3, మార్చి 2019, ఆదివారం

శివుని అష్టమూర్తులు

 శివుని అష్టమూర్తి తత్వముల గురించి మన పెద్దలు అనేక రకములుగా చెప్తూ ఉంటారు. ఇప్పుడు వాని గురించి అవి మనం మన కళ్ళతో దర్శించుకోవటానికి  వీలుగా ఎక్కడ వెలిశాయో చెప్పుకుందాం. ఇంతకూ ముందు మనం శివుని పంచభూత లింగముల గురించి చెప్పు కున్నాం కదా ఇప్పుడు వానితో పాటు మిగిలిన మూడు లింగముల గురించి కూడా చెప్పు కుందాం.
శివుని అష్టమూర్తులు  సర్వప్రాణకోటి యొక్క సృష్టి, స్థితి మరియు లయములకు మూలమై ఉన్నాయి. అవి :

  1. శర్వ : భూ రూపము : శివుడు భూమి తన రూపముగా కలిగి ఉన్నాడు. మనం భూరూపమున ఉన్న శివుని కంచి (తమిళ నాడు) లో ఏకామ్రేశ్వరునిగా దర్శించ వచ్చు 
  2. భవ : జల రూపము . శివుడు జలమే తనరూపముగా కలిగి ఉన్నాడు. మనం జలరూపమున ఉన్న శివుని జలగండేశ్వరము/ జంబుకేశ్వరం  (తమిళనాడు) లో జలగండేశ్వరునిగా దర్శించ వచ్చు. 
  3. రుద్ర : అగ్ని రూపము. శివుడు అగ్నిని తన రూపముగా కలిగి ఉన్నాడు. మనం అగ్ని రూపమయిన శివుడ్ని అరుణాచలం(తమిళనాడు) లో అరుణాచలేశ్వరుని గా దర్శించవచ్చు 
  4. ఉగ్ర: వాయు రూపము . శివుడు వాయువే తన రూపముగా కలిగి ఉన్నాడు. మనం వాయురూపంలో ఉన్న శివుని శ్రీ కాళహస్తి (ఆంధ్రప్రదేశ్) లో శ్రీ కాళహస్తీశ్వరునిగా దర్శించవచ్చు. 
  5. భీమ : ఆకాశ రూపం . శివుడు ఆకాశమే తన రూపంగా కలిగి ఉన్నాడు. మనం ఆకాశ రూపంలో ఉన్న శివుని చిదంబరం (తమిళనాడు)లో చిదంబరేశ్వరుని గా దర్శించవచ్చు. 
  6. పశుపతి : క్షేత్రజ్ఞ రూపం. అంటే ప్రతి జీవిలో ఉండే జీవాత్మరూపం. మనం ఈ క్షేత్రజ్ఞుడయిన రూపమును  ఖాట్మండు (నేపాల్)లో పశుపతినాధ్ గా దర్శించవచ్చు. 
  7. ఈశాన : సూర్య రూపం. సూర్యుడు స్వయంగా సూర్యునిగా ఉన్నాడు. మనం ఈ సూర్య రూపంలోని శివుని కోణార్క్ (ఒరిస్సా) లో సూర్య లింగునిగా దర్శించవచ్చు. 
  8. మహాదేవ : సోమ రూపం. శివుడు చంద్ర రూపంలో ఉన్నాడు. మనం సోమరూపంలో శివుని చట్టగావ్ (పశ్చిమ బెంగాల్)లో సోమనాథుని గా దర్శించవచ్చు. 
శివుడు సర్వ ప్రాణులయందు సర్వదా ఉంటాడు అనటానికి, ప్రతిజీవి పరమాత్మ రూపం అని చెప్పటానికి ఈ ఎనిమిది రూపములలో ఉన్న శివుడే తార్కాణం. ఎందుకంటే ఈ ఎనిమిది కాకుండా మరొక రూపం/ వస్తువు/ స్థితి ఈ సమస్త సృష్టి లో మరొకటి లేదు. 
ఓం నమః శివాయ 

కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి