17, అక్టోబర్ 2014, శుక్రవారం

నిమి - జనకవంశం

నిమి ఇక్ష్వాకు పుత్రుడు. సూర్యవంశస్థుడు. ఒకనాడు నిమికి సత్రయాగం ప్రారంభించవలెను అనే కోరిక పుట్టినది. తమ కులగురువైన వసిష్ఠ మహర్షి వద్దకు వెళ్లి యాగం తనతో చేయించమని అడిగాడు. కానీ అప్పటికే వసిష్ఠమహర్షి ఇంద్రునిచే ఒక యాగం చేయిస్తాను అని ఒప్పుకున్నాడు కనుక దేవలోకమునకు వెళ్లి ఇంద్రునిచే యాగం పూర్తీ చేసి తిరిగి వచ్చిన తరువాత సత్రయాగం చేస్తాను అని చెప్పాడు.
కానీ మానవజీవితం అల్పం అని తెలుసు కనుక నిమి తన సమ్కలపమును విరమించుకోకుండా , మరికొందరు ఋత్విక్కులను సమకూర్చుకుని తన యాగము మొదలుపెట్టాడు.
ఇంద్రుని యాగామునకు వెళ్ళిన వసిష్ఠుడు తన శిష్యుడు తలపెట్టిన సత్రయాగామును తలచుకుని ఇంద్రయాగం అయిన వెంటనే అతి వేగంగా వెనుదిరిగి వచ్చాడు. అప్పటికే నిమి మరికొందరు ఋత్విక్కులతో యాగం మొదలుపెట్టుట చూసి, నిమి తనను అవమానించాడు అని భావించాడు. తిన్నగా నిమిని కలుద్దామని అతని వద్దకు వెళ్ళబోగా ద్వారపాలకులు అడ్డుకున్నారు. అసలే కోపంగా ఉన్న వసిష్ఠుడు మరింత కోపించి నిమి మరణించుగాక అని శపించాడు. ఐతే అసలు కారణం విచారించక ఒక గురువయ్యుండి కూడా తన కోపం మీద తనకే నియంత్రణ లేక  అతను  చేసిన పనికి నిమి కూడా అతని గురువయిన వసిష్ఠుని మరణించమని శపించారు
కాలాంతరంలో వసిష్ఠుడు తిరిగి మిత్రావరుణు వలన అప్సరస ఐన ఉర్వసికి జన్మించాడు
ఐతే వసిష్ఠుని శాపంవలన నిమికూడా శరీరం వదిలాడు. ఐతే మొదలుపెట్టిన సత్రయాగం మధ్యలో ఆపుట సరి అయినది కాదు కనుక నిమి దేహమును అనేక రసాయనములతో పూతపూసి పాడవకుండా జాగ్రత్తచేశారు. సత్రయాగం పూర్తి  చేసారు. యాగం చివరి భాగంలో దేవతలు సంతోషించి వరములను ఇచ్చుటకు సంసిద్ధులవగా   ఋత్విక్కులు నిమిని బ్రతికించమని కోరారు. దేవతలు కూడా అతనిని బ్రతికించుటకు సిద్ధపడారు. కానీ నిమి తిరిగి తన దేహమును పొందుటకు అంగీకరించలేదు.    
నిరంతరం మోహం, అహంకారం, సుఖం, దుఃఖం అనే గుణములకు లోనవుతూ అశాశ్వతమైన దేహం నాకు తీసుకొనుట ఇష్టం లేదు  అని చెప్తున్నా నిమిని చూసి, దేవతలు ఋత్విక్కుల కోరిక కాదనలేనిది, అలాగే నీ కోరిక కూడా. అందరి కోరికలు తీరే విధంగా సర్వప్రాణులు కన్నులు ముసితెరచే ప్రక్రియగా నీవి జీవించెదవు గాక ని దేవతలు నిమికి వరమును ఇచ్చారు
ఐతే ఇప్పుడు నిమియొక్క రాజ్యభారమును వహించుటకు రాజులేడు. ఒక రాజ్యం రాజులేకుండా ఉండకూడదు కనుక వారు భద్రపరచిన నిమి దేహమును మధించగా ఒక పుత్రుడు జన్మించెను
  1. ప్ర్రాణములేని దేహంనుండి జన్మించాడు కనుక అతనిని వైదేహుడు అన్నారు
  2. మధించుటచేత జన్మించాడు కనుక అతనిని మిధులుడు అనికూడా పిలిచారు. ఇతనిచే నిర్మించబడిన నగరమే మిధిలా నగరం
  3. ప్రజలను కన్నబిడ్డలవలె పరిపాలించాడు కనుక జనకుడు అన్నారు 

విధంగా సూర్యవంశం నుండి జనకవంశం ప్రారంభం ఐనది

1 కామెంట్‌: