మనం ఇంతకుముందు దమయంతి స్వయంవరమునకు దేవతలు వచ్చారని, వారు నలుని దమయంతి వద్దకు రాయభారానికి పంపారని, ఆ రాయబారాన్ని తీసుకుని నలుడు దమయంతి దగ్గరకు వెళ్ళడం గురించి చెప్పుకున్నాం!
నలుడు దమయంతి సమాధానాన్ని దేవతలకు చెప్పాడా? వారు స్వయంవరమునకు ఎలా వచ్చారు?ఆ తరువాత స్వయంవరం ఎలా జరిగింది? అని ఇప్పుడు తెలుసుకుందాం!
దమయంతి సమాధానమును నలుడు దిక్పాలకులయిన దేవతలకు తెలియజేసాడు. దమయంతి సమాధానమును విన్న దేవతలు ఆమె నిర్ణయాన్ని ప్రశంసించారు, కానీ వారు దమయంతి స్వయం వరమునకు తప్పకుండా రావాలని నిర్ణయించుకున్నారు. అప్పుడు దిక్పాలకులు నలుగురు (ఇంద్ర,వరుణ,అగ్ని మరియు యమధర్మరాజు) ఆ స్వయంవరమునకు నలుని రూపంలో వచ్చారు.
ఆ స్వయంవరమండపం లో అన్ని రాజ్యముల నుండి రాజులు వచ్చారు. వారిలో కొందరు కేవలం ఆమెను చూడడానికి మాత్రమే వచ్చారు. దమయంతి తన చేతిలో వరమాలతో ఆ మండపం లోనికి వచ్చింది. ఆఅమె పక్కన ఉన్న చెలికత్తెలు ఆమెకు ఒకొక్క రాజు గొప్పతనమును చెబుతూ వస్తున్నారు. అలా వస్తున్న వారికి ఒక దగ్గర ఐదుగురు నల మహారాజులు కనిపించారు. అప్పుడు చెలికత్తెలకు ఏమి చెప్పాలో అర్ధంకాలేదు. దమయంతికి కూడా ఏమీ చేయలేక చూస్తూ ఉంది. ఆమెకు అక్కడ ఉన్న ఐదుగురిలో ఒక్కడు నలుడు ఆని మిగిలిన వారు దేవతలు అని తెలుసు కనుక ఆమె వారిని మనస్సులోనే ప్రార్ధించడం మొదలుపెట్టింది. వారిలో మానవుడయిన నలుడు ఎవరో తెలుసుకొనగలిగే ఉపాయమును చెప్పమని కోరుకున్నది. ఆమె దృడసంకల్పానికి సంతోషించిన దేవతలు నిజమయిన నలుని పాదములు భూమిని తాకుతూ ఉంటాయని ఆమెకు స్పురించింది. ఆమె అక్కడ ఉన్న ఐదుగురు నలమహారాజులను గమనించింది. ఆ ఐదుగురిలో కేవలం ఒక్కరి పాదములు మాత్రమే నేలను తాకుతూ ఉన్నాయి. మిగిలిన నలుగురి పాదములు భూమిని తాకకుండా ఉన్నయి. అప్పుడు దమయంతి తన వరమాలను నలుని మెడలో వేసింది.
వారి వివాహాన్ని చూసి సంతోషించిన ఇంద్రుడు, నల మహారాజు చేసే ప్రతి యజ్ఞమునకు స్వయంగా వచ్చి హవిర్భాగమును స్వీకరిస్తానని, అగ్నిదేవుడు నలుని కోరికపై అతను ఎక్కడ కావాలంటే అక్కడకు వస్తానని, వరుణుడు కూడా నలుని కోరికపై ఎక్కడికి అయినా వస్తానని, యమధర్మరాజు నలుని మనస్సు ఎల్లవేళలా ధర్మం పైననే నిలచేలా చేస్తానని వరములు ఇచ్చారు.
కామెంట్లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి