27, జనవరి 2016, బుధవారం

నారద కుండం

ముక్తి కుండం గురించి ఇంతకుముందు చెప్పుకున్నాం కదా! మరి నారద కుండం  ఎక్కడ ఉన్నది అనే అనుమానం ఇక్కడ తీరుస్తాను.
సర్పవరంలోని భావనారాయణ దేవాలయం దగ్గరలో ముక్తి కుండం ఉంది అని చెప్పుకున్నాం కదా! దానికి కొంచెం దూరంలో ఈశాన్యం దిక్కుగా ఈ నారద కుండం ఉంటుంది. నడువగలిగిన వారికి దాదాపు 15 నిముషముల దూరంలో ఉంటుంది ఈ నారద కుండం. శ్రీ భావనారాయణ స్వామి దేవాలయం నుండి సర్పవరం జంక్షన్ కు వెళ్ళే దారిలో ఎడమ చేతివైపున ఉన్న ఒక చిన్న సందులో లోపలకు ఉంటుంది ఈ నారద కుండం.  నారద కుండం ఒడ్డున శ్రీ భవానీ సమీత శ్రీ నీలకంఠేశ్వర స్వామి సన్నిధి ఉన్నది. ఈ నారద కుండమునకు ప్రతినిత్యం సాయంత్రం 7. 00 గంటలకు నక్షత్ర మరియు కర్పూర హారతులు ఇస్తారు.
ఈ దేవాలయం లో ఉన్న మరో ప్రత్యేకత "సప్త ఋషి మండలం", "దక్షిణామూర్తి దేవాలయం మరియు ధ్యాన మందిరం".  ఈ దేవాలయంలో సప్తఋషుల శిలాప్రతిమలు ఉన్నాయి. వారికి చిన్ని మందిరములు కూడా ఉన్నాయి. వారి మన్దిరములకు ముందు ఒక్కో మొక్క ఉన్నాయి.
ఆ వివరములు
  1. కశ్యపుడు - తులసి 
  2. అత్రి - అవిస 
  3. భరద్వాజ - ఉత్తరేణి 
  4. విశ్వామిత్ర - మారేడు 
  5. జమదగ్ని - గరిక
  6. గౌతముడు - ఉమ్మెత్త 
  7. వసిష్ఠ - జమ్మి 
ఈ మహర్షులకు ఆయా మొక్కలకు గల సంబంధం నాకు తెలియలేదు. వీరే కాక అక్కడ వాల్మీకి మహర్షి, వేద వ్యాసుడు, బమ్మెర పోతన మరియు ఆదిశంకరాచార్య -ప్రతిమలు ఉన్నాయి. ఈ దేవాలయ ప్రాంగణంలో దుర్గాదేవి ఆలయం కూడా ఉన్నది.
ఈ దేవాలయంలో జరిగే పూజల వివరములు 

  1. ప్రతినెలా శుద్ధ త్రయోదశి సాయంత్రం 7 గంటలకు పార్వతి కల్యాణం (భక్తులకు ఉచితం)
  2. పౌర్ణమికి కుంకుమ పూజలు నిర్వహిస్తారు  (పూజా ద్రవ్యములు ఉచితం)
  3. మాస శివరాత్రి రోజున సాయంత్రం 6. 30 కి అమ్మవారికి స్వామివారికి ప్రదోష పూజలు జరుగును 
పూజలు చేయించు కోవాలనుకునే వారు సంప్రదాయ దుస్తులలో రావలసి ఉంటుంది.  

కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి