మనం ఇంతకు ముందు లంక గురించి, ఎవరిది అనే విషయం గురించి, రాక్షసులకు మొదటగా ఆ లంక ఎలా లభించింది అని, రాక్షసుల సంతానము పెరగటం, ఆ లంకను వదిలి వారు వెళ్ళవలసిన సందర్భం ఎందుకు వచ్చింది, దశగ్రీవుడు నిజంగా అంత చెడ్డవాడా, కైకసి కుమారులు పొందిన వరముల గురించి తెలుసుకున్నాం కదా!
వారు పొందిన వరముల గురించి తెలుసుకున్న వారి తాతగారు అయిన సుమాలి, అతని మంత్రులు మారీచుడు, ప్రహస్తుడు మొదలగు వారితో కలిసి వారి వద్దకు వచ్చాడు. తాము సాధించలేనిది తమ వంశంలో వారు సాధించినందుకు ఎంతో సంతోషించారు. వారి స్వార్థం తిరిగి రెక్కలు తొడిగింది. చెప్పిన మాటలను చక్కగా వినే దశగ్రీవుని తన మాటలతో రెచ్చగొట్టారు.
లంక వారిదే కనుక, ప్రస్తుతానికి అక్కడ నివసిస్తున్న తన అన్నగారు అయిన వైశ్రవణుని అక్కడినుండి తరిమేయాలి అని, ఆ లంకను వారు సొంతం చేసుకోవాలని కోరారు. అంతే కాక అతనికి లభించిన
పుష్పకం అనే విమానం యొక్క గొప్పదనం గురించి తెలుసుకుని దానిని కూడా సొంతం చేసుకోవాలని కోరారు.
కానీ వారి మాటలు దశగ్రీవుడు అంగీకరించలేదు.
వారు సమయానుసారంగా దశగ్రీవునికి ఆ మాటలు చెప్తూనే ఉన్నారు. ఆ మాటలు వినగా వినగా చివరకు దశగ్రీవునకు ఆ మాటలు రుచించసాగాయి. అప్పుడు అతను వైశ్రవణుని వద్దకు ఒక దూతని పంపాడు. ఆ దూత చేత ఆ లంకా నగరం తమది కనుక తమకు అప్పగించమని రాయబారం పంపాడు.
తాను ఎంతో కష్టపడి నిర్మించుకున్న ఆ లంకానగరాన్ని వదలి వెళ్ళటం ఇష్టం లేకున్నా, దశకంఠుని మూర్ఖత్వాన్ని గురించి తెలుసు కనుక, తన తండ్రి విశ్రవసువు సలహా మరియు సూచనల మేరకు వైశ్రవణుడు ఆ లంకను వదలి,పుష్పక విమానంతో పాటు కైలాసపర్వత ప్రాంతమునకు వెళ్లి అక్కడ తిరిగి తన నివాసాన్ని ఏర్పాటు చేసుకున్నాడు.
కామెంట్లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి