4, సెప్టెంబర్ 2014, గురువారం

మనోరమ

మనోరమ మరుధన్వ మరియు విద్యాధర ఇందీవరాక్షుని పుత్రిక. ఈమెకు సర్వ ఆయుధములగురించిన, అస్త్రముల జ్ఞానము ఉన్నది. అన్నిటికి మించి హృదయజ్ఞానము తన తండ్రి నుండి లబించినది.
హృదయజ్ఞానము మొదట మహాదేవుడయిన శివుడు స్వయంగా స్వయంభుమనువునకు ఉపదేశించారు. తరువాత స్వయంభుమనువు సిద్దులలో ఉత్తముడయిన వానికి ఆ విద్యను ఉపదేశించారు. ఆ సిద్ధుడు చిత్రాయుధునకు ఉపదేశించాడు. తరువాత చిత్రాయుధుడు తన కుమార్తె కన్యాదాన సమయంలో అల్లుడయిన విద్యాధర ఇందీవరాక్షునికి ఉపదేశించారు. విద్యాధర ఇందీవరాక్షుడు తన పుత్రిక మనోరమకు చిన్నతనంలోనే ఉపదేశించారు.
ఒకసారి ఈమె తన చెలులైన కళావతి, విభావరి లతో కలిసి కైలాస పర్వతమునకు బయలుదేరినది. వారికి మార్గమధ్యంలో తపస్సులో మునిగి ఉన్న, శరీరం శుష్కించి ఉన్న ఒక ముని కనిపించాడు. వారు ఆ మునిని చూసి తన నవ్వును నిగ్రహించుకోలేక పోయారు. వారి నవ్వు వల్ల తపోభంగం కలిగిన ఆ ముని మనోరమను చూసి ఆమెను ఒన బ్రహ్మరాక్షసుడు తరుముతాడు అని శపించాడు. మనోరమ ప్రక్కనే ఉన్న కళావతి, విభావరి లకు కుష్టురోగము కలుగు గాక అని శపించాడు.
ముని శాపం అతని నోటినుండి వెలువడిన మరుక్షణం మనోరమను ఒక బ్రహ్మరాక్షసుడు తరుముతూ వచ్చారు. కళావతి, విభావరి లకు కుష్టురోగము వచ్చినది.
మనోరమ తనను తానూ కాపాడుకొనే ప్రయత్నంలో దిక్కులకు పరుగులు పెట్టసాగినది. అలా మూడు రోజుల నిరంతర ప్రయాణం తరువాత మంధర పర్వత ప్రాంతంలో పరుగెడుతున్న సమయంలో ఆమె స్వరోచిని తనను కాపాడవలసినదిగా ప్రార్ధించినది. ఆ సమయంలో స్వరోచి వద్ద ఏవిధమైన ఆయుధములు లేవు, ఆ విషయం గమనించిన మనోరమ తనవద్ద ఉన్న అస్త్ర జ్ఞానమును స్వరోచికి అందించినది. ఆ అస్త్రముల సహాయంచేత స్వరోచి మనోరమను తరుముతూ వచ్చిన బ్రహ్మరాక్షసుని మీద యుధానికి సంసిద్దుడయాడు.
బ్రహ్మరాక్షసుని మీద మొదటి అస్త్రం ప్రయోగించగానే ఆ బ్రహ్మరాక్షసుడు సుందరరూపం తో కనిపించాడు. అతనే మనోరమ తండ్రి  ఇందీవరాక్షుడు.
ఇందీవరాక్షుడు బ్రహ్మమిత్ర అనే ఒకమునివద్ద ఉన్న ఆయుర్వేద విద్యను తస్కరించుటకు ప్రయత్నించుట వల్ల అతని దుశ్చర్య కు కోపించిన బ్రహ్మమిత్ర ముని ఇందీవరాక్షుని బ్రహ్మరాక్షసునిగా మారమని శపించాడు. శాపవిమోచనం చెప్పమని ప్రార్ధించగా బ్రహ్మరాక్షసునిగా ఉన్నప్పుడు తన కుమార్తెను తినాలని ప్రయత్నించినప్పుడు ఒక వీరుని చేతిలో శాపవిమోచనం కలుగుతుంది, దొంగతనంగా పాప్తించుకున్న ఆయుర్వేద విద్యను అతనికి ఉపదేశించమని చెప్పారు.
ఇందీవరాక్షుడు ఆయుర్వేద విద్యను స్వరోచికి ఉపదేశించారు. అప్పుడు మనోరమ శాపకారణంగా అస్వస్థత చెందిన తన స్నేహితులను ఈ ఆయుర్వేద విద్య ద్వారా నయం చేయమని కోరినది. స్వరోచి వారిరువురికీ స్వస్థత చేకూర్చారు.
అప్పుడు కళావతి తన వద్ద ఉన్న పద్మిని విద్యను భోదించినది.
విభావరి తనవద్ద ఉన్న సర్వ జీవుల భాషలను అర్ధంచేసుకోగలిగిన జ్ఞానమును భోదించినది.
మనోరమ, కళావతి మరియు విభావరిలను స్వరోచి వివాహం చేసుకున్నాడు. 

కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి