7, మార్చి 2019, గురువారం

నటరాజ మూర్తి - ఆహార్యం

నటరాజ మూర్తి శివునికి గల అనేక రూపములలో ఒకటి అని మనం ఇంతకు ముందు చెప్పుకున్నాం కదా! అలాగే శివుని రూపం ఆహార్యం గురించి, వినాయకుని ఆహార్యం గురించి  దానిలో దాగి ఉన్న రూపాత్మకత గురించి కూడా ఇంతకు ముందు చెప్పుకున్నాం! ఇప్పుడు నటరాజ రూపం ఆహార్యం గురించి చెప్పు కుందాం.
ఇది నటరాజ స్వామి రూపం. ఇప్పుడు మనం ఈ రూపం, దీనిలోని విశేషములు గురించి తెలుసు కుందాం.

నటరాజ స్వరూపం పంచ కృత్యాత్మకం. ఇది శివుని సార్వభౌమత్వాన్ని సూచిస్తుంది.

  1. అపస్మారక పురుష : నటరాజు పాదముల కింద ఉన్న మానవుని రూపం అపస్మారక పురుషునిది. అపస్మారక స్థితిని నియంత్రణలో ఉంచితేనే జ్ఞానము ప్రకాశిస్తుంది అని దాని భావం 
  2. ఢమరు : పైన ఉన్న ఒక చేతిలో ఢమరు ఉంది. శివ రూప విశ్లేషణ లో మనం ఢమరు గురించి చెప్పు కున్నాం. ఇది నిరంతర జ్ఞాన ప్రవాహమునకు ప్రతీక 
  3. నిప్పు : పైన ఉన్న రెండవ చేతిలో నిప్పు ఉంది. ఈ నిప్పు లయమునకు ప్రతీక. అంతే కాకుండా మండపము వలే తన చుట్టూ అగ్ని కీలలు ఉంటాయి. ఇవి ప్రకృతి నటరాజ నాట్యమును సరిగా ప్రతిబింబిస్తాయి. 
  4. కింద ఉన్న ఎడమ చేయి పైకి లేచిన తన పాదమును చూపిస్తూ ఉంటుంది. తన పాదములను ఆశ్రయించమని దాని అర్ధం. 
  5. అభయ ముద్ర : క్రింద ఉన్న కుడి చేయి అభయ ముద్రలో ఉంటుంది. తన పాదములను ఆశ్రయించిన వారికి తన రక్ష సర్వదా ఉంటుంది అని ఈ అభయం. 
  6. జింక: కొన్ని చోట్ల నటరాజు చేతిలో జింక పిల్ల ఉంటుంది. జింక చంచలత్వమునాకు ప్రతీక. చంచలమయిన మనస్సును నియంత్రించుట అలవరచుకొమ్మని దాని అర్ధం. 
  7. పుర్రె : శివుని తలలో ఒక పుర్రె కనిపిస్తుంది. ఈ పుర్రె లయమునకు ప్రతీక 
  8. గంగ : నటరాజ సిగలోని గంగ కరుణకు ప్రతీక 
  9. నెలవంక : నటరాజ సిగలోని నెలవంక కాలమునకు ప్రతీక 
  10. భుజంగం : నటరాజు తలమీద ఉన్న పాము సహస్రార చక్రమును చేరుకొన్న కుండలిని శక్తి కి ప్రతీక
  11. మూడవ కన్ను : ఇది శివుని సర్వజ్ఞతకు ప్రతీక 
  12. మకర కుండలము: నటరాజ కుడి చెవికి మకర కుండలములు ఉంటాయి. ఇది పురుషత్వానికి ప్రతీక 
  13. తాటంకము: నటరాజు ఎడమ చెవికి తాటంకములు ఉంటాయి. ఇది స్త్రీత్వానికి ప్రతీక. 
  14.  పుఱ్ఱెల మాల: నటరాజు మెడలోని పుర్రెల మాల అనేక సృష్టి లయములకు ప్రతీకలు. 
  15. భస్మం : భస్మము స్వచ్ఛతకు ప్రతీక. ఈ వస్తువయినా అగ్నిలో పునీతమయితే మిగిలేది భస్మమే. అలాగే మానవుని జీవనానంతరం మిగిలేది కూడా భస్మమే. కనుక ఈ లోకములలోని ఆకర్షణలు చూసి దేవుని మరచిపోవద్దు అని హెచ్చరిక ఈ భస్మ దారుణం. 
  16. రుద్రాక్ష : ఈ రుద్రాక్షలు తన భక్తులు చేసిన పాపములు చూసి జాలితో దయతో శివుడు కార్చిన కన్నీరు అని చెప్తారు. కనుక రుద్రాక్షలు నటరాజు జాలి కి ప్రతీక 
  17. ఉపవీతం : నటరాజ స్వామి ఉపవీతంలో 96 పోగులు (దారపు వరుసలు) ఉంటాయట. ఇవి 96 తత్వములకు ప్రతీకలు అని చెప్తారు. ఇవి నటరాజు ధరించుట వలన వానికి అన్నింటికి తానే  అధిపతి అని అర్ధం. 
  18. పాము : నటరాజుని చుట్టుకుని ఉన్న పాము విశ్వశక్తి కి ప్రతీక 
  19. పులి చర్మం : పులి అహంకారమునకు, కామమునకు ప్రతీక. ఆ పులి చర్మమును ధరించుట వలన మన అహంకారమును, కామమును అదుపులో ఉంచగలను అని చెప్పుట. 



కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి