22, ఆగస్టు 2025, శుక్రవారం

సూర్య ప్రార్ధన - కుమార సంభవం

ఈరోజు మనం కుమార సంభవం లో చెప్పిన సూర్య ప్రార్ధన చుద్దాం!

                అనుపమ దివ్యమూర్తి యను నమ్తియకాదు భవాష్టమూర్తులం

                దును పరమూర్తి దాన, ప్రభతోడ జగజ్జన రాజి కెల్ల నిం

                దనయము దాన దృష్టి యను నంతియకాదు త్రిలోచనాదిలో

                   చనమును దానయైన రవి చారు నిజ ప్రభ మాకు నీవుతన్

ఆర్ధముః 

అనుపమ దివ్యమూర్తి = సాటి లేని అమానుష మైన ఆకారము గల, అనినంతియకాదు =  అనినంత మాత్రమే కాదు భవ= శివుని అష్ట=ఎనిమిది మూర్తులందు=మూర్తులలో, తాను=తనే, పర= గొప్ప, మూర్తి=మూర్తి, ప్రభ= కాంతి, తోడన్=తో, జగత్=లోకమునందలి,  జనరాజి= జనుల యొక్క సమూహం, ఎల్ల= అందరికి, ఇందున్= ఇందులో, అనయమున్= ఎల్లప్పుడు  దాన= తన,  దృష్టి= చూపు, యను నంతియకాదు త్రిలోచన= మూడు కన్నులలో,ఆది= మొదటి, లోచనము= కన్ను, యైన=  అయిన, రవి= సూర్యుడు,  చారు= అందమైన,  నిజ ప్రభ = తనదైన మెరుగును  మాకు= మాకు, నీవుతన్= ఇచ్చు గాక.

తాత్పర్యంః నిరుపమానం, అమానుషమయిన ఆకరము గల వాడనునంతమాత్రమే కాదు, శివుని ఎనిమిది మూర్తులలోను దానే శ్రేష్టమైన మూర్తి, తన వెలుగుతో లోకమునందలి ప్రాణికోటి కంతకును దానే యెల్లప్పుడును దృష్టి యనునంత మాత్రమే కాదు. ముక్కంటియైన శివునకు గల మూడుకన్నులలో మొదటి కన్నయిన సూర్యుడు మాకుతనదైన వెలుగును ఇచ్చును గాక!

18, ఆగస్టు 2025, సోమవారం

32 బ్రహ్మగారి గుణములు- లింగ పురాణం

సృష్టికర్త బ్రహ్మగారికి 32 గుణములు శివుని రూపమైన ఈశానుని ద్వారా, ఆదిశక్తి అనే మూలప్రకృతి ద్వారా సంక్రమించాయి. అవి ఏమిటో మనం ఇప్పుడు తెలుసుకుందాం!

  1. చిత్తవృత్తి నిరోధం
  2. సాంఖ్యయోగం
  3. తపస్సు
  4. విద్య
  5. విధి
  6. క్రియ
  7. ఋతం (చక్కని సంభాషణ)
  8. సత్యం
  9. దయ
  10. బ్రహ్మం
  11. అహింస
  12. సన్మతి (సత్+ మతి= మంచి బుధి)
  13. క్షమ (ఓర్పు)
  14. ధ్యానం
  15. ధ్యేయం
  16. దమం (ఇంద్రియ నిగ్రహం)
  17. శాంతి
  18. విద్య (తెలుసుకోవలసినవి తెలుసుకొనుట)
  19. అవిద్య (అవసరం లేనివి వదులుకొనుట)
  20. మతి
  21. ధృతి
  22. కాంతి
  23. నీతి
  24. ప్రధ
  25. మేధ
  26. లజ్జ
  27. దృష్టి (దివ్యజ్ఞానం)
  28. సరస్వతి
  29. తుష్టి (తృప్తి)
  30. పుష్టి (ఇంద్రియ పాటవం)
  31. క్రియ (వేద విహితమైన క్రియ)
  32. ప్రసాదం (మనస్సు ప్రశాంతంగా ఉండడం)















21, మే 2025, బుధవారం

నవదుర్గలు - మహిళా మణులు

మనకు పురాణాలలో నవదుర్గలు అని తొమ్మిది మంది దుర్గల అవతారాలు గురించి చెప్తారు.  అయితే ఈ తొమ్మిది మంది నవదుర్గలు నిత్యజీవితంలో స్త్రీ మూర్తికి అత్యంత సన్నిహితంగా ఉంటారు అంటే ఆ నవదుర్గలు  దైనందిని జీవితంలో మన చుట్టూ ఉన్న ప్రతి ఒక్క స్త్రీ మూర్తికి వారి వారి నిగూఢమైన శక్తికి ప్రతిరూపాలన్నమాట. 

 ఈ తొమ్మిది మంది నవదుర్గలు అలాగే ఆ తొమ్మిది మందిని నవదుర్గలతో  పాటుగా ప్రతి నిత్యం జీవితంలో ఉన్న శ్రీమూర్తులకు ఉన్న సంబంధం  ఎలా ఉంటుంది ఏంటి అనేది అయితే ఈ రోజు బ్లాగులో మనం నేర్చుకుందాం!

నవదుర్గలకు సంబంధించిన స్పష్టమైన శ్లోకం ఈ కింద ఇచ్చాను చూడండి. 


ప్రథమం శైలపుత్రీ చ ద్వితీయం బ్రహ్మచారిణీ 

తృతీయం చంద్రఘంటేతి కూష్మాండేతి చతుర్ధకం 

పంచమం స్కందమాతేతి షష్ఠం కాత్యాయనీతి చ 

సప్తమం కాళరాత్రీతి మహాగౌరీతి చాష్టమమ్ 

నవమం సిద్ధిదాత్రి చ నవదుర్గా   ప్రకీర్తితాః  

ఉకక్తాన్యేత్యాని నామాని బ్రాహ్మణైవ మహాత్మనా 






మొట్టమొదటి అవతారం నవదుర్గలలో శైలపుత్రి




స్త్రీ జన్మించిన  తర్వాత తన మొట్టమొదటి గుర్తింపు తన తండ్రి  అందువల్ల ఈ నవదుర్గలలో మొట్టమొదటి అవతారం శైలపుత్రి అంటే తనను తాను తన తండ్రి పేరుతో పరిచయం చేసుకుంటుందన్నమాట, శైలపుత్రి అంటే  హిమవంతుని పుత్రిక అంటే తను తన తండ్రికి కుమార్తెగా మాత్రమే తన గుర్తింపును పొందుతూ ఉంటుంది దానివల్ల ఇక్కడ అమ్మవారికి  పులి లాంటి వాహనాలు లేవు. అమ్మవారి తల పై చంద్రవంక ఉంటుంది కుడి చేతిలో త్రిశూలం ఎడమ చేతిలో కమలం ఉన్న ఈ అమ్మవారి వాహనం వృషభం



రెండవ  అవతారం బ్రహ్మచారిణి 

ఈ ప్రాయంలో అమ్మవారు విద్యార్థిగా అభివర్ణించుకుంటుంది అంటే విద్యను అభ్యసించడానికి కావలసిన అన్ని అర్హతలు తను పొందటానికి సిద్ధంగా ఉన్నాను అని రూపంలో మనకు దర్శనం ఇస్తూ ఉంటుంది. ఈ రూపం లో అమ్మవారికి వాహనమే ఉండదు. కేవలం తాను ఒక కమండలం జపమాల పట్టుకుని శుద్ధ సత్వగుణంతో విరాజిల్లుతూ ఉంటుంది. 




మూడవ  అవతారం చంద్రఘంట 





ఈ అవతారంలో అమ్మవారు తన గృహస్థధర్మమును స్వీకరించి తన భర్త కు సంబందించిన అభూషణం అయిన చంద్రుడిని తన తలపైన ధరిస్తుంది. ఈమెకు 10 చేతులు ఉంటాయి, అంటే తనకు భాద్యతలు పెరిగాయి అని, వానిని తాను అద్భుతంగా ఎంతో  చక్కగా నిర్వర్తిస్తుంది అని అర్ధం. 

నాలుగవ  అవతారం కూష్మాండ 

ఈ అవతారంలో అమ్మవారు కేవలం 8 చేతులతో దర్శనం ఇస్తారు అంటే కొంచెం భాద్యతలు తగ్గి నాయి అని. డ్డానికి కారణం ఆమె 
కూష్మాండ , తన కడుపులో ప్రపంచమును మోస్తున్నది అని అర్ధం. 



 

ఐదవ  అవతారం స్కందమాత 

ఈ అవతారంలో అమ్మవారు తన తల్లి భాద్యతలను చక్కగా నిర్వహిస్తున్నట్లుగా మనం చూడవచ్చు . ఈ అవతారంలో అమ్మవారి ఒడిలో షణ్ముఖములతో స్కందుడు అంటే కుమారస్వామి కూర్చునిఉండడం మనకు కనిపిస్తుంది. 




ఆరవ  అవతారం కాత్యాయిని 

ఈమె  మనలోని అనేక యుద్ధములలో గెలవడానికి ప్రతీక. యుద్ధం అంటే ఇష్టములకు, బాధ్యతలకు మరియు తనలోపలి అలజడులకు అన్నింటికి ప్రతీక అయినా అనేకానేక సంఘర్షణలను చిరునవ్వుతో,తన పుట్టింటి వారు నేర్పిన గుణగణములతో నేర్పుగా గెలువగలిగినది. 


ఏడవ  అవతారం కాళరాత్రి 

ఈ అవతారంలో అమ్మవారు నీలి వర్ణంలో ఉంటారు. తనలోని అనేక సంఘర్షణలను తట్టుకుంటూ తనను తాను మార్చుకుంటూ ఉన్న సందర్భంలో ప్రతి తల్లి కాళరాత్రిగానే మనకు కనిపిస్తుంది. 



ఎనిమిదవ  అవతారం మహాగౌరి 

ఈ అవతారంలో అమ్మవారు తనను తాను గెలిచి, తనలోపలి, బయటి శత్రువులను గెలిచి ప్రశాంతంగా ఉండే మధ్యవయస్సు కలిగిన స్త్రీ మూర్తిలా మనం చూడవచ్చు. 



తొమ్మిదవ  అవతారం సిద్ధిదాత్రి 


ఈ స్థితిలో అమ్మవారు అడిగిన వరములను, సిద్ధులను ప్రసాదించే సిద్ధిదాత్రి గా మనకు దర్శనం ఇస్తారు అంటే మన నిజ జీవితంలో మన కాళ్ళ ఎదుట కనిపించే మన అమ్మమ్మ నానమ్మ మరియు ఇతర పెద్ద వయసు ఉన్న స్త్రీమూర్తులను మనం ఈ విధంగా చూడవచ్చు . వారు వారి జీవితంలో నేర్చుకున్న అనేకానేక పాఠాల నుండి మనకు అనేక సలహాలు ఇస్తూ ఉంటారు. 

ఈ విధంగా మనం మన నిజజీవితంలో అమ్మవారి నవదుర్గా రూపాలను దర్శించ వచ్చు. 
ఈ బ్లాగు కు సంబందించిన youtube వీడియో ఇక్కడ చూడవచ్చు.