మనం ఇంతకు ముందు కలి ప్రభావం, కలికాలంలో మానవుని లక్షణముల గురించి తెలుసుకున్నాం కదా!
ఇప్పుడు ఆ కలి ప్రభావాన్ని తప్పించుకోవడానికి ఒక సులభమయిన మార్గం గురించి చెప్పుకుందాం!
ఈ మార్గన్ని స్వయంగా వ్యాసభగవానుడే మహాభారతంలో అరణ్యపర్వంలో చెప్పాడు. మనం ఇప్పుడు వ్యాసుడు చెప్పిన సంస్కృత శ్లోకం, దాని కవిత్రయ భారతంలోని తెలుగు అనువాదం కూడా చెప్పుకుందాం!
శ్లోః
కర్కోటకస్య నాగస్య దమయంత్యాః నలస్య చ
ఋతుపర్ణస్య రాజర్షేః కీర్తనం కలినాశనం
తెలుగు అనువాదంః
కర్కోటకుని, దమయంతి, బుణ్యమూర్తియైన నలుని
ఋజు చరిత్రుడైన ఋతుపర్ణు గీర్తింప గలిభయంబు లెల్ల గ్రాగు నధిప
భావంః కర్కోటకుడు అనే పాము, భార్యాభర్తలయిన నల దమయంతుల గురించి, రఘువంశజుడయి మంచి ప్రవర్తన కలిగిన ఋతుపర్ణుడు అనే రాజుని నిరంతరం తలుచుకొనుట వలన కలి వలన కలిగే భయములు అన్నీ తొలగుతాయి.
విశ్లేషణ
ఈ శ్లోకమును వ్యాసుడు నలదమయంతుల కధకు ఫలశ్రుతిగా చెప్పాడు. వీరి కధ అనేక మలుపులతో ఆసక్తి దాయకంగా ఉంటుంది. ఎంతో అన్యోన్య దాంపత్యమునకు ఉదాహరణగా నలదమయంతులు, వారు విడిపోయిన సమయంలో దమయంతి చూపిన మనోధైర్యం, నలుడు తాను దూరమయితే తన భార్య పుట్టింటికి వెళ్ళి సంతోషిస్తుంది అనే త్యాగం, తనకు ఉపకారం చేసిన వ్యక్తికి అపకారం రూపంలో ఉపకారం చేసిన కర్కోటకుడు, తాను ఒక రాజు అయ్యి ఉండీ తన వద్ద పనిచేసే ఒక వ్యక్తికి ఎలా మర్యాద ఇవ్వలి, ఒక విషయం వారి వద్ద నేర్చుకున్నప్పుడు వారికి తిరిగి ప్రత్యుపకారం ఎలా చేయాలి అని ఋతుపర్ణుని వద్ద మనం నేర్చుకోవలసిన పాఠములు. ఈ విషయములు అన్నీ మనం అర్ధం చేసుకోగలిగినప్పుడు, కలి అనే విషప్రభావం నుండి మనం బయట పడగలుగుతాము.
ఈ పాఠములు మనం రాబోయే టపాలలో తప్పకుండా నేర్చుకుందాం!
కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి