏప్రిల్ 2020, బుధవారం

అష్టభోగములు

మనం ఇంతకు ముందు అష్ట కష్టముల గురించి చెప్పుకున్నాం!మరి ఇప్పుడు అష్టభోగములు అంటే ఏమిటో చెప్పుకుందామా! ఆ అష్టభోగముల గురించి చెప్పే శ్లోకం

దాసో భృత్యస్సుతో బంధుర్వస్తు వాహన మేవచ
ధనధాన్యసమృద్ధిశ్చాప్యష్టభోగాః ప్రకీర్తితాః 


భావం:: దాసులు, భృత్యులు, కుమారులు, బంధువులు, కావలసిన సకల వస్తువులు, వాహనములు, సరిపోయినంత ధనము, ధాన్యము కలిగి ఉండటాన్ని అష్టభోగములు కలిగి ఉండుట అని చెప్తారు.

దాసులు అంటే ధనమును తీసుకుని సేవలు చేసేవారు, భృత్యులు అంటే మనమీది గౌరవముతోలేదా అభిమానంతో మన కోసం పనులు చేసేవారు, పున్నామ నరకము నుండి తప్పించేవాడు కనుక కుమారుడు, ఏదయినా అవసరమునకు ఆడుకోవటానికి బంధువులు, వస్తువులు, వాహనములు, మనం తినటానికి దానం చేయటానికి వీలుగా ధనము ధాన్యము ఇన్ని ఉన్నవానికి ఇంకా ఏమి కావాలి? కనుకనే ఇవి అన్ని కలిపి అష్టభోగములు అంటారు.

20, ఏప్రిల్ 2020, సోమవారం

అజ్ఞాన భూమిక

అజ్ఞాన భూమిక అంటే మనలో అజ్ఞానము స్థిరముగా ఉండటానికి కారణములు అని అర్ధము.  ఆ అజ్ఞాన భూమికలు ఏడు ఉన్నాయి. వీని గురించి  శ్రీసీతారామాంజనేయ సంవాదం అనే గ్రంధంలో చెప్పారు. అవి ఏమిటో ఇప్పుడు చూద్దాం!!


  1. బీజాగ్రము:: నామ రూప రహిత,  అఖండ  పరిపూర్ణ స్చచిదానంద పరబ్రహ్మమందు జగత్తు ని సృషించాలి అనే ఆలోచన  బీజాగ్రము
  2. జాగ్రము::  ఆ ఆలోచన కలుగుటకు ముందులేని బేధము/ మార్ఫు చిన్నగా మొదలయ్యి అది ప్రపంచముగా మార్ఫు  చెందుట జాగ్రము
  3. మహాజాగ్రము:: ప్రపంచము లో  వచ్చిన అనేకములయిన మార్పులకు అనుగుణముగా మారుట మహాజాగ్రము
  4. జాగ్రత్స్వప్నము:: జాగ్రదవస్థ లో కనిపించని వానిని ఉహించి, మనస్సులో దానిని గురించి ధ్యానము చేయుట జాగ్రత్స్వప్నము. (పగటి కలలు)
  5. స్వప్నము:: జాగ్రదవస్థలో లేనప్పుడు కల్పితమయిన రూపములు చూచుట ఆజాగ్రమందు కల్పిత స్వరూపములు చూచుట స్వప్నము
  6. స్వప్నజాగ్రము:: ఇంతకు  ముందు జరిగినదానిని మరల మరలా గుర్తుకు తెచ్చుకోవటం స్వప్నజాగ్రము
  7. సుషుప్తి:: ఆత్మ ప్రతిబింబముగా అనిపిస్తున్న జగత్తుకు సంబందించిన విషయములలో మునుగుట సుషుప్తి




18, ఏప్రిల్ 2020, శనివారం

సర్పవరం- శ్రీనాధుడు

మనం ఇంతకు ముందు సర్పవరం లోని భావనారాయణ దేవాలయం గురించి, అక్కడ ఉన్న నారద కుండం, ముక్తి కుండం గురించి  చెప్పుకున్నాం కదా! అదే సర్పవరం లోని భావనారాయణుని గురించి చెప్తూ ఆ ఉరి గురించి మహాకవిసార్వభౌముడు శ్రీనాధుడు తన భీమఖండం లో ఏమని వర్ణించారో చూద్దామా !!

శ్రీ సుదర్శన శంఖ చిహ్నాంకితముగాక యెప్పుడు మిన్నకయున్న యిల్లు లేదు
బహులోర్ధ్వపుండ్ర సంపదలేక వృధయైన ఫాలలేఖల తోడి ప్రజయు లేదు
వైష్ణవోత్తమ భాగవతసాత్త్వికుల గోష్ఠి వెలియైనవాటికా వేది లేదు
నాలీనేక్షణుడు భావనారాయణ స్వామి దప్పించి పరదైవతంబు లేదు

భావం :  సర్పవరంలో శ్రీ మహావిష్ణు సంబంధమయిన శంఖం చక్రం గుర్తులు లేని ఇల్లు లేదు, చక్కగా పెద్దవిగా ఊర్ధ్వపుండ్రములు (నిలువు బొట్టు) చక్కగా పెట్టుకోకుండా వృథాగా ఉన్న నుదిటితో ఉన్న ప్రజలు లేరు, మంచి మంచి వైష్ణవ భాగవతోత్తముల గోష్ఠి జరుగని అరుగు లేదు, భావనారాయణుడు తప్ప మరో దైవము లేడు.







16, ఏప్రిల్ 2020, గురువారం

యమధర్మ రాజు - విదురుడు?

మనం ఇంతకు ముందు మహాభారతంలోని అనేక వ్యక్తులు ఏ ఏ అంశలతో జన్మించారో చెప్పుకున్నాం కదా! ఆ క్రమం లో యమధర్మ రాజు అంశతో  విదురుడు జన్మించాడు అని చెప్పాం  కదా! అలా యమలోక పాలకుడు అయిన యముడు మానవునిగా, అందులోనూ రాజ్యాధికారం లేని విధంగా ఒక శూద్రునిగా ఎందుకు జన్మించాడు? అని ఇప్పుడు తెలుసుకుందాం!
    ఈ సంఘటనకు మూలం మాండవ్యుడు అనే ఒక మహర్షి. ఈ కధ మనకు మహాభారతంలోని ఆదిపర్వం లో కనిపిస్తుంది.

మాండవ్యుడు అనే మహర్షి ఒంటరిగా అనేక తీర్ధయాత్రలు చేస్తూ చివరకు ఒక నగరముదగ్గరలో ఒక ఆశ్రమము నిర్మించుకుని మౌనదీక్షలో కాలం గడుపుతూ రెండుచేతులూ పైకి ఎత్తి తప్పస్సు చేసుకుంటున్న సమయంలో, ఆ నగరంలో దొంగతనం చేసిన ఇద్దరు దొంగలు, వారిని తరుముకుంటూ వచ్చిన రక్షకభటులు ఆ ఆశ్రమంలోనికి వచ్చారు. ఎవరికీ కనిపించకుండా దొంగలు దాక్కున్నారు. ఆ వచ్చిన రక్షకభటులు తపస్సులో ఉన్న మహర్షిని దింగల గురించి అడిగారు. కానీ మౌనదీక్షలో ఉన్న మహర్షి సమాధానం చెప్పకపోవడంతో వారే ఆశ్రమం లోనికి వెళ్లి దొంగలను పట్టుకుని, ఆ దొంగలకు ఆశ్రయం ఇచ్చారు అన్న నేరంతో మహర్షిని కూడా రాజు వద్దకు తీసుకువెళ్లారు. రాజుగారు దొంగలకు సరిఅయిన శిక్ష విధించి, వారిని కాపాడటానికి ప్రయత్నించారు అనే నేరమునకు గాను మహర్షికి శూలదండన విధించారు. అంటే ఒక పదునయిన శూలం మీద కూర్చోబెట్టారు.
అలా శిక్షను అనుభవిస్తున్న సమయంలో అతని వద్దకు కొందరు మహర్షులు పక్షులరూపంలో వచ్చి ఇలా మాండవ్య మహర్షికి ఇలా జరగటానికి కారణం ఏమిటి అని అడుగగా, మాండవ్యముని చేసిన కర్మలకు ఫలితాలు అవే వస్తాయి అని సమాధానం చెప్పారు. ఆ మాటలు విన్న కొందరు రక్షక భటులు రాజుగారికి సమాచారం ఇవ్వగా రాజుగారు మాండవ్య మహర్షి వద్దకు వచ్చి క్షమాపణ అడిగి ఆ శూలదండన శిక్షను రద్దు చేశారు. కానీ అప్పటికే శూలం పూర్తిగా గొంతువరకు దిగబడి ఉంది. కనుక ఆ శూలంను బయటకు తెచ్చే ప్రయత్నం మానేసి ఆ శూలంను అతని శరీరంలోనే విరిచేసారు. తరువాత కొంతకాలానికి మాండవ్య మహర్షి చనిపోయారు.
 అతను అప్పుడు యముడిని కలిసి, ఇంత భయంకరమయిన శిక్ష అతనికి లభించటానికి కారణం అడిగారు. అప్పుడు యముడు మాండవ్యమహర్షి చిన్నతనంలో తూనీగలతో ఆడుతూ వాటికి కష్టం కలిగించుట వలన ఈ శిక్ష లభించింది అని చెప్పారు. కానీ చిన్నతనంలో తెలిసి తెలియక చేసిన చిన్న తప్పుకోసం ఇంట పెద్ద శిక్ష వేయటం అధర్మం, ధర్మారాజుగా పిలువబడే యముడే ఇటువంటి తప్పు చేయుట వల్ల మాండవ్యమహర్షి అతనిని శపించారు.
ఆ శాపమే ధర్మ జ్ఞానం కలిగి ఉండి అందరికీ ధర్మమును భోదించుట, ఉత్తమ వీర్య సంజాతుడు అయినా రాజ్యార్హత లేదు.  మళ్ళీ మళ్లీ ఇతని ధర్మబోధ విన్న తర్వాత కూడా ధృతరాష్ట్రుడు సన్మార్గంలోకి రాలేదు. 

13, ఏప్రిల్ 2020, సోమవారం

మహాభారతం - అంశలు

మహాభారతం గురించి ఇంతకు ముందు మనం చాలా విషయాలు చెప్పుకున్నాం కదా! ఇప్పుడు ఆ మహాభారతంలో ఉన్న అనేకమంది వ్యక్తులు ఎవరు ఎవరి అంశలో  పుట్టారో ఇప్పుడు చూద్దాం!

శ్రీ మహావిష్ణువు - శ్రీకృష్ణుడు
ఆదిశేషుడు - బలరాముడు
లక్ష్మి - రుక్మిణి
సనత్కుమారుడు - ప్రద్యుమ్నుడు
అప్సరసలు - 16 వేల మంది శ్రీకృష్ణుని అంతఃపుర స్త్రీలు
ప్రభాసుడు (ఎనిమిదవ మనువు) - దేవవ్రతుడు (భీష్ముడు)
దేవగురువు (బృహస్పతి) - ద్రోణుడు
కామము + క్రోధము - అశ్వద్ధామ
ఏకాదశ రుద్రులు - కృపుడు
సూర్యుడు - కర్ణుడు
ద్వాపరం - శకుని
అరిష్టా పుత్రుడయిన హంసుడు (గంధర్వ) - ధృతరాష్ట్రుడు
మతి  - గాంధారి
కలి - దుర్యోధనుడు
హిరణ్య కశిపుడు - శిశుపాలుడు
సంహ్లాదుడు - శల్యుడు
అనుహ్లాదుండు - దృష్టకేతుడు
శిబి - దుమ్రసేనుడు
భాష్కలుడు - భగదత్తుడు
విప్రచిత్తి - జరాసంధుడు
స్వర్భాను - ఉగ్రసేనుడు
జంబుండు - విశోకుడు
అశ్వపతి - కృతవర్మ
వృషపర్వుడు - దీర్ఘ ప్రజ్ఞుడు
అజరుడు - మల్లుడు
అశ్వగ్రీవుడు - రోచమానుడు
సూక్ష్ముడు - బృహద్రధుడు
దుహుడు - సేనాబిందుడు
ఏక చక్రుడు - ప్రతివింద్యుడు
విరుపాక్షుడు - చిత్రవర్మ
హరుడు - సుబాహు
ఆహరుడు - బాహ్లికుడు
చంద్రవక్త్రుడు - ముంజకేశుడు
నికుంభుడు - దేవాపి
శరభుడు - సోమదత్తుడు
చంద్రుడు - చంద్రవర్మ
అర్కుడు - ఋషికుడు
మయూరుడు - విశ్వుండు
సుపర్ణుడు  - క్రోధకీర్తి
రాహువు - క్రోధుడు
చంద్రహంత - శునకుడు
అశ్వుడు - అశోకుడు
భద్రహస్తుడు - నందుడు
దీర్ఘజిహ్వుడు - కాశీరాజు
చంద్రవినాశనుడు - జానకి
బలీనుడు - పౌండ్ర
వృత్రుడు - మణిమంతుడు
కాలనేమి - కంసుడు
గుహ్యకుడు - శిఖండి
మరుత్గణము - పాండురాజు
మరుత్తులు - ద్రుపదుడు, సాత్యకి, విరాటుడు
మాండవ్య ముని శాపం వలన యమ ధర్మరాజు - విదురుడు
సిద్ధి - కుంతి
బుద్ధి - మాద్రి
యముడు - ధర్మరాజు
వాయువు - భీముడు
ఇంద్రుడు - అర్జునుడు
అశ్వినీ దేవతలు - నకుల సహదేవులు
స్వర్గ లక్ష్మి - ద్రౌపది
అగ్ని - దృష్టద్యుమ్నుడు 

11, ఏప్రిల్ 2020, శనివారం

అనగనగానే ఎందుకు?

మొన్న ఆ మధ్య ఒక మిత్రుడు ఈ ప్రశ్న వేసాడు. మన తెలుగు కధలు అన్నీ  అనగనగా అనే ఎందుకు మొదలవుతాయి అని?
నాకు కూడా ముందుగా తెలియలేదు కానీ ఆలోచిస్తే ఒక సమాధానం దొరికింది. ఈ సమాధానం మీకుకూడా సమంజసంగా ఉంటుందేమో చూద్దామా!

ఈ మధ్య సినిమాలు, సీరియళ్లు చూస్తున్నప్పుడు వానికి ముందు "DISCLAIMER" అని ఒకటి వేస్తున్నారు కదా! అంటే ఈ సినిమాలోని పాత్రలు కేవలం కల్పితం ఎవరినీ  ఉద్దేశించినవి కావు అని, అలాగే మన అనగనగా కూడా ఒక "DISCLAIMER" అని నా ఉద్దేశం. 

అంటే ఈ కధ నేను చెప్పటంలేదు, నాతో ఎవరో అన్నారు, వారితో ఇంకెవరో అన్నారు, ఇలా అందరూ  అనగనగా ఆ కధ నేను మీకు చెప్తున్నాను అని అయ్యి ఉంటుంది అని నా భావన. 

ఒకవేళ మీకు ఎలా కాకుండా ఇంక  ఏమయినా సమాధానం తెలిస్తే దయచేసి చెప్పగలరు!

10, ఏప్రిల్ 2020, శుక్రవారం

గతకాలము మేలు వచ్ఛుకాలము కంటెన్

 ఈ మాట మనకు సహజంగా పెద్దల నోట వినిపిస్తూ ఉంటుంది. ఈ రోజుల కంటే ఇంతకూ ముందు ఉన్న మారోజులే బాగుండేవి అని చెప్పే సందర్భంలో ఈ పద్య పాదమును వాడుతూ ఉంటారు. అయితే ఈ పద్య పాదం ఎక్కడిది?

ఈ పద్యపాదం నన్నయ ఆంధ్రీకరించిన మహా భారతంలోని ఆది పర్వంలోనిది. ఆది పర్వం పంచమాశ్వాసం లో 159వ  ఆ పద్యం మీకోసం 


మతిఁ దలఁపఁగ సంసారం 
బతి చంచల మెండమావులట్టుల సంప 
త్ప్రతతు లతిక్షణి కంబులు 
గతకాలము మేలు వచ్ఛుకాలము కంటెన్ 

ఈ పద్యము సాక్షాతూ వ్యాసుడు తన తల్లి సత్యవతి తో మాట్లాడుతున్న సందర్భం లోనిది. ఆమెను ఇక వానప్రస్థము స్వీకరించమని చెప్తున్న సందర్భంలోనిది. కానీ ఈ పద్య భావం మనకు అన్ని సందర్భాలలోనూ అన్వయించుకోవటానికి అనువుగా ఉంటుంది. 

భావం:  మనస్సులో అలోచించి చూస్తే ఈ సంసారం ఎండమావుల వలే చాలా చంచలమైనది. సంపదలు ఎంతో కాలం నిలువవు. కావున రాబోయే రోజులకంటే ఎల్లప్పుడూ గడచిన రోజులే మేలు. 

1, ఏప్రిల్ 2020, బుధవారం

లంక ఎవరిది?

రామాయణం  ప్రకారం లంకాధిపతి రావణుడు. అతని కంటే ముందు అది ధనాధీశుడు అయిన కుబేరుని ఆధీనంలో ఉండేది. అయితే లంక రక్షా జాతికి సంబందించినది అని కూడా చెప్తారు. మరి ఇంతకీ లంక అని పిలువబడే సువర్ణలంక ఎవరిది?

ఈ ప్రశ్న కు సమాధానం మనకు రామాయణంలోని ఉత్తరకాండ లో దొరుకుతుంది.
ఈ నగరాన్ని సువర్ణ మయంగా నిర్మించిన వాడు దేవతల శిల్పి విశ్వకర్మ. త్రికూటా చల పర్వతం మీద ఇటువంటి ఒక నగరమును నిర్మించమని కోరినవాడు స్వయానా ఇంద్రుడు. కాలాంతరమున ఇంద్రుడు ఆ విషయమును మరచిపోయాడు.
తరువాతి కాలంలో దేవతలమీద యుద్ధం జయించిన తరువాత రాక్షసులయిన మాల్యవంతుడు, మాలి , సుమాలి లు తమ కోసం నివాసయోగ్యమయిన స్థలమును చూపించమని విశ్వకర్మను అడుగగా వారికి త్రికూటాచల శిఖరాలపై నిర్మించిన లంకను అతను చూపించాడు. ఆ తరువాతి కాలంలో విష్ణు భయం చేత రాక్షసులు లంకను వదలి పాతాళం లో దాక్కున్నారు.  అలా లంక తిరిగి అనాధ అయ్యింది.
తరువాత కొంత కాలానికి విశ్రవసుడు తన పుత్రుడయిన  వైశ్రవునకు  ఆ లంకను నివాస భూమిగా నియమించాడు. అలా ఆ లంక కొంతకాలం యక్షులకు నిలయం అయ్యింది.
ఆ తరువాత అదే విశ్రవసుని పుత్రుడయిన దశకంఠుడు దానిని స్వాధీనం చేసుకున్నాడు. అలా మరలా లంక రాక్షసుల నిలయం అయ్యింది.  

31, మార్చి 2020, మంగళవారం

పులస్త్యుడు - విశ్రవసుడు

మనం ఇంతకు ముందు ఒక పురాణమునకు మరొక పురాణమునకు భేదములు ఉండటానికి కారణం అవి జరిగిన కల్పములే కారణం అని చెప్పుకున్నాం కదా!
ఇప్పుడు అటువంటిదే మరొక సంఘటన గురించి తెలుసుకుందాం!
భాగవతం ప్రకారం నవబ్రహ్మలలో ఒకరయిన పులస్త్యుని భార్య హవిర్భువు అని, ఆమె స్వయంగా కర్దమ ప్రజాపతి మరియు దేవహూతి లకు కలిగిన తొమ్మిది మంది కుమార్తె లలో ఒకటి అని చెప్పుకున్నాం!

కానీ వాల్మీకి రచించిన రామాయణం ప్రకారం పులస్త్యుని భార్య తృణబిందుని పుత్రిక.
రామాయణం ప్రకారం:
పులస్త్యుడు మేరు పర్వత ప్రాంతంలో తృణబిందు అనే ఆశ్రమ సమీపంలో నివసిస్తూ, తపస్సు చేసుకుంటూ ఉండేవాడు. ఆ ఆశ్రమ సమీపంలో ఉన్న వనంలో ఎప్పుడూ వసంతకాలంలా ఉండేది. ఆ ప్రకృతిని ఆస్వాదించటానికి వచ్చినవారు అక్కడ చేసే కోలాహలమునకు ఇతని తపస్సు భంగం అవుతూ ఉండేది. అలా కొంతకాలం భరించిన అతనికి సహనం నశించి ఆ స్థలమునకు వచ్చి ఎవరయినా అతని కంట పడితే ఆ స్త్రీ గర్భం ధరిస్తుంది అని శపించాడు. ఇతని శాపము తెలియని తృణబిందుని కుమార్తె ఒకసారి అలా వనంలో విహరిస్తూ ఇతని కంట పడింది. అప్పటి నుండి ఆమె శరీరంలో గర్భసూచనలు కనిపించసాగాయి.
ఈ విషయం తెలుసుకున్న తృణబిందు తన కుమార్తెను తీసుకుని పులస్త్యుని వద్దకు వచ్చి, తన కుమార్తెను అతనికి దానం చేసాడు. అలా గర్భం దాల్చిన ఆమెను పులస్త్యుడు వివాహం చేసుకున్నాడు.  గర్భం దాల్చిన ఆమె ఆ ఆశ్రమ వాతావరణంలో కాలం గడుపుతూ, వారు చదివే శాస్త్రములు వేదములు వింటూ ఉన్నది కనుక ఆ పుట్టిన బిడ్డకు విశ్రవసుడు అని పేరు పెట్టారు.
ఈ విశ్రవసుడు కూడా తన తండ్రికి వలెనే అత్యంత నిష్టా గరిష్టుడు. ఇతని ధర్మాచరణమును గురించి తెలుసుకొనిన భరద్వాజుడు తన కుమార్తెను ఈ విశ్రవసునకు ఇచ్చి వివాహం చేశారు. తరువాత వీరికి ఒక పుత్ర సంతానం కలుగగా ఆ బాలునికి వీరు వైశ్రవణుడు అని పేరు పెట్టారు. అతనే కాలాంతరంలో ధనాధిపతి కుబేరుడు గా మనకు సుపరిచితుడు. 

29, మార్చి 2020, ఆదివారం

భారతమును మహాభారతం అని ఎందుకు పిలుస్తారు?

 మనకు 18 పురాణములు, 18 ఉప పురాణములు ఉన్నాయి. వానిలో దేనికి "మహా" అనే సంబోధన మనకు కనిపించదు. కానీ ఒక ఇతిహాసముగా చెప్పబడుతున్న భారతమునకు ఈ విధమయిన సంబోధన కనిపిస్తుంది. మరి ఆ భారతము మహా  భారతం అవటానికి కారణం ఏమి  అయ్యి ఉంటుంది?
దీనికి సమాధానం మనకు మహాభారత తత్వకథనం లో దొరుకుతుంది.

ఏకత శ్చతురో వేదా భారతం చైత దేకత:
పురాకిల సురై స్సర్వై స్సమేత్య తులయా ధృతం

చతుర్భ్య స్సరహాస్యేభ్యో వేదోభ్యో హ్యధికం యదా
తదాప్రభృతి లోకేస్మిన్ మహాభారత ముచ్యతే

మహత్త్వేచ గురుత్వేచ ధ్రియమణం యతో ధికం
మహత్త్వా ద్భారవ త్త్వా చ్చ మహా భారత ముచ్యతే

భావం :  దేవతలు నాలుగు వేదములను భారతమును పరిశీలించి ఏది వీనిలో ఉన్నతమయినది అని నిర్ణయించవలసి వచ్చి  నప్పుడు, 108 ఉపనిషత్తులు కలిగిన వేదముల కంటే అర్ధము, గుణముల వివరణము, శబ్దముల ఆధిక్యము అన్ని కలిగిన ఈ భారతమే గొప్పది అని నిర్ణయించారు. అందువల్లనే భారతమును మహాభారతం అని సంబోధించుట పరిపాటి అయినది.  

28, మార్చి 2020, శనివారం

నవ శక్తులు

శక్తులను గురించి చెప్తున్నప్పుడు మన పెద్దలు తొమ్మిది శక్తుల గురించి చెప్తారు.
ఆ తొమ్మిది శక్తుల గురించి ఇప్పుడు మనం తెలుసుకుందాం!!

  1. ఇచ్ఛాశక్తి 
  2. క్రియాశక్తి 
  3. ఉత్సాహశక్తి 
  4. ప్రభుత్వశక్తి 
  5. మంత్రశక్తి 
  6. సత్వశక్తి 
  7. రజశ్శక్తి
  8. తమోశక్తి 
  9. జ్ఞానశక్తి 




26, మార్చి 2020, గురువారం

శ్రీ మహ విష్ణువు బట్టలు పసుపు (పీతాంబరములు) గా ఎందుకు ఉంటాయి?

ఏదయినా విషయములు చెప్పే సమయంలో కవి ఎంతో సృజనాత్మకంగా, ఇంతకూ ముందు చెప్పినవారి కంటే భిన్నంగా చెప్పే ప్రయత్నం చేస్తాడు. అలాగే పైన మనం చెప్పుకున్న ఆ ప్రశ్నకు సమాధానం వికటకవి గా పేరు పొందిన తెనాలి రామకృష్ణుడు తను రచించిన పాండురంగమహత్యం లో చాలా చక్కగా చెప్పాడు.

అభినవాయాతి తనపుత్రు నజుని గాంచి
సంతసంబున నాభివేశంత జలజ
ముబ్బి వెలిగ్రాయు పుప్పొడి యొరపు నెరపు
హళది పుట్టంబు కటిసీమ నలదువాని

భావం : అప్పుడే వచ్చిన తన పుత్రుడు అయిన బ్రహ్మ ను చూసి, విష్ణుమూర్తి నాభిలోని కమలం ఉబ్బితబ్బిబ్బు అయినదట. అలా తబ్బిబ్బు అవుతున్నప్పుడు ఆ కమలంలోని పుప్పొడి రేణువులు బయటకు చింది శ్రీ మహావిష్ణువు పంచె మొత్తం పడినవట.

బ్రహ్మదేవుడు  విష్ణు నాభి కమలంలో నుండి జన్మించాడు. కనుక పుత్రుని చుసిన సమయంలో జనకులకు అనందం కలుగుట సహజం. అలా ఆనందంలో ఉన్న సమయంలో చేతిలోవి జారిపోవుట సహజం. కానీ ఆలా జరుగుట వలన శ్రీ మహావిష్ణువు పంచె పసుపుగా మారింది అని చెప్పటం కవి హృదయం.  అందునా వికటకవి కనుక ముందే ఉన్నదానికి ఇలా ఒక కారణం చెప్తున్నాడు. అలంకార శాస్త్రంలో దీనిని ఉత్ప్రేక్షాలంకారం అంటారు. 

24, మార్చి 2020, మంగళవారం

కవి

ఈ మధ్య కాలంలో కలం పట్టిన ప్రతివాడు కవిని అని చెప్పుకుంటున్నాడు. కానీ మన పెద్దలు చెప్పిన దాని ప్రకారం కవులు ఎన్ని రకాలు? ఆ విభజన ఏ విధంగా చేయవచ్చును అని తెలుసుకుందామా?
కవులను ఈ కింద చెప్పిన శ్లోకం ప్రకారం మూడు  రకాలుగా విభజించ వచ్చు



శాస్త్రకవిః కావ్యే రససంపదం విచ్చినత్తి
కావ్యకవిః శాస్త్రే తర్కకర్కశమప్యర్ధముక్తి
 వైచిత్ర్యేణ శ్లధయతి, ఉభయ కవి స్తూభయోరపి

వరీయాన్యదుభయత్ర పరంప్రవీణఃస్యాత్

పైన చెప్పిన శ్లోకం ప్రకారం కవులు మూడు రకములు.  వారు
శాస్త్ర కవి
కావ్య కవి
ఉభయ కవి


శాస్త్ర కవి : కావ్యములో రససంపదను చక్కగా వివరించగలవాడు
కావ్య కవి: శాస్త్రములలోని తర్కముల కి సంబందించిన కర్కశత్వమును విదిలి మ్రుదువుగ చెప్తారు
ఉభయ కవి: పైన చెప్పిన ఇద్దరు కవుల లక్షణములని కలిగి ఉంటారు 

4, ఆగస్టు 2019, ఆదివారం

నవగ్రహములు - మండలముల ఆకారములు

మనకు తొమ్మిది గ్రహములు ఉన్నాయి. ఆ నవ గ్రహములకు సంబందించిన నవరత్నముల గురించి ఇంతకు ముందు మనం  చెప్పుకున్నాం కదా ! ఇప్పుడు వాని మండలముల గురించి తెలుసుకుందాం! ఆ మండలములు  వివిధములయిన ఆకారములు కలిగి ఉంటాయి. ఆ ఆకారముల గురించి అగ్ని పురాణములో చాలా వివరించారు. అవి

  1. సూర్యుడు - గుండ్రనిది 
  2. చంద్రుడు - చతురస్ర ఆకారం 
  3. అంగారకుడు - త్రికోణము 
  4. బుధుడు - బాణాకారము 
  5. గురుడు - దీర్ఘ చతురస్రము 
  6. శుక్రుడు - పంచకోణము 
  7. శని - ధనురాకారం 
  8. రాహువు - చేట ఆకారం 
  9. కేతువు - జెండా ఆకారం 






7, జులై 2019, ఆదివారం

నవ రత్నములు - నవ గ్రహములు

మన శాస్త్రముల ప్రకారం మానవుని జీవత గమనము మొత్తం నవగ్రహముల గమనముపై ఆధారపడి ఉంటుంది. అయితే ఆ నవగ్రములకు ప్రతీకగా మన పెద్దలు నవరత్నములు చెప్పారు. ఆ గ్రహములకు సంబంధించిన ఆయా రత్నములు ధరించితే ఆయా గ్రహముల శాంతి దృష్టి కలుగుతుంది అని చెప్పారు. ఇప్పుడు ఏయే గ్రహములకు ఏ రత్నములు చెప్పారో చూద్దాం!


  1. సూర్యుడు - పద్మరాగం (కెంపు)
  2. చంద్రుడు - ముత్యము 
  3. అంగారకుడు - పగడము 
  4. బుధుడు - పచ్చ 
  5. గురుడు - పుష్యరాగం 
  6. శుక్రుడు - వజ్రము 
  7. శని - నీలము 
  8. రాహువు - గోమేధికము 
  9. కేతువు - వైడూర్యము  



27, జూన్ 2019, గురువారం

సుకాలినులు

సుకాలినులు అనే పితృ దేవతలు మూర్తగణములు.  వీరు ద్యులోకం పైన నక్షత్రకాంతిలో ప్రకాశించు జ్యోతిర్భాసి అనే లోకంలో నివసిస్తారు. వీరి తండ్రి గారు వశిష్ఠుడు. వీరిని శ్రాద్ధకాలంలో బ్రాహ్మణులు పూజిస్తారు. వీరి మానస పుత్రి పేరు గౌ:



25, జూన్ 2019, మంగళవారం

ఆజ్యపులు

ఆజ్యపులు అనే పితృగణములు మూర్తగణములు . వీరు పులహుని పుత్రులు కొందరు, కర్దమ ప్రజాపతి పుత్రులు కొందరు. వీరు నివసించు లోకము సర్వ కామనాలు చక్కగా తీర్చే కామదుఘాము అనే లోకము. వీరిని శ్రాధ సమయములో వైస్యులు పూజిస్తారు. వీరి మానస పుత్రిక పేరు విరజ. ఈమె నహుషునికి భార్య, మహారాజు యయాతి కి తల్లి. 



23, జూన్ 2019, ఆదివారం

హవిష్మంతులు

హవిష్మంతులు అనే పేరుగల పితృగణము మూర్తగణము. వీరి తండ్రి అంగీర: ప్రజాపతి. వీరు నివసించు లోకము సూర్యమండలములో గల మరీచి గర్భములు, అంటే లోపలవైపునకు కూడా కిరణములు కలవి అని అర్ధము కలిగిన లోకములు. వీరిని శ్రాద్ధములు జరిపించు క్షత్రియులు పూజిస్తారు. వీరి మానస పుత్రిక పేరు యశోద. 
ఆమె సూర్యవంశమునకు చెందిన అంశుమంతుడు అనే రాజునూ వివాహం చేసుకున్నది. వారికి జన్మించిన పుత్రుడు దిలీపుడు. దిలీపుని పుత్రుడు భగీరధుడు. సాక్షాత్తు ఆకాశగంగను భూమి మీదకు తెచ్చినది ఇతనే. 



21, జూన్ 2019, శుక్రవారం

సోమపులు

మనం ఇంతకు ముందు 7గురు పితృ దేవతల పేర్లు వారిలో ఆమూర్తగణముల గురించి తెలుసుకున్నాం కదా! ఇపుడు మూర్త గణముల గురించి తెలుసుకుందాం! వారిలో మొదటి గణము  సోమపులు.
వీరు స్వధాకారము నుండి జన్మించారు. వీరు బ్రహ్మ లోకములోని మానసములు అనే లోకములో నివసిస్తారు. వీరు అనంతమయిన యోగ సిద్ధి చేత బ్రహ్మత్వము పొందారు. వీరి పుత్రిక పేరు నర్మద, ఈమె సకల జలములకు ప్రతీక.
ఈ సోమపులు సకల పితృదేవతల కు ప్రతీకలు కనుకనే శ్రాద్ధము చేసే తప్పుడు స్వధాకారం చెప్తారు మరియు జలముల దగ్గర తర్పణములు చేస్తారు. 



19, జూన్ 2019, బుధవారం

బర్హిషదులు

ఈ పితృగణము అమూర్త గణము. వీరి తండ్రి పులస్త్యుడు.వీరు నివసించు లోకము  ధ్యు లోకంలోనే కాంతివంతములయిన మరికొన్ని లోకములు, విభ్రాజములు. 
వీరిని అసుర, దానవ , గంధర్వ, అప్సరస యక్షులు, ధ్యు లోకములోని దేవతలు అందరూ  ఆరాధిస్తారు. వీరి మానస పుత్రిక పేరు పీవరి. ఆమె యోగులకే యోగిని అనే చెప్తారు.