27, జనవరి 2016, బుధవారం

నారద కుండం

ముక్తి కుండం గురించి ఇంతకుముందు చెప్పుకున్నాం కదా! మరి నారద కుండం  ఎక్కడ ఉన్నది అనే అనుమానం ఇక్కడ తీరుస్తాను.
సర్పవరంలోని భావనారాయణ దేవాలయం దగ్గరలో ముక్తి కుండం ఉంది అని చెప్పుకున్నాం కదా! దానికి కొంచెం దూరంలో ఈశాన్యం దిక్కుగా ఈ నారద కుండం ఉంటుంది. నడువగలిగిన వారికి దాదాపు 15 నిముషముల దూరంలో ఉంటుంది ఈ నారద కుండం. శ్రీ భావనారాయణ స్వామి దేవాలయం నుండి సర్పవరం జంక్షన్ కు వెళ్ళే దారిలో ఎడమ చేతివైపున ఉన్న ఒక చిన్న సందులో లోపలకు ఉంటుంది ఈ నారద కుండం.  నారద కుండం ఒడ్డున శ్రీ భవానీ సమీత శ్రీ నీలకంఠేశ్వర స్వామి సన్నిధి ఉన్నది. ఈ నారద కుండమునకు ప్రతినిత్యం సాయంత్రం 7. 00 గంటలకు నక్షత్ర మరియు కర్పూర హారతులు ఇస్తారు.
ఈ దేవాలయం లో ఉన్న మరో ప్రత్యేకత "సప్త ఋషి మండలం", "దక్షిణామూర్తి దేవాలయం మరియు ధ్యాన మందిరం".  ఈ దేవాలయంలో సప్తఋషుల శిలాప్రతిమలు ఉన్నాయి. వారికి చిన్ని మందిరములు కూడా ఉన్నాయి. వారి మన్దిరములకు ముందు ఒక్కో మొక్క ఉన్నాయి.
ఆ వివరములు
  1. కశ్యపుడు - తులసి 
  2. అత్రి - అవిస 
  3. భరద్వాజ - ఉత్తరేణి 
  4. విశ్వామిత్ర - మారేడు 
  5. జమదగ్ని - గరిక
  6. గౌతముడు - ఉమ్మెత్త 
  7. వసిష్ఠ - జమ్మి 
ఈ మహర్షులకు ఆయా మొక్కలకు గల సంబంధం నాకు తెలియలేదు. వీరే కాక అక్కడ వాల్మీకి మహర్షి, వేద వ్యాసుడు, బమ్మెర పోతన మరియు ఆదిశంకరాచార్య -ప్రతిమలు ఉన్నాయి. ఈ దేవాలయ ప్రాంగణంలో దుర్గాదేవి ఆలయం కూడా ఉన్నది.
ఈ దేవాలయంలో జరిగే పూజల వివరములు 

  1. ప్రతినెలా శుద్ధ త్రయోదశి సాయంత్రం 7 గంటలకు పార్వతి కల్యాణం (భక్తులకు ఉచితం)
  2. పౌర్ణమికి కుంకుమ పూజలు నిర్వహిస్తారు  (పూజా ద్రవ్యములు ఉచితం)
  3. మాస శివరాత్రి రోజున సాయంత్రం 6. 30 కి అమ్మవారికి స్వామివారికి ప్రదోష పూజలు జరుగును 
పూజలు చేయించు కోవాలనుకునే వారు సంప్రదాయ దుస్తులలో రావలసి ఉంటుంది.  

25, జనవరి 2016, సోమవారం

సర్పవరం భావనారాయణ దేవాలయం

కాకినాడకు సమీపంలోని  సర్పవరం లోని త్రిలింగ క్షోణి వైకుంఠం గా పిలువబడే  ఈ భావనారాయణ దేవాలయం ముందుగా ఎవరు నిర్మించారో ఎవరికీ సరిగా తెలియదు. కానీ క్షేత్ర మహత్యం ప్రకారం, కలియుగ ప్రారంభం నుండి అంటే సుమారుగా 2000 సంవత్సరములుగా ఉన్నట్లు భావిస్తున్నారు. క్రీ. శ 4 వ శతాబ్దంలో యాళులు, తరువాతికాలం లో పాండ్యులు, రెడ్డి రాజులు, చోళులు, కళింగులు, వసంత భోగరాయలు, శ్రీ కృష్ణ దేవరాయలు, రాజరాజ నరేంద్రుడు, కాటయ వేమారెడ్డి ఈ దేవాలయమునకు వారి సేవలు అందించినట్లుగా కొన్ని శాసనములు ఉన్నాయి.
క్రీ శ 1779 వ సంవత్సరంలో పిఠాపురం రాజా "శ్రీ గంగాధర రాయనం గారు" శిధిలావస్థలో ఉన్న ఈ దేవాలయమును బాగు చేయించి, శిఖరములు నిర్మింపచేసి, ఉత్తర దిక్కున గాలిగోపురం నిర్మింప చేసారు. అంతే కాకుండా దేవాలయం లో 12 మంది ఆళ్వారులను, వైష్ణవ మత స్థాపకులయిన రామానుజుల వారికి మరుజన్మగా చెప్పుకునే శ్రీ మనవాళ మహాముని సన్నిధిని వారు స్థాపించారు. అంతే కాకుండా పాడయి ఉన్న నారద కుండం మరియు ముక్తి కుండములను తిరిగి తవ్వించారు. వారి కాలంలో దేవాలయమునకు సంబందించిన చాకలి, మంగలి పురోహితులు అందరికి రాజుగారు మాన్యములు ఇచ్చారు.
గాలిగోపురం స్వామి ఎదురుగా ఉన్న తూర్పు వైపున కాకుండా ఉత్తరమున ఎందుకు కట్టించారు?
ఎందుకంటే ఈ దేవాలయమునకు ఉత్తరం వైపున పిఠాపురం ఉన్నది. కనుక వారు ప్రతి నిత్యం ఈ దేవాలయమునకు రాకున్నా వారు ఈ గాలిగోపురం చూసి నమస్కారం చేసుకునేందుకు వీలుగా రాజావారు అలా కట్టించారట.
దేవాలయం ప్రాంగణం:
ఈ దేవాలయమునకు తూర్పున ముఖ ద్వారం ఉంది, ఉత్తరమున గాలిగోపురం ఉంది. తూర్పువైపు నుండి ప్రవేశిస్తే ఆలయ ప్రాంగణంలో మొదటగా దర్సనం ఇచ్చేవి స్వామివారి పాదములు.  ఆ వెనుకగా ద్వజస్థంభం. ఆ వెనుక రాతి గరుడ స్థంబం ఉంటాయి.   అక్కడి నుండి దేవాలయ ప్రదక్షిణ మొదలు పెడితే ముందుగా కనిపించేది అక్కడి గో సంపద. ఆ తరువాత అక్కడ ఉన్న నక్షత్ర మొక్కలు. అవునండి మనకు ఉన్న 27 నక్షత్రములకు సంబందించిన 27 మొక్కలు అక్కడ ఉన్నాయి. వాని చుట్టూ చక్కగా ఫెన్సింగ్ చేసి, ఆయా నక్షత్రముల చుట్టూ తిరిగే వారు చదువుకోవలసిన శ్లోకములను, ఆయా ఫెన్సింగ్ లపై వ్రాయించి ఉంచారు.  
దేవాలయం లోపలి భాగం:
గర్భగుడిలో శ్రీ రాజ్యలక్ష్మీ సమేత శ్రీ భావనారాయణ స్వామి దర్శనం ఇస్తారు. జయ విజయాల నిలువెత్తు రూపములు. అక్కడి నుండి ప్రదక్షిణ పురస్సరంగా వెళితే ఆ ప్రాకారంలో పడమర ముఖంగా ముందు 12 మంది ఆళ్వారుల సన్నిధి ఉంటుంది. వారికి ప్రక్కగా శ్రీ అనంత ప్రతిష్ట శ్రీ మూల భావనారాయణ స్వామి దర్సనం ఇస్తారు. వీరికి ఇరువైపులా శ్రీ వేణుగోపాల స్వామి మరియు శ్రీ విఖనస మహర్షి ఉంటారు. అలా సుమారుగా గర్భగుడి వెనుక వైపుకు వస్తే అక్కడ దాదాపు 5-6 అడుగుల లోతులో శ్రీ పాతాళ భావనారాయణుడు దర్సనం ఇస్తాడు. అక్కడి నుండి కొంచెం ముందుకు వెళితే, మూల మూర్తికి  వాయువ్య మూలగా మనవాళ మహాముని ఉంటారు.   వీరికి ఎదురుగా, మూల మూర్తికి ఈశాన్యంలో శ్రీ లక్ష్మి అమ్మవారు/ గోదా దేవి దర్శనం ఇస్తారు. వీరిని సాక్షాత్తూ శ్రీ వేదవ్యాసులు ప్రతిష్టించారట.

ఉత్తర గాలి గోపురం: 
ఉత్తరమున ఉన్న ఈ గాలిగోపురం 42 అడుగుల ఎత్తు ఉంటుంది. దేవాలయం లో ముఖ్యంగా ఆకట్టుకునేది ఆఉత్తర గాలిగోపుర శిల్ప సంపద. పురాణేతిహాసములలోని అనేక ముఖ్య ఘట్టములు చాలా మనోహరంగా ఈ గాలిగోపురంలో మలచారు. రామ రావణ యుద్ధం
హంసవాహనారూడుడయిన బ్రహ్మ 



దేవాలయ ప్రాకారంలో పశ్చిమవైపున ఉన్న గోడలోపల తూర్పు ముఖంగా వినాయకుని దర్శించవచ్చు.

ఇతర విశేషములు:

ఉత్తర ద్వారం (గాలిగోపురం) నుండి బయటకు వస్తూనే సర్పవరం జంక్షన్ - మాధవపట్నం కలిపే రహదారి కనిపిస్తుంది. ఆ రహదారికి అవతల ఒక కోనేరు ఉన్నది. అదే ముక్తి కుండం. ఆ ముక్తి కుండం ప్రక్కన ఈమధ్యనే శ్రీ నారదులవారిని ఉంచారు. నారదులవారి చేతికి ఉన్న గాజులను ఇక్కడ చూడవచ్చు.

మరి నారద కుండం ఎక్కడ ఉంది?
ఉంది. ఉంది. అది మరొక టపాలో చెప్పుకుందాం!
ముఖ్య విషయములు 
  1. ఈ దేవాలయం సుమారుగా 40 సంవత్సరముల నుండి దేవాదాయ ధర్మాదాయ శాఖ క్రింద ఉన్నది.
  2.  ప్రస్తుతం ఈ దేవాలయమునకు 80ఎకరముల భూమి ఉన్నది. 
  3. మూల భావనారాయణ, భావనారాయణ ల మెడలో 108 సాలగ్రామములతో చేసిన మాల ఉంటుంది. వీనిని గండకి నది నుండి తెప్పించారు. 

పూజల వివరములు:

నిత్య పుజావిధానం:
ఉదయం :    6.00  - అర్చన 
                   7. 30 - బాల భోగం 
                            సేవాకాలం (తిరుప్పావై )
                            తీర్ధ ప్రసాదములు 
                    11. 00- అర్చన, రాజ భోగం 
సాయంత్రం :   5. 00 - దేవాలయం తెరుస్తారు 
                    6. 30 - అర్చన, శనగలు నివేదన 
                    8. 00 - పవళింపు సేవ 
                    8. 30 - 9. 00 - దేవాలయం ముసి వేస్తారు. 
మంగళ, శని వారములు - సాయంత్రం 7. 00 - 8. 00 వరకు సంక్షేప రామాయణం(మహిళా మణుల పారాయణం)
శుక్రవారం - సాయంత్రం 7. 00 - 8. 00 వరకు విష్ణు సహస్త్రనామ పారాయణం
పర్వదినములు- ప్రత్యేక పూజలు 
చైత్ర మాసం : ఉగాది - ఉదయం : బాల భోగం - ఉగాది పచ్చడి 
                                సాయంత్రం : పంచాంగ శ్రవణం 
వైశాఖ మాసం : శుద్ధ ఏకాదశి నుండి 7 రోజులు కల్యాణోత్సవం (7 వాహనములపై ఊరేగింపు )
శ్రావణ మాసం : పుబ్బ నక్షత్రం - గోదాదేవి తిరు నక్షత్రం 
                        పౌర్ణమి తరువాతి అష్టమి - కృష్ణాష్టమి - సాయంత్రం 5. 00 - పంచామృతాభిషేకం 
                                                                                                        9 రకముల ప్రసాదములు   
                                         మరుసటి రోజు - నవమి - ఉట్టి సంబరం ; తిరువీధి ఉత్సవం 
ఆశ్వయుజ మాసం: నవరాత్రులు 
                              దశమి రోజు - జమ్మి ఉత్సవం, గ్రామోత్సవం 
కార్తీక మాసం : మూలా నక్షత్రం - మనవాళ మహాముని జయంతి ఉత్సవం 
మార్గశిర మాసం : డిసెంబర్ 16- జనవరి 13 : ధనుర్మాసం 
                              ప్రతిరోజూ ఉదయం : తిరుప్పావై 
                          వైకుంఠ ఏకాదశి ఉత్తర ద్వార దర్సనం 
                            గరుడ వాహనం పై గ్రామోత్సవం 
                      బోగి నాడు : గోదా కల్యాణం 
మాఘ మాసం : నాలుగు ఆదివారములు తిరునాళ (నారదునికి స్వామి దర్సనం ఇచ్చింది మాఘ మాసంలోనే)    

15 సంవత్సరముల నుండి సర్పవరం గ్రామంలోని సేవాసమితి వారు ప్రతి శుద్ధ ఏకాదశి నాడు సామూహిక పూజలు నిర్వహించి, స్వామివారికి దశ హారతులు ఇచ్చి. తీర్ధ ప్రసాద వితరణం చేస్తున్నారు.           

22, జనవరి 2016, శుక్రవారం

పాతాళ భావనారాయణుడు

"త్రిలింగ క్షోణి వైకుంఠం" గా చెప్పబడే సర్పవరంలో వెలసిన శ్రీ పాతాళ భావనారాయణుడు అమిత దయా మూర్తి. ఎలాగంటే ..
నిజంగా ఆర్తితో పిలిస్తే భార్య కొంగు పట్టుకున్నానని ధ్యాసకూడా లేకుండా పరుగెత్తుకు వచ్చే శ్రీమన్నారాయణుడు, భక్త సులభుడు కదా! అందుకే తన మాయలో చిక్కుకున్న నారదుని రక్షించటానికి ఒక సామాన్య బ్రాహ్మణునిగా వచ్చాడు. కించిత్ జ్ఞానం వచ్చిన నారదుని వదలి వెళ్లి, అతను ఏమి చేస్తాడా అని చూసి ఉంటారు. నారదుడు పాపం తపస్సు మొదలు పెట్టారని, హడావిడిగా వచ్చేశారు పాపం శ్రీవారు. నారదుని కోసం బయలుదేరగానే గరుడుని అధిరోహించి, పాతాళం నుండి పైకి వచ్చారు కానీ పాపం గరుడునికి పూర్తిగా పైకి వచ్చే అవకాశం ఇవ్వలేదు పాతాళ భావనారాయణుడు. ఇప్పటికీ సర్పవరంలోని పాతాళ భావనారాయణుని చూసి నప్పుడు మనకు గరుడునిపై అధిరోహించిన స్వామి దర్శనం ఇస్తారు. కానీ గరుడుని తల మరియు రెక్కలు మాత్రమే దర్సనం ఇస్తాయి. అతని శరీరం మరియూ కాళ్ళు పాతాళంలోనే ఉన్నాయి. ఈ పాతాళ భావనారాయణుని దర్సిన్చుకోవటానికి మనం భూతలమునకు దాదాపు 4/5 అడుగులు క్రిందకు వెళ్ళవలసి ఉంటుంది.   వారి పాదముల వద్ద నారదుని చూడవచ్చు.
పైన చూపించిన పెయింటింగ్ శ్రీ పాతాళ భావనారయణుని ద్వారం పైన ఉన్నది. ఇక్కడ గరుడుని, శ్రీ స్వామివారి ముఖములు చూడవచ్చు.
స్వామివారు నాలుగు భుజములతో ఉన్నారు. శంఖ, చక్ర, గద మరియు అభయ ముద్రలు దాల్చి ఉన్నారు. నారదునికి స్వామి సాక్షాత్కారం ఇచ్చిన తరువాత నారదుడు సకల భూభాగం తిరిగి ఇటువంటి మరొక మూర్తి ఎక్కడయినా ఉంటుందేమో అని వెతికారట. కానీ వారికి ఈ ప్రదేశంలో తప్ప మరెక్కడా ఇటువంటి మూర్తి కనిపించలేదట. 

21, జనవరి 2016, గురువారం

తెలుగు సంవత్సరాల పేర్లు

తెలుగు సంవత్సరాల పేర్లు అందరికి తెలుసు అయినా ఒక్కసారి గుర్తు చేసుకుందాం!
  1. ప్రభవ 
  2. విభవ 
  3. శుక్ల 
  4. ప్రమోదూత 
  5. ప్రజాపతి 
  6. అంగీరస 
  7. శ్రీముఖ 
  8. భవ 
  9. యువ 
  10. ధాతృ 
  11. ఈశ్వర 
  12. బహుధాన్య 
  13. ప్రమాధి 
  14. విక్రమ 
  15. వృష 
  16. చిత్రభాను 
  17. స్వభాను 
  18. తారణ 
  19. పార్ధివ 
  20. వ్యయ 
  21. సర్వజిత్ 
  22. సర్వధారి 
  23. విరోధి 
  24. వికృతి 
  25. ఖర 
  26. నందన 
  27. విజయ 
  28. జయ 
  29. మన్మధ 
  30. దుర్ముఖి 
  31. హేమరంభి 
  32. విళంభి 
  33. వికారి 
  34. శార్వరి 
  35. ప్లవ 
  36. శుభకృత్  
  37. శోభకృత్ 
  38. క్రోధి 
  39. విశ్వావసు 
  40. పరాభవ
  41. ప్లవంగ 
  42. కీలక 
  43. సౌమ్య 
  44. సాధారణ 
  45. విరోధికృత్ 
  46. పరీధాతి 
  47. ప్రమాధీచ 
  48. ఆనంద 
  49. రాక్షస 
  50. నల 
  51. పింగళ 
  52. కాలయుక్త 
  53. సిద్ధార్ధి 
  54. రౌద్రి 
  55. దుర్మతి 
  56. దుందుభి 
  57. దుధిరోద్గారి 
  58. రక్తాక్షి 
  59. క్రోధన 
  60. క్షయ  
వీరు 60 మంది స్త్రీగా మారిన నారదుని కుమారులు అని చెప్తారు. 


