31, మే 2016, మంగళవారం

శ్రీరామ శతకము – 28

సీ :      అపరాధు శిక్షించుటయె నీమతమనన్
                  దోషభోగ్యుడనన్న దోషమొదవు
          పాపాత్ముడనివీని పారద్రోలెదవేని
                  పతితపావనతకు భంగమొదవు
          అజ్ఞానునకు నీవు హాని జేసెదవేని
                 వాత్సల్యతకు నెప్డువచ్చు కీడు
         శిక్షార్హుడని నీవు చేరదీయవదేని
                  సౌశీల్యతకు వచ్చు సామి కొరత
తే :    ఇట్టి కొరతలు వచ్చుట కిష్టపడుదె
        యనుచు శ్రీదేవి మిమ్మెప్పుడడుగుచుండు

        గానయఘములు జూడక కావుమెపుడు
        అందుకొనవయ్య శ్రీరామ వందనములు !!

                                   - శ్రీ తిరుకోవలూరు రామానుజస్వామి

30, మే 2016, సోమవారం

శ్రీరామ శతకము – 27

సీ : ఆత్మాభిలాష నిన్నర్చింతునందునా
              దేహాభిమానమున్ తీసిపోదు
       జ్ఞానభక్తినిరక్తి ధ్యానింతు నందునా
       కలికాలమునకది యలవి గాదు
       మనసునేకాగ్రతన్ మసలజేసెదనన్న
            ఈషణత్ర బంధమెపుడుపోదు
       సత్సహవాసంబు సంతరించెదనన్న
           దుస్సహవాసమే తోడు పడును
తే:   ఇట్టి లంపటు లంబడి తుట్టతుదకు
       మట్టి చేపట్టి నోటను కొట్టుకొంటి
        గాన పాపిని విడువక కలుషమణచి
         అందుకొనవయ్య శ్రీరామ వందనములు !!

                                   - శ్రీ తిరుకోవలూరు రామానుజస్వామి

29, మే 2016, ఆదివారం

శ్రీరామ శతకము – 26


సీ : దశరూపధరుడవు ధర్మమూర్తివినీవు
          బహుజన్మ ధరుడనే పాతకుడను
      పతితపావనుడీవు భక్తవత్సలనేను
             పతితుండ నీచుడ పాపరతుడ
      శరణాగతత్రాణబిరుదాంకితుడవీవు
             కాపాడుమన చంపు ఘనుడ నేను
     కారుణ్యదాక్షిణ్య కళ్యాణ నిధివీవు
             నిర్దయుండనునేను నిందితుడను

తే :  నీదు బిరుదములట్లుండు నాదుహేయ
       గుణములిట్లౌట జోడింకకుదరదనుచు
      తరిమికొట్టకు దిక్కింకతండ్రివీవె
       అందుకొనవయ్య శ్రీరామ వందనములు !!

                                   - శ్రీ తిరుకోవలూరు రామానుజస్వామి

28, మే 2016, శనివారం

శ్రీరామ శతకము – 26

సీ : భక్తాంబరీషుని భయము బాపగ చక్రి
          దుర్వాసు గర్వంబు తూర్ణమడచె
       ధర్మజురక్షింపధారిణి కృష్ణుడు
            శిశుపాలు ఖండించె శీఘ్రముగను
      సుగ్రీవుగాపాడసుజనుడు రాముడు
             వాలి గూల్చెను నేల కోలవేసి
      ప్రహ్లాదుగావంగ నాహ్లాదియాహరి
           అసురుని ద్రుంచెను యవని మెచ్చ

తే :    భక్త వరులను భాదించు పాపిజనుల
         నెన్నడేనియు క్షమియింప డీశ్వరుండు
         నేడు నాదోషములు జూచి నేనరునుంచి
         అందుకొనవయ్య శ్రీరామ వందనములు !!
                              - శ్రీ తిరుకోవలూరు రామానుజస్వామి

27, మే 2016, శుక్రవారం

శ్రీరామ శతకము – 25

సీ : కాముకత్వోద్రేక గర్వితుల్ చెడిపోరె
            మునుబ్రహ్మ రుద్రులు మోహ మొంది
      దేవేంద్రుడాహల్యదేవి గూడగ మేన
              పెక్కు  యోనులు గల్గి పేల్వమొందె
     ఋశ్య శృంగుడు చెడె ఋష్యా శ్రమమ్ములో
               వేశ్యలరతుల కావేశమొంది
     మునులు ఋషులును రాజ ముఖ్యులు వేల్పులు
             స్త్రీ సంగమును కోరి చెడిరి భువిని

తే : కామ వశులౌచు చెడిరిట్లు ఘనులు మున్ను
       నన్ను నీచుని సామాన్య నరునకట్టి
       కామమణచగ వశమౌనె కలుషహరణ
      అందుకొనవయ్య శ్రీరామ వందనములు !!

                                   - శ్రీ తిరుకోవలూరు రామానుజస్వామి

26, మే 2016, గురువారం

శ్రీరామ శతకము – 24

సీ :  పరవాసుదేవ నా బహునీచగుణములు
                 వినిపింతు వినవయ్య విసువుగొనక
           బ్రహ్మచారి నటంచు భ్రమపడజేసితి
                  భ్రష్టమానసినంచు బలుకనైతి
           నమ్రత్వమును జూపినమ్మ జేసితిగాని
                   కుటిలుడనని నేను గొలుగనైతి
           పావనత్వమ్మెందు ప్రకటించితిగాని
                    తరచుపాపి నటంచు తలచనైతి

తే : ఇట్టి దుర్వృత్తులెన్నియో ఈడ్చియీడ్చి
      ఘోరనరక ఫలమ్ముల గుడువనుంటి
      గాన దరి జేర్చిదయజూడు కమలనాభ
     అందుకొనవయ్య శ్రీరామ వందనములు !!

                                            - శ్రీ తిరుకోవలూరు రామానుజస్వామి

25, మే 2016, బుధవారం

శ్రీరామ శతకము – 23

సీ :      ఆలుబిడ్డల సాకనవనినే పడుపాట్లు
                   తలచగభయమెంతో గలుగు నెపుడు
           గురుదేవతల భక్తి మరచి వేగమె పోయి
                    భుక్తి కోసము దుష్టు పొగడనాయె
           చనరాని చోట్లకు సంతసంబునజని
                    చేయగల్గని పనుల్ చేయుటాయె
           దాసదాసులసేవ తగదని విడిపోయి
                   చెడి నీచు సేవలు చేసి చెడితి

తే :   నుడువరానట్టి మాటలు నుడివినాను
        కొలువ రానట్టి కొలువులు గొలిచినాను
        అడియనెడ బాయకాశ్రయ మందజేసి
         అందుకొనవయ్య శ్రీరామ వందనములు !!

                               - శ్రీ తిరుకోవలూరు రామానుజస్వామి

24, మే 2016, మంగళవారం

శ్రీరామ శతకము – 22

సీ :  సాధువువలె నేను జనము లందరిలోన
                 కనిపించుటయే కాని ఖలుడ నిజము
            ఆచారవంతుదనుచు జెప్పెదగాని
                                     సతమనా చారంబు సలుపు చుందు
          నిష్ఠాపరుండను నియతి చాటెదుగాని
                     కనదురాచార సంగతియె మెండు
         వైష్ణవుండని చాట విష్ణు చిహ్నములుండు
                       మాధవునెపుడేని మదిని గొల్వ

తే :  గోముఖ వ్యాఘ్రమను రీతి కుమతినైతి
       మోసగాడంచు నీవెట్లు ముఖముజూడ
       గలవు నా తండ్రి వేగమె కలుషమణచి
      అందుకొనవయ్య శ్రీరామ వందనములు!!
                                  - శ్రీ తిరుకోవలూరు రామానుజస్వామి

23, మే 2016, సోమవారం

శ్రీరామ శతకము – 21

సీ :    జూదరులందున జూదరి నైనేను
                 విత్త వ్యయము జేసి వెర్రినైతి
          త్రాగు బోతుల జేరి తెగ త్రాగవదరితి
                  మానావమానముల్ గాన కెందు
          తిండిపోతరులందు తిండిపోతైతిని
                  భక్షించు విజ్ఞాన లక్ష్యమిడక
          జారత్వమున నేను జాణనటంచును
                   పేరు పెంపుగడించి పెద్దనైతి

తే :  పట్టభద్రుండ నైతిని పాపులందు 
       లేశమైనను సుకృతంబు లేదునాకు 
       పతిత పావన బిరుదాంక పట్టి విడతు 
      అందుకొనవయ్య శ్రీ రామ వందనములు !!

                              - శ్రీ తిరుకోవలూరు రామానుజస్వామి    

22, మే 2016, ఆదివారం

శ్రీరామ శతకము – 20

సీ :      పరులనిందించంగ బలుక నేర్చితిగాని
నానేరముల జెప్పుకొనగనైతి
విష్ణు దాసులజూచి వెక్కిరించితి గాని
ముక్తులంచనియెంచి మ్రొక్కనైతి
ఇతరులవంచించ సతము గోరితిగాని
ఆత్మవంచకునటంచరయనైతి
పలుదేవతల గొల్చి పాడనేర్చితిగాని
పరమాత్ముడగు నిన్ను పట్టనైతి

తే :      భూరివేదాంత సూక్తుల బొగడనైతి
మాటిమాటికి నినుగొల్వ మరచిపోతి
ఇంకనేవిధి నను బిల్చి యేలుకొనెదో
అందుకొనవయ్య శ్రీరామ వందనములు !!

                            - శ్రీ తిరుకోవలూరు రామానుజస్వామి    

21, మే 2016, శనివారం

శ్రీరామ శతకము – 19

సీ :      జన్మంబులెన్నొయీ జగతిలోపలనెత్త
విసుగెంతయును లేదు వాసుదేవ
అనుభవించెడి కర్మలవియెన్నశక్యమే
శూలికైనను తమ్మి చూలికైన
నేనుజేసినస్తన్యపానంబునిజముగా
సప్తోదధులమించుసారసాక్ష
ఘోరాతిఘోరమౌ నరకంబులనెల్ల
 దుఃఖమంచనకనుదూకినాడ
తే :      అగ్రజుండను పాపులయందు నేను
నిరయ మొందగనుంతిని నీరజాక్ష
నీదుభజనమె జేయుచు నిన్నువిడను
అందుకొనవయ్య శ్రీరామ వందనములు !!

- శ్రీ తిరుకోవలూరు రామానుజస్వామి                                        

20, మే 2016, శుక్రవారం

శ్రీ రామ శతకము-18

సీ:         విద్యుత్సమాన దుర్విషయాను రక్తులై
స్త్రీ సంగమును కోరి చెడుట నిజము
భోగాభిలాషచే భూరి సంపద గూర్చి
నరక దుఃఖము నొందు నరుడు నిజము
బంధువుల్ భార్యయేపరమనువారికి
సంసారబంధంబు సాగు నిజము
పాంచభౌతికమైన పాడు దేహముజూచి
నేను నాదను వాడు నీల్గు నిజము

తే :      ఇట్టి యైహిక మస్థిరమీప్సితముల
దగు నీకను నన్నెప్డుదయను బ్రోవ
నిన్నెనమ్మితి మనమున నీరజాక్ష
అందుకొనవయ్య శ్రీరామ వందనములు !!

19, మే 2016, గురువారం

శ్రీరామ శతకము –17

సీ :    శ్రీ రమానాయకా చిత్తగించ గదయ్య 
              వివరింతు నీకు నా విపుల చరిత 
        మవని నేజేయని యఘమొక్కటియులేదు 
                 బండబూతులదిట్టు దండివాడ 
      జారత్వ చోరత్వ చంచలత్వపునుడుల్ 
                 మాటిమాటికి సేయు మేటిమగడ 
      పరహింస పరధన పరకాంతలను జేర 
                బట్టివీడని జగజ్జెట్టి ఖలుడ 

తే : పరుల మేలోర్వ జాలని పాపమతిని 
      ఘనుల నిందల పాల్జేయు కపటికులుడ 
      ఇంకయేరీతిన న్నీవు యేలుకొనెదొ 
     అందుకొనవయ్య శ్రీరామ వందనములు !!

                              - శ్రీ తిరుకోవలూరు రామానుజస్వామి     
 

18, మే 2016, బుధవారం

శ్రీ రామ శతకము - 16

సీ:       సంసార రొంపిలో స్తంభంబు కూరిన
ట్లయ్యెను నావిధ మరసిచూడ
శ్లేష్మంబునంబడి లేవనేరక యీగ
తపియించు కరణి నాతపన యయ్యె
కారాగృహంబందు నేరస్థు కైవడి
దేహబాధల తగిలి దీనునైతి
పెనుతుపానుకు జిక్కి పీడింపబడు నోడ
విధమయ్యె యీదేహి వింతగాను

తే:      ఘోరకృత్యంబు లెల్లను కోరికోరి
చేసి నరకంబు చేరను సిద్దమైతి
రమ్మునను గని దరిజేర్చరా మురారి
అందుకొనవయ్య శ్రీరామ వందనములు !!

- శ్రీ తిరుకోవలూరు రామానుజస్వామి                                            

4, మే 2016, బుధవారం

శ్రీరామ శతకము – 32

సీ : అర్ధ పంచక జ్ఞానమమరియుండిన గదా
             జ్ఞాన మాత్మకు గల్గు మానకెపుడు
      ఆకారత్రయ నిష్ఠయాత్మకుండినగదా  
             అన్య దేవతలందు నానవదలు
      నవవిధ సంబంధమును నమ్మినట్లైన
            ఇతరాంతరంబుల యిష్టముడుగు
      తత్వత్రయంబాత్మతరచి చూచినగదా
              మంత్రాంతరంబులమాని బ్రతుకు
తే : భువిని నీయర్ధముల యొక్క భోగ్య తెరిగి
       చేతినిష్టలనున్నట్టి చేతనులను
       దయను రక్షింతువట తండ్రి ధర్మమూర్తి
      అందుకొనవయ్య శ్రీరామ వందనములు !!
                           - శ్రీ తిరుకోవలూరు రామానుజస్వామి

26, ఏప్రిల్ 2016, మంగళవారం

శ్రీ రామ శతకము-15

సీ :       ప్రకృతి గుణంబులు బాగుగానను జేరి
ప్రకృతి వశ్యుని జేసె ప్రాజ్ఞవినవె
సుఖ దుఃఖములు నాకు చుట్టరికంబులై
కలిమి లేములు నన్ను కెలికి చెరచె
మదము మాత్సర్యంబు మమకార గర్వముల్
కరణత్రయము చేత ఖలుని జేసె
రాగద్వేషంబులు బాగుగా నీడ్వగా
కోపతాపంబులు కోరిచేరె
తే:       ద్వంద్వములు నన్ను నీడ్వగా తపనపొంది
తండ్రి నిను జేరజాలక తలతునిదిగొ
వరద గోవింద వామన వాసుదేవ
అందుకొనవయ్య శ్రీరామ వందనములు !!

24, ఏప్రిల్ 2016, ఆదివారం

శ్రీ రామ శతకము -14

సీ:       శైశ వంబున దేవ శరణన లేకను
మలమూత్రముల మున్గి మరచుటాయె
కౌమారదశయందుగనలేకనుండెనా
చెడు స్నేహంబులు నన్ను చేరి చెరచె
యౌవనంబున నిన్ను యర్చించ కొనకుండ
అంగనా సాంగత్యమడ్డు నిలచె
ముదియందు నిన్బక్తిమురిపించలేక నీ
చెడు రోగముల దెల్వి చెడగనాయె
తే :      శ్రీరమానాధ గోవింద శ్రీనివాస
ఎట్లు తరియింతునే దశనెట్లు గొలుతు
వేగవేంచేసి రక్షించు వేదవేద్య

అందుకొనవయ్య శ్రీరామ వందనములు !!

23, ఏప్రిల్ 2016, శనివారం

శ్రీ రామ శతకము -13

సీ:       నీనామములు సహస్రానీకములు గాన
 ఏ నామమున బిల్వ నేర్తునిన్ను
బహు రూపములు నీకు భావ్యమై యుండగ 
ఏ రూపమని నిన్ను నేర్పరింతు
కళ్యాణగుణములు కల వనంతంబులై 
ఏగుణమ్మన నిన్ను నెంచుకొందు
సకల లోకాలలో సర్వంబు నీవౌట
యెందు గలవీవని యెరుగ గలను 
తే :      క్షితిని నిను జూచు వారేరి చిద్విలాస
మలినమతి నేను నిన్నెట్లు దెలియనేర్తు
వచ్చి కాపాడు శరణము జొచ్చినాడ

అందుకొనవయ్య శ్రీరామ వందనములు !!

22, ఏప్రిల్ 2016, శుక్రవారం

ఎక్కడ నుండి ఏం తీసుకోవచ్చు!

విషాదప్యమృతం గ్రాహ్యమమేధ్యాదపి కాంచనం
నీచాదప్యుత్తమా విధ్యా స్త్రీ రత్నం దుష్కులాదపి!!

భావం : విషం నుండి అమృతాన్ని, మలినముల నుండి బంగారాన్ని, నీచుని వద్ద నుండి విధ్యను, తన కంటే తక్కువ కులములో ఉన్నా స్త్రీ రత్నమును స్వీకరించ వచ్చును.

వివరణ: విషమును అలాగే స్వీకరిస్తే అనారోగ్యం కలుగు తుంది. అలా కాకుండా దానిని చేయవలసిన విధంగా శుద్ధి చేస్తే అది ప్రాణములను నిలబెట్టే అమృతం అవుతుంది. మురికిగా ఉన్నప్పుడు అత్యంత విలువైన బంగారాన్ని కూడా మనం గుర్తించలేము. దానిని గుర్తించి, మురికిని తొలగించే నిపుణత ఉన్నప్పుడు మనకు బంగారము లభిస్తుంది. నీచుడు (తనకంటే చిన్నవాడు) చేసే పనులలోనుండి కూడా ఉత్తమ విధ్యను నెర్చుకునే అవకాశం ఉంటుంది. అయితే దానికి కూడా కొంత నిపుణత అవసరం. స్త్రీ రత్నం తనకన్నా తక్కువ కులంలో జన్మించినా కూడా ఆమెను వరించ వచ్చును.  

21, ఏప్రిల్ 2016, గురువారం

శ్రీరామ శతకము – 12

సీ :      నీలమేఘమువాడు నిడుద బాహులవాడు
కరుణారసము జిల్కు కనులవాడు
వెడద వక్షము వాడు వేద స్వరూపుడు
 కమనీయ కంఠంబు గలుగువాడు
కనక రంభాతిరస్కారులూరులవాడు
పద్మ పత్రముమించు పదమువాడు
శ్రీవత్స చిహ్నంబు శ్రీచూర్ణరేఖలు
 కరముల శంఖ చక్రముల వాడు
తే :      వక్షమందున శ్రీలక్ష్మి వాసమొంద
          శేషశయ్యను బవళించ శేషజనుల
దయ కటాక్షించునను మాట తప్పుగాదు

అందుకొనవయ్య శ్రీరామ వందనములు !!