9, జనవరి 2016, శనివారం

మదం - క్రోధము

వినత, కద్రువ లు కశ్యప ప్రజాపతి భార్యలు. వినత కద్రువకు లబించిన సంతానం చూసి అసూయ చెంది, ఆ కారణంగా తన కుమారుని చేతనే శాపం పొందింది.
ఐతే కద్రువ ఇంతకు మించిన మదం మరియు క్రోధము కారణంగా కన్నతల్లి అయి ఉండి కూడా తనపిల్లలను చనిపోమని శాపం ఇచ్చినది.
ఒక రోజు వినత, కద్రువ విహారానికి వనమునకు వెళ్లారు. వారు అలా నడుస్తూ ఉండగా సాయంకాలం అవుతుండగా, వారికీ దూరంగా ఉచైశ్రవం అని పిలువబడే ఒక అందమైన తెల్లని గుర్రం కనిపించినది.
దానిని చూసిన కద్రువ, వినతకు చూపి, ఆ గుర్రం అంతా తెల్లగా ఉన్నా దాని తోకకు ఉన్న నలుపు చంద్రునిలో మచ్చ వలే ఉన్నది అని అన్నది. ఆ మాటలు విని వినత అదేమిటి అక్క అలా అంటావు ఆ గుర్రం వెన్నెలలా తెల్లగా ఉంది. దాని తోకకు నలుపు లేనే లేదు అని అన్నది. అప్పుడు కద్రువ ఒక విచిత్రమైన షరతు విధించినది. ఆ గుర్రం తోక నల్లగా ఉన్నట్లయితే వినత కద్రువకు దాసిగా ఉండాలి, ఒకవేళ ఆ గుర్రం తోక తెల్లగానే ఉన్నట్లయితే కద్రువ వినతకు దాసీ అవ్వాలి. ఇద్దరూ ఆ షరతుకు ఒప్పుకున్నారు. వినత అప్పుడే వెళ్లి ఆ గుర్రం తోకను చూడడం అని అన్నది. కానీ అప్పటికే సంధ్యా సమయం యించి కనుక ఈ రోజుకి ఇంటికి వెళ్లి రేపు వచ్చి చూడడం అని కద్రువ చెప్పింది. సరే అని వారిద్దరూ వారి వారి ఇళ్ళకు వెళ్లి పోయారు.
అప్పుడు కద్రువ ఎలాగయినా వినతను తన దాసిగా చేసుకోవాలని కోరికతో తనకుమారులయిన పాములను పిలిచినది. తనకు, వినతకు మధ్య జరిగిన విషయం చెప్పి, వారిని ఆ గుఱ్ఱము తోకకు నల్లని మచ్చలా ఉండమని కోరినది.
ఆ సర్పములు ధర్మ మార్గమునకు విరుద్ధమైన ఆ పని చేయుటకు నిరాకరించారు. అప్పుడు కద్రువ క్రోధమునకు వశమై తన కుమారులు భవిష్యత్తు లో జరుగబోయే ఒక విపరీతమైన యాగం లో పడి చావండి అని శపించినది.ఆ శాపమునకు భయపడిన కర్కోటకుడు అనే పేరుగల ఒక్క పాము మాత్రం తల్లి చెప్పిన ఆ పని చేయుటకు ఒప్పుకున్నాడు.

విశ్లేషణ  

మదం: 

నిజానికి ఆ గుర్రం తోక నల్లగా లేదని కద్రువకు తెలుసు. తన సవతి వినత తనపై పెంచుకున్న అసూయ కూడా  కద్రువకు తెలుసు. ఆమె తనపై అసూయ పడుతుందంటే తను వినతకంటే గోప్పదానిని అని గర్వం కద్రువకు ఎక్కువ ఐంది. అది ఏదో ఒకలా బయటకు రావాలి. కనుక గుర్రం తోక నల్లగా ఉంది అని వినతతో వాదించింది. వాదించటమే కాకుండా తన సవతిని భయ పెట్టే విధంగా షరతు విధించింది. ఆమే ఆ షరతు విధించినప్పుడు బహుశా వినత భయపడి గుర్రం తోక నల్లగానే ఉంది అని ఒప్పుకుంటుంది అని అనుకోని ఉండ వచ్చు.  కానీ నిజాన్ని కనిపెట్టటానికి వినత అప్పుడే గుర్రం దగ్గరకు వెళదాం అని అడిగితే సంధ్యాసమయం అడ్డు చెప్పి, ఆ రోజుకు తప్పించుకుంది. ఒకవేళ తాము వెంటనే ఆ గుర్రం దగ్గరకు వెళ్ళినట్లయితే తను ఖచితంగా వినతకు దాసీ కావలసి ఉంటుంది. కనుక ఆమె అప్పటికి తప్పించుకుంది. 

క్రోధం 

ఆమె చేసిన ఈ తప్పు, తన పిల్లలు ఎత్తి చూపించారు. వెంటనే ఆమె మదం క్రోధంగా మార్పుచెందింది. కన్న బిడ్డలు అని కనికరం కూడా లేకుండా వారని చనిపోమని శపించింది. 


కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి