30, ఏప్రిల్ 2019, మంగళవారం

పాండవులు - ఇంద్రుడు

 మహాభరతం లో ఎన్ని సార్లు ఎంతమంది సమాధానాలు చెప్పినా మల్లి మల్లి అందరు అడిగే ప్రశ్న ద్రౌపదికి ఐదుగురు భర్తలు ఉండుట ధర్మమేనా?
ఈ ప్రశ్నకు మహాభారతంలో అనేక సందర్భములలో అనేక వృత్తాంతములతో ఇది ధర్మమే అని చెప్పారు. ఆ వృత్తాంతములు చెప్పే ముందు అసలు పంచ పాండవులు ఎవరు? ద్రౌపది ఎవరు అని ముందుగా చూద్దాం!

ద్రౌపది - స్వర్గ లక్ష్మి
ధర్మరాజు - యమధర్మ రాజు అంశ
భీముడు - వాయుదేవుని అంశ
అర్జునుడు - ఇంద్రుని అంశ
నకుల,సహదేవులు - అశ్వినీ కుమారుల అంశ

ఇలా పాండవులు వివిధ దేవతల అంశాలుగా చెప్పబడినా , వారిలో నుండి బయటకు వచ్చిన ఆయా అంశలు కూడా ఇంద్రుని అంశలే అని ద్రౌపది కల్యాణ సమయంలో స్వయంగా వ్యాసుడు ద్రుపదునికి చెప్పాడు.
ఇదే కథను మార్కండేయ పురాణంలో మరోవిధంగా చెప్పారు. ఆ కదా ప్రకారం :

ఇంద్రుడు దేవతల రాజు. అత్యంత ధర్మవంతునిగా ఉండవలసిన భాద్యత అతనిది. కానీ ఆ విధంగా చేయవలసిన అనేక సందర్భములలో కొన్నిసార్లు అధర్మం చేయవలసి వచ్చింది. అలా అధర్మం చేసినప్పుడు అతనిలోని కొంత శక్తి కోల్పోతూ వచ్చాడు. అయితే అతను కోల్పోయిన ఆ శక్తి ఆయా సందర్భములలో అతనిని ఉద్దరించటానికి సహాయం చేసిన దేవతలకు ఆ  శక్తి అంశలుగా చేరాయి. మరి ఇంద్రుడు ఏ పనులు చేసాడు, ఆలా  చేసినప్పుడు  అంశ ఏ దేవతలను చేరిందో తెలుసుకుందాం!

అహల్యా వృత్తాంతం : గౌతమ ముని శాపం తర్వాత అత్యంత జుగుప్సాకరంగా మారిన అతని శరీరమును తిరిగి పూర్వ రూపం వచ్చేలా ప్రయత్నించిన వారు దేవా వైద్యులయిన  అశ్విని దేవతలు. కనుక ఇంద్రుడు ఆ సమయంలో కోల్పోయిన శక్తి ఈ సందర్భంలో అశ్వినీ దేవతలకు సంక్రమించింది.  

వృత్రాసుర వధ : వృత్రాసురుని వధ తరువాత అతనికి బ్రహ్మహత్యాపాతకం సంక్రమించింది. 
ఆ బ్రహ్మహత్యాపాతకమును కొంత తాను తీసుకున్న వాయుదేవునికి కొంత ఇంద్రతేజస్సు సంక్రమించింది. 

త్రిశిరుని వధ : త్రిశిరుడు అనే రాక్షసుని సంహరించిన తరువాత ఆ పాపంలో కొంత పాపం తాను తీసుకుని ఇంద్రునికి సహాయం చేసిన యమునిలో ఇంద్ర అంశ కొంత వచ్చి చేరింది. 

కనుక కుంతీ దేవి, మాద్రిదేవి వివిధదేవతలను ఉపాసించి పుత్రులను కోరినప్పుడు ఆయా దేవతలు వారివద్ద ఉన్న ఇంద్రుని అంశలను వారికి పుత్రులుగా ఇచ్చారు కనుక 

ధర్మరాజు - యమధర్మ రాజు అంశ గా వచ్చిన ఇంద్ర అంశ
భీముడు - వాయుదేవుని అంశగా  వచ్చిన ఇంద్ర అంశ
అర్జునుడు - ఇంద్రుని అంశ
నకుల,సహదేవులు - అశ్వినీ కుమారుల అంశగా వచ్చిన ఇంద్ర అంశ

కనుక అందరు పాండవులు కూడా ఇంద్రుని అంశలే. మరి ఇంద్రుని రాజ్యలక్ష్మి అయిన స్వర్గ లక్ష్మి  పాండవుల పట్ట మహిషి అయిన ద్రౌపది గా వచ్చినది.   

27, ఏప్రిల్ 2019, శనివారం

వాల్మీకి - ఒక ఆలోచన

ఇది వరకు మనం ఆధ్యాత్మరామాయణం లో శివుడి పార్వతితో చెప్పిన ఒక శ్లోకమును ఆధారముగా చేసుకుని వాల్మీకి ప్రచేతసుల కుమారుడు అని చెప్పుకున్నాం కదా! మరి మనకు తెలిసిన కథ సంగతి ఏమిటి? ఆ విషయం తెలుసుకునే ముందు అసలు మనకు తెలిసిన కథ ఏంటో ఇప్పుడు చూద్దాం!

అనగనగా ఒక బోయవాడు. వేటాడి తన కుటుంబాన్ని పోషించుకునేవాడు. వేట దొరకనప్పుడు దారి కాచి బాటసారులను దోచుకుని ధనం సంపాదించేవాడు. ఒకరోజు నారద మునిని అలానే బెదిరించగా తాను చేస్తున్నది పాపం కనుక ఆ పాపంలో వాని కుటుంభం సభ్యులు పాలు పంచుకుంటారేమో అడుగ మని చెప్పగా, బోయవాడు వెళ్లి అందరిని అడుగగా ఎవ్వరూ ఆ పాప భారమును స్వీకరించుటకు సుముఖంగా ఉండకపోవుట చూసి వైరాగ్యము కల్గిన బోయవాడు నారదుని కాళ్లపై పడగా , నారదుడు అతనికి "రామ" మంత్రం ఉపదేశించారు.  ఆ మంత్రము నోరుతిరుగక పోవుట వలన నారదుడు బోయవానికి "మర" అని పలుకమని తరుణోపాయము చెప్పారు. ఆ తారక మంత్రములో నిమగ్నుడయిన అతని చుట్టూ పుట్టలు పట్టాయి. కొన్ని రోజుల తరువాత ఆ పుట్టలోనుండి బయటకు చచ్చాడు కనుక అతనిని వాల్మీకి అని సంభోదించారు.

అయితే ఈ కథలోని కొన్ని భాగాలు కొంచెం ఆలోచిస్తే ప్రక్షిప్తాలేమో అనే అనుమానం తప్పకుండా వస్తుంది.

  1. ఈ కథ జరిగిన కాలం: రామాయణం ప్రకారం వాల్మీకి మహర్షి రామాయణ రచన రాముడు భూమిమీద నడయాడుతున్న కాలంలోనే జరిగింది, అనగా సుమారుగా త్రేతా యుగ చివరి సమయం . అంటే అతను తపస్సు చేసిన కాలం అంతకంటే ముందు అనగా ద్వాపర మధ్య లేక మొదటి భాగం.  మరి ఆ కాలంలో దారి దోపిడీ లు జరిగేవా? కొంచెం అనుమానమే కదా!
  2. కుటుంబ సభ్యులు పాప భారం తీసుకోము అని చెప్పటం: ఆ యుగములలో ఎవరి ధర్మం వారికి ప్రాణప్రదం. ఆ కాలం లో భర్త పాపములో భాగము తీసుకోను అని చెప్పే సందర్భం ఉండే అవకాశం ఉంటుందా?
  3. మంత్రం: మన సనాతన ధర్మములో ఉన్న అనేక మంత్రముల కంటే అతి చిన్నదయిన, సరళమయిన మంత్రం "రామ", ఈ మంత్రం నోరుతిరుగాక పోవటం, "మర" అనేది నోరు తిరగటం ఎంతవరకు నిజమై ఉండవచ్చు?
కనుక వాల్మీకి బోయవాడు అని చెప్పే విషయం కంటే వాల్మీకి ప్రచేతసుల కుమారుడు అని నమ్మటానికి కొంత అవకాశములు ఎక్కువగా ఉన్నాయి అని నా అభిప్రాయం!

25, ఏప్రిల్ 2019, గురువారం

ప్రచేతసులు - వాల్మీకి

ఇది వరకు మనం రామాయణం - వేదం అని ఎలా చెప్పవచ్చు? అనే దాని గురించి చెప్పుకున్నాం కదా! ఇప్పుడు అదే శ్లోకంలో ఒక విచిత్రమయిన విషయాన్ని గురించి చెప్పుకుందాం!
వేదవేద్యే పరే పుంసి జాతే దశరథాత్మజే 
వేదః ప్రాచేసాదాసీత్ సాక్షాద్రామాయణాత్మనా!

ఈ శ్లోకము ఆధ్యాత్మరామాయణం లోనిది. ఈవిధంగా సాక్షాత్తు శివుడు పార్వతికి చెప్పాడు. ఈ శ్లోకములో రామాయణము వేదమని మనం ఇంతకు ముందు చెప్పుకున్నాం. అయితే ఇక్కడ మనం ప్రస్తావిస్తున్నది వాల్మీకి గురించి. ఈ శ్లోకంలో శివుడు వాల్మీకి ని ప్రాచేసా అని సంబోధించారు. అంటే వాల్మీకి ని ప్రచేతసుని కుమారునిగా చెప్పారు. అది ఎలా సాధ్యం?

మనకందరికి తెలిసిన కథ ప్రకారం వాల్మీకి ఒక బోయవాడు. దారి దోపిడీ దొంగ. మరి ఆటను ప్రచేతసుల  కుమారునిగా శివుడు ఎందుకు చెప్పారు?

ప్రాచిన బర్హి గారి 10 మంది కుమారులను కలిపి ప్రచేతసులు అంటారు. వారు 10 మందికి ఒకరే భార్య. ఆమె పేరు మారిష. వీరి సంతానములలో మనకు బాగా తెలిసిన వారు దక్షుడు. వారికీ కల్గిన పడవ సంతానమే వాల్మీకి అని చెప్తారు. 

మరి వాల్మీకి బోయవాడు కాదా? అనే ప్రశ్నకు సమాధానం తరువాతి టపాలో చూద్దాం! 


22, ఏప్రిల్ 2019, సోమవారం

ఇతిహాసము - నిర్వచనము

మనం ఇంతకు ముందు పురాణముల నిర్వచనం గురించి తెలుసుకున్నాం కదా! ఇప్పుడు ఇతిహాసమునకు నిర్వచనము తెలుసుకుందాం!

ఇతిహాసము : అంటే ఇది ఈవిధముగా జరిగినది అని అర్ధము. దీనిని విపులంగా శ్లోకరూపంలో ఎలా చెప్పారో ఇప్పుడు చూద్దాం!

ధర్మార్ధ కామమోక్షాణాం ఉపదేశ సమన్వితం 
పూర్వ వృత్త కధా యుక్త ఇతిహాసం ప్రచక్ష్యసే!

దీని భావం: ఇదివరకు జరిగిన అనేక సంఘటనలను కధా రూపంలో  ధర్మార్ధ కామ మోక్షములను అన్వయించుచూ చెప్పేదే ఇతిహాసం.

14, ఏప్రిల్ 2019, ఆదివారం

రామాయణము - ఆధ్యాత్మిక అర్ధము

రామాయణము లోని  కధ చిన్నపిల్లలకు కూడా చాల బాగా తెలుసు. ఈ కధలోని విశిష్టత పట్టే, కొట్టే , తెచ్చే అను మూడు మాటలలో చెప్పవచ్చు. ఆలా కాకుండా సవిస్తారంగా వర్ణించవచ్చు. సర్వదా ఒక మానవుడు ఏ మార్గంలో చరించాలో చెప్పేది రామాయణం. ఇప్పుడు ఆ కథను మనం క్లుప్తంగా చెప్పుకుందాం! ఆ తర్వాత ఆ కధలో దాగిఉంది అని మన పెద్దలు చెప్పిన ఆధ్యాత్మిక కోణం గురించి తెలుసు కుందాం!
కథ : రాముడు సీత దంపతులు. పదితలలు ఉన్న రావణాసురుడు ఆమెను అపహరించి, సముద్రం అవతల లంకలో దాచివుంచాడు. అప్పుడు రాముడు హనుమంతుని సహాయంతో సీత లంకలో ఉన్నదని గుర్తించి రావణుని సంహరించి సీతను తిరిగి తెచ్చుకున్నాడు.

ఆధ్యాత్మిక అర్ధము: అర్ధము తెలుసుకోవటానికి ముందు ఇంకా కొన్ని విషయములు చూద్దాం!

రాముడు - పరబ్రహ్మ
సీత - జీవాత్మ / జీవరూపిణి
దశకంఠుడు, రావణుడు - దశ ఇంద్రియములు
సముద్రం - సంసారం
లంక - దేహం
హనుమంతుడు - గురువు

పరబ్రహ్మ నుండి జీవాత్మను దశ ఇంద్రియములు దూరం చేస్తాయి. పరబ్రహ్మ కు జీవాత్మకు మధ్య సాగరమే సంసారం మరియు దేహమనే లంకలో జీవాత్మ బంధించ బడింది. జీవాత్మ పరమాత్మను చేరుకోవాలంటే గురువు ప్రమేయం తప్పనిసరిగా అవసరం. 

8, ఏప్రిల్ 2019, సోమవారం

రామ, భారత, లక్ష్మణ, శత్రుఘ్న

రాముడు ఈ పేరు వింటే ఒక విధమయిన మానసిక శాంతి లభిస్తుంది కదా! పూర్వకాలంలో నవజాత శిశువులకు పేరు పెట్టవలసిన సందర్భంలో పెద్దలు వారి జాతకమునకు, వారి వ్యవహారమునకు, భవిష్యత్తులో వారు చేయబోయే కార్యములను ముందే సూచిస్తూ పేర్లు పెట్టేవారట. ఒకవేళ వారు పెద్దఅయిన తరువాత ఈ పేరుకు మించి వారు ఘనమైన పనులు చేస్తే వారికి అసలుపేరు కంటే వ్యవహార నామమే ఎక్కువ ప్రసిద్ధికి ఎక్కుతుంది.

ఉదాహరణకు రావణాసురుని పేరు చూడండి. పుట్టినప్పుడు పెద్దలు ఇతనికి అనేక కళలలో ప్రావీణ్యం ఉంటుంది. అత్యంత మేధాసంపన్నుడు, ఇతను ఒక్కడే పది మంది పుత్రులకు సరిపడు తెలివితేటలు కలవాడు అని "దశగ్రీవుడు" అని పెట్టారు. తీరా ఇతను పెద్ద అయిన తరువాత కైలాసపర్వతం ఎత్తినప్పుడు కలిగిన భాద వలన పెద్దగ రొద పెట్టి, శివుని చేత "రావణా" అని పిలిపించుకున్నాడు. ఇప్పుడు ఎవరిని ఐనా మీకు దశగ్రీవుడు తెలుసా అని అడగండి. గ్రీకు వీరుని తమ్ముడా అని మిమ్మల్నే అడుగుతారు.

అలాగే రామాయణంలో దశరధునికి పుట్టిన నలుగురు పుత్రులకు పేర్లు పెట్టే సమయంలో వారు అన్ని చూసి, వారికి సార్ధక నామదేయములు పెట్టారు. అవి రామ, భారత, లక్ష్మణ, శత్రుఘ్న. ఇంతకీ వారికి ఆ పేర్లు ఎందుకు పెట్టారో తెలుసుకోవాలంటే కింది పద్యం చూడండి.

గీ.  రాముడయ్యెను భువనాభి రాముడగుట
      లక్ష్మణుండయ్యె శౌర్యాదిలక్ష్మికతన
     భరము దీర్చెడివాడౌట భరతుడయ్యె
     దునుమువాడౌట రిపుల శత్రుఘ్నుడయ్యె

ఈ పద్యం శ్రీ పిసుపాటి చిదంబర శాస్త్రిగారు చెప్పిన "శ్రీమదాంధ్ర పద్మ పురాణం" లో పాతాళ ఖండంలో, పూర్వకల్ప రామాయణం లో చెప్పబడినది. 

6, ఏప్రిల్ 2019, శనివారం

భరతుడు వంటి సోదరుడు ....

భరతుడు, రామాయణం లోని అనేక వ్యక్తుల చేత అనుమానించబడిన వాడు. దశరధుడు, గుహుడు చివరకు తన సోదరుడయిన లక్ష్మణుడు కూడా అతనిని అనుమానించారు. అటువాని భరతుని గురించి శ్రీ రాముడు ఏమన్నాడో తెలుసా!
న సర్వే భ్రాతర స్తాత భవంతి భారతోపమాః 
 అంటే భరతుని వంటి సోదరుడు ఎవరికయినాను లభించుట దుర్లభము అని అర్ధము.  మరి శ్రీ రామునితో అంత చక్కగా తనగురించి చెప్పించుకున్న భరతుడు ఎలాంటి వాడు? నిజంగా శ్రీ రామునితో అటువంటి పొగడ్తలకు అర్హుడా?

అర్హుడే అని వాల్మీకి రామాయణం చెప్తుంది. దానికి కారణం అతని హృదయంలోగల భాతృ భక్తి. దానికి ఈ కింద శ్లోకమే తార్కాణం.

అభిషేక్ష్యతి రామతు రాజా యజ్ఞంను యజ్ఞంను యక్ష్యతే!
ఇత్యహం కృత సంకల్పో హృష్టో యాత్రా మాయాశిషం!!
తదిదం హ్యన్యధా భూతం వ్యవదీర్ణం మనోరమ !!!

     నేను ఏంతో సంతోషంగా తాతగారి ఇంటికి వెళ్ళాను. నేను అటు వెళ్ళగానే తండ్రిగారి అన్నగారయిన శ్రీరాముని రాజుగా ప్రకటించి, పట్టాభిషేకం చేసి ఆ తరువాత యాగాన్ని కూడా జరిపించి ఉంటారని అనుకున్న.  ఈ శ్లోకమునకు ఉన్న అర్థమును చూసి మన పెద్దలు భరతుని వ్యక్తిత్వమును చాలా చక్కగా విశ్లేషించారు. భరతుడు ఈ విధంగా అనుకున్నాడు అంటే, అతను శ్రీరామ పట్టాభిషేకం అతని పరోక్షంలో జరగాలని అనుకున్నాడు. అలా ఎందుకు అనుకోని ఉండవచ్చు? 2 కారణములు 
  1. భరతునికి రాజ్యకాంక్ష ఉండి శ్రీరామునికి పట్టాభిషేకం అవుతుంటే చూడలేక !
  2. భరతునికి దశరధుడు తన తల్లి కైకేయికి వివాహం జరిగిన సమయంలో ఆమె తండ్రికి ఇచ్చిన మాట తెలిసి. 
ఈ రెండు సందర్భాలలో మొదటిది అసలు సంభవమే కాదు, ఒకవేళ తాను శ్రీరామ పట్టాభిషేకం చూడలేక అమ్మమ్మగారి ఇంట్లో ఉండగా పట్టాభిషేకం జరిగి పోవాలి అని కోరుకుంటే, అతను తిరిగి వచ్చాక రాజ్యం అకంటకంగా తన పరం అవుతున్నప్పుడు మరలా రామునికోసం అడవులలోనికి పరుగులు పెట్టాడు కదా!
అంటే దీనిని బట్టి మన పెద్దలు ఎలా విశ్లేషించారంటే భరతునికి దశరధుడు తనతల్లికి ఇచ్చిన 2 వరముల గురించి తెలిసిన తెలియక పోయినా, తన తాతగారికి దశరధుడు ఇచ్చిన వాగ్దానం బాగా తెలుసు.  దశరధుని రాముని పైన గల ప్రేమ, రామునికి గ రాజ్య పరిపాలనా దక్షత , రాజ్యంలో ప్రజల కు రాముని పై గల ప్రేమ అన్ని తెలుసు. కనుక రాజ్యమును పరిపాలించే అవకాశం తనకు ఉంది తెలిసినా తన అన్నగారికి పట్టాభిషేకం జరగాలి అని కోరుకున్నాడు. మరి అటువంటి భరతుని గురించి రాముడు ఆలా చెప్పటం చాలా సబబే కదా!

4, ఏప్రిల్ 2019, గురువారం

సీతా రామ వియోగం

శ్రీరామ పట్టాభిషేకం తరువాత జరిగిన సంఘటనల క్రమాన్ని వివరించేది ఉత్తర కాండ. ఆ ఉత్తర కాండ లో ముఖ్యమయిన ఘట్టం సీతా రామ వియోగం. అయితే ఈ సీత రామ వియోగానికి గల కారణాన్ని అనేక పురాణములలో, అనేక కవులు రచించిన రామాయణములలో అనేక రకములుగా చెప్పారు. ఇప్పుడు వాని గురించి తెలుసు కుందాం. 
  1. వాల్మీకి రామాయణం: మనం అన్నింటికన్నా ముందు ముఖ్యంగా చెప్పుకోవలసినది వాల్మీకి రామాయణం గురించే. వాల్మీకి మహర్షి రాసిన రామాయణంలో శ్రీరాముడు రాజ్యంలో ప్రజలు ఏమనుకుంటున్నారు అని వేగులను అడిగినప్పుడు ప్రజల ఆంతర్యములో దానవుడు చెరబత్తిన స్త్రీ తమకు రాణిగా ఉండుట వారికి అంగీకారం కాదు అని అనుకుంటున్నారు అని మాత్రమే వేగులు చెప్పారు. ఆ విషయం విన్న శ్రీరాముడు రాజ్యంలోని ప్రజలకు సీత ఆమోదయోగ్యంగా లేదు కనుక సీతను పరిత్యజించాడు. 
  2. పద్మ పురాణం : పద్మ పురాణం లో ఈ సంఘటన  ఇప్పుడు మనమందరము చెప్పుకుంటున్న రాజకుని నింద  వలన జరిగినది అని చెప్పబడింది. అయితే ఆ రజకుడు కూడా అలా చేయటానికి కారణంగా ఒక కథను చెప్తారు. ఆ కథను ఇక్కడ చదవండి.  
  3. ఆధ్యాత్మ రామాయణం: ఈ రామాయణంలో సీత రాముడు ఏమి చేసినా చక్కాగా ముందే మాట్లాడుకుని వారు అనుకొనిన విధముగా చేస్తారు అని ప్రతిపాదించారు. సీతాపరిత్యాగ విషయముకూడా అంతే. వారు ఏకాంతములో ఉండగా సీతాదేవి దేవతలు తనను ముందుగా వైకుంఠమునకు రమ్మని కోరుతున్నారని చెప్పగా, శ్రీ రాముడు తనకు ముందుగానే ఈ విషయములు అన్ని తెలుసు కనుక దానికి సంబందించిన ప్రణాళిక సిద్దము చేసుకున్నాను అన్ని చెప్పారట. ఆ ప్రణాళిక ప్రకారమే లోక నింద మిషగా సీతను పరిత్యజించి, ఆమె ముని ఆశ్రమములో కుమారులను కనిన తరువాత లోకమునకు తన పాతివ్రత్యమును నిరూపించుకొను మిషతో భూగర్భమునకు తిరిగి చేరుకొనినది. అక్కడి నుండి వైకుంఠమునకు చేరినది. 

2, ఏప్రిల్ 2019, మంగళవారం

రామాయణం - వేదం

రామాయణం సాక్షాత్తు  వేదం అని చెప్తారు.

వేదవేద్యే పరే పుంసి జాతే దశరథాత్మజే 
వేదః ప్రాచేసాదాసీత్ సాక్షాద్రామాయణాత్మనా!

పరమాత్మ వేదవేద్యుడు. అంటే పరమాత్మ కేవలం వేదముల ద్వారానే తెలియదగినవాడు. అలాగే వేదములు కేవలం పరమాత్మగురించి మాత్రమే చెప్తాయి. కానీ ఒకసారి పరమాత్మ హఠాత్తుగా తన నామ,రూప, స్థానములను మార్చుకుని దశరథాత్మజుడు అయ్యాడట. అతని రూప, నామ , స్థానములు తెలియని వేదం సతమతమయ్యి అతని కోసం వెతికినదట. ఎక్కడ వెతకాలి తెలియక కవి మరియు ఋషి అయిన వాల్మీకి దగ్గరకు వచ్చిందట. అయితే పరమాత్మ రామునిగా ఉన్న విషయం తెలిసిన వాల్మీకి వేదము యొక్క రూపమును ఒక కావ్యముగా  మార్చినాడట.