సర్పపురం - సర్పవరం

అరిషట్ వర్గములలో భాగములయిన క్రోధం, మదం వలన తనకొడుకులను తనే చావమని శపించింది కద్రువ. కొడుకులు చేసిన తప్పు తల్లి చేయమని చెప్పిన తప్పును చేయము అని చెప్పటం. జరిగిన సంఘటన ఆమె పుత్రులను కలచి వేసింది. వారిలో ముఖ్యుడు అనంతుడు.
అనంతుడు కలత హృదయంతో ఇంటిని విడచి పుణ్య స్థలములు వెతుక్కుంటూ తిరిగాడు. అన్ని తీర్దములలో స్నానం చేసాడు. కానీ అతనికి స్వాంతన దొరకలేదు. చివరకు అరణ్యంలో ఒకచోట తపస్సును ఆరంభించాడు. ఆ తపస్సుకు మెచ్చిన శ్రీ మహా విష్ణువు అనంతునికి తనకు పడకగా ఉండే భాగ్యం కలుగ చేసాడు. తన భాగ్యమునకు సంతోషించిన అనంతుడు తాను తపస్సు చేసిన ఆ స్థలంలో నారాయణుని ప్రతిష్టించాడు. ఈ నారాయణుని పేరు మూల భావ నారాయణ. ఆది సర్పం (ఆదిశేషుడు/ అనంతుడు) తపస్సు చేసిన, నివశించిన ప్రదేశం కనుక ఈ స్థలమునకు సర్పపురం అని పేరు వచ్చింది. కాల క్రమేణా సర్పవరం గా మారింది.
ఈ వివరం మనకు పురాణములలో కనిపిస్తుంది కనుక ఈ అనంత ప్రతిష్ట నారాయణుని "త్రిలింగ క్షోణి వైకుంఠం" లో చెప్ప బడే పురాణ ప్రతిష్ట గా చెప్తారు.

13, జనవరి 2016, బుధవారం

నారదుడు - గర్వ భంగం

గర్వంతో విష్ణుమాయను గెలవగలను అని ప్రకటించిన నారదుడు, స్త్రీ గా మారి అడవులలో తిరుగుతూ ఉన్నాడు. ఆ అడవి ఇప్పుడు మనం చూస్తున్న పిఠాపురం పరిసరాలలో ఉన్నది.
అప్పుడు అటుగా వేట ముగించుకుని వస్తున్న పిఠాపురం మహారాజు "నికుంఠమణి" ఆ "నారద కన్య" ను చూసి ఆమెను తనతో పిఠాపురం తీసుకు వెళ్ళాడు. అక్కడ ఆమె చిత్రపటం వేయించి అన్ని రాజ్యములకు ఆమె చిత్రపటమును పంపించి, ఆమె ఎవరికి చెందినదో తెలుసుకోవటానికి ప్రయత్నించాడు. కానీ ఎవరూ ఈమె తమకు సంబందించినది అని ముందుకు రాలేదు. కనుక కొంతకాలం చూసి నికుంఠమణి ఆమెను వివాహం చేసుకున్నాడు. ఆమెను అందరూ "సుదతి" అని పిలిచే వారు. వారికి 60 మంది పుత్రులు కలిగారు. వారి పేర్లు ప్రస్తుతం వాడుకలో ఉన్న మన తెలుగు సంవత్సరాల పేర్లు. ఇలా కొంతకాలం గడచిన తరువాత, ఒకసారి పరదేశపు రాజులు వీరి రాజ్యం మెడకు దండెత్తి వచ్చారు. ఆ యుద్ధంలో నికుంఠమణి, అతనితో అతని 60 మంది కుమారులు కూడా చనిపోయారు. అప్పుడు శత్రురాజులు ఆ సుదతిని రాజ్యంనుండి తరిమేశారు. ఆమె ఆకలి దప్పులతో అక్కడ ఇక్కడ తిరుగుతూ చివరకు తన భర్త మరియు పుత్రులు మరణించిన యుద్ధభూమి వరకు వచ్చినది. ఆకలితో నీరసించిపొతున్న ఆమెకు ఒక చెట్టు చిటారి కొమ్మన ఉన్న ఒక పండు కనిపించింది. చెట్టు ఎక్కే ఓపికలేదు కనుక ఆ యుద్ధభూమిలో పడి ఉన్న శవాలను ఒకొక్క దానిని తీసుకెళ్ళి ఒకదానిపై ఒకటి పేర్చుకుంటూ వెళ్ళింది. చివరకు ఆమె భర్త శవాన్ని కూడా అక్కడకు తీసుకు వచ్చింది. దానిమీద ఎక్కి పండు అందుకోవాలని ప్రయత్నిస్తున్న సమయంలో ఒక బ్రాహ్మణుడు వచ్చాడు. అతను సుదతిని ఆ పని చేయకుండా ఆపి, ఆమెను కొంతదూరం తీసుకు వెళ్లి అక్కడ ఉన్న ఒక కొలనులో స్నానం చేయమని చెప్పాడు.
ఆమె అలా కోనేట్లో మునగ గానే ఆమెకు తిరిగి నారద రూపం వచ్చేసింది.కానీ అతని ఎడమ చేతికి గాజులు అలాగే ఉన్నాయి.  అంతే కాకుండా ఇంతకుముందు జరిగిన వింత అనుభవం కూడా బాగా గుర్తు ఉన్నది. ఆ సంఘటనలు తలుచుకుని నారదుడు విష్ణుమాయ కారణంగా ఇది జరిగినది అని తెలుసుకున్నాడు. పశ్చాతాపం చెందాడు.
అప్పుడు శ్రీ మహావిష్ణువు కొరకు తప్పస్సు ప్రారంభించాడు. అలా 10,000 సంవత్సరములు తపస్సు చేయగా అప్పుడు, గరుడుని మీద విరాజితుడయిన శ్రీమన్నారాయణుడు పాతాళంనుండి పైకి వచ్చి దర్శనం ఇచ్చాడు. అప్పుడు నారద మహర్షి తన తప్పును క్షమించమని, తన చేతికి ఉన్న గాజులు పోయేలా అనుగ్రహించమని కోరాడు. ఆవిధంగా నారదునికి కలిగిన భవ  బంధాలను పోగొట్టిన వాడు కనుక ఆ నారాయణుడిని "భావ నారాయణుడు " అని పిలిచారు.
ఐతే పాతాళం నుండి వచ్చిన భావనారాయణుడు అక్కడే నివాసం ఉండేలా నారదుడు కోరుకున్నాడు. దానికి మహా విష్ణువు సరే అని చెప్పి, తాను స్వయంభువు గా అక్కడే నిలిచి, మరొక అర్చా మూర్తిని శ్రీ రాజ్యలక్ష్మీ సమేతంగా ప్రతిష్టించమని ఆదేశించాడు. నారద మహర్షి అలాగే ప్రతిష్టించాడు. అదే ఈనాడు "త్రిలింగ క్షోణి వైకుంఠం" గా చెప్ప బడే సర్పవరం యొక్క స్థల పురాణం.

ముఖ్య విషయులు:

  1. నారదుడు స్త్రీగా మారిన కొలను - నారద కుండం 
  2. సుదతి నారదునిగా మారిన కొలను - ముక్తి కుండం 
  3. సుదతిని వివాహం చేసుకున్న రాజు - పిఠాపురం మహారాజు 
  4. యుద్ధం జరిగిన ప్రదేశం - పండూరు 
  5. స్వయంభు - పాతాళ భావనారాయణ 
  6. నారద ప్రతిష్ట - రాజ్యలక్ష్మీ సమేత భావనారాయణ

12, జనవరి 2016, మంగళవారం

నారదుడు- గర్వం

గర్వం అంటే పొగరుగా ఉండటమే కాదు, తను సాధువుగా ఎంతో సాధించేశాను అని అనుకోవటమ కూడా గర్వం అనే చెప్పారు పెద్దలు. చిన్న పిల్లలు పెద్ద తప్పు చేసినా చిన్న శిక్ష వేసి దారిలోకి తెచ్చే సంప్రదాయం మనది. అయితే ఎంతో జ్ఞానం సంపాదించి, సాక్షాత్తు బ్రహ్మకు పుత్రుడయిన నారద మహర్షి కి గర్వం వస్తే! చుడండి ఎలా ఉంటుందో !

ఒకసారి బ్రహ్మలోకంలో సకల దేవతలు సమావేశం అయ్యారు. అందరు దేవతలు అనేక విషయముల గురించి ముచ్చటిస్తూ విష్ణుమాయ గురించి మాట్లాడుకోసాగారు.
అప్పుడు బ్రహ్మదేవుడు, సదాశివుడు కూడా తమను విష్ణు మాయ ఏ విధంగా మోహింప చేసిందో చెప్తున్నారు. ఆ సమయంలో ఆ సభలో ఉన్న నారద మహర్షి చిరునవ్వు నవ్వారు. ఆ నవ్వును గమనించిన దేవతలు ఆ నవ్వునకు కారణం అడిగారు. దానికి సమాధానంగా నారద మహర్షి తనను ఈ విష్ణుమాయ ఏ విధంగాను ప్రభావం చేయలేదు అని ప్రకటించారు. ఆ మాటలు విన్న పరమపిత బ్రహ్మదేవుడు నారదుని మందలించారు. అయినా వినకుండా నారద మహాముని మరలా ఆ విష్ణుమాయ తనను మొహంలో ఉంచలేదు అని ప్రకటించారు.  అప్పుడు సర్వ దేవతలు నారదునికి స్వీయానుభవం అయితే తప్ప తెలిసిరాదు అని ఎవరి ధామములకు వారు వెళ్ళిపోయారు.
కొంతకాలానికి ఒకరోజు నారదుడు అరణ్యములలో తిరుగుతూ ఉండగా సంధ్యాసమయం అయింది. సంధ్యావందనం చేద్దాం అని ఏదయినా నీటి కొలను ఉందేమో అని చూసాడు. కొంతదూరం తిరుగగా అక్కడ ఒక కొలను కనిపించింది. ఆ కొలనులో దిగి స్నానాధికాలు కానిచ్చి సంధ్యా వందనం చేద్దాం అనే ఆలోచనతో ఆ కొలనులో మునిగిన నారదుడు, పైకి లేచేసరికి స్త్రీగా మారిపోయాడు. అంతే కాకుండా అతనికి ఇంతకుముందు ఏమి జరిగిందో, తను ఎవరోకూడా గుర్తు లేదు. అలా స్త్రీ గా మారిపోయిన నారదుడు ఆ అడవిలో అటూ ఇటూ తిరుగుతూ ఉన్నాడు.
నారదుడు స్త్రీ గా మారిన ఈ కొలను పేరు నారద కుండం అయింది. 

11, జనవరి 2016, సోమవారం

త్రిలింగ క్షోణి వైకుంఠం

"త్రిలింగ క్షోణి వైకుంఠం"  అంటే శ్రీ మహావిష్ణు మూర్తులు మూడు, మూడు రకములుగా స్థాపించబడిన క్షేత్రం అని అర్ధం.
ఆ మూడు రకములు
  1. స్వయంభు - స్వామివారు భక్తుని కొరకు తనకు తానుగా వెలయటం 
  2. ఆరుషం - మహాభక్తుడయిన మహర్షి స్వామివారి అర్చామూర్తిని నెలకొల్పటం 
  3. పురాణ సిద్ధం - పురాణములలో ప్రస్తావించిన ఒక సంఘటనకు సంబందించిన మూర్తి నెలకొని ఉండటం
ఈ మూడు రకముల మూర్తులు కలిగి ఉన్న క్షేత్రమును "త్రిలింగ క్షోణి వైకుంఠం"  అని పిలువ వచ్చు.

ఇటువంటి అధ్బుతమైన ప్రత్యేకత కలిగిన దేవాలయం మనకు అత్యంత చేరువలో తూర్పుగోదావరి జిల్లలో ఉన్నది. అదే కాకినాడకు సమీపంలోని సర్పవరం లోని భావ నారాయణ దేవాలయం
ఈ సర్పవరం లో ఉన్న ముగ్గురు విష్ణుమూర్తులు ఇలా ఉన్నాయి. 
  1. స్వయంభు - పాతాళ భావనారాయణ 
  2. ఆరుషం - రాజ్యలక్ష్మీ సమేత భావనారాయణ - నారద ప్రతిష్ట 
  3. పురాణ సిద్ధం - మూల భావనారాయణ -  అనంత ప్రతిష్ట 
ఈ సర్పవరమునకు చేరుకోవటానికి సామర్లకోట నుండి ఆటో సౌకర్యం ఉన్నది. కాకినాడనుండి సర్పవరం జంక్షన్ నుండి ఆటో సౌకర్యం ఉంటుంది. ఒకవేళ బస్సునందు రా దలచుకొంటే, కాకినాడనుండి సామర్లకోట వెళ్ళే దారిలో మాధవపట్నం అనే స్టాప్ దగ్గర బస్సుదిగి దాదాపుగా 1 కిలోమీటర్ నడవ వలసి ఉంటుంది. 

10, జనవరి 2016, ఆదివారం

పురాణాలు - భేదము

మనకు 18 పురాణాలు ఉన్నాయి. వీటిని వినే వారికి, చదివే వారికి కలిగే ఒక ముఖ్యమైన సందేహం "మనకు ఉన్న ఈ  పురాణాలు ఒకదానితో ఒకటి కొన్ని విషయాలలో విభేదిస్తున్నాయి కదా! అలా ఎందుకు?" అని.  మరి దీనికి  మనకి నిజంగా సమాధానం ఇవ్వగలమా?
ఈ ప్రశ్నకు సమాధానం పద్మ పురాణం లో ఇవ్వబడినది.

క్వచిత్క్వచిత్పురాణేషు, విరోధో యది దృశ్యతే 
కల్ప భేదాది భిస్తత్ర, వ్యవస్థా సధ్బిరిష్యతే  


ఈ శ్లోకం పద్మ పురాణంలో పాతాళ ఖండంలో చెప్పబడి ఉన్నది. దీనికి భావం 
" ఆయా పురాణాలలో మనకు కనిపించే భేదములకు కారణం ఆయా పురాణములు ఆయా కల్పములలొ జరిగిన విధమును చెప్పుటయే"
ప్రతి కల్పములో ఈ సంఘటనలు పునరావృతం అవుతాయి. ఐతే అవి అన్ని సార్లు ఒకేలా జరిగి ఉండక పోవచ్చు. కనుక ఏ పురాణం ఏ కల్పంలో చెప్ప బడినదో అది ఆ కల్పంలో జరిగిన విధమును మనకు చెప్తుంది.  

9, జనవరి 2016, శనివారం

మదం - క్రోధము

వినత, కద్రువ లు కశ్యప ప్రజాపతి భార్యలు. వినత కద్రువకు లబించిన సంతానం చూసి అసూయ చెంది, ఆ కారణంగా తన కుమారుని చేతనే శాపం పొందింది.
ఐతే కద్రువ ఇంతకు మించిన మదం మరియు క్రోధము కారణంగా కన్నతల్లి అయి ఉండి కూడా తనపిల్లలను చనిపోమని శాపం ఇచ్చినది.
ఒక రోజు వినత, కద్రువ విహారానికి వనమునకు వెళ్లారు. వారు అలా నడుస్తూ ఉండగా సాయంకాలం అవుతుండగా, వారికీ దూరంగా ఉచైశ్రవం అని పిలువబడే ఒక అందమైన తెల్లని గుర్రం కనిపించినది.
దానిని చూసిన కద్రువ, వినతకు చూపి, ఆ గుర్రం అంతా తెల్లగా ఉన్నా దాని తోకకు ఉన్న నలుపు చంద్రునిలో మచ్చ వలే ఉన్నది అని అన్నది. ఆ మాటలు విని వినత అదేమిటి అక్క అలా అంటావు ఆ గుర్రం వెన్నెలలా తెల్లగా ఉంది. దాని తోకకు నలుపు లేనే లేదు అని అన్నది. అప్పుడు కద్రువ ఒక విచిత్రమైన షరతు విధించినది. ఆ గుర్రం తోక నల్లగా ఉన్నట్లయితే వినత కద్రువకు దాసిగా ఉండాలి, ఒకవేళ ఆ గుర్రం తోక తెల్లగానే ఉన్నట్లయితే కద్రువ వినతకు దాసీ అవ్వాలి. ఇద్దరూ ఆ షరతుకు ఒప్పుకున్నారు. వినత అప్పుడే వెళ్లి ఆ గుర్రం తోకను చూడడం అని అన్నది. కానీ అప్పటికే సంధ్యా సమయం యించి కనుక ఈ రోజుకి ఇంటికి వెళ్లి రేపు వచ్చి చూడడం అని కద్రువ చెప్పింది. సరే అని వారిద్దరూ వారి వారి ఇళ్ళకు వెళ్లి పోయారు.
అప్పుడు కద్రువ ఎలాగయినా వినతను తన దాసిగా చేసుకోవాలని కోరికతో తనకుమారులయిన పాములను పిలిచినది. తనకు, వినతకు మధ్య జరిగిన విషయం చెప్పి, వారిని ఆ గుఱ్ఱము తోకకు నల్లని మచ్చలా ఉండమని కోరినది.
ఆ సర్పములు ధర్మ మార్గమునకు విరుద్ధమైన ఆ పని చేయుటకు నిరాకరించారు. అప్పుడు కద్రువ క్రోధమునకు వశమై తన కుమారులు భవిష్యత్తు లో జరుగబోయే ఒక విపరీతమైన యాగం లో పడి చావండి అని శపించినది.ఆ శాపమునకు భయపడిన కర్కోటకుడు అనే పేరుగల ఒక్క పాము మాత్రం తల్లి చెప్పిన ఆ పని చేయుటకు ఒప్పుకున్నాడు.

విశ్లేషణ  

మదం: 

నిజానికి ఆ గుర్రం తోక నల్లగా లేదని కద్రువకు తెలుసు. తన సవతి వినత తనపై పెంచుకున్న అసూయ కూడా  కద్రువకు తెలుసు. ఆమె తనపై అసూయ పడుతుందంటే తను వినతకంటే గోప్పదానిని అని గర్వం కద్రువకు ఎక్కువ ఐంది. అది ఏదో ఒకలా బయటకు రావాలి. కనుక గుర్రం తోక నల్లగా ఉంది అని వినతతో వాదించింది. వాదించటమే కాకుండా తన సవతిని భయ పెట్టే విధంగా షరతు విధించింది. ఆమే ఆ షరతు విధించినప్పుడు బహుశా వినత భయపడి గుర్రం తోక నల్లగానే ఉంది అని ఒప్పుకుంటుంది అని అనుకోని ఉండ వచ్చు.  కానీ నిజాన్ని కనిపెట్టటానికి వినత అప్పుడే గుర్రం దగ్గరకు వెళదాం అని అడిగితే సంధ్యాసమయం అడ్డు చెప్పి, ఆ రోజుకు తప్పించుకుంది. ఒకవేళ తాము వెంటనే ఆ గుర్రం దగ్గరకు వెళ్ళినట్లయితే తను ఖచితంగా వినతకు దాసీ కావలసి ఉంటుంది. కనుక ఆమె అప్పటికి తప్పించుకుంది. 

క్రోధం 

ఆమె చేసిన ఈ తప్పు, తన పిల్లలు ఎత్తి చూపించారు. వెంటనే ఆమె మదం క్రోధంగా మార్పుచెందింది. కన్న బిడ్డలు అని కనికరం కూడా లేకుండా వారని చనిపోమని శపించింది. 


8, జనవరి 2016, శుక్రవారం

అసూయ

అరిషట్ వర్గములలో ఒకటయిన మత్సరం ఒక తల్లి తన సొంత కొడుకు వికలాంగుడు అవ్వటానికి కారణం అయింది అంతేకాక అదే కొడుకు చేత శాపం పొందేలా చేసింది.
కశ్యప ప్రజాపతి నవ బ్రహ్మలలో ఒకరైన మరీచి పుత్రుడు.  అతనికి 13 మంది భార్యలు ఉన్నారు. వారు దక్ష ప్రజాపతి పుత్రికలు.
వారిలో ఇద్దరు కద్రువ మరియు వినత. వీరిద్దరికీ సంతానం కలుగ లేదు. అనేకములయిన పూజలు వ్రతములు చేసిన తరువాత కశ్యప ప్రజాపతి వారికి ఎటువంటి సంతానం కావాలని అడిగాడు. అప్పుడు కద్రువ తనకు అమిత బలసంపన్నులు,దీర్ఘ దేహములు కలవారు అనేకులు సంతానంగా కావాలి అని కోరింది.  వినత కద్రువ పిల్లలకంటే బలవంతులయిన వారిని ఇద్దరిని కోరింది. కశ్యప ప్రజాపతి అలాగే అని చెప్పారు. కద్రువ అనేకములయిన గుడ్లను , వినత రెండు గుడ్లను పొందారు. కొంతకాలానికి కద్రువ పిల్లలు ఒక్కొక్కరు గుడ్డుల లోనుండి బయటకు రాసాగారు. వారిని చుసిన వినత తన బిడ్డలు ఇంకా బయటకు రాలేదని బెంగపెట్టుకుంది. ఒకరోజు ఆగలేక తనకు ఉన్న రెండు గుడ్లలో ఒకదాన్ని పగులగొట్టింది. అప్పుడు అందులోనుండి సగం దేహం ఏర్పడిన (ఉరువుల నుండి పైభాగం మాత్రమే ఏర్పడిన) బాలుడు బయటకు వచ్చాడు. అతని పేరు అనూరుడు అని పెట్టారు. అతను బయటకు రాగానే తన తల్లి చేసిన తొందరపాటు పనికి ఆమెను నిందించి, ఆమె ఎవరిని చూసి అసూయ చెందిందో ఆ సవతికి దాసిగా ఉండమని శపించాడు. అంతే కాకుండా ఆ రెండవ గుడ్డును జాగ్రత్తగా చూసుకొమ్మని, అందులోనుండి జన్మించబోయే తన తమ్ముడు అమిత పరాక్రమవంతుడు అవుతాడు మరియు తల్లిని దాస్యం  నుండి  రక్షిస్తాడు అని చెప్పాడు. 

7, జనవరి 2016, గురువారం

అరిషట్ వర్గములు

అరి అంటే సంస్కృతంలో శత్రువు అని అర్ధం. షట్ అంటే ఆరు అని. అరిషట్ వర్గములు అంటే మనలో ఉండే ఆరు శత్రువులు. అవి

  1. కామం - ధర్మబద్ధం కాని కోరిక 
  2. క్రోధం - తనను తను అదుపుచేసుకోలేని విపరీతమైన కోపం 
  3. లోభం - తన అవసరాలకు కూడా ధనమును వినియోగించుకోలేని పిసినారి తనం 
  4. మోహం - ఏది చేసినా నాది, నా అనే స్వార్ధం 
  5. మదం - అతిశయించిన గర్వం 
  6. మాత్సర్యం - ఎదుటి వారికి ఉన్నది నాకు లేదు అనే అసూయ 
చూడటానికి చిన్నగా ఉన్నా ఇవి మానవులకు చేసే అపకారాలు లెక్కకు మించినవి. ఇవి ఒక మనిషిలో ఉన్నప్పుడు అవి ఎదుటి వారికి చేసే హానికంటే అవి ఆ వ్యక్తికి చేసే హాని ఎక్కువ ఉంటుంది.  

6, జనవరి 2016, బుధవారం

ప్రహ్లాదుని పూర్వజన్మ

శివశర్మ తన నలుగురు పుత్రులు విష్ణులోకమునకు వెళ్ళిన తరువాత మిగిలిన ఐదవ పుత్రుడు, సోమశర్మను పిలచి, అతని చేతికి నాలుగవ కుమారుడు తెచ్చి ఇచ్చిన అమృత కలశమును ఇచ్చి జాగ్రత్త చేయమని చెప్పి, తన భార్యతో కలసి తీర్ధయాత్రలకు బయలుదేరి వెళ్ళెను.
ఇలా దాదాపుగా పది సంవత్సరములు శివశర్మ తన భార్యతో కలసి అన్ని తీర్ధములు తిరిగి, తమ ఇంటికి చేరుకొనే సమయమునకు శివశర్మతపోబలంతో, అతనికి అతని భార్యకి కూడా కుష్టు రోగం వచ్చేలా చేసాడు. ఆ కుష్టు రోగంతో భాదపడుతూ ఇంటికి తిరిగి వచ్చిన తల్లితండ్రులను చూసిన సోమశర్మ అత్యంత విస్మయం చెందాడు.
"ఓ తండ్రీ! తమరు నిత్యం అత్యంత నియమ నిష్టలతో ఉంటారు. అటువంటి కలుశారహితులయిన మీకు ఇట్టి అవస్థ ఏ పాపమువలన కలిగినదో ? దయచేసి చెప్పండి" అని నీరు నిండిన కన్నులతో అడిగెను. సోమశర్మ మాటలు విన్న శివశర్మ "మీము పూర్వ జన్మములలో ఏదో పాపం చేసే ఉంటాం దాని నివ్రుట్టికోరకు ఇప్పుడు ఈ విధంగా శిక్ష అనుభవించ వలసి వచ్చినది. పూర్వం చేసిన కర్మములకు ఫలములు తప్పక అనుభవించవలసినదే కదా! నీవు మాగురించి మా పాపముల గురించి విచారించక, నీవు పితృభక్తి తత్పరుడవు కనుక ఈ శరీరములను వేడి నీటితో కడిగి రక్షించుము" అని బదులు ఇచ్చెను.
సోమశర్మ తనతల్లితండ్రులకు చేయవలసిన సేవలు చేస్తూ, వారి పుండ్లను శుభ్రం చేస్తూ, వారికి విధిగా స్నానం చేయిస్తూ, మధురమయిన భోజనములను పెడుతూ తన నిత్య కృత్యములను చేస్తూ ఉన్నాడు. ఐతే శివశర్మ, అతని భార్య వారి సరీరములకు కలిగిన భాదల వలన తమ కుమారుడు తమకు సరిగా సేవలు చేయటంలేదని, అతనిని తిడుతూ, ఒక్కొక్కచో కొడుతూ ఉన్నారు. అయినా సోమశర్మ భయభక్తులు కలిగి తల్లితండ్రులకు సేవలు చేస్తూనే ఉన్నాడు. ఇలా కొంతకాలం గడచినా తరువాత, శివశర్మ ఇక తన ఐదవ పుత్రునికి విడుదల ఇవ్వాలి అని నిశ్చయించుకున్నాడు. తను తన భార్యతో కలసి తీర్ధయాత్రలకు వెళ్లేముందు సోమశర్మకు ఇచ్చిన అమృత కలశమును దొంగిలించాడు. ఇక ఏమి తెలియనివానివలే సోమశర్మను పిలచి " పుత్రా సోమశర్మ! మీము ఇంతకు  మునుపటి జన్మలలో చేసిన పాపములకు ఇప్పటివరకు మేము అనుభవించిన శారీరిక క్లేశం  సరిపోతుంది కనుక మేము ఇక ఈ భాద నుండి విముక్తి పొంద దలచాం కనుక నేను నీకు ఇంతకుమునుపు ఇచ్చిన అమృతకలశమును తెచ్చి ఇవ్వుము. " అని అడిగెను.
తండ్రి కోరిక మేరకు అమృతం ఇవ్వటానికి చూడగా, సోమశర్మకు అమృత కలశం కనిపించలేదు. ఈ విషయం తన తండ్రికి తెలిసినచో భాదపడతాడని తలచి, తన తపఃశక్తితో విష్ణుమూర్తిని ప్రసన్నం చేసుకొని మరొక అమృత కలశం సంపాదించి తెచ్చి తన తండ్రికి ఇచ్చెను. తన పుత్రుని పితృభక్తి ని చూసి అమితానందం పొందిన శివశర్మ తన భార్యతోకుడా తన నిజ రూపం పొందిరి. అప్పుడు శివశర్మ సోమశర్మతో "ఓ పుత్రా! నీ భక్తి కి మేము అత్యంత ప్రసన్నులం అయ్యాము. నీవు ఇంకొంతకాలం ఈ భూమి పై ఉండవలసి ఉన్నది కనుక నీవు నిత్యం ధర్మాచరణలో ఉండుము. నీకు ఉన్నత పదవులు సిద్దించగలవు" అని ఆశీర్వదించి వారు విష్ణులోకమునకు చేరుకున్నారు.
సోమశర్మ తపస్సుచేసుకుంటూ ఉన్నాడు. ఇలా కొంతకాలం గడచినది. సోమశర్మకు అంతిమ ఘడియలు సమీపించగానే అతనికి తనకు దగ్గరలో ఎవరివో రాక్షస గర్జనలు, కోలాహలములు వినిపించినవి. ఆ శబ్దములు వింటూ, రాక్షసుల గురించి ఆలోచిస్తూ తుదిశ్వాస విడిచాడు.
తుదిశ్వాస విడచే సమయంలో ఎవరు ఏవిషయం గురించి ఆలోచిస్తారో మరు జన్మలో వారు అలా జన్మిస్తారు. కనుక సోమశర్మ రాక్షసయోనిలో జన్మించాడు. కానీ పూర్వజన్మలో చేసుకున్న అమితమయిన పుణ్యం కారణంగా అతనికి విష్ణు భక్తి ప్రాప్తించినది. అతనే విష్ణుభక్తులలో అగ్రగణ్యుడుగా చెప్పుకునే "ప్రహ్లాదుడు".
ఇది ప్రహ్లాదుని పూర్వజన్మ వృత్తాంతం.