6, మార్చి 2016, ఆదివారం

శివుని ఆహార్యం - విశ్లేషణ

 సర్వదా సదాశివుడ్ని మనం అరూపరూపిగా అంటే లింగ రూపంలో చూస్తాం. కానీ మన పెద్దలు శివుని మానవ రూపంలో చూపే సందర్భంలో ఆతని ఆహార్యానికి ఎంతో విలక్షణతను ఇచ్చారు. మన హిందూ ధర్మంలో ఒక దేవతకు ఏదయినా ఒక రూపం ఇచ్చినప్పుడు, అది వారి ప్రత్యేకతను చాటటమే కాకుండా ఆ దేవత సర్వమానవాళికి ఇవ్వవలసిన/ ఇవ్వగలిగిన వరములు లేదా చేయగలిగిన కార్యములను ఒక చిన్న అమరిక ద్వారా చెప్తారు. మనం ఈ విషయాన్ని ఇంతకు ముందు వినాయకుని గురించి తెలుసుకున్నాం. ఇప్పుడు మహాదేవుని గురించి తెలుసుకుందాం!


శివుని ఆకారం మనకు సదా ధ్యాన మగ్నుడయి, చంద్ర మరియు సర్పాభరణ భుషితుడయి, తలపై గంగమ్మతో, పరచి ఉన్న జఠాజూఠంతో, వొంటినిండా విభూది రాసుకుని, నుదుటిన మూడవ కన్నుతో, మెడలో పుర్రెల మాల (కొన్ని చోట్ల), చేతిలో త్రిశూలం, ఢమరు ధరించి, నీలి కాంతులు వెదజల్లుతున్న దేహంతో, పులి/ ఏనుగు చర్మం ధరించి కనిపిస్తారు కదా ఇప్పుడు అవి అలా ఎందుకు ఉన్నాయో తెలుసుకునే ప్రయత్నం చేద్దాం!

  1. చంద్రుడు: శివుని తలపై చంద్రుడు ఉంటాడు. దీనికి రెండు కారణములు చెప్తారు.
    • చంద్రుడు మనః కారకుడు. మానవుని సుఖసంతోషములు అతని మనఃస్తితిపై ఆధార పడి ఉంటాయి కనుక శివుడు చంద్రుడ్ని ధరించాడు 
    • చంద్రుడు కాలమునకు ప్రతీక (కాలాన్ని చంద్రాయణాలుగా కొలుస్తారు). శివుడు కాలమును జయించినవాడు అని చెప్పటానికి చంద్రుడుని శివుని తలపై చూపిస్తారు. 
  2. భుజంగ భూషణం: శివుడు పాములను ధరించటానికి అనేక అర్ధములు చెప్తారు.  అవి 
    • పాములు నిరంతర జాగరూకతకు ప్రతీకలు. మనకు అత్యంత భయ కారకములు, వానిని ధరించుట ద్వారా శివుడు మనలను కాపాడతాను అనే అభయం ఇస్తున్నాడు. 
    • మెడ చుట్టూ తిరిగి ఉన్న పాము కాల చక్రంనకు సంకేతం.   
    • పాము ఆకారం కుండలిని శక్తిని పోలి  ఉంటుంది కనుక తనను భక్తిశ్రధలతో పూజిస్తే వారికి జ్ఞానమును ప్రసాదిస్తాడు.
    • పాము గర్వమునకు సూచిక. తన గర్వమును ఎవరైతే గెలుస్తారో వారికి అది ఒక ఆభరణం అవుతుంది తప్ప వారికి హాని చేయలేదు అని చెప్పటం 
    • పాము మానవుని కోరికలకు ప్రతిరూపం. శివుడు సకల కోరికలను జయించినవాడు కనుక ప్రతీకాత్మకంగా పాము అతనికి ఆభూషణం అయింది 
  3. గంగమ్మ : బ్రహ్మదేవుని, శ్రీ మహావిష్ణువును తాకి శివుని తలపై నిలచిన గంగమ్మ పవిత్రతకు ప్రతీక. గంగమ్మ నిరంతర ప్రవాహం జ్ఞానమునకు ప్రతీక. జలము, జ్ఞానము నిరంతరం ప్రవహిస్తూనే ఉండాలి. 
  4. త్రినేత్రం : మహాదేవుని నుదుటిన ఉన్న మూడవ నేత్రం సకల ద్వంద్వములకు అతీతమైన పరమ జ్ఞానమునకు ప్రతీక. ఇది సత్గురు కృపవలన మాత్రమే సాధ్యం కనుక దీనిని కన్నుగా సూచించారు.  దీని వలన మాత్రమే  గెలువగలరు. ఇది ఆజ్ఞా చక్రమునకు స్థానం. 
  5. భస్మం: 
    • స్థూలంగా చెప్పాలంటే సృష్టిలో ఉన్న ఏ వస్తువు అయినా అగ్నికి ఆహుతి అయితే మిగిలేది భస్మమే. కనుక శివుడు లయకారుడు  చెప్పేందుకు భస్మం ధరిస్తాడు.  
    • సూక్ష్మంగా చెప్పాలంటే భస్మం నిరంతర బ్రహ్మానందమునకు ప్రతీక. భస్మమునకు నాశనం లేదు. 
  6. త్రిశూలం:  ఇది శివుని ఆయుధం. అజ్ఞానమును అంతమొందిస్తుంది. శూలం అంటే సకల భాధలను తొలగించేది అని అర్ధం 
    • శివుడు త్రిగుణాతీతుడు (సత్వ రజః తమో గుణములకు అతీతుడు) అని చెప్పటం.
    • త్రికాలములు (భూత భవిష్యత్ వర్తమాన)  అధిపతి అని చెప్పటం 
    • త్రిస్థితులకు (జాగృత్, స్వప్న, సుషుప్తి) అధినేత అని చెప్పటం 
    • త్రితాపములను (ఆది దైవిక, ఆది భౌతిక, ఆధ్యాత్మిక) పోగొడుతుంది. 
  7. ఢమరు : 
  8. Image result for infinity symbol

    • ఈ సృష్టి వస్తూ పొతూ ఉంటుంది అని స్థూలంగా చెప్పటం ఈ ఢమరు ఆకారం చెప్తుంది. అంతేకాకుండా ఈ ఢమరు ఆకారం అనంతమునకు (infinity) ప్రతీక.
    • ఈ ఢమరు సృష్టిమొదటి శబ్దమును (ప్రణవమును) పలికింది. కనుక ఢమరు శబ్దమునకు ప్రతీక. ఈ సృష్టిలో సర్వం ఈ శబ్దమునకు చెందినదే. 
  9. జఠాజూఠం/శరీరపు నీలి క్రాంతి: నిజమునకు శివునికి ఒక ప్రత్యేకమయిన ఆకారం లేదు. మనం మన సౌకర్యార్ధం అతనికి ఒక రూపమును ఆరోపించాము. అతను సర్వత్రా ఆకాశం వలే వ్యాపకుడు అని చెప్పటానికి నీలి రంగు చూపబడినది. అతని పరచుకున్న జఠాజూఠం అతని సర్వవ్యాపకత్వమునకు సూచిక. 
  10. నంది వాహనం: నంది మహా దేవుని వాహనం మాత్రమే కాదు. అతని సర్వసైన్యాధి పతి కూడా. 
    • నంది ధర్మమునకు ప్రతీక 
    • నంది అంటే పశువు. పాశముతో కట్టబడునది, మనందరికీ ప్రతీక. తన నాధుడయిన పశుపతినాదునికి సదా వసీభూతమై ఉంటుది. 
    • నంది అంటే నిరంతర భగవత్ చింతన. ఎంతకాలమయినా సాక్షాత్కారం కోసం ఎదురు చూస్తూ ఉంటుంది. 
  11. పులి చర్మం: శివుడు పులి చర్మంపై కుర్చుని ఉంటాడు. పులి అంటే అతి క్రూర జంతువు. కాలం కూడా క్రురమైనదే. 
    • పులి అమ్మవారి (శక్తి) వాహనం. శివుడు సర్వ శక్తులకు అధిపతి. 
    • పులి కామమునకు ప్రతీక. శివుడు కామారి. 
  12. ఏనుగు / జింక చర్మం: శివుడు ఏనుగు లేదా జింక చర్మం కట్టుకుని ఉన్నట్లు చూస్తాం. 
    • ఏనుగు గర్వమునకు ప్రతీక. ఏనుగు చర్మం ధరించుట ద్వారా గర్వమును గెలిచిన వానిగా గుర్తించాలి
    • జింక అత్యంత ఉద్విగ్నంగా ఉంటుంది, మనసులా. ఉద్విగ్నమైన మనసును గెలిచినవాడు అని చెప్పటం 
  13. మెడలో పుర్రెల మాల: ఇది మనకు కొన్ని కొన్ని చోట్ల మాత్రమే కనిపిస్తుంది. 
    • శివుడు లయకారకుడు అని చెప్పటం.
    • సృష్టి ముగిసిన ప్రతిసారి బ్రహ్మగారి కపాలం ఆ మాలకు గృఛుతూ ఉంటారట. అంటే శివుడు అనంతుడు అని చెప్పటం. 

కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి