27, అక్టోబర్ 2014, సోమవారం

ఉత్పలమాల - సురాష్ట్రుని మొదటి భార్య జన్మ వృత్తాంతం

ఉత్పలమాల సురాష్ట్రుని మొదటి భార్య. తమ అమాత్యుడు నరసింహశర్మ చేసిన తపస్సు ఫలితంగా సురాష్ట్రుడు అమితమైన ఆయుష్షు కలిగి ఉన్నాడు. కనుక కాల గమనంలో ఉత్పలమాల గతించి పోయినది.
మరు జన్మలో ధృఢధన్వుని వంశంలో జన్మించినది. కానీ ఆమెకు పూర్వజన్మ స్మృతి ఉన్నది. ఒకనాటి సమయంలో తన చెలికత్తెలతో వనము నందు సంచరిస్తుండగా, ఒక మునికుమారుడు ఆమెను చూసి, ఆమె అందమునకు వశుడయ్యి, తనను వివాహం చేసుకోమని కోరాడు.
ఆమెకు పూర్వజన్మ గుర్తు ఉన్న కారణంగా ఆమె మనస్సు నందు సురాష్ట్రుడు  ఉన్నాడు. కానీ ఆ విషయం బ్రాహ్మణకుమారునకు చెప్పనవసరం లేదని భావించి, " ఓ బ్రాహ్మణోత్తమా! నేను ఒక రాజ కన్యను, నీవు ముని పుత్రునివి! కనుక నీవు నీకు తగినట్లుగా ఒక బ్రాహ్మణ కన్యను చూసి వివాహం చేసుకో!" అని చెప్పినది.
అలా మాట్లాడుతున్న రాకుమారి తనను అవమానించినది అని భావించిన ఆ ముని కుమారుడు ఆమెను లేడిగా తిరుగుము అని శపించాడు.
ఆ శాపము విని భయం కలిగిన రాకుమారి ఆ ముని కుమారుని క్షమాపణ కోరి, శాపవిమోచనం చెప్పమనగా, ఆ ముని కుమారుడు ఆమె లేడిగా తిరుగుతున్న సమయంలో, సంభవించిన అత్యంత భయకరమైన వర్షం కారణంగా నీటిలో కొట్టుకు పోయే సమయమందు, నీ పూర్వజన్మ భర్త (సురాష్ట్రుడు) నిన్నుఆధారంగా చేసుకుని ఈది, గట్టుకు వచ్చిన సమయంలో, నీకు పూర్వజన్మ స్మృతి  కలుగుతుంది. అప్పుడు ఆ రాజు నీ కంఠమును కౌగలించుకొనిన మరుక్షనణం నీకు మానవ రూపం తిరిగి లభిస్తుంది. అప్పుడు నీవు అతనిని వివాహం చేసుకుని, కొంతకాలమునకు అతని కారణంగా ఒక మనువు కు జన్మనిస్తావు అని శాపవిమోచనం చెప్పారు.
కాలాంతరంలో  మనకు గల 14 మంది మనువులలో నాలుగవ వాడయిన తామస మనువు వారికి జన్మించాడు.  

కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి