26, జులై 2016, మంగళవారం

శ్రీరామ శతకము – 56

సీ :  రాక్షసిదునుమాడి రాక్షసి వికృతిని
             గావించు రవికుల ఘనయశుoడ 
      కపిరాజు ద్రుoచియు కపిరాజు గైకొని
             కపిరాజ్య మొసగిన కపికులండు
     చాపంబు ఖండించి చాపంబు చేపట్టి
              శత్రు సేనల ద్రుoచు క్షాత్రవరుడు
    అసురేంద్రు దునుమాడి అసురేంద్రునకు
              రాజ్యమును నిప్పించినరాచకులుడు
తే : శబరి దయజూచి కాంక్షించు శబరునెపుడు
      గ్రద్దరేనికి మోక్షంబు కూర్మినొసగు
      రక్షకుడవెల్ల వారికి మోక్షమొసగ
      అందువుకొనవయ్య శ్రీరామ వందనములు !

                                    - శ్రీ తిరుకోవలూరు రామానుజస్వామి

24, జులై 2016, ఆదివారం

శ్రీరామ శతకము – 55

సీ :  నీయందు చిత్తంబు నిలుపనేర్వనివాడు
            ఏ వేదములనేర్చి నేమి ఫలము
      చిత్తంబు నీయందు జేర్చక యజ్ఞాదు
             లొనరించ ఫలమేమి మానవునకు
     మాధవనేయందు మనసు లేకొనరించు
             పూజలు దానముల్ పూజ్యమగును
     హరియందు చిత్తంబు యమరకచేసెడి
            గంగాది స్నానముల్ భంగమగును
తే :  మాధవునియందు చిత్తంబు మరలుకొలిపి
      చేయుకర్మంబులెల్లను సిద్ధినందు
      నేనశక్తుండని విజేయ నిజముదేవ 
      అందుకొనవయ్య శ్రీరామ వందనములు!! 
                                    - శ్రీ తిరుకోవలూరు రామానుజస్వామి

22, జులై 2016, శుక్రవారం

శ్రీరామ శతకము – 54

సీ :  జన్మమేదెత్తిన జగతిలోపల నేను
           భక్తిహీనుల చెల్మి రక్తిజేయ
      ఇంపుసొంపుల నుండు యేకధలైనను
            వినజాల నీకధల్ వినగ గలను
      పాషండులను జూచి పారిపోయెదగాని
            నినుదలంపని వారి నేనుగోర
      నీపూజలేజేసి నీకధాశ్రవణముల్
             గోరెడివారి నే గోరుచుందు
తే : వినుము భవదీయ దాసులలోన నన్ను
     కట్టకడపటివాడని కరుణజూచి
     దాస్యమింపుగ గొనవయ్య తండ్రి నీవు

     అందుకొనవయ్య శ్రీరామ వందనములు!!
                                    - శ్రీ తిరుకోవలూరు రామానుజస్వామి

20, జులై 2016, బుధవారం

శ్రీరామ శతకము – 53

సీ  :  కమలాలయేభార్య కమలాసనుడు బిడ్డ
               దివిజులెల్లరు నీదు సేవకులును
       వేదపురుషుడు నిన్వేవిధంబుల గొల్చు
               పార్ధుండు నీప్రియ బాంధవుండు
       తల్లియే దేవకి దయయె మోక్షంబండ్రు
                ఈ జగత్తే మాయ యిలను ప్రజలకు
       నీమాయ తెలియంగ నేనెంతవాడను
                మహిమతెలియగ లేరు మాన్యులైన
తే :   నీ కృపాలేశమెంతైన నిలచియున్న
       ప్రకృతి నెడబాపి నిన్నింక మరువగలనె
       దాతవై నన్ను దరిజేర్చు ధర్మపరుడ
       అందుకొనవయ్య శ్రీరామ వందనములు !!
                                    - శ్రీ తిరుకోవలూరు రామానుజస్వామి

18, జులై 2016, సోమవారం

శ్రీరామ శతకము – 52

సీ :  శ్రీనివాసా నాకు క్షితియందు నెప్పుడు
             నీ నామ స్మరణమే నిత్యమొసగు
      శ్రీవల్లభాయంచు చిత్తంబులోపల
            ధ్యానముండెడి రీతి జ్ఞానమొసగు
      వరద దామోదర పరమాత్మయనగను
           నీకీర్తనము జేయ నియతి నొసగు
     నారాయణాకృష్ణ నామంబులనుగొని
          భజనంబు చేయగ భక్తినిమ్ము
తే :  మధురమై యుండు నీనామ స్మరణ మెపుడు
      నాధ దయచేయు సతతము నాకు నెపుడు
      పతితపావన బిరుదాంక పరమ పురుష
      అందుకొనవయ్య శ్రీరామ వందనములు !!
                                    - శ్రీ తిరుకోవలూరు రామానుజస్వామి

