శ్రీకృష్ణదేవరాయలు ఆస్థానంలో ఉన్న అష్టదిగ్గజ కవుల గురించి మనం ఇంతకు ముందు తెలుసుకున్నాం కదా! తన ఆస్థానంలో కావులకు స్థానం కల్పించి వారిని పోషించుటే కాక శ్రీకృష్ణదేవరాయలు స్వయంగా కవి. ఆయన ఆముక్తమాల్యద అనే ప్రబంధమును రచించారు. ఈ గ్ర్రంధము గోదాదేవి గురించిన కధను చెప్తుంది. ఆ ప్రబంధము మొదలుపెడుతూ శ్రీకృష్ణదేవరాయలు మొట్టమొదటగా చెప్పిన పధ్యం మనం ఇప్పుడు చెప్పుకుందాం!
శ్రీ కమనీయ హారామణిం జెన్నుగ దానును గౌస్తుభంబునం
దాకమలావధూటియు నుదారత దోప బరస్పరాత్మలం
దాకలితంబు లైన తమ యాకృతులచ్ఛత బైకి దోపన
స్తోకత నందు దోచె నన శోభిలు వేంకటభర్త గొల్చెదన్
అర్ధం ః
శ్రీ = లక్ష్మిదేవి, కమనీయ = అందమయిన, హార= హారమందలి, మణిన్= రత్నంలో, చెన్నుగ= గొప్పగా, తానును = తను, కౌస్తుభం = కౌస్తుభ మణి, నందు= లోపల, ఆ = ఆ, కమలావధూటియును = లక్ష్మీదేవియును, ఉదారత = గొప్పగా,తోపన్= ప్రతిబింభించగాఅ, పరస్పర = ఒకరికొకరు, ఆత్మలందు= హృదయము/ మసస్సులలో, ఆకలితంబులైన = ప్రేమగా నిలచి ఉన్న, తమ = తమ ఇద్దరి, ఆకృతులు = ఆకారములు, అచ్ఛతన్= శరీరముల స్వచ్ఛత చేత, పైకి తోపన్= పైకి కనిపిస్తూ ఉండగా, అస్తోకతన్= ఆధిక్యము వలన, అందున్= ఆ రత్నములందు, తోచె = కానవచ్చెను, అనన్ = అన్నట్లుగా, శోభిలు = ప్రకాశిస్తున్న, వేంకటభర్తన్ = వేంకటేశ్వరస్వామిని, కొల్చెదన్= నమస్కరిస్తాను.
తాత్పర్యంః
లక్ష్మీదేవియొక్క సుందరమయిన కంఠహారమందలి మణియందు వేంకటేశ్వరుడు, అతని కౌస్తుభమణిలోలక్ష్మీదేవి ప్రతిబింబించగా, పరస్పరము వారి మనస్సులందు ప్రేమాతిశయముచేత నిలచి ఉన్న తమ ఇద్దరి ఆకారములును శరీరము స్వచ్ఛముగా ఉండుట వలన బహిః ప్రకాశములై కనిపిస్తున్నశ్రీ వేంకటేశ్వరస్వామికి నమస్కరిస్తున్నాను.
కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి