3, సెప్టెంబర్ 2014, బుధవారం

కళావతి

 కళావతి, ఈమె గురించి మనకు ఎక్కువ తెలియదు. ఈమె కూడా శకుంతల వలే తల్లి తండ్రులవల్ల అరణ్యం లో విడువ బడినది. ఐతే ఎందుకు? ఆమె గురించి మనం ఎందుకు తెలుసుకోవాలి?

పూర్వకాలంలో పర అనే పేరుకలిగిన ఒక బ్రహ్మర్షి ఉండేవాడు. అతను చిన్నపటినుండి బ్రహ్మచార దీక్షలో ఉన్నాడు. అతను సర్వగుణ సంపన్నుడు. వేదములు,వేదాంగములు అవుపాసన పట్టినవాడు. చైత్రమాసం, కోకిలలు కూయుచున్న వేళ అతను ఉన్న ఆ ప్రదేశానికి పుంజికస్థల అనే ఒక అప్సరస వచ్చినది. ఆమెను చూడగానే పర బ్రహ్మర్షి మనసు మన్మధ తాపమునకు లోనయినది. వారి సంగమము వల్ల వారికి ఒక పుత్రిక జన్మించినది. పుత్రిక జన్మించగానే వారికి కలిగిన మోహపు తెరలు విడిపోయాయి. అప్సరస తన స్వస్థానానికి వెళ్ళిపోయినది, బ్రహ్మర్షి కూడా తన తపస్సు కొరకు ఆ పసిపిల్లను అడవిలో వదిలి వెళ్లి పోయాడు. అడవిలో అనేక క్రూరమృగముల మధ్య ఆ బాలిక కేవలం చంద్రుని అమృత ధారలను పానం చేస్తూ పెరిగినది. కనుకనే ఆమెను కళావతి అని పిలిచారు. ఎవరో ఒక మహాత్ముడు ఆమెను చేరదీసి పెంచాడు.
ఆమె సౌందర్యాన్ని చూసి ముగ్ధుడైన అలీన అనే ఒక అందమైన, దేవతలకు విరుద్ధంగా ఉండే ఒక గంధర్వుడు ఆమెను వివాహంచేసుకుంటాను అని ఆమె తండ్రి వద్దకు వచ్చి అడిగాడు. ఐతే ఆ తండ్రి ఆమెను ఆ గంధర్వునికి ఇవ్వటానికి ఇష్టపడలేదు.  తన ప్రస్తావనను నిరాకరించిన ఆమె తండ్రి మీద ఆ గంధర్వునికి విపరీతమైన కోపంవచ్చినది. వెంటనే గంధర్వుడు ఆమె తండ్రిని సంహరించాడు.
తన తండ్రి మరణానికి తానే కారణం అని భావించిన కళావతి ఆత్మహత్యా ప్రయత్నం చేసినది. ఆ సమయంలో ఆమెను ఒక దివ్య శక్తి అడ్డుకున్నది. ఆమే భవుని భార్య సతీదేవి. సతీదేవి కళావతిని అనునయించినది, ఆమెకు భవిష్యత్తు గురించి చెప్పినది.
"ఓ ప్రియ కళావతి! నీవు ఎంతో సుందరమైన దానివి. నీకు ఈ భూలోకంలో అత్యంత ఉత్తమమైన భవిష్యత్తు ఉన్నది. మునుముందు నీవు స్వరోచి అనే ఒక ఉత్తముని వివాహం చేసుకోవలసి ఉన్నది. అతనే స్వారోచిషుడు అనే మనువునకు తండ్రి కాగలిగిన వాడు. అతనికి నీ నుండి ఎంతో సహాయం జ్ఞాన రూపంలో అందవలసి ఉన్నది. లోక రక్షణార్ధమై నీవు ఈ పని చేయవలసి ఉన్నది కనుక స్వయంగా జ్ఞాన స్వరూపుడైన శివుని అర్ధంగిని, సతీ దేవిని అయిన నేను నీకు స్వయంగా పద్మిని విద్యను బోధిస్తాను. ఈ విద్య ద్వారా సర్వదేవతలు ఉన్నత గతిని పొందుతున్నారు." అని పద్మిని విద్యను కళావతికి భోదించినది.
కాలాంతరంలో కళావతి, విభావరి తో కలిసి మనోరమ అనే ఒక గంధర్వకాంతకు చెలికత్తెగా ఉన్నారు. వారు ముగ్గురూ స్వరోచిని వివాహంచేసుకున్నారు.
మనకు గల మనువులలో రెండొవవాడు ఐన స్వారోచిష మనువు,  జననమునకు కావలసిన సర్వగుణములు అతనికి చేరేలా రంగం సిద్ధం అయినది. 

కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి