30, నవంబర్ 2017, గురువారం

మంచి, చెడు- 3

ధనము నందు అత్యాశ గలిగి ఉండుట కంటే దుర్గుణము లేదు
అబద్ధములు చెప్పుట కంటే పాపము వేరొకటి లేదు - సత్యవాక్కును మించిన తపస్సు లేదు
మనస్సు పవిత్రంగా ఉండుట కంటే గొప్ప తీర్ధము లేదు . సౌజన్యము కు మించి పరివారము లేదు
 మంచి పనులు చేయుట వలన ప్రాప్తిoచిన పరువు అన్నింటి కంటే ప్రకాశమైన అలంకారం
విద్య కంటే విలువ గల ధనము లేదు
లోకనిందను మించి నీచమైన చావు లేదు  

28, నవంబర్ 2017, మంగళవారం

మంచి,చెడు -2

మన పెద్దలు ఏ విషయాన్ని చెప్పినా మంచిని చెడును సమాంతరంగా చెప్తారు. ఒక విషయాన్ని మంచిది అని చెప్తున్నప్పుడు దానికి సంబంధించి చెడుఎలా ఉండవచ్చో కూడా చెప్తారు. ఇటువంటి మంచి చెడుని నిర్వచిస్తున్నప్పుడు వారు ముఖ్యంగా మనిషి సామాజిక బాధ్యతకి ప్రాముఖ్యత ఇచ్చారు. 

అటువంటివి కొన్ని మనం చూద్దాం.

మంచి:  
ఆకలిగొనిన వారల కన్నము పెట్టవలెను
దాహము గలిగిన వారికి దాహశాంతి చేయవలెను
దుఃఖములో ఉన్నవారికి అవసరమయిన సహాయం చేయవలెను ఒకవేళ మన వంతు సహాయం చేయలేక పొతే కనీసం వారికి ఓదార్పు కలిగేలా మసలితే మంచిది.

చెడు : 
పక్కవారి ఆకలిని, దాహమును గమనించకుండా తన భోజనము తాను చేయుట అన్నింటికంటే చెడ్డ పనిగా మన పెద్దలు చెప్పారు.
పక్కవారు దుఃఖంలో ఉన్నప్పుడు వారిని పట్టించుకోకపొతే రేపు అటువంటి సమస్య మనకు కలిగినప్పుడు మనకు సహాయం చేయటానికి ఎవరు వస్తారు?

27, నవంబర్ 2017, సోమవారం

మంచి, చెడు -1

ఈ రోజులలో ఉద్యోగం చేసే టప్పుడు అధికారి దగ్గర ఎలా ప్రవర్తించాలి అనేదాని గురించి మన పెద్దలు ఏ విధంగా అది   కత్తిమీద సామువంటిదో విపులంగా ఎలాచెప్పారో చూద్దామా!
యజమాని/ అధికారి  దగ్గర ఎక్కువగా మౌనముగా ఉంటే మూగవాడు అంటారు
యజమాని/ అధికారి  దగ్గర  ఎక్కువగా మాట్లాడితే అధిక ప్రసంగి  అంటారు
యజమాని/ అధికారి కి అత్యంత సమీపంగా ఉంటే గర్వితుడు అంటారు
యజమాని/ అధికారితో అంటీ ముట్టనట్లు దూరంగా ఉంటే భయస్తుడు అంటారు
యజమాని/ అధికారి ప్రవర్తనను ప్రశ్నించకుండా భరిస్తుంటే పిరికివారు అంటారు
యజమాని/ అధికారి ముందు తన ఆత్మగౌరవమును కాపాడుకొనే ప్రయత్నం చేస్తే గౌరవము లేని వ్యక్తి అని చెప్పుకుంటారు
కనుక ఉద్యోగము  చేసే దగ్గర మనపని మనం చూసుకోవాలి, మరీ ఎక్కువగా మాట్లాడకుండా, అవసరమైన దగ్గర మాట్లాడకుండా ఉండకుండా మన ఆత్మగౌరవాన్ని మనం కాపాడుకుంటూ ఉండాలి. 

26, నవంబర్ 2017, ఆదివారం

శ్రీరామ శతకము – 100

సీ  : సీస పద్యములిదొ శ్రీరామ మాలగా 
             గూర్చి మీ కొసగితి కొదువ లేక 
        శత పుష్ప మాలిది సంతసంబున గొని 
             దంపతుల్ ముదమొOద దాల్చరయ్య 
       తావి నిండిన పూల దండలివి మెడదాల్చి 
            చెడిపోవకుండగా జేయరయ్య 
       బీద దాసుడిచ్చు ప్రేమ కానుక గొని 
            మంగళంబులు సామి మాకు నొసగు 
       
తే :   గ్రుడ్డి పూలంచు నిర్గందకుసుమమనుచు
        మనసు నందున రోయక మణిసరాల
        టంచు రామానుజుండిచ్చు హారమిదిగొ
       అందుకొనవయ్య శ్రీరామ వందనములు

                                    - శ్రీ తిరుకోవలూరు రామానుజస్వామి

4, అక్టోబర్ 2017, బుధవారం

శ్రీరామ శతకము – 99

సీ   : చంచరీకము తేనె యంచితంబుగ గ్రోలె
                        పరువెత్తు మందార పాదపముకు
         గాక వేమును గ్రోల కడు నుత్సహించునే
                         కమలాక్ష నాయాత్మ కలత లేక
        నీ పదామృత చింత నెమ్మి మానసమందు
                         లగ్నమై యితరంబులకును జనదు
        సామి మతిభ్రమ జరుగకుండగ బ్రోచి
                        కాపాడు మేవేళ కరుణ తోడ
       
తే :   దాసు యీ కోర్కె దీర్చOగ తగును నీకు
         జనని సీతామ తల్లితో సరగ వచ్చి
         మంగళా శాసనము జేసి మమత తోడ
        అందువుకొనవయ్య శ్రీరామ వందనములు !

                                    - శ్రీ తిరుకోవలూరు రామానుజస్వామి

5, జులై 2017, బుధవారం

శ్రీరామ శతకము – 98

సీ   : తనయుడు తండ్రివిధంబు సంబంధంబు
                  జీవేశ్వరుల బంధమవని యందు
          రక్ష్యరక్షక భారరమ్యమౌబంధము
                  నారాయణునకును నరునకెపుడు
         శేషశేషిత్వముల్ చేతనేశ్వరులకు
                 చెవులుగా బంధమై నిలిచియుండు
       భర్త్రుభార్యాబంధ పావన బందము
                  పరమాత్మ నాత్మకు పరుగు నెపుడు
       
తే :   ఆత్మ యాత్మీయ బంధంబు లనగా
           నవ విధంబులఁ బాంధవ్య మనకుం
           వాడె నీవౌట నిన్నింక వదలలేను
          అందువుకొనవయ్య శ్రీరామ వందనములు !

                                    - శ్రీ తిరుకోవలూరు రామానుజస్వామి

2, జులై 2017, ఆదివారం

శ్రీరామ శతకము – 97

సీ  :  బలు  రోగములకెల్ల పరమౌషదంబిది
               పాతకంబుల బాపు భళిరె మందు
         దైత్యుల హతుజేయుదండి యౌషధమిది
                మునులెల్ల పఠియించి మురియుమందు
         ఐశ్వర్య మొసగెడి అందమౌ మందిది
                పాముకాటును  మాన్చు భారి మందు
         భక్తులు జీవించ భవ్య యౌషధమిది
                 దుష్టులు నశియించు దొడ్డ మందు
       
తే :    పెద్దలాచార్యులెల్లరు ప్రీతి గొనెడి
          అదియె అష్టాక్షరని యెడి యాది మందు
          దీని సేవించి సుఖియింతు రను దినంబు
          అందువుకొనవయ్య శ్రీరామ వందనములు !

                                    - శ్రీ తిరుకోవలూరు రామానుజస్వామి

21, ఏప్రిల్ 2017, శుక్రవారం

శ్రీరామ శతకము – 96

సీ :  దాసుని దోషముల్ తరచుగా వినవయ్య
                 విని నన్ను మదిలోన వెఱ్ఱియనకు
        వినయంబులవి నక్కవినయంబులగు దేవ
                 జపము లెల్లను బక జపము లౌను
        మర్కటచేష్టలు మానగలేదెందు
                   శీలంబు మార్జాల శీలమరయ
        శునక వాలమువోలె మనసెందు నిలువదు
                   హృదయంబు కత్తెరైబాధ పెట్టు
       
       
తే :   గోముఖంబును గలవాడ క్రూర మతిని
          ముష్టి పండును బోలు ముఖముఁజూడ
          దుర్గుణంబులు వివిగాంచి దుష్టుడనక
          అందువుకొనవయ్య శ్రీరామ వందనములు !

                                    - శ్రీ తిరుకోవలూరు రామానుజస్వామి

20, ఏప్రిల్ 2017, గురువారం

శ్రీరామ శతకము – 95

సీ :  పరుల సొమ్మును జూచి బాధ జెందుట కన్న
                   పరమాత్మ నినువేడ పరమ సుఖము
         పరుల భోగము జూచి భోరునేడ్చుటకన్న
                    వారనిదన్ గొల్చుట పరమ సుఖము
         అన్యు సంపద జూచి అలమటించుటకన్న
                     అఖిలాండపతి గొల్వ యమరు సుఖము
         అన్య దేవతలను యాశ్రయిOచుటకన్న
                     లక్ష్మివల్లభు సేవ లక్ష సుఖము
         
       
తే :    ఇట్టి సుఖములుచేవీడి యిహముగోరి
           చెడుట నిక్కంబు సౌఖ్యంబు జెందగోరి
           నిన్నెభజియిOతు నేవేళ నిక్కముగను
          అందువుకొనవయ్య శ్రీరామ వందనములు !

                                    - శ్రీ తిరుకోవలూరు రామానుజస్వామి

18, ఏప్రిల్ 2017, మంగళవారం

శ్రీరామ శతకము – 94

సీ :  పంకేరుహాక్షనా సంకటంబులు బాప
                గరుడవాహన యేల కదలి రావు
         మొర నాలకించవా మును గోపికలు వేడ
                నేడేల వినవు నా నేరమేమి
          ప్రియ  మొనరించవా ప్రేమ కుచేలున
                  కప్రియుండని నాకు ఆంక్ష విడకు
           దరి జేర్చవా నన్ను తనయుని గాపాడ
                   భారమా నొకడను భక్తపోష   
       
తే :    భువనములనెల్ల నేవేళ గానలేదె
          నేడు నను గావకుండిన నిందరాదె
          కరుణ జూడుము కడసారి కాంక్ష తోడ
          అందువుకొనవయ్య శ్రీరామ వందనములు !

                                    - శ్రీ తిరుకోవలూరు రామానుజస్వామి

16, ఏప్రిల్ 2017, ఆదివారం

శ్రీరామ శతకము – 93

సీ :  నా మనో భ్రమరంబు నాధ నీ శ్రీపాద
                తీర్ధంబపేక్షించు దిన దినంబు
         జిహ్వ కీరంబులు చింతించు దేవర
                 తళియ ప్రసాదంబు తమిని గ్రోల
          నేత్ర చకోరముల్ నీ ముఖ చంద్రికల్
                   సేవించ నాశించు చిరము గాను
          ఆడియని చిత్తంబు హరి దివ్య తిరుమేను
                   సౌందర్య మీక్షించ చలము సేయు 
       
తే :   దాసుడను నాదు అవయవాల్ దాస్యసేవ
          చేయగోరుచున్నవి శ్రీనివాస
          మనసు స్థైర్యంబు నొనగురమానసుండ
          అందువుకొనవయ్య శ్రీరామ వందనములు !

                                    - శ్రీ తిరుకోవలూరు రామానుజస్వామి

15, ఏప్రిల్ 2017, శనివారం

శ్రీరామ శతకము – 92

సీ :  ధర్మంబు నాల్గు పాదంబుల నడచెను
                 కృతయుగ మందెంచు వెతలు లేక
        మూడు పాదంబుల ముఖ్యమౌ ధర్మము
                  త్రేతాయుగంబున ప్రీతి నడచె
         రెండు పాదములౌచు నుండును ధర్మంబు
                   ద్వాపరంబుననట్లు వాసిగాంచె
          ఏక పాదము ధర్మమీరీతి నుండగా
                    కలియుగంబున నెందు కలహమొందు
       
తే :   జారచోరత్వమవినీతి జవము గల్గి
          ధర్మచింతయు భక్తియు ధర నశించు
          కలియుగంబందు నన్నింక కరుణనేలి
          అందువుకొనవయ్య శ్రీరామ వందనములు !

                                    - శ్రీ తిరుకోవలూరు రామానుజస్వామి

14, ఏప్రిల్ 2017, శుక్రవారం

శ్రీరామ శతకము – 91

సీ :    దారీషణము జూడదగు పక్షులందున
                      మక్కువగా జంట మరులు కొనుచు
           ద్రవ్యేచ్చయాది సర్పరాజుల యందుండు
                      నిధినాశ్రయిOచుచు నిలుచునెప్పుడు
           పుత్రీషణము జూడపుడమి గోవులయందు
                      కనిపించు మక్కువ ఘనముగాను
           ఈషణత్రయమందు నేదియు వదలక
                       కాంక్షించు నరుడు తా కామమొంది
         

తే :   ధరను యైహికమస్థిర ద్రవ్యములను
          తృణముగానెంచి నారాయణుని దలంచి
          నిత్యకైంకర్యమాశించ నిలచినాను
          అందువుకొనవయ్య శ్రీరామ వందనములు !

                                    - శ్రీ తిరుకోవలూరు రామానుజస్వామి

13, ఏప్రిల్ 2017, గురువారం

శ్రీరామ శతకము – 90

సీ :  నింగిని రిక్కాలు నీ యాజ్ఞమీరక
                   పరివేష్టనము చేయు పరిధి విడక
         శశిభాను గ్రహములు సప్తర్షులెల్లరు
                   అవధిదాటక తిర్గునంబరమున
        జలధులు నీ యాజ్ఞజగముల ముంచక
                    చెలియలి కట్టను చేరవెరచు
        కలిదోషమున జేసి మలిన మానసు నౌట
                    ధర్మ శాస్త్రములెల్ల తప్పుయనుచు
       
తే :    వేదములకపార్థంబులు వేరెదెలిపి
           భాగవత ధర్మ పద్ధతుల్ పారద్రోలి
           నాశ మొందుచునుంటిని నన్నువిడక
          అందువుకొనవయ్య శ్రీరామ వందనములు !

                                    - శ్రీ తిరుకోవలూరు రామానుజస్వామి

12, ఏప్రిల్ 2017, బుధవారం

శ్రీరామ శతకము – 89

సీ :  మన్మధా నను నీవు మరులుగొల్చెదనంచు
                  గర్వించి వేధించకను తొలంగు
        శివుని మూడవకన్ను చిచ్చుచే నీకైన
                   శాస్తిని గుర్తించి చనుము వేగ
        వినవేవి నీకిదె విష్ణుచక్రమువచ్చి
                    రూపురేఖలుమార్చి రూపు మాపు
        భక్తుల బాధించు పాపులు వెంటనే
                    ఘోరమౌనిరయాన గూలఁగలరు
       
తే :    అభయ హస్తుడు మాధవుడండ యుండ
           మారుడైనను హరుడైన మ్రందు నిజము
           గాన నాతండ్రి యెడబాయలేను నిన్ను
          అందువుకొనవయ్య శ్రీరామ వందనములు !

                                    - శ్రీ తిరుకోవలూరు రామానుజస్వామి

10, ఏప్రిల్ 2017, సోమవారం

శ్రీరామ శతకము – 88

సీ :  దీనదయాళుడ దివ్యస్వరూపుడ
                నామొరాలించవా నళిననేత్ర
        దారాసుతాదులు ధారమౌ సంకిళ్లు
                ఆభాసబాంధవు లాప్త వరులు
        చుట్టాలు శత్రువుల్ నట్టేటి నక్రముల్
               అగ్రజుల్ భాగినులు యుగ్రకరులు
        సంసార సంబంధ సంస్రిత మానవుల్
              శార్దూల శునకాది సర్పసములు
       
తే :   ఘోరముగ మీద లంఘించి గోడుగుడువ
           జేయుతరి రుగ్మతయుగూడి చేయుకీడు
           గాన ననుగావు కళ్యాణకర మహాత్మ
          అందువుకొనవయ్య శ్రీరామ వందనములు !

                                    - శ్రీ తిరుకోవలూరు రామానుజస్వామి

9, ఏప్రిల్ 2017, ఆదివారం

శ్రీరామ శతకము – 87

సీ :  వింతనా మారీచు వేయామడల గొట్ట
                ఘనమదాకపిరాజుగాచుటెంత
        పంత మాచుపనాతి పాపిని ద్రోలుట
                గొప్ప నా పూతన గుల్చు టెంత
         తంత్రమాజలరాశి దాటగా నదిఎంత
               బాధ యాజానకి బాయుటెంత
        ఎంత యాశబరి చిరకాలమున బ్రోవ
               పేర దారుక్మిణి పెండ్లి ఎంత
       
తే :    వింతలను గొప్పలివి కావు కొంతలౌను
          పంతముతో నన్ను రక్షించ పాటుపడిన
          సుంత యికలేదు ఘనుడవు శూరుడవును
          అందువుకొనవయ్య శ్రీరామ వందనములు !

                                    - శ్రీ తిరుకోవలూరు రామానుజస్వామి

8, ఏప్రిల్ 2017, శనివారం

శ్రీరామ శతకము – 86

సీ :  కాయంబు నమ్మంగ నాయంబె నరునకు
                 పాయును భువియందు పాయ ఋణము
        హేయంబు సంసారకామంబు నిక్కంబు
                 ఆయాసమధికమౌ యాత్మకెపుడు
        ధ్యేయంబుయాత్మకు దివ్యంబు స్థిరమోచు
                  పారాయణము రాముభజన మెపుడు
        సాయంబు నాకౌ నుపాయంబుమది జూడ
                  నారాయణుడె రక్షనయముగాను
       
తే :    ఏయాపాయంబులేదింక యిలను నాకు
           ఆ దయాళుని యెడబాయ ననవరతము
           తండ్రివైరక్షసలుపంగ దగుదువీవు
          అందువుకొనవయ్య శ్రీరామ వందనములు !

                                    - శ్రీ తిరుకోవలూరు రామానుజస్వామి

7, ఏప్రిల్ 2017, శుక్రవారం

శ్రీరామ శతకము – 85

సీ :  కరములారా మీరు కమలాక్షు నర్చించి
                 భజనంబుజేయుచు బాగుపడుడు
         నేత్రంబులార యా నీరజాక్షుని రాము
                  కనులార జూచుచు కనుడుసుఖము
         వీనులారా మీరు వేదాంత వేద్యుని
                  విమల చరిత్రంబు వినుడు సతము
         మననమా నీవింక మాధవు స్మరియిOచి
                  గలిగిన కాలంబు గడుపు సుఖము
       
తే :    పాదములు మీరు పరమాత్ముపదము లంట
           పరుగులిడరండు పాపంబు భయమదేల
           భక్తజనులను రక్షించు భవ్య మూర్తి
          అందువుకొనవయ్య శ్రీరామ వందనములు !

                                    - శ్రీ తిరుకోవలూరు రామానుజస్వామి

6, ఏప్రిల్ 2017, గురువారం

శ్రీరామ శతకము – 84

సీ :  నీ సృష్టి జాలంబు నీకొక వింతయా 
                   పృథివి నీకిది యెంత పేద రజము
        జలధులన్నియు నొక్క జలబిందువన  నొప్పు
                   రవి తేజసంతయు దివిటీ బోలు
        వాయువే నొక యూర్పువలె నుండునేగాని
                   అభ్రమే రంధ్ర మట్లమరుదేవ
         బ్రహ్మాది దేవతల్ బహు సూక్ష్మ జీవులై
                    విశ్వమందుండును వివిధ గతుల
       
తే :    వైభవము నీదు వర్ణింప వశము గాదు
           ఏరు నీ వైభవము గన్న వారొ వారి
           వారివారిని గొలిచెద వసుధ నెపుడు
          అందువుకొనవయ్య శ్రీరామ వందనములు !

                                    - శ్రీ తిరుకోవలూరు రామానుజస్వామి

4, ఏప్రిల్ 2017, మంగళవారం

శ్రీరామ శతకము – 83

సీ :  అపరాధి వాయసుండంఘ్రలంటిన నాడు
                     రక్షింప లేదహో  రామభద్ర 
         శిశుపాలు దోషముల్ చెప్పరానివి యైన 
                     క్షమియింప లేదహో చక్రహస్త    
         పాపిష్ట్య జామీళు పాపముల్ తొలగంగ 
                     పారద్రోలిన కృపాకర మహాత్మ 
         పాంచాలి సభ కీడ్చి భంగంబు గావించు 
                     కురురాజు నేలవే కూర్మి తోడ           
తే :    పాపులైనను వీరెల్ల బాగుపడిరి
           పచ్చి పాపంబు నేజేసి వచ్చినాడ
           నీచుడను నన్ను గాపాడ నీవే దిక్కు
          అందువుకొనవయ్య శ్రీరామ వందనములు !

                                    - శ్రీ తిరుకోవలూరు రామానుజస్వామి

2, ఏప్రిల్ 2017, ఆదివారం

శ్రీరామ శతకము – 82

సీ :  దీన రక్షక దేవ దీన దయాళుడ
                నీనామ స్మరణంబె  నేను జేతు
         పుడమి యందేమి యేభువనమందున్నను
                నరక మందున్నను నళిన నాభ
          స్వర్గమందున్నను వైకుంఠముననున్న
                 పాతాళమందున్న పద్మనాభ
           ఎచట నేనున్నను ఇసుమంత భయమొOద
                  నిన్నే స్మరించుచు నిలువగలను

                
తే :   పాపి జారుడు చోరుడు పరమ నీచు
         డంచు మదినెంచి యెడబాయ నెంచితేని
         పాదములు రెండు గట్టిగ పట్టుకొనెద
          అందువుకొనవయ్య శ్రీరామ వందనములు !

                                    - శ్రీ తిరుకోవలూరు రామానుజస్వామి

1, ఏప్రిల్ 2017, శనివారం

శ్రీరామ శతకము – 81

సీ :  కంఠంబునందెప్డు కఫమునిండగ బాధ
                గురగుర ధ్వనులనిన్ గుర్తుగొనను
         ఆలుబిడ్డలు జూచి యయ్యయోయని యేడ్వ
                 ధ్యాసలేకెంతయు దలఁప నిన్ను
          జనులాస వీడ్కొని చనిపోవు నంచేగ
                  కనరాదు నీరూపు కన్నులకును
          యమదూతలీ యాత్మ ఎడము చేయనురాగ
                  నిను దలంచెడి శక్తి నిలువగలదె
                
తే :   చెప్పలేనన్ని బాధలు చివర చేరి
          నరకముల పాలబడ జేయునాథ నిజము
          గాన కీర్తింతు నిప్పుడే కమలనాభ
          అందువుకొనవయ్య శ్రీరామ వందనములు !

                                    - శ్రీ తిరుకోవలూరు రామానుజస్వామి

31, మార్చి 2017, శుక్రవారం

శ్రీరామ శతకము – 80

సీ :  స్థిరముగాదీ జన్మ చిరకాలముండంగా
                  ఎప్పుడు మరణంబొ చెప్పలేను
         గ్రామమందో లేక గహన మధ్యంబునో
                     జలములందో లేక తలమునందో
         అగ్నియందో లేక యారామ మందునో
                      గుట్టు చెట్టులుగాక పుట్టలందొ
         పగటియందో లేక పాడు చీకటియందొ
                     పడిపోవు దేహంబు పసను విడచి
                
తే :   దేవ మరణంబు వచ్చుట తెలియలేను
          స్మరణ మాత్రము నీయందె స్థిరతనుండు
          పుండరీకాక్ష నీవాడ బ్రోవు మెపుడు
          అందువుకొనవయ్య శ్రీరామ వందనములు !

                                    - శ్రీ తిరుకోవలూరు రామానుజస్వామి

30, మార్చి 2017, గురువారం

శ్రీరామ శతకము – 79

సీ :  జీవుండు కర్మలు జేసి జన్మలనెత్త
               తల్లి గర్భము లోకి తరచు వెడలు
         రక్త మాంసంబులు రక్తితో నటగుడ్చి
               గర్భాద్యవస్థల గడుపు వేళ
          భగవాను ధ్యానించి పలుమారు చింతించు
                నవమాసములు నిండినవని పుట్టి
          బాల్య యౌవన వృద్ధ భావి జీవితములొ
                 అజ్ఞాన వశ్యత నంధుడగుచు

                
తే :   చేయరానట్టి పనులెల్లజేసి తుదకు
          కాలకింకరు బాధల తాళలేక
           వరద శ్రీవేంకటేశంచు మొరలు పెట్ట
          అందువుకొనవయ్య శ్రీరామ వందనములు !

                                    - శ్రీ తిరుకోవలూరు రామానుజస్వామి

శ్రీరామ శతకము – 78

సీ :  సంసార సంద్రమే హింసాకరంబయ్యె
                     దరిదాపు లేక నేవెరపుగొంటి
        ఈషణత్రయ సుళ్ళు భీషణంబుగ జేర
                     పంచేంద్రియంబులు పట్టు దప్పె
         తాపత్రయాదులు తాపమొOదించగ
                     ప్రకృతి బద్ధుడనౌట వికృతి నైతి
         మునుగుచు తేలుచు మోహమందుచు దేవ
                      భోరు మంచరచుచు మోదుకొంటి

                
తే :   చక్రభ్రమణంబు నందిట్లు వక్రగతిని
          వేదనల నిండి నినుగన వేదవేద్య
           సన్నుతించెద నిదె వేగ నన్ను బ్రోవ
          అందువుకొనవయ్య శ్రీరామ వందనములు !

                                    - శ్రీ తిరుకోవలూరు రామానుజస్వామి

29, మార్చి 2017, బుధవారం

శ్రీరామ శతకము – 77

సీ :  శైశవ దశనుండి సామి నేనెప్పుడు
              నిన్వీడి యుంటివా నిజముగాను
       బాల్యమందైదేండ్ల ప్రాయమందేయుండ
               ననుజేరబిల్చిన నాధుడెవరు
        యౌవనంబున నేను జవ్వనిగూడుచు
                వెంగలినై నిన్ను విడిచినానె
        పలుబాదలందున బహునేర్పుతో నన్ను
                రక్షించితివిగాదె రంగుగాను
                
తే :   చాటుగనుయుండి రక్షణ సేయు నీవు
          నేటికిని చూపవదియేమి నీదు రూపు
          దీన జనునకు కాంక్షను దీర్చ వేగ
          అందువుకొనవయ్య శ్రీరామ వందనములు !

                                    - శ్రీ తిరుకోవలూరు రామానుజస్వామి

28, మార్చి 2017, మంగళవారం

శ్రీరామ శతకము – 76

సీ :  బాల్యమందున నన్ను బహు ప్రేమగాపాడి
                 దయను రక్షించిన తండ్రివీవె
        విద్యయు నిర్వంగ విమలుల స్నేహంబు
                  ఘటియిల్లజేసిన కాంతులిడీవె
        అధ్యాపకుని వృత్తి యమరనిప్పించియు
                  పాలించగలిగిన ప్రభువు నీవె
        సంగీత సాహిత్య సారస్వతములిచ్చి
                 పేరు రప్పించిన పెద్దవీవె
                
తే :   ఇట్లు నన్నెందుబాయక యిOపుగాను
          గుండె ధైర్యము గలిగించి కుందుదీర్చి
          నేటికి రక్ష సలిపెడి నీరజాక్ష
          అందువుకొనవయ్య శ్రీరామ వందనములు !

                                    - శ్రీ తిరుకోవలూరు రామానుజస్వామి

27, మార్చి 2017, సోమవారం

శ్రీరామ శతకము – 75

సీ :  విష్ణుభక్తియులేని విప్రవర్యునినైన
                 శూద్రుడంచును శాస్త్ర సూక్తి నుడువు
        విష్ణుభక్తియుగల్గు వేదేతరునినైన
                  విప్రుడందురు వారి విమలులెల్ల
        ఏవర్ణజుండైన యేకులస్తునినైన
                  విష్ణు గొల్చినవాడె వైష్ణవుండు
        శృతులును స్మృతులితి హాసములీరీతి
                 ఘోషించు నెప్పుడు గురుతరముగ

                
తే :   వర్ణ హీనులు బాలురు వనితలైన
          భక్తి నారాయణుని గొల్వ ముక్తి బడయ
           నర్హులంచును వినమె నన్నర్హు జేయ
          అందువుకొనవయ్య శ్రీరామ వందనములు !

                                    - శ్రీ తిరుకోవలూరు రామానుజస్వామి

26, మార్చి 2017, ఆదివారం

శ్రీరామ శతకము – 74

సీ :  రామ నీ రెండక్షరంబులు జపియించి
                     వాల్మికి మోక్షంబు వాసిగాంచె
        ఖట్వాOగుడను వాడుకడుమోద మందుచు
                     హరిని జపించుచు పరముగనెను
        నారాయణాయని నందనున్ స్మరియించి
                    ఆ యజామీళుడు హరిని జేరె
        సభలోన శౌరినిస్మరియించి ద్రౌపది
                   అక్షయంబుగ వల్వలందుకొనెను

                
తే :   ఎందరెందరొ మహనీయులిట్లునిన్ను
          యెప్పుడెప్పుడు పిల్చినప్పుడపుడే
           పలికిరక్షింతువన విని దలతునిన్ను
          అందువుకొనవయ్య శ్రీరామ వందనములు !

                                    - శ్రీ తిరుకోవలూరు రామానుజస్వామి

24, మార్చి 2017, శుక్రవారం

శ్రీరామ శతకము – 73

సీ :  వెరపించి వత్సాపహారంబు గావించు 
               బ్రహ్మదేవుడు మున్ను భంగపడియె
         కామించె మోహినిన్ కాముకత్వము దీర
               సిగ్గుచే రుద్రుOడు చింతనొOదె
          నారదుండానాడు నారిరూపంబొంది
                బహునందనులగని బాధ జెందె
          మానభంగము చేయ మానిని సభకీడ్చి
                దుర్యోధనుడు సృక్కె తులువ యగుచు

                
తే :   వేల్పులింకెందరో నీదు విశ్వరూప
          మెరుగలేరనుచుండ నేనెరుగుటెట్లు
          నన్ను దాసుని బ్రోవుము సన్నుతించు
          అందువుకొనవయ్య శ్రీరామ వందనములు !

                                    - శ్రీ తిరుకోవలూరు రామానుజస్వామి

23, మార్చి 2017, గురువారం

శ్రీరామ శతకము – 72

సీ :   బ్రహ్మంబునెఱుగుట బ్రాహ్మణ విధియని
                     ఉపనిషత్తులు దెల్పు నుర్వియందు
         క్షాత్రంబుతోక్షితి క్షత్రియుల్ పాలించ
                     విధియని దెల్పదే వేదమెపుడు
         వాణిజ్య కృషి యెల్ల వైశ్యుని విధియంచు
                      తెల్పవా గ్రంధముల్ దెప్పరముగ
         అగ్రజాతులసేవ అవనిలో విధియని
                      చూపించు శాస్త్రముల్ శూద్రులకును
                
తే :   భగవదాచారక వైష్ణవ భక్తి యొకటె
          వైష్ణవుడకుండు చెడకుండ వసుధ నెపుడు
           ననగవిని వైష్ణవుల దాసుడైతినయ్య
          అందువుకొనవయ్య శ్రీరామ వందనములు !

                                    - శ్రీ తిరుకోవలూరు రామానుజస్వామి

21, మార్చి 2017, మంగళవారం

శ్రీరామ శతకము – 71

సీ :  కనుగొందునా నీదు కమనీయ రూపము
                 కనుల పండువుజేయ కమల నాభ
        విందునా నీదివ్య వేదాంత సూక్తులు
                శ్రవణేంద్రియంబుల శ్రమదొలంగఁ
        దర్శింతునా దేవ ధర్మమూర్తిని నిన్ను
                 మదిలోని మమత తన్మయమునొOద
        పూజింతునా నిన్ను పూలమాలలచేత
                 కరముల కండూతి కదలిపోవ 
                
తే :   పరమపదనాధ వైకుంఠపురవిహార
         శంఖ చక్ర గదా ఖడ్గ శారజ్ఞ హస్త
         యెన్నడెట్లుద్ధరింతువో యేమొ స్వామి
          అందువుకొనవయ్య శ్రీరామ వందనములు !

                                    - శ్రీ తిరుకోవలూరు రామానుజస్వామి

20, మార్చి 2017, సోమవారం

శ్రీరామ శతకము – 70

సీ :  వరద నారాయణ వాసుదేవ ముకుంద
                         గజరాజు మొరలిడగాన జనవె
         గోపాల మాధవ గోవింద నరసింహ
                          పాOచాలి రక్షించ పరుగులిడవె
         దామోదరా! కృష్ణ! దశరథ నందనా!
                          శబరివిందులగోరి చనగలేదె
         వేంకటేశ జనార్ధనాంకిత ప్రియవేష
                           రాతి నాతిగజేయ ప్రీతి జనవే 

తే :    భక్తులింకెందరో యిట్లు భజనజేయ
           వేసములమార్చి మదిని ప్రయాస పడక
           కరుణ రక్షించవే నన్ను గాంక్షబ్రోవ
          అందువుకొనవయ్య శ్రీరామ వందనములు !

                                    - శ్రీ తిరుకోవలూరు రామానుజస్వామి

19, మార్చి 2017, ఆదివారం

శ్రీరామ శతకము – 69

సీ :  పుణ్యముల్ జేసిన పురుషుOడు స్వర్గము
                     నంది భోగంబులననుభవించు
         పాపకర్మలు చేయు పాపులు నరకము
                      చేరి దుఃఖంబుల చేటువొOదు
          పాపపుణ్యంబులు పరగజేసినవాడు
                       భువియందు కర్మేఛ్చపుట్టు చుండు
          జన్మ పరంపరల్ జగతిగల్గిననేమి
                        మదిలోన చింతించు మాటలేదు

తే :    చిత్తమెప్పుడు నీయందుజేర్చియుంతు
           మనసు నిన్వీడకుండగా మరులుగొనుచు
           చిరము నీనామ స్మరణంబె చేరికొలుతు
          అందువుకొనవయ్య శ్రీరామ వందనములు !

                                    - శ్రీ తిరుకోవలూరు రామానుజస్వామి

18, మార్చి 2017, శనివారం

శ్రీ మహావిష్ణుని 21 అవతారములు

మనలను ఎవరైనా శ్రీ మహావిష్ణుని అవతారములు ఎన్ని అని అడిగితే మనం ఠక్కున 10 అని చెప్తాము కదా! కానీ హైందవ ధర్మం ప్రకారం భగవానుడు సృష్టిలోని ప్రతి చరాచరములలో నిండి ఉన్నాడు. కానీ ఆ విష్ణు భగవానుని లీలలు చెప్ప బడిన శ్రీమద్ భాగవతం ప్రకారం శ్రీమహావిష్ణువు ఇప్పటివరకు ధరించిన అవతారములలో ముఖ్యమయినవి 21.  21 ముఖ్యమయిన అవతారములు ధరించి భూమిమీదకు వచ్చారు. మరి అవి ఏమిటో ఇప్పుడు చూద్దామా!

  1.  సనత్కుమారుడు 
  2. వరాహ 
  3. నారదుడు 
  4. నర నారాయణులు (ఇద్దరు)
  5. కపిల మహర్షి 
  6. దత్తాత్రేయుడు 
  7. యజ్ఞుడు 
  8. ఋషభ దేవుడు 
  9. పృధు మహారాజు 
  10. మత్స్యం 
  11. ధన్వOతరి 
  12. కూర్మం 
  13. మోహిని 
  14. నృసింహ 
  15. వామన 
  16. పరశురామ 
  17. వ్యాస మహర్షి 
  18. శ్రీరామ 
  19. శ్రీ కృష్ణ 
  20. బుద్ధ 
  21. కల్కి 
వీరి గురించి వివరంగా తరువాతి టపా లలో తెలుసు కుందాం!

17, మార్చి 2017, శుక్రవారం

శ్రీరామ శతకము – 68

సీ :  వేదపురుషుOడెల్లవే దంబులకుఁబాడి
                       విసిగెను నీయంతు వాసిగనుక
        ద్రావిడామ్నాయముల్ తనివితీరక పాడి
                       ఆళ్వార్లు విసిగిరి యంతుగనక
        తిరుపాణి త్యాగయ్య తిరునామములు పాడి
                        నిలిచిరి నింన్గొల్చు నేర్పు గనక
        వాల్మీకి పోతన వ్యాసులు నినుపాడి
                       అంతుగానక వీడిరంతుగనక

తే :   వైభవము నీదువ్యాహృతివశమె తెలియ
          అల్పుడను దేవ అజ్ఞుల అలసుకాడ
           చిన్న పాటల మెచ్చుచు నన్ను విడక
          అందువుకొనవయ్య శ్రీరామ వందనములు !

                                    - శ్రీ తిరుకోవలూరు రామానుజస్వామి

16, మార్చి 2017, గురువారం

శ్రీరామ శతకము – 67

సీ :   వేమారు నేబిల్వ వినవెందుకీ కక్ష
                     వినిపించుకోవేల దీన రక్ష
         జన్మంబులిక నెత్త జగతి జాలున కాంక్ష
                     కమలాక్ష మాకిది కఠిన శిక్ష
         భక్తుల రక్షించు పనియైన యీ దీక్ష
                      పక్షివాహన నీకు బహు యపేక్ష
         నీమూర్తి కనుపించ నిజమునాకిడు భిక్ష
                       సరియైనదని ఎంచ సారసాక్ష

తే :   కుక్షి నీయందు నరులుండు కోటిలక్ష
         వానినేవిధి రక్షింతో వారిజాక్ష
          దాసు రక్షించుటది యొప్ప ధర్మ దీక్ష
          అందువుకొనవయ్య శ్రీరామ వందనములు !

                                    - శ్రీ తిరుకోవలూరు రామానుజస్వామి

15, మార్చి 2017, బుధవారం

శ్రీరామ శతకము – 66

సీ :   శ్రీరామ నీయండ చిరకాలముండగ
                  తాపముల్ లేకుండు ధరణినిండ
         పతిత పావను దండ కైదండ నాకుండ
                   పాప పిందులు నన్ను పాయునండ
         దండిదాతను జేరు తనయుండ దాసుండ
                   తండ్రియైరక్షించు ధార్మికుండ
         కోదండ మెక్కిడి కూరిమి కాపుండ
                   మా బాధలిక తీరు మనసునిండ

తే :   మాకు సిరులిచ్చి రక్షించు మాధవుండ
          గొనుము నేనిచ్చు పూదండ మేను నిండ
          నిండు హృదయంబు నీ యందె నిలచియుండ
          అందువుకొనవయ్య శ్రీరామ వందనములు !

                                    - శ్రీ తిరుకోవలూరు రామానుజస్వామి

14, మార్చి 2017, మంగళవారం

శ్రీరామ శతకము – 65

సీ :   కౌసల్య దేవకీ గర్భంబులా నీకు
                   చెరసాలలాయెనా చిట్టి తండ్రి
         మధురలో కంసుడు మామ యేర్పరచిన
                   చెరసాలె పుట్టిల్లు చిట్టి తండ్రి
         కాంతల కౌగిళ్లె కఠినబంధములౌచు
                     చెరసాలలాయెనా చిట్టి తండ్రి
          భక్తుల హృదయాలె పరమాత్మ నీపాలి
                     చెరసాలలాయెనా చిట్టి తండ్రి

తే :   వింతవింతల చెరసాలలంతు దెలిసి
         నాదు హృదయమ్మె చెరసాల నవ్యమనుచు
          చేరిసంతృప్తి పూజలదేరి తండ్రి
          అందువుకొనవయ్య శ్రీరామ వందనములు !

                                    - శ్రీ తిరుకోవలూరు రామానుజస్వామి

13, మార్చి 2017, సోమవారం

శ్రీరామ శతకము – 64

సీ :   ముందుమాలాకారు దండంబుగానిచ్చు
                విరులదండలు నీవువేగ గొనవే
         భక్తి కుబ్జిచ్చుబహు పూల దండలు
                 కామించి గైకొనవె కాంక్షతోడ
          ఆండాళుముడిచిన హారంబులవిగొని
                   భోగ్యంబుగా మేనబూనలేదే    
          తొందరడిప్పొడితో మాలలీయగా
                    తిరుమేను సౌరెచ్చ దేవగొనవె

తే :   దాసుకడలేదు సౌగంధి దామములును
         ప్రేమయంజలి దామముల్  పెక్కుగలవు
          దాచియుంచితి దయతోడ దాల్చిమేన
          అందువుకొనవయ్య శ్రీరామ వందనములు !

                                    - శ్రీ తిరుకోవలూరు రామానుజస్వామి

12, మార్చి 2017, ఆదివారం

శ్రీరామ శతకము – 63

సీ :    కౌసల్య రామన్న కరుణించవేయన్న
                  కఠినాత్ముడవుగావు కదలవన్న
          మమునీవు శిక్షించ మారాముతగదన్న
                  మంకుపట్టిది నీవు మానవన్న
          పాలు పెరుగు దిన్న పసివాడవౌదన్న
                    విశ్వరూపంబెట్ల నెలయునన్న
          మా దోషములు యెOచి మదినుంచుకోయన్న
                  మాపాల నెనరుంచి మరువకన్న      

తే :   వెన్నగాదొక నీమది నన్ను గన్న
          చిన్నవాడను నన్నేలు పున్నెమున్న
          కన్నతండ్రివి నీకన్నగాన మిన్న
          అందువుకొనవయ్య శ్రీరామ వందనములు !

                                    - శ్రీ తిరుకోవలూరు రామానుజస్వామి

11, మార్చి 2017, శనివారం

శ్రీరామ శతకము – 62

సీ :     మేనెల్ల కృషియిOచె మేధ తొలంగెను
                  ధైర్యమ్ము వమ్మయ్యె తండ్రినిజము
           మనసునిల్కడతప్పె మరపువాటిల్లెను
                  జవసత్వములు క్రుంగె జనకనిజము
           ఇంద్రియంబులు సోలెఇరవు మీరచునుండె
                  నవనాడులవిక్రుంగె నాధ నిజము
            ప్రాణముల్ చలియిOచె పసనుపోగొట్టెను
                   ధీరత్వమది తగ్గె దేవ నిజము

తే :   చెప్పరానట్టి బాధలు చేరె నిజము
          ఆలసించిన ప్రాణముల్ అవిసిపోవు
          దిక్కులేనట్టి నాకింక దిక్కునీవె
          అందువుకొనవయ్య శ్రీరామ వందనములు !

                                    - శ్రీ తిరుకోవలూరు రామానుజస్వామి

10, మార్చి 2017, శుక్రవారం

శ్రీరామ శతకము – 61

సీ :  శ్రీ లక్ష్మి సీతమ్మ సిరులమేటి గడమ్మ
              చిన్న నీకొమరుని చేరవమ్మ
         ఆలగావరివాని నాశ్రయించితినమ్మ
              అడవి ద్రిమ్మరి నంచు వీడకమ్మ
          అపరాధిరక్షించుటది నీకె తగునమ్మ
               మాధవు వినిపించు మాతవమ్మ
           ఆత్మలాక్రోశించ నదియెట్లు వినెదమ్మ
                 ఆర్తిని పోగొట్టు మూర్తివమ్మ        

తే :  దయకు నేకేరుసాటి యౌదార్యులమ్మ
         భర్త నెడబాయకుండెడి పడతివమ్మ
         తల్లిదండ్రులు మిమ్మింక ధరను విడను
          అందువుకొనవయ్య శ్రీరామ వందనములు !

                                    - శ్రీ తిరుకోవలూరు రామానుజస్వామి

9, మార్చి 2017, గురువారం

శ్రీరామ శతకము – 60

సీ :  భక్తులు నీపాదపద్మముల్ విడరంచు
                 నెగసిపోయెడి పక్షినెక్కినావు
        నీ సేవకులు చుట్టూ నిలిచి పోదురటంచు
                 పాలసముద్రమునందు వెలసినావు
        దాసదాసులు నిన్నుతలచి విడువరటంచు
                 పాముపై నీశయ్య పరచినావు
        భృత్యులు నినుజేరి పీడింతురని ఎంచి
                 పరమ పదంబున కరగినావు

తే : భక్తజన పోషన్యాయంబె పరుగులిడగ
        దీనజనులకు తెరువేదో తేటపరచు
        ఇంక నిను వీడి మనలేను పంకజాక్ష
        అందువుకొనవయ్య శ్రీరామ వందనములు !

                                    - శ్రీ తిరుకోవలూరు రామానుజస్వామి

                                 

20, ఫిబ్రవరి 2017, సోమవారం

శ్రీరామ శతకము – 59

సీ :  చెట్టునై విరుల సేవజేసితంచ
                   పూర్వపుణ్యంబులు పొసగవేమొ
        బండనై గుడియందు బడియుండి తరియించ
                 పూజచేయగలేనొ పూర్వమందు
       గడపనై నీరూపుకనుచు సంతోషించ
                 నోమునోచగ లేదో కమల నాభ
      పక్షినైయెదుటను పాటలు పాడంగ
                  అదృష్టరేఖేందు యమర లేదొ

తే : మనిషినై యుండి నీయందు మనసులేక
       మానవత్వము విడనాడి మరపుజెంది
       చపలుడౌటను నీసేవసలుసలుపలేను
      అందువుకొనవయ్య శ్రీరామ వందనములు !

                                    - శ్రీ తిరుకోవలూరు రామానుజస్వామి

18, ఫిబ్రవరి 2017, శనివారం

శ్రీరామ శతకము – 58

సీ :    మాధవుడేడని మతి మాంద్యుడడిగిన
                          మాట యేమనవలె మాన్యుచెపుమ
          నరహరి యేడని నాస్తికుడడిగిన
                         నాధ యేమనవలె నాకు నుడువు
          బౌద్ధజైనులు వచ్చి భగవంతుడేడన
                          ప్రత్యుత్తరము నెట్లు పలుక వలెను
          యవనహుణులు జేరి హరి ఎందుగలడన్న
                          ఏమని జెప్పుదు యెరుగజేయు

తే :   నిజమునీరూపు నీయున్కి నిలుకడెచటో
          వాస్తవంబు దెల్పి నాస్తికవాదముడుపు
          నీదే భారంబు నిన్నమ్మి నిన్నెగొలుతు
          అందుకొనవయ్య శ్రీరామ వందనములు !

                                    - శ్రీ తిరుకోవలూరు రామానుజస్వామి

17, ఫిబ్రవరి 2017, శుక్రవారం

శ్రీరామ శతకము – 57

సీ :   ధర్మంబులిడుమని దయను నేగోరను
                 కామ్యంబులొందను కాంక్షలేదు
        అర్ధించగనులేను యర్ధంబునిమ్మని
                మోక్షమిమ్మంచును ముదము గోర
       దృడకాయమిమ్మని దృఢముగా నేవేడ
               తపసి కావలెనను తపన లేదు
      సతతంబు నీనామ స్మరణమే జేయుచు
              గలిగినకాలంబు గడపుటకును

తే :   కోరుచుండెద నామది కూర్మితోడ
         ఇంత మాత్రమె నొసగను పంతమేల
         క్రూ రుడని  ఎంచినామీద కోపపడక
         అందుకొనవయ్య శ్రీరామ వందనములు !

                                    - శ్రీ తిరుకోవలూరు రామానుజస్వామి