16, జులై 2016, శనివారం

శ్రీరామ శతకము – 51

సీ :  పాపంబులను జేసి పరితపించుట యేల
             పతితపావనుడు తాప్రాపుగాగ
       కర్మంబులనుజేసి కడు దుఃఖ పడనేల
              కలుషంబులను బాపు ఘనుడు గలుగ
       రుజ బాధలంజూచి రోధించ నది యేల
               రంజించు జానకీ రమణుడుండ
        ఆలుబిడ్డలజూచి అలమటించుట యేల
                ఆవేదనల బాపు హరియెగాన

తే : చిత్తమా నీవు దుఃఖంబు జెందుటెట్లు
     అంతరాత్మలొ హరి యుండి ఆదుకొనును
     నేడు నాబాధలను దీర్చ నిన్నెగొలుతు
     అందుకొనవయ్య శ్రీరామ వందనములు
                                    - శ్రీ తిరుకోవలూరు రామానుజస్వామి

14, జులై 2016, గురువారం

శ్రీరామ శతకము – 50

సీ :  సరసిజ నయనుండు శంఖ చక్రధరుండు
           దివ్య సుందరమూర్తి దేవ విభుడు
      దరహాస వదనుడు యురమందు శ్రీవత్స
            చిహ్నంబు గలవాడు శ్రీధరుండు
     రత్న కిరీటంబు రమణీయముగ నొప్ప
            శిరమున దాల్చెడు శ్రీ సఖుండు
     కనకంపు చేలంబు గట్టుచుండెడి వాడు
             మేఘవర్ణముబోలు మేను వాడు
తే :  అభయ హస్తమునిడు తన యాశ్రితులకు
      పాదపద్మములను జూపి భయము బాపి
      నేడునను రక్ష సలుపంగ నిలచినావు
      అందుకొనవయ్య శ్రీరామ వందనములు
                                    - శ్రీ తిరుకోవలూరు రామానుజస్వామి

12, జులై 2016, మంగళవారం

శ్రీరామ శతకము – 49

సీ :  ప్రారబ్ధములు మెండు పాపకర్మలు మెండు
            దరిజేరు విధమది దయను జూడు
      బలురోగములు మెండు బహువిఘ్నములు మెండు
            పలు భాదలెల్లను బారద్రోలు
      దుస్సంగతులు మెండు దుర్మార్గములు మెండు
             దురిత జాలములెల్ల తొలగగొట్టు
      ఖలుల కూటమి మెండు కలి దోషములు మెండు
             కనరాదు నీరూపు కన్నులకును

తే : మనసు నిలువదు నీయందు మమత పోదు
      చిత్తమేరీతి నీయందు జేర్చ గలనొ
      నన్నువీడకు నిన్నెద నమ్మినాడ

      అందుకొనవయ్య శ్రీరామ వందనములు
                                    - శ్రీ తిరుకోవలూరు రామానుజస్వామి

10, జులై 2016, ఆదివారం

శ్రీరామ శతకము – 48

సీ :  తప్తచక్రాంకముల్ దాల్చనినరుడెట్లు
            వైష్ణవుండని పేరు వసుధ గాంచు
      అర్ధపంచకనిష్ట యాత్మకు లేకున్న
             కమలనాభునిభక్తి గలుగునెట్లు
      భాగవతాచార్యుభక్తి గొల్వకనెట్లు
           భగవంతు కృపనిందు బడయగలడు
      శ్రీవైష్ణవులసేవ జేయక యదియెట్లు
             వైకుంఠ పురమందు వాసిగాంచు
తే : భువినియాచార్యుకృప నిందు పొందెనేని
     రక్తిభగవాను డెట్లైన ముక్తి నిచ్చు
     తామెయాచార్యులై నన్ను దయనుబ్రోవ
    అందుకొనవయ్య శ్రీరామ వందనములు
                                    - శ్రీ తిరుకోవలూరు రామానుజస్వామి

8, జులై 2016, శుక్రవారం

శ్రీరామ శతకము – 47

సీ :   నేనెంత వేడినా నీకేల దయరాదు
             భక్తవత్సల దీన భయవిదూర
       నేనెంత బిలచినా నీవేల పలుకవు
             కరిరాజు వెతదీర్చు కమలనాభ
       నేనెంత తలచినా నీవేల కనరావు
             గోపికా ప్రియదర్శ గోపబాల
      నేనెందుజూచినా నీ జాడకనరాదు
           ప్రహ్లాదుగాచిన పరమ పురుష

తే :  కుబ్జవెతలను దీర్చిన కూర్మిసఖుడ
      చింతయంత్యను గోపిక చింతదీర్చు
      నాధనన్నిదె రక్షించు నళిన నేత్ర

      అందుకొనవయ్య శ్రీరామ వందనములు
                                    - శ్రీ తిరుకోవలూరు రామానుజస్వామి

