21, ఆగస్టు 2020, శుక్రవారం

గణేషునికి ఒక చిన్న ఎలుక ఎలా వాహనం అయ్యింది?

మనం ఇంతకుముందు వినాయకుని గురించి చాలా విషయములు చెప్పుకున్నాం. అయితే అలా చెప్పుకున్నప్పుడు వినాయకుని వాహనం మూషికం అని చెప్పుకున్నాం!
వినాయకుని ఆహార్యం గురించి మనకు  తెలుసు. అటువంటి భారీకాయునికి ఒక చిన్న చిట్టి ఎలుక వాహనం ఎలా అయ్యింది? అని తెలుసుకోవటానికి ఒక చిన్న కధ ఉంది అది ఏమిటో ఇప్పుడు తెలుసుకుందాం!
ఒకానొక సమయంలో పరాశర మహర్షి ఆశ్రమంలోకి ఒక పెద్దదయిన ఎలుక వచ్చింది. అలా వచ్చిన ఆ ఎలుక ఆ ఆశ్రమంలో ఉన్న అందరిని ఇబ్బంది పెట్టసాగింది. ఆశ్రమంలోని సకల వస్తువులను పాడు చేయసాగింది.  మొక్కలను, వాటి పాదులను పాడు చేసింది. చివరకు మహర్షుల వస్త్రములను కూడా కొరికేయటం మొదలుపెట్టింది. వారు ఆశ్రమవాసులు అవ్వటంవలన వారు జీవ హింస చేయరు. కానీ ఆ ఎలుకను ఎలా వదిలించుకోవాలో వారికీ తెలియలేదు.
ఆ సమయంలో పరాశర మహర్షి శ్రీ మహాగణపతి  ని తమకు  సహాయం చేయమని కోరారు.వారి భక్తి శ్రద్ధలకు మెచ్చిన శ్రీ మహాగణపతి వారిని ఇబ్బంది పెడుతున్న ఆ భయంకరమైన ఎలుకను పట్టుకోవడానికి తమ చేతిలో ఉన్న పాశమును  విసిరారు. ఆ పాశము ఆ మూషికము యొక్క వెనుక తరిమి తరిమి పాతాళ లోకం వరకు వెళ్ళి మూషికమును బంధించి, దానిని తీసుకుని గణేషుని వద్దకు చేరింది. 
 అలా గణేషుని దగ్గరకు చేరిన మూషికం శ్రీ  గణేశుని స్తుతించటం ప్రారంభించింది. అప్పుడు గణేశుడు ఆ మూషికం పరాశరమహర్షిని, అతని ఆశ్రమవాసులను విసిగించినా ఇప్పుడు అతని శరణు కోరినది కనుక వరము కోరుకొమ్మన్నాడు.  గణేశుని ఆ మాటలు విన్న మూషికము భక్తిశ్రద్ధలతో, కొంత అహంభావంతో తనకు ఏ విధమైన వరమూ అవసరం లేదు అని అతనికి ఏమయినా వరం కావాలంటే కోరుకొమ్మని చెప్పినది. అలా గణేషునితో చెప్పిన మూషికమును తనకు వాహనంగా ఉండమని గణేశుడు అడిగాడు. తన అహంకారము తో ఆ మూషికం గణేశునికి వాహనంగా ఉండటానికి అంగీకరించింది. అయితే గణేశుడు ఒక్కసారి తనమీద కూర్చోగానే, దానికి తాను చేసిన తప్పు తెలిసిరాలేదు. అప్పుడు పశ్చాత్తాపం పొంది తిరిగి గణేశుని ప్రార్ధించింది. తనకి గణేశుని భారం వహించే శక్తిని ఇవ్వమని కోరుకున్నది. అప్పుడు గణేశుడు ఆ మూషికమునకు ఆ శక్తిని ఇచ్చాడు. అప్పటి నుండి అతను మూషిక వాహనుడు అయ్యాడు.
మన హిందూ ధర్మం లో ఉండే ప్రతీకాత్మకతను మనం గణేశుని ఆహార్యం లో చక్కగా చూడ వచ్చు. ఆ ప్రతీకాత్మకత తెలుసుకోవటం కోసం ఇక్కడ నొక్కండి.



కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి