29, జూన్ 2020, సోమవారం

దశకంఠుడు నిజంగా అంత చెడ్డవాడా?

మనం ఇంతకూ ముందు రాక్షసుల గురించి, కైకసి కి విశ్రవసునివలన కలిగిన సంతానం గురించి తెలుసుకున్నాం కదా!అలాగే ఒక తల్లి తన పిల్లలతో మాట్లాడేటప్పుడు ఆమె అసూయను పిల్లల ముందు ప్రదర్శిస్తే, అది ఆ పిల్లల మనస్సు మీద ఎటువంటి ప్రభావం చూపిస్తుందో ఇప్పుడు మనం చూద్దాం!

ఒకరోజు లంకాధిపతిగా ఉన్న వైశ్రవణుడు తన పుష్పక విమానంలో తన తండ్రి, విశ్రవసుని కలవటానికి వచ్చాడు. అతనిని అక్కడ అంత  వైభోగం లో చూసిన కైకసికి అసూయ కలిగింది. ఆమె తన పెద్దకుమారుడు అయిన దశకంఠుని వద్దకు వెళ్లి, అతనిని కూడా అతని సోదరుని వలే గొప్పవానిగా ఉంటె చుడాలీని ఉన్నది అని కోరుకున్నది. అంటే కాక అతను అనుభవిస్తున్న స్వర్ణలంక నిజమునకు తమదే అని చెప్పింది. ఆ మాటలు విన్న దశకంఠునికి, తన సవతి సోదరుని మీద విపరీతమయిన అసూయ, ద్వేషములు కలిగాయి.
అప్పటివరకూ అతనికి తన సవతి సోదరుని మీద అంత కోపం, ద్వేషం ఉన్నట్లు ఎవ్వరు ఎక్కడా చెప్పలేదు. పిల్లలకు తమ తల్లి మాట  మంత్రం లా పని చేస్తుంది. తన తల్లి అలా అతనిని, తన సవతి సోదరునితో పోల్చి మాట్లాడటం, అతను అనుభవిస్తున్న సౌకర్యములు నిజానికి అతనికే సంబందించినవి అని చెప్పి బాధపడటం అతని మనస్సును తీవ్రంగా ప్రభావితం చేసింది. అది అతనిలో కోపం, అసూయ, ద్వేషం మొదలయిన వికారములకు కారణం అయ్యింది.
 ఎలా అయినా తల్లి కోరికను తాను తీర్చుతాను అని చెప్పాడు. ఆమె కోరికలు అన్ని సిద్దించాలి అంటే కేవలం తపస్సు ఒక్కటే మార్గం అని తెలుసుకున్న అతను తన తమ్ముళ్లను కూడా తన వెంట తీసుకుని గోకర్ణము నకు వెళ్లి అక్కడ బ్రహ్మదేవుని గురించి ఘోరమయిన తపస్సు చేశారు.
మరి ఆ తపస్సు ఏమయ్యింది? వారు ఏమి వారములు కోరుకున్నారు అని తరువాతి టపాలో చెప్పుకుందాం!

28, జూన్ 2020, ఆదివారం

శరీరమును వదిలిన పితృదేవతలకోసం మనమెందుకు పిండ దానమును చేయాలి?

మనం ఇంతకు ముందు పితృదేవతల గురించి చెప్పుకున్నాం కదా! వారిలో మూర్త గణములు, అమూర్తగణముల గురించి కూడా చెప్పుకున్నాం! వారికి అమావాస్యతిధికి గల సంబంధం గురించి కూడా చెప్పుకున్నాం!!
మరి ఇంతకీ మానవులుగా జన్మించిన మనం పితృ కార్యములు ఎందుకు చెయ్యాలి? శరీరమును వదిలి వెళ్లినవారు మనం చేసే పిండ దానమును ఎలా స్వీకరిస్తారు?
ఈ ప్రశ్నను కరంధముడు స్వయంగా మహాకాళుని అడిగాడు. ఆ సంఘటన గురించి స్కందపురాణంలో చెప్పారు.
ఆ ప్రశ్నకు సమాధానంగా మహాకాళుడు ఈ విధంగా సమాధానం చెప్పాడు.
భౌతిక దేహమును వదలి, పితృగణములుగా మారినవారు, మనం నివేదించే పిండములు, తర్పణములు మొదలగు వానిని తిన్నగా తీసుకోక పోయినా వానిలోని సారమును గ్రహించగలరు.
వారికి సమయం , దూరము మొదలగు ప్రతిబంధకములు ఉండవు. 
తరువాత కరందముడు మహాకాళుని మరొక ప్రశ్న అడిగాడు.
ప్రశ్న: శరీరమును వదలి ఒక ఆత్మ వెళుతున్నప్పుడు అది కర్మలతో కట్టబడి ఉంటుంది కదా! మరి అలా బంధించి ఉన్నవారు కూడా మనకు దీవెనలు ఎలా ఇస్తారు? వారిని తృప్తి పరిస్తే మనకు కలిగే లాభం ఏమిటి?
మహాకాళుని సమాధానం: శరీరమును వదలిన పితరులు అందరూ వారి కర్మలకు బందీలుగా ఉండరు.
దేవతలు, అసురులు, మరియు యక్షులకు సంబందించిన పితరులు అమూర్త పితరులు. అలాగే భూమిమీద ఉన్న ప్రజలకు సంబందించిన పితరులు మూర్తపితరులు. ఈ ఏడూ రకముల పితరులను శాశ్వత పితరులుగా పరిగణిస్తాం.  అటువంటి గణములు కర్మ సిద్ధాంతములను కూడా అధిగమించి ఉంటాయి. ఈ ఏడు పితృగణములకు లోబడి  31 గణములు ఉంటాయి. మానవులుగా మనం అర్పించే పిండములు, తర్పణములు ఆ ఏడు శాశ్వతమయిన పితరులకు చెందుతాయి. మనకు ఆశీర్వాదములను ఇచ్చేది ఆ ఏడు పితృ గణములే. 

27, జూన్ 2020, శనివారం

మంధర - పూర్వజన్మ

ఒకానొక కాలంలో విరోచనుడు అనే పేరు కల్గిన ఒక రాక్షసుడు ఉండేవాడు. అవ్వటానికి రాక్షసుడు అయినా బ్రాహ్మణత్వం పొంది, సకల సుకర్మలు చేస్తూ రాజుగా ఉన్నాడు. రాజుగా  దేవతలపై దండెత్తి వారిని ఓడించి దేవలోకమును స్వాధీన పరచుకున్నాడు. దేవలోకంనుండి పారిపోయిన దేవతలు వారి గురువు బృహస్పతి వద్దకు వెళ్లారు. వారి పరిస్థితిని తెలుసుకున్న బృహస్పతి, ఆ ఆపదకు నివారణ  ఉపాయం కేవలం అతనికి గల దానగుణమును ఉపయోగించుకొనుట మాత్రమే అని చెప్పాడు.
అతని మాటలు విన్న దేవతలు వెంటనే బ్రాహ్మణరూపములు ధరించి విరోచనుని వద్దకు వెళ్లారు. ఆలా తనవద్దకు వచ్చినవారు దేవతలు అని తెలిసి కూడా విరోచనుడు వారికి అతిధి సత్కారములు చేసి, ఏమి కావాలో కోరుకొమ్మని చెప్పాడు. అప్పుడు వారు విరోచనుని దేహమును ఇవ్వమని కోరారు. ఇంటికి వచ్చి అర్ధించిన అతిధులకు ఇవ్వటానికి పనికి రాకపోతే, అటువంటి శరీరం ఉన్న లేకపోయినా ఒకటే అని చెప్పి అతని శరీరమును వారికి ఇచ్చివేసాడు.
అప్పుడు రాక్షసులు ఆనాధలు అవ్వటం వలన  కోలాహలం చెలరేగింది. ఆ కోలాహలమునకు విరోచనుని కుమార్తె బయటకు వచ్చింది. ఆమె అనేక రాక్షస కృత్యములలో ఆరితేరినది. అనేక క్షుద్రవిద్యలు తెలిసినది అవ్వటం వలన వారికి దైర్యం చెబుతూ, అన్యాయంగా తన తండ్రిని మోసగించిన దేవతల పై తాను ప్రతీకారం తీర్చుకుంటాను అని చెప్పి రాక్షసులను తన అధికారంలోనికి తెచ్చుకున్నది. అలా ఆమె అధీనంలో ఉన్న రాక్షసులు తిరిగి దేవలోకంపై దండెత్తారు. కానీ వారు మరలా దేవతల చేతిలో ఓటమి పొందుతున్న సమయంలో, కొందరు రాక్షసులు విరోచనుని కుమార్తె వద్దకు వచ్చి యుద్ధం లో వారు ఓడిపోతున్న విషయం చెప్పగా, ఆమె స్వయంగా దేవలోకమునకు వెళ్లి నేరుగా దేవతలతో తలపడింది. తన విద్యలతో దేవతలను, వారి వాహనములు బందించింది.
అలా బంధించబడిన దేవతలు శ్రీమహావిష్ణువు ను శరణు వేడుకున్నారు. ఆర్త త్రాణపరాయణుడు అయిన ఆ శ్రీ మహా విష్ణువు ఉన్నపళంగా అక్కడకు వచ్చి, దేవతలను బంధముల నుండి విడిపించి, ఆ విరోచనుని కుమార్తెను చంపటానికి ఇంద్రుడిని ప్రేరేపించాడు. అప్పుడు ఇంద్రుడు ఆమె పై వజ్రాయుధమును ప్రయోగించాడు. ఆ వజ్రాయుధం తగిలిన ఆమె అలా కిందకు భూలోకమునకు పడిపోతూ, తనకు అటువంటి గతి పట్టటానికి కారణం ఇంద్రుడే అయినా , ఇంద్రుడు అలా ప్రవర్తించటానికి కారణం శ్రీమహావిష్ణువు కాబట్టి, తాను ఎలాగయినా విష్ణువునకు అపకారం చేయాలి అని తన మనస్సులోనే శపధం చేసుకుంది. ఆమె శరీరం భూమిపై పడినప్పుడు మూడు వంకరలుతిరిగింది. పెద్దగా అరుస్తూ ఆమె ప్రాణములు వదిలింది. అలా చివరి క్షణంలో ఆమె విష్ణువు నకు అపకారం చేయాలి అని అనుకున్నది కనుక ఆమె మరు జన్మలో, మానవ కాంతగా, గూని దానిగా జన్మించి, ఎంతో సంతోషంగా శ్రీరాముని పట్టాభిషేకమునకు సిద్ధపడుతున్న అయోధ్యను ఆశ్చర్యకరంగా బాధపెట్టిన మంధరగా జన్మించి, తన పూర్వజన్మ పంతమును నెరవేర్చుకున్నది.  

26, జూన్ 2020, శుక్రవారం

వైశ్రవణునికి కుబేరుడు అనే పేరు ఎందుకు వచ్చింది?

మనం ఇంతకు ముందు గుణనిధి గురించి, అతను దొంగగా మారుట,  అతనికి శివలోకం లభించిన విధానం, తరువాత అతను దమనుడు అనే రాజుగా జన్మించి జన రంజకంగా పరిపాలించిన సంగతి తెలుసుకున్నాం కదా!
మరి అంత జనరంజకంగా పరిపాలించిన గుణనిధి/ దమనుడు తరువాత ఏమి అయ్యాడు?
ధనునిగా తన తనువూ చాలించిన తరువాత, గుణనిధి ఆటను చేసిన పుణ్యఫలముల కారణంగా పులస్త్యుని వంశంలో విశ్రవసునికి కుమారునిగా జన్మించాడు. అతనికే వైశ్రవణుడు అని పేరు పెట్టారు. అతనే తరువాతి కాలంలో దిక్పాలకత్వం పొందాడు. అతనే లంకాధిపతిగా కొంతకాలం గడిపాడు. తరువాత తన తమ్ముడు అయిన  దశగ్రీవునిచేత అక్కడి నుండి తరుమబడి కైలాసం దగ్గరలో ఉన్న అలకాపురిలో తన నివాసం ఏర్పరచుకున్నాడు.
ఈ జన్మలో కూడా అతను సర్వదా శివధ్యానం చేస్తూ, దీప దానములు చేస్తూ ఉన్నాడు.
అదృష్టవశాత్తూ, అతని తపఃఫలంగా ఒకసారి శివుడు పార్వతీ సమేతుడయ్యి దర్శనం ఇచ్చాడు. శివుని పై ఉన్న భక్తి కారణంగా శివునికి నమస్కారం చేసిన వైశ్రవణునికి, శివుడు పార్వతికి కూడా నమస్కరించమని చెప్పాడు. శివుడు చెప్పిన మాటను విన్న వైశ్రవణుడు పార్వతిని చూసాడు. అలా చుసిన ఒక్క క్షణంలో ఆమె ఎంత తపస్సు చేస్తే ఇలా శివునిలో సగశరీర భాగం పొందగలిగిందో! అనే అసూయ కలిగింది.
వైశ్రవణునిలో ఎంత భక్తి కలిగినా అరిషట్వర్గములలో ఒకటయిన అసూయ కలిగిన కన్నులతో పార్వతిని చుసిన కారణంగా అతని కన్నుస్ఫుటిత నేత్రంగా మారిపొమ్మని చెప్పింది. అప్పటి నుండి ఆ వైశ్రవణుని అందరూ కుబేరుడు అని పిలిచారు.
కు = చెడ్డ / అసూయతో కూడిన
బేర = చూపు కల్గిన వాడు 

17, జూన్ 2020, బుధవారం

గుణనిధి - పునర్జన్మ- దమనుడు

గుణనిధి కోసం యమదూతలు, శివదూతలు వాదులాడుకుని చివరికి శివదూతలు గుణనిధిని కైలాసమునకు తీసుకువెళ్లారు. సూక్ష్మరూపంలో ఉన్న గుణనిధి వారి వాదనలను విన్నాడు. కైలాసమునకు వెళ్లిన గుణనిధి కొంతకాలం అక్కడ శివుని సేవలో గడిపేశాడు. కొంతకాలం తర్వాత ఆ గుణనిధి తన పూర్వజన్మలో చేసిన చివరి మంచిపనులు కారణంగా తిరిగి భూలోకంలో కళింగరాజ్యమునకు రాజయిన అరిందమునకు కుమారునిగా జన్మించాడు.
అరిందముడు తనకుమారునకు దమనుడు అని పేరుపెట్టారు. తిరిగి మానవునిగా జన్మించిన తరువాత కూడా అతనికి పూర్వజన్మ, చివరి కాలంలో జరిగిన సంఘటనలు గుర్తు ఉన్నాయి. అరిందముని తరువాత దమనుడు కళింగ రాజ్యమునకు రాజు  అయ్యాడు. అతను రాజు అయిన సమయం నుండి ప్రతి మాస శివరాత్రికి ప్రతిశివాలయంలో దీపములు ఏర్పాటుచేయాలని ప్రజలను కోరాడు.
అలా గుణనిధిగా సకల వ్యసనములకు బానిస అయిన వ్యక్తి అదృష్ట వశాత్తు శివపూజ చేసిన ఫలితంగా అతనికి ఉత్తమ గతులు ప్రాప్తించటమే కాక అతని ఒక రాజు అయ్యి తన రాజ్యంలో ఉన్న అందరు ప్రజలను కూడా శివుని భక్తులను చేసాడు. వారికి కూడా ఉత్తమ గతులను కలిగించాడు.  

15, జూన్ 2020, సోమవారం

గుణనిధి కి శివలోకం

మనం ఇంతకు ముందు గుణనిధి గురించి చెప్పుకుంటున్నాం! అతనిని అతని తండ్రి వదిలేసాడు. తరువాత అతను దొంగగా మారి ఆహారం దొగతనం చేస్తూ దొరికిపోయి రక్షకభటుల చేతిలో ఒక్క దెబ్బకు ప్రాణములు వదిలేసాడు. తరువాత ఏమయ్యిందో ఇప్పుడు చూద్దాం!
అతను చనిపోయిన మరుక్షణం యమదూతలు వచ్చి, గుణనిధి సూక్ష్మదేహాన్ని పాశములతో కట్టి బందించి యమలోకమునకు తీసుకు వెళ్లబోతుండగా వారికి శివదూతలు ఎదురువచ్చి ఆ గుణనిధి సూక్ష్మదేహము కైలాసమునకు వెళ్ళవలసి ఉన్నది కావున వారికి ఇవ్వవలసినది అని కోరారు.
ఆశ్చర్య పోయిన యమభటులు గుణనిధి చేసిన అకృత్యములను, అతనికి ఉన్న సప్తవ్యసనములను, అతని తండ్రి స్వయంగా అతనికి తిలోదకములు వదలటం అన్నీచెప్పి అతనికి యమలోకంలో తప్ప ఇంకెక్కడా ఉండటానికి అర్హత లేదు అని చెప్పారు. ఆ మాటలు విన్న శివదూతలు అతను ఇంతకుముందు ఎన్ని పాపములు చేసినా ఆ రోజు శివునికి అత్యంత ప్రీతికరమయిన బహుళ చతుర్దశి అంటే మాసశివరాత్రి అవ్వటం వలన, తెలిసో తెలియకో ఆటను ఆ రోజంతా ఉపవాసం ఉండటం వలన, శివుని గర్భగుడిలో దీపములను వెలిగించుట వలన అప్పటి వరకు కలిగిన పాపములు అన్ని తొలగిపోయాయి అని చెప్పారు.
అలా అత్యంత దుష్టుడు, వ్యసన పరుడు అయినా కూడా గుణనిధి చివరి సమయంలో చేసిన శివ పూజ కారణంగా శివలోకం చేరుకున్నాడు. 

14, జూన్ 2020, ఆదివారం

విశ్రవసుడు - కైకసి - సంతానం

మనం ఇంతకు ముందు లంక గురించి, ఎవరిది  అనే విషయం గురించి, రాక్షసులకు మొదటగా ఆ లంక ఎలా లభించింది అని, రాక్షసుల సంతానము పెరగటం, ఆ లంకను వదిలి వారు వెళ్ళవలసిన సందర్భం ఎందుకు వచ్చింది అని తెలుసుకున్నాం కదా!  తిరిగి లంకను రాక్షసులు ఎలా స్వాధీనం చేసుకున్నారు? అలా వారు స్వాధీనం చేసుకోవటానికి తోడ్పడిన సంఘటనల క్రమాన్ని కూడా తెలుసుకుందాం!
శ్రీ మహావిష్ణువు వలన కలిగిన భయంతో తమ పరివారాన్ని తీసుకుని పాతాళానికి వెళ్లిన సుమాలి అక్కడే కాలం గడపసాగారు. ఆప్పుడప్పుడు భూలోకమునకు వచ్చి అక్కడి పరిస్థితులు తెలుసుకుంటూ ఉండేవాడు.  ఒక నాడు అతను అలా బయటకు వచ్చిన సందర్భంలో పుష్పక విమానంలో అద్భుతంగా, ఆశ్చర్యకరంగా వెళుతున్న వైశ్రవణుడు అతనికి కనిపించాడు. సుమాలి అతని ని చూసి కొంత అసూయ చెంది ఆటను ఎవరు, ఎలా ఆ ఐశ్వర్యమును పొందాడు అనే విషయములు తెలుసుకుని తిరిగి పాతాళమునకు వెళ్ళాడు.
సుమాలి కుమార్తెలలో ఒకరయిన కైకసి కి అప్పటివరకు వివాహం కాని కారణం వల్ల, ఆమెకు విశ్రవసుడు తగిన వరుడు అని తాను అభిప్రాయ పడుతున్నట్లుగా చెప్పాడు.  అంతేకాక ఆ సమయంలో వారు ఉన్న పరిస్థితులలో వారికి వైశ్రవణుని వంటి ఒక వారసుడు అవసరం కనుక విశ్రవసునితో కుమారులను కంటే, ఆ కుమారులు వారి రాక్షసజాతికి ఎంతో ఉపయోగపడతారు అని చెప్పాడు.
తండ్రి మాటలు విన్న కైకసి ఉన్నపళంగా విశ్రవసుని వద్దకు వెళ్ళింది. ఆమె రాకను గమనించిన విశ్రవసుడు ఆమె రాకకు కారణం అడిగాడు. ఆమె ఆ విషయమును తిన్నగా చెప్పకుండా, అతను సర్వము తెలిసినవాడు కనుక అతనినే దివ్యదృష్టితో కనుక్కోమని చెప్పింది. ఆటను ఆమె అక్కడకు రావటానికి గల కారణం తెలుసుకుని, ఆమె వచ్చిన సమయం సాయం సంధ్యా సమయం కనుక ఆమె  ప్రకారం కలిగే పిల్లలు రాక్షస ప్రవ్రుత్తి  కలవారు అవుతారు అని చెప్పాడు. ఆ మాటలకు సంతోషించని కైకసి తనకి ఒక ధర్మాత్ముడయిన కుమారుని కూడా ప్రసాదించమని కోరుకున్నది.
అలా కైకసికి మొదటి సంతానం కలిగింది. నల్లగా, భయంకరంగా, పెద్ద కోరలతో, పది తలలతో జన్మించాడు. విశ్రవసుడు అతనికి దశకంఠుడు / దశగ్రీవుడు అని నామ కారణం చేసాడు.
రెండవవానిగా అత్యంత భారీకాయుడు జన్మించాడు. అతని చెవులే పెద్ద కుండలవలే కనిపించాయి. విశ్రవసుడు అతనికి కుంభకర్ణుడు అని పేరు పెట్టాడు.
మూడవసంతానం గా ఒక అమ్మాయి జన్మించింది. ఆమే శూర్పణఖ
నాల్గవవానిగా ధర్మాచరణ పరుడయిన విభీషణుడు జన్మించాడు. 

13, జూన్ 2020, శనివారం

గుణనిధి - దొంగ

మనం ఇంతకు ముందు యజ్ఞదత్తుడు - గుణనిధి గురించి తెలుసుకున్నాం కదా! మరి తండ్రి తనను వదిలేశాక గుణనిధి ఏమయ్యాడు? ఇప్పుడు తెలుసుకుందాం!
తానా తండ్రి తనను వదిలేసాడు అని తెలుసుకున్న గుణనిధి ఇంటికి వెళితే తన తండ్రి ఎం చేస్తాడో అనే భయంతో పారిపోయాడు. కొంతకాలం అలా తిరిగిన తరువాత ఒకరోజు అతనికి తినటానికి ఏమి దొరకక ఒక అడవిలో చెట్టుకింద కూర్చుని ఉన్నాడు. ఆ సమయంలో ఒక శివభక్తుడు తన పరివారంతో, అనేక తినుబండారములు తీసుకుని శివాలయమునకు వెళుతూ ఉండటం చూసాడు. ఆ తినుబండారముల సువాసనలు అతనిని ఎంతో ఆకర్షించాయి. ఎలాగయినా వానిని తినాలి అనే ఆలోచనతో గుణనిధి కూడా వారితో పాటుగా శివాలయంలోనికి ప్రవేశించాడు.  వారంతా వారు తెచ్చిన తినుబండారములను శివునకు నివేదించి, సందర్భానుసారంగా నృత్యగానములను ఆస్వాదించి అక్కడే పడుకుండిపోయారు.  వారి పూజలు అయ్యేంతవరకు గుణనిధి అక్కడే నక్కి కూర్చున్నాడు.అలావారంతా నిద్రపోయిన తరువాత గుణనిధి మెల్లిగా గర్భగుడిలోని ప్రవేశించాడు. అతనికి విపరీతమయిన ఆకలి కారణంగా కన్నులు సరిగా కనిపించలేదు. కనుక అక్కడ ఉన్న దీపములో తన ఉత్తరీయమును చించి ఒక వత్తి లా చేసి పెట్టి, దానిని వెలిగించాడు. ఆ తినుబండారాలు అన్ని మూటగట్టుకుని బయటకు రాబోతుండగా అక్కడ పడుకున్న భక్తులలో ఒకరికి మెలకువ వచ్చి దొంగా దొంగా  అని అరిచారు. ఆ అరుపులకు రక్షకభటులు వచ్చారు. అతని చేతిలోని తినుబండారాలు చూసి అతని దొంగ అని నిర్ణయించుకుని కొట్టారు. ఒక్క దెబ్బ పడగానే గుణనిధి ప్రాణములు వదిలేసాడు.  

12, జూన్ 2020, శుక్రవారం

తెలుగు మధురమయిన పద్యం - 3

ఇంతకూ ముందు మనం కొన్ని అద్భుతమయిన తెలుగు పద్యముల గురించి చెప్పుకున్నాం కదా! వానిలో ఒక పద్యం కవిరాజ శిఖామణి నన్నెచోడుడు రచించిన కుమారా సంభవం లోని ఒక పద్యం చూసాం కదా!! ఇప్పుడు అదే కుమారా సంభవం లోని మరొక పద్యం చూద్దాం!  
ఈ పద్యం ప్రార్ధనలోని భాగం. ఈ పద్యమునకు అర్ధం రెండురకములుగా చూద్దాం! 

తన జనకుడురుస్థాణువు 
జనని యపర్ణాఖ్య దా విశాఖుo డనగా 
దనరియు నభిమతఫలముల 
జనులకు దయ నొసగుచుండు షణ్ముఖు గొలుతున్  
  1. భావం: తనతండ్రి కదలలేని ఒక మొద్దు, తల్లి కి ఆకులే లేవు, అతనికి  కొమ్మలు కూడా లేవు, కానీ కోరినకోర్కెలు తీర్చే ఆరు ముఖములు కలిగినవానికి నమస్కరిస్తున్నాను. 
  2. భావం: ప్రళయకాలంలో కూడా చెదరనివాడు అతనికి తండ్రి, తపస్సుకోసం కనీసం ఆకులు కూడా ముట్టనిది అతని తల్లి, వారినుండి సాహసమును, సహనమును పొందిన విశాఖుడు అయ్యి, ఎవరు కోరినకోర్కెలు అయినా దయతో తీర్చేవాడయిన షణ్ముఖునకు నమస్కారం.  

11, జూన్ 2020, గురువారం

యజ్ఞదత్తుడు - గుణనిధి

మనం ఇంతకు ముందు సప్త వ్యసనముల గురించి చెప్పుకున్నాం కదా! ఆ వ్యసనములు ఉన్న వ్యక్తి తన  కోల్పోతాడు? అతనితో అతని తల్లిదండ్రులు ఎలా వ్యవహరించాలో ఇప్పుడు ఒక చిన్న కధ ద్వారా చూద్దాం!

పూర్వకాలంలో కాంపిల్య నగరంలో యజ్ఞదత్తుడు అనే ఒక సద్బ్రాహ్మణుడు ఉండేవాడు. ఆ యజ్ఞదత్తుడు సదాచార పరాయణుడు, యాజ్ఞికుడు. అతనికి చాలాకాలమునకు ఒక కుమారుడు కలిగాడు. లేకలేక కలిగిన ఆ కుమారునికి గుణనిధి అని పేరుపెట్టారు. ఐతే విద్యార్థి దశలోనే గుణనిధికి  చెడు స్నేహములు వాని వల్ల చెడు వ్యసనములు కూడా అలవాటు అయ్యాయి. లేకలేక కలిగిన కుమారుడు అవ్వటం వలన అతని తల్లి అతనిని చాలా గారాబంగా చూసుకునేది. అయితే యజ్ఞదత్తుడు తన నిత్య కార్యక్రములలో, యజ్ఞములలో చాలా సమయం గడుపుటవలన అతనికి కుమారుడిని పట్టించుకునే సమయం ఉండేది కాదు. అయినా అతడు తన కుమారుని గురించి తన భార్యను అడిగి తెలుసుకునే వాడు. అయితే కొడుకు మీద ఉన్న మమకారం కారణంగా అతని భార్య అతనికి ఎల్లప్పుడూ వారి కుమారుడు చక్కగా అన్ని శాస్త్రోక్తంగా చదువుకుంటున్నాడు అని చెప్పేది. కానీ నిజానికి గుణనిధి ఎంతోకాలం ముందే సప్తవ్యసనములకు బానిస అయ్యాడు. అవి ఏమి తెలియని యజ్ఞదత్తుడు అతనికి ఒక మంచి కన్యను చూసి వివాహం కూడా జరిపించాడు.
ఒకనాడు యజ్ఞదత్తుడు స్నానమునకు వెళుతూ తన ఉంగరమును బల్లమీద పెట్టి వెళ్ళాడు. అది గమనించిన గుణనిధి ఆ ఉంగరమును తీసుకుని వెళ్ళి తన జూదంలో పందెంగా పెట్టి ఓడిపోయాడు. యజ్ఞదత్తుడు తన ఉంగరం విషయం మరచిపోయాడు. ఒకరోజు యజ్ఞదత్తుడు అనుకోకుండా ఒక వ్యక్తి చేతికి ఆ ఉంగరాన్ని చూసి అది అతనికి ఎలా వచ్చింది అని అడుగగా, ఆటను యజ్ఞదత్తునికి గుణనిధి గురించి చెప్పి, ఇంటిలోని సమన్లు అతను అమ్ముకొనక ముందే అతనికి బుద్ధి చెప్పుకొమ్మని ఎగతాళి చేసాడు. ఆ విషయాన్నివిన్నయజ్ఞదత్తుడు ఇంటికి వచ్చి అతని భార్యను నిలదీయగా ఆమె నిజమును చెప్పింది. 
ఆ వివరం మొత్తం తెలుసుకున్న యజ్ఞదత్తుడు తక్షణం తన కుమారునికి తర్పణములు వదిలేసాడు. 

8, జూన్ 2020, సోమవారం

సప్త వ్యసనములు

మనం ఇంతకుముందు కామం వలన జనించిన 10 వ్యసనముల గురించి చెప్పుకున్నాం కదా! ఇప్పుడు అసలు సప్త వ్యసనములు అంటే ఏమిటో ఇప్పుడు చూద్దాం!
మానవుని జీవితంలో అత్యంత పాపమునకు కారణమయినవి  ఏడు వ్యసనములు. అవి 
  1. వేట 
  2. మద్యపానం 
  3. చాడీలు చెప్పటం 
  4. అబద్దాలు చెప్పటం 
  5. దొంగతనం 
  6. జూదం 
  7. పరస్త్రీ సంగమం 

7, జూన్ 2020, ఆదివారం

ముంగీస -ధర్మరాజు అశ్వమేధయాగం - శాప విమోచనం

మహాభారత యుద్ధం అయిపోయిన తరువాత యుద్ధంలో విజయం సాధించిన పాండవులు అశ్వమేధయాగం చేశారు. ఆ యాగమును అత్యంత వైభవంగా, శాస్త్రోక్తంగా చేశారు. ఆ యాగమును చూడటానికి వచ్చినవారందరికీ వారు అత్యంత గొప్పవయినా దానాలు చేశారు. అలా రత్నములు, మణులు దానాలు తీసుకున్న రాజులు బ్రాహ్మణులూ వానిని మోయలేక మోయలేక వారి వారి ఇళ్లకు తీసుకెళుతూ ఉన్నారు. ఆ సమయంలో అన్నదానం కూడా జరుగుతోంది.
అలా వివిధములయిన దానములు తీసుకున్న బ్రాహ్మణులు ఒక చోట కొందరు గుంపుగా నిలబడి ఆ పాండవుల ధర్మనిరతని మెచ్చుకుంటూ, వారు చేసిన ఆ అశ్వమేధయాగాన్ని కీర్తిస్తూ, ఇంతగొప్ప దానములు చేసాడు అని మాట్లాడుకుంటూ ఉండగా!
అక్కడే చాటుగా సంచరిస్తున్న వింతగా  సగం దేహం బంగారు కాంతితో మెరిసిపోతున్న ఒక ముంగీస వచ్చి, ఈ అశ్వమేధయాగం ఎంతమాత్రమూ సక్తుప్రస్తుని త్యాగానికి, ధర్మానికి సరితూగదు అని చెప్పింది. ఆ మాటలు విన్న బ్రాహ్మణులూ ఆశ్చర్యపోయి ఆ సక్తుప్రస్తుని కథను తెలుసుకుని ఆనందించారు.  అంతేకాక సక్తుప్రస్తుడు చేసిన దాన విశేషణ ఫలముగా ముంగీసకు సగం దేహం బంగారు వర్ణం కలిగింది. మరి పాండవులు చేసిన అశ్వమేధ యాగ ప్రాంగణంలో ఆ ముంగీస మిగిలిన దేహం బంగారు మాయం కాలేదు కనుక ఆ బ్రాహ్మణులుకూడా ఆ ముంగీస మాటలతో ఏకిభవించారు.
దానికి కారణం కూడా మనకు మహాభారతం లో చెప్పారు. అశ్వమేధయాగం అనేది అశ్వమును వినియోగించి చేస్తారు. అంటే జంతువును హింసిస్తారు. కానీ సక్తుప్రస్తుడు, అతని కుటుంబం చేసిన దానము అహింస అనే పునాది మీద జరిగినది. కనుక ఎల్లప్పుడూ హింసకంటే అహింస ఎంతో గొప్పది.
అలా అక్కడ ఉన్న బ్రాహ్మణులు ముంగీస చెప్పిన మాటలు అంగీకరించారో అప్పుడు ఆ ముంగీసకు ఉన్న శాపవిమోచనం కలిగి ఆనందిస్తూ అక్కడి నుండి వెళ్ళిపోయింది. 

6, జూన్ 2020, శనివారం

రాక్షసులు లంకను వదలి ఎందుకు వెళ్లారు?

మనం ఇంతకు ముందు లంక ను స్వర్ణలంక అని ఎందుకు అంటారో తెలుసుకున్నాం కదా! ఆ లంక ముందుగా రాక్షసుల నివాసస్థలంగా ఉండి ఆ తరువాత అది వైశ్రవణునికి నివాసంగా ఉంది. అయితే వైశ్రవణుడు అక్కడికి చేరే సమయానికి లంక కాళీగా ఉంది. మరి అతనికంటే ముంది  ఉన్న ఆ రాక్షసులు లంకను వదిలి ఎక్కడకు వెళ్ళారు? ఎందుకు వెళ్ళారు?
రాక్షస గణములు ప్రగటానికి కారణం మాల్యవంతుడు,మాలి, సుమాలి అని చెప్పుకున్నాం కదా!  వారి వరముల కారణంగా మాల్యవంతుడు, మాలి, సుమాలి సోదరులు గర్వం పెరిగి,   సర్వ లోకములను వేధించటం మొదలుపెట్టారు. దేవతలు దిక్కులేనివారు అయ్యారు. దేవతలు కైలాసమునకు వెళ్లి శివునకు మొరపెట్టుకున్నారు. కానీ పరమేశ్వరుడు సుకేశుని మీది జాలి, ప్రేమ కారణంగా  కుమారులను సంహరించటానికి సుముఖం  కాలేక విష్ణుమూర్తి వద్దకు వెళ్ళమని చెప్పాడు.
వారి మొరలు  విష్ణువు దేవతలకు అభయం ఇచ్చాడు. ఆ విషయం ఆ ముగ్గురు అన్నదమ్ములకు చారుల  ద్వారా తెలిసింది. అప్పుడు పెద్దవాడయిన మాల్యవంతుడు విష్ణువు ఇంతకు ముందు కూడా రాక్షసులను చంపి ఉన్నాడు కనుక ఏమి చెయ్యాలి అని తన తమ్ముళ్లను అడిగాడు. దానికి ఆ తమ్ముళ్లు విష్ణువు అలా  మనలను చంపుతాను అని చెప్పుటకు కారణం ఆ దేవతలు కనుక ముందుగా ఆ దేవతలను నాశనం చేయాలి అని చెప్పారు. ఆ మాటలను అంగీకరించిన మాల్యవంతుడు వెంటనే దేవతల మీద యుద్ధం ప్రకటించారు.
అనేక రాక్షస సైన్యమును వెంటపెట్టుకుని వీరు స్వర్గం మీద దాడి చేశారు. రాక్షసులు దండెత్తి వస్తున్నారని తెలిసిన దేవతలు పారిపోయారు. ఈ విషయాలు అన్ని తెలుసుకున్న విష్ణువు తన వాహనం గరుడుని పై,సకల ఆయుధాలను ధరించి బయలుదేరాడు. యుద్ధభుమిని చేరే సమయానికి, గరుడుని రెక్కల వేగానికి ఆ యుద్ధభూమీలోని రాక్షసులు ఎగిరిపోయారు, వారి ఆయుధాలు చెల్లాచెదురు అయిపోయాయి. ఎగిరిపోగా మిగిలిన రాక్షసులు విష్ణువు మీద యుద్ధం చేయనారంభించారు. వారు ప్రయోగించిన అన్ని బాణములు విషుమూర్తి దేహంలో కలిసిపోతున్నాయి. విష్ణుమూర్తి కూడా వారిపై బాణముల వర్షం కురిపిస్తున్నాడు.
ఆ బాణ వర్షమునకు ఎందరో రాక్షసులు నేలకూలారు. కొందరు పారిపోయారు. ఆ విజయమునకు సూచనగా విష్ణువు తన పాంచజన్యమును పూరించాడు.  ఆ పాంచజన్య శబ్దమునకు రాక్షసుల వాహనములకు కట్టిన జంతువులు పారిపోయాయి. అలా వారి యుద్ధం ఓడిపోతున్న ఉక్రోషంతో సుమాలి తిన్నగా వెళ్లి విష్ణువుతో తలపడ్డాడు.  అలా మళ్ళీ కొందరు రాక్షసులు విష్ణువు చుట్టూ చేరి యుద్ధం చేయసాగారు. అప్పుడు విష్ణువు ఒక బాణంతో సుమాలి సారధిని సంహరించాడు. అప్పుడు అతని రధమును ఆ గుఱ్ఱములు దూరంగా లాక్కుని వెళ్లిపోయాయి. అప్పుడు మాలి యుద్దానికి వచ్చాడు. మాలి భయంకరంగా యుద్ధం చేసాడు. అయితే అతని బాణములు ఏవి విష్ణువును భాధించలేదు. అప్పుడు మాలి తన గధతో గరుడుని ముఖంపై కొట్టాడు. ఆ దెబ్బను తట్టుకోలేక గరుడుడు అకస్మాతుగా కదిలాడు. గరుడుని ఆధీనంలోకి తెచ్చుకున్న తరువాత విష్ణుమూర్తి ఆ మాలిని సంహరించటం కోసం సుదర్శనమును ప్రయోగించాడు. ఆ సుదర్శనం మాలి కంఠమును నరికి వేసింది. ఆ దృశ్యమును చుసిన రాక్షసులు భయపడి పారిపోయారు.
అలా పారిపోతున్న రాక్షసులను విష్ణువు గరుడుని మీద వెంబడించాడు. అలా వెంబడిస్తున్న విష్ణువును మాల్యవంతుడు ఎదిరించాడు. అల ఎదిరించిన మాల్యవంతుడిని గరుడుడు తన రెక్కలతో కొట్టాడు. ఆ దెబ్బకు మాల్యవంతుడు దూరంగా ఎగిరిపోయాడు. అలా మాల్యవంతుడు ఎగిరిపోవటం చూసిన సుమాలి అతని సైన్యమును తీసుకుని, లంకకు వెళ్లి , అక్కడ వారి కుటుంబాలను కూడా తీసుకుని పాతాళమునకు వెళ్లి దాక్కున్నారు. మాలి చనిపోవటం, మాల్యవంతుడు దూరంగా ఎగిరి పోవటంతో రాక్షసులకు సుమాలి రాజుగా , రాక్షస రాజ్యమును స్థాపించి పరిపాలించాడు.
అలా ఖాళీ అయినా లంకను తనకు నివాస యోగ్యంగా మార్చుకొమ్మని విశ్రవసుడు  తన కుమారుడు వైశ్రవణునికి చెప్పాడు. 

5, జూన్ 2020, శుక్రవారం

సక్తుప్రస్తుని దానం - ఫలం

మనం ఇంతకుముందు మానవుడు తప్పని సరిగా చేయవలసిన పంచమహాయజ్ఞముల గురించి తెలుసుకున్నాం కదా! దానిలో అతిధి యజ్ఞం అద్భుతంగా చేసిన ఒక బ్రాహ్మణుని కధ ఇప్పుడు చూద్దాం!
పూర్వాకాలంలో కురుక్షేత్రం ప్రాంతంలో సక్తుప్రస్తుడు అనే పేరు కలిగిన ఒక బ్రాహ్మణుడు ఉండేవాడు. అతనికి కోరికలు ఏమీలేవు. అతనితో పాటుగా అతని భార్య, కొడుకు ,కోడలు కూడా అదేవిధమయిన భక్తి వైరాగ్యములు కలిగి ఉండేవారు. వారు ఉంచ్చవృత్తి చేస్తూ జీవించేవారు. వారు కేవలం పొలంలో రాలిన, ఎవ్వరూ ఆశించని ధాన్యమును ఏరుకుని తెచ్చుకుని దానిని మాత్రమే తిని జీవిస్తారు.
ఒకసారి వానలు సరిగా పడక పంటలు సరిగా పండక, ఆ ప్రాంతంలో కరువు సంభవించింది. వీరికి ఆహారం దొరకటం చాలా కష్టం అయ్యిపోయింది. వారు నలుగురు తెచ్చిన ఆహారఎం వారికి సరిపోయేది కాదు.
అల ఒకరోజు వారికి కొంత ధాన్యం దొరికింది. అది సాయంత్రానికి వారి భోజనానికి తయారు చేసుకున్నారు. ఆ రోజు చేయవలసిన శాస్త్రోక్తకర్మలను పూర్తిచేసుకుని వారు భోజనం చేయటానికి ఆ ఆహారాన్ని నలుగురూ సమంగా పంచుకుని తినబోతున్న సమయంలో వారి ఇంటికి ఒక అతిధి వచ్చారు. ఆ అతిథికి సకల మర్యాదలు చేసి, కుశల ప్రశ్నలు అడిగిన తరువాత, అతనికి మామగారు తన వంతు భోజనాన్ని అందించాడు. అతిధి ఆ ఆహారాన్ని స్వీకరించాడు. కానీ అతనికి ఆ ఆహారం అతనికి సరిపోలేదు అని ఆ బ్రాహ్మణుడు గమనించాడు. కానీ వచ్చిన అతిథిని ఇంకా ఎలా సంతృప్తిపరచాలో అతనికి తెలియక చూస్తున్న సమయంలో, అతని భార్య తనవంతు భోజనాన్ని అతిథికి ఇచ్చింది. అది కూడా అతనికి సరిపోకపోతే అతని కుమారుడు, ఆ తరువాత వారి కోడలు కూడా వారి వారి భోజనాన్ని పరం సంతోషంగా వచ్చిన అతిథికి సమర్పించారు . అలా అందరూ ఇచ్చిన ఆహారాన్ని బుభుజించిన ఆ అతిథి సంతృప్తుడు అయ్యాడు.
అలా సంతృప్తుడయిన ఆ అతిథి, భక్తి, వినయం, శ్రద్ధ, ఓర్పుతో కూడిన మర్యాద, దయ, అతిధులయందు ప్రేమ అన్ని ఉన్న ఆ బ్రాహ్మణ కుటుంబానికి తను యముడిని అని చెప్పి తన్మ నిజరూపమును చూపించాడు . అంతే కాక వీరి దానగుణమును సకల దేవతలు, సప్తఋషులు కూడా ఆశ్చర్యపోతున్నారు అని చెప్పాడు. దేవతలు వారి మీద పుష్పవర్షం కురిపించారు. యముడు వారిని బ్రహ్మ తనలోకమునకు తీసుకువెళ్ళేందుకు విమానమును పంపిస్తాడు అని చెప్పాడు.   ఆలా చెప్తూ ఉండగానే ఒక విమానం వచ్చింది. అప్పుడు యముడు వారిని ఆ విమానంలో ఎక్కమని చెప్పాడు. వారు ఆ విమానంలో ఎక్కి బ్రహ్మలోకమునకి వెళ్లారు.
ఆ కుటుంబం మొత్తం విమానంలో బ్రహ్మలోకమునకు వెళుతున్న సమయంలో వచ్చిన కోలాహలం విన్న ఒక ముంగీస కలుగులో నుండి  బయటకు వచ్చి  చూస్తూ ఉండగా , ఆ అతిధిగా వచ్చిన యముడు చేతులు కడుగుకున్న నీటిని ఆ ముంగీస సగంశరీరం తాకుటవల్ల ఆ ముంగీస సగం శరీరం బంగారు వర్ణం లోనికి మారింది. ఇంట ఘనంగా దానం చేసిన ఫలములో కొంత భాగం తనకు దక్కినది అని తలచి ఆ ముంగీస మిగిలిన శరీరమును బంగారు వర్ణంగా మార్చుకోవటానికి దానములు జరిగే ప్రతి చోటుకూ వెళ్లి వారు చేతులు కడుగుకునే స్థలంలో తిరుగుతూ ఉండేది. 

4, జూన్ 2020, గురువారం

రాక్షస వంశాభివృద్ధి

మనం ఇంతకు ముందు రాక్షసుల జన్మ గురించి తెలుసుకున్నాం కదా! ఆ వంశంలో జన్మించిన మాల్యవంతుడు, మాలి, సుమాలి గురించి కూడా తెలుసుకున్నాం! ఇప్పుడు వారి సంతానం గురించి తెలుసుకుందాం!

మాల్యవంతుడు :

  1. వజ్రముష్టి 
  2. విరుపాక్షుడు 
  3. దుర్ముఖుడు 
  4. సుప్తఘ్నుడు 
  5. యజ్ఞకోపుడు
  6.  మత్తుడు 
  7. ఉన్మత్తుడు
  • కుమార్తెలు 
  1. అనల 
సుమాలి : కుమారులు

  1. ప్రహస్తుడు 
  2. అకంపనుడు 
  3. వికటుడు 
  4. కాలికాముఖుడు 
  5. ధూమ్రాక్షుడు 
  6. దండుడు 
  7. సుపార్శ్వుడు 
  8. సంహాద్రి 
  9. ప్రఘనుడు 
  10. భాసకర్ణుడు

కుమార్తెలు :

  1. రాక 
  2. పుష్పోత్కట 
  3. కైకసి 
  4. కుంభీనస 


మాలి : కుమారులు

  1. అనలుడు 
  2. అనిలుడు 
  3. హరుడు 
  4. సంనాతి 
  5. విభీషణుడు  


 

3, జూన్ 2020, బుధవారం

జమదగ్ని- శాంతం - శాపం

మనం ఇంతకు ముందు ఋచీకుని కుమారుడు జమదగ్ని అని తెలుసుకున్నాం కదా ! ఆ జమదగ్ని నిష్ఠ గురించి ఒక  సంఘటన ఇప్పుడు చూద్దాం!
ఒకసారి జమదగ్ని శ్రాద్ధం చేయదలచి ఒక ఆవుపాలు స్వయంగా ఒక కొత్త కుండలో తీసుకువచ్చి జాగ్రత్తగా ఒక చోట పెట్టాడు. అతని మనస్సును పరీక్షించాలి అనే ఉద్దేశ్యంతో క్రోధమునకు అధిదేవత సాకారంగా వచ్చి ఆ పాలు ఉన్న కుండను అనుకోకుండా తగిలినట్లు చేసి, ఆ పాలు ఒలికి  పోయేట్లుగా చేసింది. ఆ విధం గమనించిన జమదగ్ని కోపగించకుండా, సావధాన మనస్కుడై ఉన్నాడు. అతనిని గమనించిన క్రోధాదిదేవత అతనిని క్షమాపణ కోరింది.  అతను కోపగించకుండా , అక్కడ సంకల్ప సిద్ధంగా జరగవలసిన శ్రాద్ధ కర్మ సరిగా జరుగక పోవటం వలన పితృదేవతలు శపిస్తారు కనుక, వారు ఆలా చేయక మునుపే ఆమెను అక్కడ నుండి వెళ్లిపొమ్మని కోరాడు. ఆమె వెళ్ళిపోయింది.
అప్పుడు పితృదేవతలు జమదగ్నికి సాక్షాత్కరించి, జరుగవలసిన శ్రాద్ధం సరిగా జరిపించలేదు, దానికి కారణమయిన వారిమీద కోపం చూపించలేదు కనుక వారు జమదగ్నిని ముంగీస గా జన్మించమని శాపం ఇచ్చారు.
అప్పుడు జమదగ్ని వారితో, దీక్షాపరుడయిన కారణంగా క్రోధంవహించుట సరి అయిన పద్దతి కాదు కనుక తానూ కోపం తెచ్చుకోలేదు అని, తనకు శాప విమోచన మార్గం చెప్పమని ప్రార్ధించాడు.
అతని ధర్మ నిరతకు సంతోషించిన పితృదేవతలు, అతను ఏ రోజున పండిత, విద్వాంసులందరినీ కూడా ఒక మహాధర్మమును అధమ ధర్మముగా చెప్పి ఒప్పించగలుగుతాడో ఆ రోజున అతనికి శాప విమోచనం కలుగుతుంది అని చెప్పారు.

మరి ఇంతకూ అలా ముంగీసగా పుట్టిన జమదగ్నికి శాప విమోచనం ఎలా కలిగింది ? ఎలా పండితులను మహాధర్మమును అధమ ధర్మం అని  ఒప్పించగలిగాడు? తరువాతి టపా లో చెప్పుకుందాం!

2, జూన్ 2020, మంగళవారం

రాక్షస సంతాన వృద్ధి

ఇంతకుముందు మనం రాక్షసులకు పిల్లలు ఎలా వెంటనే కలుగుతారు,  వారు ఎందుకు తమ తల్లి వయస్సు కలవారు అవుతారు అని తెలుసుకున్నాం కదా!
పార్వతీదేవి, శివుని కరుణా కటాక్షామముల వల్ల పెరిగి పెద్దవాడయిన సుకేశునికి గ్రామణి అనే గంధర్వుడు తన కుమార్తె దేవవతిని ఇచ్చి వివాహం జరిపించాడు.  వారికి మాల్యవంతుడు, మాలి, సుమాలి అనే ముగ్గురు కుమారులు కలిగారు. వీరు ముగ్గురూ మేరుపర్వతం వద్ద బ్రహ్మగురించి తపస్సు చేశారు. ఆ తపస్సుకు మెచ్చిన బ్రహ్మదేవుడు వారిని వరములు కోరుకొమ్మన్నాడు. 
వారికి అత్యంత బలం కావాలని, వారి మధ్య ఎన్నటికీ విరోధం కలుగకుండా ఉండాలని కోరుకున్నారు. బ్రహ్మదేవుడు వారికి ఆ వరములు ఇచ్చారు. తరువాత వారు విశ్వకర్మదగ్గరకు వెళ్లి తమకు నివాసయోగ్యమయిన స్థలమును చూపించమని అడిగారు. దానికి విశ్వకర్మ స్వర్ణలంక ని తమ నివాసంగా చేసుకోమని చెప్పాడు.   
తరువాత వారు ఒక గందర్వ కాంత నర్మద యొక్క ముగ్గురు కుమార్తెలు సుందరి, కేతుమతి, వసుధలను వివాహం చేసుకున్నారు.   వారికి అనేకమంది సంతానం కలిగారు. వీరి వలననే రాక్షస సంతానం వృద్ధి చెందింది. 
రావణాసురుని తల్లి అయిన కైకసి, సుమాలి పుత్రిక. 

1, జూన్ 2020, సోమవారం

మానవ జీవితం - పంచమహా యజ్ఞములు

మానవుని జీవితంలో ఉండే  బ్రహ్మచర్య, గృహస్థ, వానప్రస్థ మరియు సన్యాస అనే నాలుగు ఆశ్రమముల గురించి మనకు తెలుసు కదా! ఆ నాలుగు ఆశ్రమములలో ముఖ్యమయినది, మిగిలిన మూడు ఆశ్రమములకు ఆధారమయినది గృహస్థ ఆశ్రమం. 
అయితే ఈ గృహస్థాశ్రమంలో ఉన్న వారు యజ్ఞములు చేస్తేనే వారికి పరమేశ్వరానుగ్రహం లభిస్తుంది. మరి ఇంతకీ ఆ యజ్ఞములు ఎన్ని రకములు? వానిని ఎలా చేయాలో తెలుసుకుందాం! 

ముఖ్యమయిన యజ్ఞములు ఐదు రకములు. అవి

  1. దేవ యజ్ఞము: వీనిని మనం వాడుక భాషలో యజ్ఞములు అనే వ్యవహరిస్తాము. ఇవి భగవదనుగ్రహం కోసం, ఇష్టకార్యార్ధ సిద్ధి కోసం చేస్తారు. గృహస్తులయితే తమ గార్హపత్యాగ్ని లో హవిస్సును సమర్పిస్తారు. బ్రహ్మచారులయితే లౌకికమైన అగ్నితోనే చేస్తారు. ఇక శూద్రులకు నమస్కారమే దేవ యజ్ఞ ఫలమును ఇస్తుంది.  
  2. పితృ యజ్ఞము: ఇవి తమను వదలి పరలోకమునకు చేరిన తమ పితృదేవతల కొరకు చేస్తారు.  ఐతే తండ్రి బ్రతికి ఉండగా ఇట్టి  యజ్ఞమును చేయుటకు పుత్రునికి అధికారం లేదని చెప్పెదరు. 
  3. భూత యజ్ఞము: ఈ యజ్ఞమునకు అర్ధం తనతో పాటుగా ఈ భూమిమీద ఉన్న సకల చరాచర జీవరాశులకు ఉపయోగపడేలా తాను అండుచుకోవాలి అని. 
  4. మనుష్య యజ్ఞము: ఈ యజ్ఞమునే అతిధి యజ్ఞం అనికూడా పిలుస్తారు. మన ఇంటికి వచ్చిన అతిధిని గౌరవంగా చూసుకోవాలి.  ఈ యజ్ఞము ద్వారానే గృహస్తుడు మిగిలిన మూడు ఆశ్రమములవారికి ఆధారం అవుతున్నాడు.
  5. బ్రహ్మ యజ్ఞము: ఈ యజ్ఞము ద్వారా గృహస్తుడు అనేక కొత్త విషయములను తెలుసుకుంటాడు. అంతేకాక మిగిలినవారికి కూడా తెలియజేస్తూ ఉంటాడు. ఈ యజ్ఞంలో భాగంగా గృహస్తుడు జ్ఞానమును ఆర్జిస్తాడు, అందరికి పంచి పెడతాడు.