మనం ఇంతకు ముందు విదురనీతి శీర్షికలో రెండు భాగాలు చెప్పుకున్నాం! రెండవ భాగంలో దృతరాష్ట్రుడు విదురుని ప్రశ్నించటం చూశాం! ఇప్పుడు ఆ విదురుడు చెప్పే సమాధానం ఎంత విచిత్రంగా ఉందో చూద్దాం!
సంస్కృత శ్లోకం:
అభియుక్తం బలవతా దుర్బలం హీనసాధనం
హృతస్త్వం కామినం చోరమావిశన్తి ప్రజాగరాః
కచ్చిదేతైర్మహాదోషైర్న స్పృష్టోసి నరాధిప
కచ్చిన్న పరవిత్తేషు గృధ్యన్నిపరితప్యసే
శ్రీ మల్లాది సూర్యనారాయణ శాస్త్రి గారు రచించిన తెలుగు పద్యంః
ఇలబలశాలితోడ నెదురేగెడు హీనబలుడు నన్యకాం
తల నెదగోరువాడపహృతస్వుడు చౌర్యసమర్ధుడన్న వీ
రలు గతనిద్రులౌదురు ధరావరయుంటివె వీరిలోన న
న్యుల ధనమున్ హరింపదలపుంచితివే కతమెద్ది మేల్కొనన్
భావం:
ఓ మహారాజా! తనకంటే బలవంతుడిని ఎదుర్కోబోతున్న వాడు, తన ఆస్తిని/ సొమ్మును అంతటినీ పోగొట్టుకున్న వాడు , పరస్త్రీలను మనసునందు కోరుకుంటున్న వానికి, ఇతరుల సంపద దోచుకోవాలని అనుకున్న వారికి నిద్ర రాదు. కనుక మహారాజా మీరు ఇటువంటి ఆలోచనలు ఏమయినా ఉన్నాయా!
విశ్లేషణ:
మనం ఇంతకు ముందు చెప్పుకున్నట్లు విదురుడు సాక్షాత్తు ధర్ముని అవతారం. అతనికి ధర్మాధర్మముల విచక్షణ ఉంది. ఇక్క డ దృతరాష్ట్రుడు రాజు, విదురుడు అతనికి వరుసకు తమ్ముడే అయినా అతనికి కేవలం సలహాలు చెప్పే అవకాశం తప్ప అతనిని తిన్నగా ప్రశ్నించే అవకాశం లేదు. కనుక పైన అడిగిన ప్రశ్న అడిగాడు. ఆ సమాధానం చుస్తే నిజంగా అన్ని సందర్భాలు కూడా ఆ సమయంలో దృతరాష్ట్రునికి సంబంధించినవే.
సంజయుడు పాండవుల సభలో ఎం జరిగిందో ధృతరాష్ట్రునికి చెప్పలేదు.
తనకంటే బలవంతుడిని : ధృతరాష్ట్రునికి అన్ని వేళలా తమకంటే పాండవులే బలవంతులు అనే నమ్మకం ఉంది. కనుక ఒక వేళ వారు సంధికి ఒప్పుకోకుండా తిన్నగా యుద్ధానికి రమ్మన్నారేమో అని అతని అనుమానం!
తన ఆస్తిని/ సొమ్మును అంతటినీ పోగొట్టుకున్న వాడు: ధృతరాష్ట్రునికి ఆ రాజ్యం మీద సింహాసనం మీద విపరీతమయిన వ్యామోహం. అదే అతని సర్వస్వం. దానిని ఆ పాండవులు లక్కుంటారేమో అని భయం
పరస్త్రీలను మనసునందు కోరుకొనుట: ఇది ధృతరాష్ట్రుని దృష్టి కాక పోయినా, ద్రౌపదిని నిండు సభలో అవమానిస్తున్నప్పుడు, అతను ఏమీ మాట్లాడలేదు, పరస్త్రీని మనస్సులో కొరుకొవడానికీ, ఆమెకు నలుగురిలో అవమానం జరుగుతున్నప్పుడు దానిని ఆపకుండ ఉండడానికి తేడాలేదు
ఇతరుల సంపద దోచుకోవడంః నిజంగా ధృతరాష్ట్రునికి పాండవుల రాజ్యమును దోచుకోవాలని కోరిక ఉంది.
ఇది విదురుని గొప్పతనం. తాను అడగాలని అనుకున్నది అడుగుతూనే, మహారాజు తప్పులను ఎత్తి చూపటం.
కామెంట్లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి