15, జులై 2014, మంగళవారం

వెనుక నుండి వాలిని బాణం తో కొట్టిన రాముడు ధర్మాత్ముడేనా?

వెనుక నుండి వాలిని బాణం తో కొట్టిన రాముడు ధర్మాత్ముడేనా?
నూటికి నూరు శాతం రాముడు ధర్మాత్ముడే అని తన చివరి క్షణంలో వాలే అంగీకరించాడు. అది ఎలానో చూద్దాం!
తన తమ్ముడు సుగ్రీవునితో యుధం చేస్తున్న తనమీద ఎవరో బాణ ప్రయోగం చేసారు అని ధ్వని విన్న వాలి వెనుకకు తిరిగేంతలో రామబాణం వాలి గుండెలో గుచ్చుకుంది. ఆ బాణం వేగానికి తట్టుకోలేకపొయిన వాలి కుప్పకూలిపోయాడు.
అప్పుడు వెనుక నుండి వస్తున్న రామలక్ష్మణులను చూసి,  వాలి రాముడిని కొన్ని ప్రశ్నలను అడిగాడు.

రామా! నువ్వు చాలా గొప్పవాడివి, ధర్మం తెలిసినవాడివి, పరాక్రమం ఉన్నవాడివి అంటారు. నా భార్య తార నీగురించి చెప్పింది, నీవు నాతమ్ముడైన సుగ్రీవునితో స్నేహం చేస్తున్నావ్ అని కుడా చెప్పి నన్ను ఈ యుద్దానికి వెళ్ళద్దు అని వారించింది. అవి అన్నీ విన్న నేను నీవు నిజంగా ధర్మాత్ముడవే అని నమ్మాను. నేను సుగ్రీవునితో యుధం చేస్తుండగా నీవు నన్ను ఎదిరిస్తావు అని అనుకున్నాను కాని నీవు నా వెనుక నుండి బాణ ప్రయోగం చేసావు. నేను చనిపోయాక నా తమ్ముడు రాజ్యం తీసుకోవటం సబబు గానే ఉంది కాని నీవు నన్ను చంపుట లో ధర్మం లేదు.  కనుక నీవు ధర్మం అనే తొడుగు కప్పుకున్న మహా పాపాత్ముడివి. కాదు అని నీవు చెప్పగలవా! ఐతే నా ఈ ప్రశ్నలకు సమాధానం చెప్పు.
  1. నీతో కాకుండా నేను ఇంకొకరితో అటువైపుకి తిరిగి యుద్ధం చేస్తుంటే నువ్వు చెట్టు చాటు నుండి నా మీద బాణం ఎందుకు వేసావు?
  2. యుద్ధం అంటూ వస్తే, బంగారం వల్ల, వెండి వల్ల, భూమి వల్ల రావాలి కానీ, నీకు నాకు ఈ విషయాల్లో తగాదా  లేదు. నేను నీ రాజ్యానికి కాని నీ పట్టణానికి కాని ఈ విధమైన విఘాతం కలిగించలేదు. 
  3. క్షత్రియులలొ పుట్టిన నీకు మంచి చెడు ఏదో తెలుసుకున్న తర్వాతనే శిక్ష విధించాలి అని తెలియదా? నీవు మా మద్య జరిగిన ఏ విషయాల మీద ఆధారపడి నేను దోషిని అని నిర్ణయించావు?
  4. నేను చెట్ల మీద ఉండే ఆకులని, పండ్లని తినే శాఖాహార మృుగాన్ని. నా చర్మం వలిచి వేసుకోవటానికి, మాంసం తినటానికి, నాగోర్లు మరొక ప్రయోజనానికి పనికిరావు కనుక నన్ను చంపుట లో  న్యాయం లేదు! దీనికి నీ సమాధానం?
  5. నీ భార్య కోసం అడవిలో వెతుక్కుంటున్నావు కదా! నీ భార్యని ఎత్తుకుపోయిన రావణాసురుడు నా కింకరుడు. నువ్వు నాతో స్నేహం చేసి ఉంటే, అసలు రక్తపాతం లేకుండా ఆ రావణాసురుడిని ఒక్క రోజులో నీముందు పడేసేవాడిని. అటువంటిది నాముందే నిలువలేని సుగ్రీవుడిని ఆశ్రయించి, నువ్వు సీతని ఎలా సాధించుకోగలవు? బలవంతుడిని వదిలి బలహీనునితో స్నేహం ఎందుకు చేసావు?
అప్పుడు రాముడు వాలికి సమాధానం చెప్పాడు

ఓ వాలి! నీకు అసలు ధర్మం గురించి కానీ, అర్ధం గురించి కానీ, కామం గురించి కానీ తెలుసా. నువ్వు అజ్ఞానివి. బాలుడు ఎలా ప్రవర్తిస్తాడో నువ్వు అలా ప్రవర్తించేవాడివి. నీకు ఏమీ తెలుసని నా మీద ఇన్ని ఆరోపణలు చేశావు. నువ్వు అజ్ఞానీవి కావటం వల్ల నీకు ఏమి తెలియకపోతే, ఆచారం తెలిసినవారిని, పెద్దలైన వారిని ఆశ్రయించి తెలుసుకోవలసినది.
నువ్వు ఈ వానరములకు ప్రభువువి. మంత్రుల చేత సేవింపబడుతున్న వాడివి. సంధ్యావందనం చేస్తున్నవాడివి. నువ్వు ధర్మం తప్పితే నీ వెనుక ఉన్నవారు కూడా ధర్మం తప్పుతారు. నేను క్షత్రియుడిని కనుక నిన్ను శిక్షించవలసిన అవసరం నాకు ఉంది. క్షత్రియ ధర్మం ప్రకారం ఒకడు చేసిన తప్పు ప్రభువైన వాడికి తెలిసి వాడిని శిక్షిస్తే, వాడి పాపం పోతుంది. కానీ ప్రభువు అలా శిక్షించకపోతే, ఆ పాపం రాజుకి వెళుతుంది.  ఇక్ష్వాకుల రాజ్యం లోకి ఈ భాగం కూడా వస్తుంది. ఆ ఇక్ష్వాకు వంశంలో పుట్టిన భరతుడు ఇప్పుడు రాజ్యం చేస్తున్నాడు. ఇక్ష్వాకు వంశం వారు రాజ్యం చేస్తుండగా ధర్మాధర్మములు జరిగిన చోట నిగ్రహించే అధికారం మాకు ఉంటుంది.
ఇక నీవు అడిగిన ప్రశ్నలకు సమాధానం చెప్తాను విను!
  1. నేను మానవుడిని, నువ్వు జంతువువి. క్షత్రియుడు ఒక మృగాన్ని కొట్టవలసి వస్తే, తాను చాటున ఉండి, వల వేసి,పాశం వేసి,అప్రమత్తంగా ఉన్నప్పుడు, పడుకుని ఉన్నప్పుడు,నిలబడి ఉన్నప్పుడు,  పారిపోతున్నప్పుడు ఎప్పుడైనా కొట్టొచ్చు. కానీ ఆ మృగo మరో మృగం తో సంగమిస్తున్నప్పుడు కొట్టకూడదు. నువ్వు మిధున లక్షణంలో లేవు కనుక నిన్ను కొట్టాను.
  2. తప్పు చేసినవానిని రాజు శిక్షిస్తే వాడి పాపం ఇక్కడితో పోతుంది. నేను నిన్ను ఛంపటం వల్ల నువ్వు ఏ పాపం లేని స్థితి కి చేరుకున్నావు. నీ పాపం ఇక్కడితో పోయింది. అందుకని నువ్వు ఉత్తమ లోకాలకి వెళ్ళిపోతావు. 
  3. తోడబుట్టిన తమ్ముడు, తన దగ్గర విద్య నేర్చుకున్న శిష్యుడు కుమారులతో సమానం. నీ తండ్రి మరణించటం చేత, నువ్వు పెద్దవాడివి అవటం చేత నువ్వు సుగ్రీవునకు తండ్రి తో సమానము. నీ తమ్ముడు భార్య అయిన రూమ నీకు కోడలితో సమానము. కానీ సుగ్రీవుడు బ్రతికి ఉన్నాడని తెలిసి, కోడలితో సమానమైన రుమతో, నీ భార్యగా కామ సుఖాలని పొందుతున్నావు.అందుచేత ఒక మామగారు కోడలితో కామభోగాన్ని అనుభవిస్తే ఎంత దోషమో, అంత దోషాన్ని నువ్వు చేశావు. ధర్మ శాస్త్రం లో దీనికి మరణ శిక్ష తప్ప వేరోక శిక్ష లేదు. అందుకని నేను నిన్ను చంపవలసి వచ్చింది. (దీనిలో పైన వాలి అడిగిన 2,3,4 ప్రశ్నలకు సమాధానం వచ్చేసింది) 
  4. నీలాంటి అధర్మాత్ముడితో నేను స్నేహం చెయ్యను. 
రాముడు మాటలు విన్న వాలి తన రెండు చేతులతో రాముడికి నమస్కారం చేస్తూ  "మహానుభావా! ధర్మాత్మా! రామచంద్రా! నువ్వు చెప్పినది యదార్ధం. దోషం నాయందే ఉన్నది. నీవు చేసిన ఈ పని నిజం గా నాయందు దయతో చేసావు అని నేను నమ్ముతున్నాను. శ్రీరాముడు ధర్మాత్ముడు అని నేను ఒప్పుకుంటున్నాను. ఇటువంటి నీ చేతిలో మరణమైనా నాకు స్వర్గమే రామా" ఆనాడు.


ఆనంద రామాయణం ప్రకారం శ్రీకృష్ణావతార సమాప్తసమయం లో శ్రీకృష్ణుడిని బాణం తో కొట్టినది ఆ కాలం లో కిరాతునిగా పుట్టిన ఈ వాలి. 

కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి