31, మార్చి 2020, మంగళవారం

పులస్త్యుడు - విశ్రవసుడు

మనం ఇంతకు ముందు ఒక పురాణమునకు మరొక పురాణమునకు భేదములు ఉండటానికి కారణం అవి జరిగిన కల్పములే కారణం అని చెప్పుకున్నాం కదా!
ఇప్పుడు అటువంటిదే మరొక సంఘటన గురించి తెలుసుకుందాం!
భాగవతం ప్రకారం నవబ్రహ్మలలో ఒకరయిన పులస్త్యుని భార్య హవిర్భువు అని, ఆమె స్వయంగా కర్దమ ప్రజాపతి మరియు దేవహూతి లకు కలిగిన తొమ్మిది మంది కుమార్తె లలో ఒకటి అని చెప్పుకున్నాం!

కానీ వాల్మీకి రచించిన రామాయణం ప్రకారం పులస్త్యుని భార్య తృణబిందుని పుత్రిక.
రామాయణం ప్రకారం:
పులస్త్యుడు మేరు పర్వత ప్రాంతంలో తృణబిందు అనే ఆశ్రమ సమీపంలో నివసిస్తూ, తపస్సు చేసుకుంటూ ఉండేవాడు. ఆ ఆశ్రమ సమీపంలో ఉన్న వనంలో ఎప్పుడూ వసంతకాలంలా ఉండేది. ఆ ప్రకృతిని ఆస్వాదించటానికి వచ్చినవారు అక్కడ చేసే కోలాహలమునకు ఇతని తపస్సు భంగం అవుతూ ఉండేది. అలా కొంతకాలం భరించిన అతనికి సహనం నశించి ఆ స్థలమునకు వచ్చి ఎవరయినా అతని కంట పడితే ఆ స్త్రీ గర్భం ధరిస్తుంది అని శపించాడు. ఇతని శాపము తెలియని తృణబిందుని కుమార్తె ఒకసారి అలా వనంలో విహరిస్తూ ఇతని కంట పడింది. అప్పటి నుండి ఆమె శరీరంలో గర్భసూచనలు కనిపించసాగాయి.
ఈ విషయం తెలుసుకున్న తృణబిందు తన కుమార్తెను తీసుకుని పులస్త్యుని వద్దకు వచ్చి, తన కుమార్తెను అతనికి దానం చేసాడు. అలా గర్భం దాల్చిన ఆమెను పులస్త్యుడు వివాహం చేసుకున్నాడు.  గర్భం దాల్చిన ఆమె ఆ ఆశ్రమ వాతావరణంలో కాలం గడుపుతూ, వారు చదివే శాస్త్రములు వేదములు వింటూ ఉన్నది కనుక ఆ పుట్టిన బిడ్డకు విశ్రవసుడు అని పేరు పెట్టారు.
ఈ విశ్రవసుడు కూడా తన తండ్రికి వలెనే అత్యంత నిష్టా గరిష్టుడు. ఇతని ధర్మాచరణమును గురించి తెలుసుకొనిన భరద్వాజుడు తన కుమార్తెను ఈ విశ్రవసునకు ఇచ్చి వివాహం చేశారు. తరువాత వీరికి ఒక పుత్ర సంతానం కలుగగా ఆ బాలునికి వీరు వైశ్రవణుడు అని పేరు పెట్టారు. అతనే కాలాంతరంలో ధనాధిపతి కుబేరుడు గా మనకు సుపరిచితుడు. 

29, మార్చి 2020, ఆదివారం

భారతమును మహాభారతం అని ఎందుకు పిలుస్తారు?

 మనకు 18 పురాణములు, 18 ఉప పురాణములు ఉన్నాయి. వానిలో దేనికి "మహా" అనే సంబోధన మనకు కనిపించదు. కానీ ఒక ఇతిహాసముగా చెప్పబడుతున్న భారతమునకు ఈ విధమయిన సంబోధన కనిపిస్తుంది. మరి ఆ భారతము మహా  భారతం అవటానికి కారణం ఏమి  అయ్యి ఉంటుంది?
దీనికి సమాధానం మనకు మహాభారత తత్వకథనం లో దొరుకుతుంది.

ఏకత శ్చతురో వేదా భారతం చైత దేకత:
పురాకిల సురై స్సర్వై స్సమేత్య తులయా ధృతం

చతుర్భ్య స్సరహాస్యేభ్యో వేదోభ్యో హ్యధికం యదా
తదాప్రభృతి లోకేస్మిన్ మహాభారత ముచ్యతే

మహత్త్వేచ గురుత్వేచ ధ్రియమణం యతో ధికం
మహత్త్వా ద్భారవ త్త్వా చ్చ మహా భారత ముచ్యతే

భావం :  దేవతలు నాలుగు వేదములను భారతమును పరిశీలించి ఏది వీనిలో ఉన్నతమయినది అని నిర్ణయించవలసి వచ్చి  నప్పుడు, 108 ఉపనిషత్తులు కలిగిన వేదముల కంటే అర్ధము, గుణముల వివరణము, శబ్దముల ఆధిక్యము అన్ని కలిగిన ఈ భారతమే గొప్పది అని నిర్ణయించారు. అందువల్లనే భారతమును మహాభారతం అని సంబోధించుట పరిపాటి అయినది.  

28, మార్చి 2020, శనివారం

నవ శక్తులు

శక్తులను గురించి చెప్తున్నప్పుడు మన పెద్దలు తొమ్మిది శక్తుల గురించి చెప్తారు.
ఆ తొమ్మిది శక్తుల గురించి ఇప్పుడు మనం తెలుసుకుందాం!!

  1. ఇచ్ఛాశక్తి 
  2. క్రియాశక్తి 
  3. ఉత్సాహశక్తి 
  4. ప్రభుత్వశక్తి 
  5. మంత్రశక్తి 
  6. సత్వశక్తి 
  7. రజశ్శక్తి
  8. తమోశక్తి 
  9. జ్ఞానశక్తి 




26, మార్చి 2020, గురువారం

శ్రీ మహ విష్ణువు బట్టలు పసుపు (పీతాంబరములు) గా ఎందుకు ఉంటాయి?

ఏదయినా విషయములు చెప్పే సమయంలో కవి ఎంతో సృజనాత్మకంగా, ఇంతకూ ముందు చెప్పినవారి కంటే భిన్నంగా చెప్పే ప్రయత్నం చేస్తాడు. అలాగే పైన మనం చెప్పుకున్న ఆ ప్రశ్నకు సమాధానం వికటకవి గా పేరు పొందిన తెనాలి రామకృష్ణుడు తను రచించిన పాండురంగమహత్యం లో చాలా చక్కగా చెప్పాడు.

అభినవాయాతి తనపుత్రు నజుని గాంచి
సంతసంబున నాభివేశంత జలజ
ముబ్బి వెలిగ్రాయు పుప్పొడి యొరపు నెరపు
హళది పుట్టంబు కటిసీమ నలదువాని

భావం : అప్పుడే వచ్చిన తన పుత్రుడు అయిన బ్రహ్మ ను చూసి, విష్ణుమూర్తి నాభిలోని కమలం ఉబ్బితబ్బిబ్బు అయినదట. అలా తబ్బిబ్బు అవుతున్నప్పుడు ఆ కమలంలోని పుప్పొడి రేణువులు బయటకు చింది శ్రీ మహావిష్ణువు పంచె మొత్తం పడినవట.

బ్రహ్మదేవుడు  విష్ణు నాభి కమలంలో నుండి జన్మించాడు. కనుక పుత్రుని చుసిన సమయంలో జనకులకు అనందం కలుగుట సహజం. అలా ఆనందంలో ఉన్న సమయంలో చేతిలోవి జారిపోవుట సహజం. కానీ ఆలా జరుగుట వలన శ్రీ మహావిష్ణువు పంచె పసుపుగా మారింది అని చెప్పటం కవి హృదయం.  అందునా వికటకవి కనుక ముందే ఉన్నదానికి ఇలా ఒక కారణం చెప్తున్నాడు. అలంకార శాస్త్రంలో దీనిని ఉత్ప్రేక్షాలంకారం అంటారు. 

24, మార్చి 2020, మంగళవారం

కవి

ఈ మధ్య కాలంలో కలం పట్టిన ప్రతివాడు కవిని అని చెప్పుకుంటున్నాడు. కానీ మన పెద్దలు చెప్పిన దాని ప్రకారం కవులు ఎన్ని రకాలు? ఆ విభజన ఏ విధంగా చేయవచ్చును అని తెలుసుకుందామా?
కవులను ఈ కింద చెప్పిన శ్లోకం ప్రకారం మూడు  రకాలుగా విభజించ వచ్చు



శాస్త్రకవిః కావ్యే రససంపదం విచ్చినత్తి
కావ్యకవిః శాస్త్రే తర్కకర్కశమప్యర్ధముక్తి
 వైచిత్ర్యేణ శ్లధయతి, ఉభయ కవి స్తూభయోరపి

వరీయాన్యదుభయత్ర పరంప్రవీణఃస్యాత్

పైన చెప్పిన శ్లోకం ప్రకారం కవులు మూడు రకములు.  వారు
శాస్త్ర కవి
కావ్య కవి
ఉభయ కవి


శాస్త్ర కవి : కావ్యములో రససంపదను చక్కగా వివరించగలవాడు
కావ్య కవి: శాస్త్రములలోని తర్కముల కి సంబందించిన కర్కశత్వమును విదిలి మ్రుదువుగ చెప్తారు
ఉభయ కవి: పైన చెప్పిన ఇద్దరు కవుల లక్షణములని కలిగి ఉంటారు 

4, ఆగస్టు 2019, ఆదివారం

నవగ్రహములు - మండలముల ఆకారములు

మనకు తొమ్మిది గ్రహములు ఉన్నాయి. ఆ నవ గ్రహములకు సంబందించిన నవరత్నముల గురించి ఇంతకు ముందు మనం  చెప్పుకున్నాం కదా ! ఇప్పుడు వాని మండలముల గురించి తెలుసుకుందాం! ఆ మండలములు  వివిధములయిన ఆకారములు కలిగి ఉంటాయి. ఆ ఆకారముల గురించి అగ్ని పురాణములో చాలా వివరించారు. అవి

  1. సూర్యుడు - గుండ్రనిది 
  2. చంద్రుడు - చతురస్ర ఆకారం 
  3. అంగారకుడు - త్రికోణము 
  4. బుధుడు - బాణాకారము 
  5. గురుడు - దీర్ఘ చతురస్రము 
  6. శుక్రుడు - పంచకోణము 
  7. శని - ధనురాకారం 
  8. రాహువు - చేట ఆకారం 
  9. కేతువు - జెండా ఆకారం 






7, జులై 2019, ఆదివారం

నవ రత్నములు - నవ గ్రహములు

మన శాస్త్రముల ప్రకారం మానవుని జీవత గమనము మొత్తం నవగ్రహముల గమనముపై ఆధారపడి ఉంటుంది. అయితే ఆ నవగ్రములకు ప్రతీకగా మన పెద్దలు నవరత్నములు చెప్పారు. ఆ గ్రహములకు సంబంధించిన ఆయా రత్నములు ధరించితే ఆయా గ్రహముల శాంతి దృష్టి కలుగుతుంది అని చెప్పారు. ఇప్పుడు ఏయే గ్రహములకు ఏ రత్నములు చెప్పారో చూద్దాం!


  1. సూర్యుడు - పద్మరాగం (కెంపు)
  2. చంద్రుడు - ముత్యము 
  3. అంగారకుడు - పగడము 
  4. బుధుడు - పచ్చ 
  5. గురుడు - పుష్యరాగం 
  6. శుక్రుడు - వజ్రము 
  7. శని - నీలము 
  8. రాహువు - గోమేధికము 
  9. కేతువు - వైడూర్యము  



27, జూన్ 2019, గురువారం

సుకాలినులు

సుకాలినులు అనే పితృ దేవతలు మూర్తగణములు.  వీరు ద్యులోకం పైన నక్షత్రకాంతిలో ప్రకాశించు జ్యోతిర్భాసి అనే లోకంలో నివసిస్తారు. వీరి తండ్రి గారు వశిష్ఠుడు. వీరిని శ్రాద్ధకాలంలో బ్రాహ్మణులు పూజిస్తారు. వీరి మానస పుత్రి పేరు గౌ:



25, జూన్ 2019, మంగళవారం

ఆజ్యపులు

ఆజ్యపులు అనే పితృగణములు మూర్తగణములు . వీరు పులహుని పుత్రులు కొందరు, కర్దమ ప్రజాపతి పుత్రులు కొందరు. వీరు నివసించు లోకము సర్వ కామనాలు చక్కగా తీర్చే కామదుఘాము అనే లోకము. వీరిని శ్రాధ సమయములో వైస్యులు పూజిస్తారు. వీరి మానస పుత్రిక పేరు విరజ. ఈమె నహుషునికి భార్య, మహారాజు యయాతి కి తల్లి. 



23, జూన్ 2019, ఆదివారం

హవిష్మంతులు

హవిష్మంతులు అనే పేరుగల పితృగణము మూర్తగణము. వీరి తండ్రి అంగీర: ప్రజాపతి. వీరు నివసించు లోకము సూర్యమండలములో గల మరీచి గర్భములు, అంటే లోపలవైపునకు కూడా కిరణములు కలవి అని అర్ధము కలిగిన లోకములు. వీరిని శ్రాద్ధములు జరిపించు క్షత్రియులు పూజిస్తారు. వీరి మానస పుత్రిక పేరు యశోద. 
ఆమె సూర్యవంశమునకు చెందిన అంశుమంతుడు అనే రాజునూ వివాహం చేసుకున్నది. వారికి జన్మించిన పుత్రుడు దిలీపుడు. దిలీపుని పుత్రుడు భగీరధుడు. సాక్షాత్తు ఆకాశగంగను భూమి మీదకు తెచ్చినది ఇతనే. 



21, జూన్ 2019, శుక్రవారం

సోమపులు

మనం ఇంతకు ముందు 7గురు పితృ దేవతల పేర్లు వారిలో ఆమూర్తగణముల గురించి తెలుసుకున్నాం కదా! ఇపుడు మూర్త గణముల గురించి తెలుసుకుందాం! వారిలో మొదటి గణము  సోమపులు.
వీరు స్వధాకారము నుండి జన్మించారు. వీరు బ్రహ్మ లోకములోని మానసములు అనే లోకములో నివసిస్తారు. వీరు అనంతమయిన యోగ సిద్ధి చేత బ్రహ్మత్వము పొందారు. వీరి పుత్రిక పేరు నర్మద, ఈమె సకల జలములకు ప్రతీక.
ఈ సోమపులు సకల పితృదేవతల కు ప్రతీకలు కనుకనే శ్రాద్ధము చేసే తప్పుడు స్వధాకారం చెప్తారు మరియు జలముల దగ్గర తర్పణములు చేస్తారు. 



19, జూన్ 2019, బుధవారం

బర్హిషదులు

ఈ పితృగణము అమూర్త గణము. వీరి తండ్రి పులస్త్యుడు.వీరు నివసించు లోకము  ధ్యు లోకంలోనే కాంతివంతములయిన మరికొన్ని లోకములు, విభ్రాజములు. 
వీరిని అసుర, దానవ , గంధర్వ, అప్సరస యక్షులు, ధ్యు లోకములోని దేవతలు అందరూ  ఆరాధిస్తారు. వీరి మానస పుత్రిక పేరు పీవరి. ఆమె యోగులకే యోగిని అనే చెప్తారు. 



17, జూన్ 2019, సోమవారం

అగ్నిష్వాత్తులు

అగ్నిష్వాత్తులు అనే పితృగణము అమూర్త గణము. వీరి తండ్రి మరీచి, వీరు నివసించు లోకము  సోమ పధము. వీరు అగ్నియందు అనేకములయిన హవిస్సులు వేసి యజ్ఞములు చేశారు కనుక వీరికి ఈ పేరు వచ్చింది. వీరిని సకల దేవతలు ఆరాధిస్తారు.
వీరి పుత్రిక పేరు : ఆచ్చోదా, అమావాస్య 



15, జూన్ 2019, శనివారం

వైరాజులు

పితృదేవతలలో ఆమూర్తి గణములలో మొదటి వారు వైరాజులు. వారి తండ్రి పేరు  విరాజుడు. వీరు నివసించు లోకము ద్యు లోకము. వీరిని మానవ దేవతా భేదం లేకుండా అందరూ  ఆరాధిస్తారు. వీరి మానస పుత్రిక పేరు మేన దేవి.ఈమె ఒకానొక శాపం కారణంగా భూలోకమునకు రావలసి వచ్చి, హిమవంతుడిని వివాహం చేసుకున్నది. ఆ తరువాత ఆమె పార్వతిదేవికి  తల్లి అయినది. 

13, జూన్ 2019, గురువారం

పితృ దేవతలు - సత్యవతి

ఇంతకు  ముందు మనం పితృ దేవతలు , వారి పుత్రిక అమావస్య గా ఎందుకు పిలవ బడుతుంది అని తెలుసుకున్నాం కదా !
ఆ విషయం  తెలుసుకున్నప్పుడు ఆమెకు పితృదేవతలు ఇచ్చిన శాపం గురించి కూడా తెలుసుకున్నాం! ఆమెను భూలోకంలో మానవజన్మ నెత్తమని వారి శాపం.  వారి శాపమును విన్న అమావస్య అత్యంత బాధకు, పశ్చాతాపమునకు లోనయ్యి ఆ శాపమునకు కలుగు ఉపశమనమును తెలుపమని కోరినది. భూత భవిష్య వర్తమాన కాలములను తెలుసుకొనగలిగిన ఆ పితృ దేవతలు ఆమెకు జరుగబోయే విషయములను చక్కగా వివరించారు.

ఆమె 28వ ద్వాపరయుగములో ఒక దివ్య పురుషునకు జన్మనివ్వవలసి ఉన్నది. అతను మాత్రమే తరువాత వచ్చు అనేక అల్పబుద్ధి, అల్ప ఆయుష్షు కల్గిన మానవులను కాపాడే విధంగా వేదములను విభాగం చేయగలడు. అయితే అతని జననం వలన ఆమె కన్యత్వం చెడదు. ఆ తరువాత ఆమె సముద్ర అంశతో జన్మించిన శంతనుడు అనే ఒక మహారాజును వివాహం చేసుకుంటుంది.
తెలిసింది కదా ఆమె ఎవరో! ఆమే మత్స్య గంధి, యోజన గంధి  అని పిలువ బడే సత్యవతి. 

11, జూన్ 2019, మంగళవారం

పితృ దేవతలకు అమావస్య తిధి ఎందుకు ఇష్టమంటే ...!

మనం ఇంతకు ముందు పితృదేవతలు 7 గణములని వారి పేర్లు చెప్పుకున్నాం కదా! వారిలో అగ్నిష్వాత్తులు అనే పితృదేవతలకు ఆచ్చోదా అనే మానస పుత్రిక ఉన్నది. ఆమె ఒక వెయ్యి దివ్య సంవత్సరములు తపస్సు చేసింది. ఆమె తపస్సుకు మెచ్చిన పితరులు సంతుష్టులై ఆమెను వరం కోరుకొమ్మని అడిగారు. అయితే వచ్చిన ఆ పితృదేవతలలో మావసుడు అనే వానిని ఆమె వరించింది. ఆమె చేసిన ఈ ధర్మ దూరమయిన పనికి ఆ పితృ దేవతలు  ఆమెను భూలోకములో జన్మించమని శపించారు.
అయితే ఆ మావసుడు ఆమెను పుత్రికా దృష్టితో చూసినందువలన ఆమె మావాస్య కాలేదు. అంటే ఆమె అమావాస్య అయినది. ఆమె చేసిన తపస్సును పితృదేవతలు మెచ్చారు కనుక అమావస్య తిధి రోజు పితరులకు అర్పించినది ఏదయినా అక్షయము అవుతుంది.

9, జూన్ 2019, ఆదివారం

పితరులు

శ్రాద్ధము మొదలయిన కర్మలలో మనకు తరచుగా వినిపించే పేరు పితృదేవతలు. అయితే వారు ఎవరు? దీనికి సమాధానము హరివంశములో చెప్పారు.

అమూర్తానాంచ ముర్తానాం పితౄణం దీప్తతేజసం
నమష్యామి సదాతేషాం ధ్యాయినాం యోగ చక్షుషా !

దీనికి అర్ధం : రూపము కలిగిన వారును, రూపము లేనివారూ, అత్యంత ప్రకాశవంతమయిన తేజస్సు కలిగినవారు, యోగ శక్తి సంపన్నమయిన కన్నులతో, ధ్యానము ద్వారా అన్ని విషయములగురించి తెలుసుకోగలిగినవారు , అటువంటి యోగ చక్షువులు కలిగినవారి చే ధ్యానింప బడే వారు అయిన పితృ దేవతలకు సదా నమస్కరింతును.

అంటేఅనేక గణములుగా ఉన్న పితరులతో కొందరికి రూపములు ఉన్నాయి మరి కొందరికి లేవు. మొత్తం పితర గణములు 7. వానిలో

అమూర్త గణములు : రూపములు లేని వారు
  1. వైరాజులు 
  2. అగ్నిష్వా త్తులు 
  3. బర్హిషదులు 
మూర్త గణములు : రూపములు ఉన్నవారు 

9, మే 2019, గురువారం

రామాయణం - ఒక భక్తుని జీవితం

మనం ఇంతకూ ముందు రామాయణం గురించి అనేక విషయములు చెప్పుకున్నాం! రామాయణంలోని వివిధ సంఘటనలను మానవుని దేహంలోని ఏడు  చక్రములతో ఎలా పోల్చారో,  రామాయణమునకు ఉన్న ఆధ్యాత్మిక అర్ధం ఏమిటో, రామాయణమును కల్పవృక్షం, వేదం  మరియు గాయత్రీ మంత్రములతో ఎలా పోల్చాలో చెప్పుకున్నాం కదా! ఇప్పుడు మహా రామ భక్తుడు అయిన తులసీదాసు రామాయణంలోని ఏడు కాండలను ఒక భక్తుని జీవితంలో రామభక్తిలో చేరుకునే అనేక సోపానములతో పోల్చారు. అవి ఏంటో చూద్దామా!


  1. బాల కాండ - సుఖ సంపాదన సోపానం 
  2. అయోధ్య కాండ - ప్రేమవైరాగ్య సంపాదన సోపానం 
  3. అరణ్య కాండ - విమల వైరాగ్య సంపాదన సోపానం 
  4. కిష్కింద కాండ - విశుద్ధ సంతోష సంపాదన సోపానం 
  5. సుందర కాండ - జ్ఞాన సంపాదన సోపానం 
  6. యుద్ధ కాండ - విజ్ఞాన సంపాదన సోపానం 
  7. ఉత్తర కాండ - అవిరళ హరిభక్త సంపాదన సోపానం 

6, మే 2019, సోమవారం

రామాయణం - 7 చక్రములు

మనం ఇంతకు ముందు మనం రామాయణం దానిలోని ఆధ్యాత్మిక అర్ధం గురించి చెప్పుకున్నాం కదా! ఆ రామాయణం మానవునిలో ప్రాణశక్తిని మేల్కొలిపి 7 చక్రములను జాగృతం చేసి పరమాత్ముని చేరుకొనే మార్గంలో కలిగే అనేకములయిన అనుభవాలను చెప్తుంది అని పెద్దల వాక్కు. అయితే రామాయణంలో ఏ సంఘటనలు ఆయా చక్రములను సూచిస్తుందో ఇప్పుడు చూద్దాం!


  1. మూలాధారం: రామాయణంలో శివధనుర్బంగం జరిగిన సంఘటన ను మూలాధారంగా చెప్తారు. స్థిరత్వమును చేకూర్చే ఈ చక్రమును శ్రీరాముని కళ్యాణముతో పోల్చుట సరిగ్గా సరిపోతుంది. 
  2. స్వాధిష్టానం: రామాయణంలో కైక అడిగిన రెండు వరముల కారణంగా శ్రీరాముడు వనవాసమునకు వెళ్లే సంఘటనను స్వాధిష్టాన చక్రం గా చెప్తారు. భావావేశములకు మూలమయిన ఈ చక్రమును విపరీతమయిన భావావేశము నిండిన ఈ సంఘటనతో పోల్చుట సరిగ్గా సరిపోతుంది. 
  3. మణిపుర: వనవాసమునకు వెళ్లిన సీతారాములకు దివ్యమయిన ఆభరణములు పరమ పతివ్రత అయిన అనసూయాదేవి ఇవ్వటం అనే సంఘటనను మణిపుర చక్రంగా చెప్తాము. ఈ ఆభరణములు తరువాతి కధలో అత్యంత ముఖ్యపాత్ర పోషిస్తాయి. అటువంటి దివ్య మణిమయములయిన ఆభరణములు సీతాదేవికి సంక్రమించే సంఘటనను మణిపుర చక్రంతో పోల్చుట సరిగ్గా సరిపోతుంది. 
  4. అనాహతం: వనవాసం సజావుగా ఆనందముగా సాగుతున్న సమయములో శూర్పణఖ ప్రవేశించుటను అనాహత చక్రంతో పోల్చారు. సరిగ్గా రామాయణంలో అసురవధ ఈ ఘట్టంతరువాతనే ముఖ్యంగా జరుగుతుంది కనుక అడ్డంకులు తొలగించు అనాహత చక్రం తో ఈ సంఘటనను పోల్చుట సరిగ్గా సరిపోతుంది. 
  5. విశుద్ధి: సీతా వియోగం వలన పరితపిస్తున్న శ్రీరాముడు  పరమ శుద్ధ భక్తురాలయిన శబరిని కలిసిన సంఘటనను ఈ విశుద్ధి చక్రంతో పోల్చారు. 
  6. ఆజ్ఞా: రామాయణంలో సుగ్రీవుని ఆజ్ఞతో సీతాదేవిని వానరులు వెతుకుటకు బయలుదేరు సంఘటనను ఆజ్ఞా చక్రం మొదలుగా పోల్చారు. అయితే సహజంగా ఈ చక్రం వరకు చేరిన ప్రాణమునకు దివ్య దర్శనం జరుగుతుంది. మరి రామాయణంలో జరిగిన ఆ క్షణకాల దివ్య దర్శనం ఎం అయ్యి ఉంటుంది?  దీనికి సమాధానంగా మన పెద్దలు కిష్కిందకాండలో సీతను వెతుకుతూ వెళ్లిన హనుమంతుడు మొదలగు వారికి కలిగిన ఒక అనుభవాన్ని చెప్తారు. సూర్యప్రభాదేవి . అనుకోకుండా ఒక కొండా గుహలో బందీలయిన వానర వీరులను సూర్యప్రభాదేవి ఒక్క క్షణకాలంలో సముద్ర తీరమునకు చేర్చుతుంది. 
  7. సహస్త్రారం: ఈ చక్రం మానవుని దైవత్వమునకు దగ్గర చేస్తుంది అని చెప్పుకున్నాం కదా! రామాయణంలో శ్రీరామ పట్టాభిషేకం ఘట్టమును ఈ చక్రముతో పోల్చారు. 

3, మే 2019, శుక్రవారం

మానవుని దేహంలో 7 చక్రములు

మానవుని దేహంలో 7 చక్రములు ఉంటాయి. ఆ చక్రములను జాగృతం చేస్తే మానవుని మేధస్సు నిరుపమానంగా వృద్ధి చెందుతుంది. మరి ఆ చక్రములు ఏవో చెప్పుకుందాం!


  1. మూలాధారం : పేరు లో చెప్పినట్లు ఏది మూలమునకు ఆధారంగా ఉంటుంది. మానవుని దేహములో ఈ చక్రం వెన్నెముక చివరి భాగంలో ఉంటుంది. ఈ చక్రంలో భూ తత్త్వం ఉంటుంది.  సహజంగా ఈ చక్రము ఎరుపు రంగు కలిగి నాలుగు పత్రములు కల్గిన చక్రంగా చెప్తారు. ఈ చక్రం మానవుని దేహంలో స్థిరత్వమును కలిగిస్తుంది 
  2. స్వాధిష్టానం: ఈ పేరుకు అర్ధం స్వ - అధిష్టానం. మానవుని శరీరంలో ఈ చక్రం పొత్తికడుపు భాగం లో ఉంటుంది. ఈ చక్రం జలతత్వం కలిగి ఉంటుంది. సహజంగా ఈ చక్రం నారింజరంగు కలిగిన ఆరు పత్రములు కలిగి ఉంటుంది. ఈ చక్రం మానవుని దేహంలో భావావేశములు మరియు కోరికల కు నియంత్రిస్తుంటుంది. 
  3. మణిపుర: దీనికి అర్ధం మణుల పురము అని. మానవుని దేహంలో ఈ చక్రం బొడ్డు భాగంలో ఉంటుంది. ఈ చక్రం అగ్నితత్వం కలిగి ఉంటుంది. సహజంగా ఈ చక్రం ఎరుపు రంగులో త్రికోణంగా ఉంటుంది. ఈ చక్రం మానవుని దేహంలో ఆహారము జీర్ణ క్రియను నియంత్రిస్తుంది.  
  4. అనాహతం: ఈ పేరుకు అర్ధం అనా- హతం, అడ్డంకులు లేనిది. మానవుని దేహంలో ఈ చక్రం హృదయస్థానంలో ఉంటుంది. ఇది వాయు తత్త్వం కలిగి ఉంటుంది. ఈ చక్రం ఆకుపచ్చ రంగులో మధ్య షట్కోణం దానిచుట్టూ 12 కమల దళములు కలిగి ఉంటుంది. ఈ చక్రం మానవుని దేహంలో జాగృతం అవుట వలన తమపర భేదం లేని అవ్యాజమైన ప్రేమ మూర్తులు గ ఉంటారు. 
  5. విశుద్ధి: ఈ పేరుకు అర్ధం పరిశుభ్రం చేయునది అని. మానవుని దేహంలో ఈ చక్రం కంఠ భాగంలో ఉంటుంది. ఈ చక్రం ఆకాశ తత్త్వం కలిగి ఉంటుంది. ఈ చక్రం నీలం రంగు కలిగి తలక్రిందులుగా ఉన్న త్రిభుజం దానిచుట్టూ 16 వంకాయరంగు దళములు కలిగిన పద్మముగా ఉంటుంది. ఈ చక్రం మానవుని దేహంలో జాగృతం అవుట  వలన నిస్సందేహంగా నిజములను చెప్పగలుగుతారు. వారి మనోభావాలను సూటిగా చెప్పగలుగుతారు. 
  6. ఆజ్ఞా: ఈ పేరుకు అర్ధం స్వాధికారత. మానవుని దేహంలో ఈ చక్రం కనుబొమల మధ్య ఉంటుంది. ఈ చక్రానికి ఏవిధమయిన తత్త్వం ఉండదు. ఈ చక్రం పారదర్శికం గా ఉన్న కమలం దానిలో రెండు తెలుపు దళములతో ఉంటుంది. ఈ చక్రం జాగృతం అవుట వలన  మానవునికి తనగురించి తనకు పూర్తిగా తెలుస్తుంది, భౌతిక విషయములకు మించి అనేక విషయముల జ్ఞానం కలుగుతుంది. 
  7. సహస్త్రారం: ఈ పేరుకు అర్ధం వేయి దళముల పద్మం. మానవుని దేహంలో ఈ చక్రం మాడు పైభాగం లో ఉంటుంది. ఈ చక్రము ఏ విధమయిన భౌతిక ధాతువుల తత్వమూ కలిగి ఉండదు. ఈ చక్రం వేయిదళముల పద్మం, ఈ పద్మం చుట్టూ లేత గులాబీరంగు కంటి ఉంటుంది. ఈ చక్రం మానవుని దైవత్వమునకు దగ్గర చేస్తుంది.