6, జులై 2016, బుధవారం

శ్రీరామ శతకము – 46

సీ :  నారాయణుడు తానెనరునకొసంగెను
           మంత్రరాజము మున్ను బదరియందు
      ద్వయమంత్రమొసగెను వైకుంఠపురమందు
            పెరియ పిరాట్టికి ప్రేమతోడ
      చరమంబు కృపజేసెకురుభూమియందున
           పార్ధుండుదీనుడైప్రణుతిజేయ
      తత్వత్రయంబిట్లు తానె యాచార్యుడై
            వివిధస్థలంబుల విశదపరచె
తే :  గురుడునీమంత్రముల నెల్లకోర్కెనీయ
      భక్తి భజియించు వారికిముక్తి గలుగు
      ననుచుభోధించు యాచార్యుడీవెగాన
      అందుకొనవయ్య శ్రీరామ వందనములు!!
                                    - శ్రీ తిరుకోవలూరు రామానుజస్వామి

4, జులై 2016, సోమవారం

శ్రీరామ శతకము – 45

సీ :  సర్వేశ నీ గొప్ప సౌందర్యమునుజూసి
            శ్రీలక్ష్మి మైమర్చి సేవజేయు
      నవనీత హృదయంబునకు మేటియౌనన
            వక్షస్థలంబందు వాసమొందె
      సతి ధర్మమునుదెల్ప పతిని విదువక తానె
             సకల కైంకర్యముల్ సలుపునెపుడు
      భక్తులు యేతెంచి భయపడి పోకుండ
             నిత్యాన పాయియై నిలచియుండు

తే :  జనని జానకి మాతల్లి చనువుచేత
      పురుషకారము జేయును నరులబ్రోవ
      దయను శిక్షించుతొ రక్షించుతొ తరిమి కొడుతొ
      అందుకొనవయ్య శ్రీరామ వందనములు !!
                                    - శ్రీ తిరుకోవలూరు రామానుజస్వామి

3, జులై 2016, ఆదివారం

మ్లేచ్చుడు నిర్వచనం

మనం ఇంతకు ముందు బ్రాహ్మణుడు, వైశ్యుల మరియు శూద్రుల నిర్వచనం తెలుసుకున్నాం కదా!ఇప్పుడు మరి మ్లేచ్ఛుని నిర్వచనం చాణక్యుని ప్రకారం ఏవిధంగా ఉందో చూద్దాం !
వాపీ కూప తడాగానామారామ సురవేశ్మనామ్
ఉచ్ఛేదనే నిరాశంకః స పిప్రో మ్లేచ్ఛ ఉచ్యతే!!
భావం : దిగుడు బావులు,బావులు, చెరువులు,ఉద్యానవనములు, దేవాలయములు మొదలగు వానిని నిశ్శంకోచముగా నాశనము చేయు వాడు (పుట్టుకతో) బ్రాహ్మణుడయిననూ వానిని మ్లేచ్ఛుడు అని చెప్పవలెను.

వివరణ :

పదిమందికి ఉపయోగపడు వానిని నాశనంచేయుటవలన ఎవరికి ఏ ఉపయోగమూ ఉండదు. కానీ కొందరు అలా చేయుటకు వెనుకాడరు. వారిని మ్లేచ్ఛులు అని పిలవవచ్చును అని పెద్దల మాట. 

2, జులై 2016, శనివారం

శ్రీరామ శతకము – 44

సీ :   శ్రీరంగపురవాస శ్రీరంగనాయకా
            మంగళంబులు నీకు మాన్యచరిత
       వేంకటాచలవాస వేంకటేశ్వరసామి
             శుభములు నీకగు అభయహస్త
       కరిశైలగిరివాస వరదరాజ ప్రభో
              కల్యాణములు నీకు కలుషహరణ
       జయ యాదవాద్రీశ సంపత్కుమారుడ
              జయములు నీకగు భయ విదూర

తే :  భద్రగిరివాస శ్రీరామ భజన మిదిగో
      యాదగిరివాస నరసింహ అంజలిదిగో
      దాసహృద్వాస శ్రీరామదాసునేలి
      అందుకొనవయ్య శ్రీరామ వండనములు
                                    - శ్రీ తిరుకోవలూరు రామానుజస్వామి

1, జులై 2016, శుక్రవారం

శూద్రుడు నిర్వచనం

చాణాక్య నీతి ప్రకారం  మనం ఇంతకు ముందు బ్రాహ్మణ, వైశ్యుల నిర్వచనములు తెలుసుకున్నాం కదా! ఇప్పుడు శూద్రుని నిర్వచనం ఏ విధంగా ఉన్నదో చూద్దాం .
లాక్షాదితైలనీలానాం కుసుమ్భ మధు సర్పిషామ్
విక్రేతా మద్యమాంసానాం స విప్రః శూద్ర ఉచ్యతే !!

భావం  :  లక్క, నూనె వంటి నల్లని రంగు కలిగిన వస్తువులు, కుంకుమ, తేనె వంటి ఎర్రని రంగు గల వస్తువులు, మధ్యం,మాంసం మొదలగు వాటిని అమ్మేవారిని (పుట్టుకతో) బ్రాహ్మణులయినా, వారిని శూద్రులుగా పిలువ వలెను.