31, డిసెంబర్ 2015, గురువారం

నూతన సంవత్సర శుభాకాంక్షలు

కొందరు ఒక విచిత్రమైన వాదన వాదించుకోవటం  నేను విన్నాను. జనవరి ఒకటవ తేదిన నూతన సంవత్సరం జరుపుకుంటున్నారు కదా! మరి మన సంప్రదాయాలు వదిలేసినట్లేనా? అని. ఈ వాదన నాకు విచిత్రంగా అనిపించింది.
ప్రపంచం మొత్తం ఈ రోజున కొత్త సంవత్సరం వచ్చింది అని సంబర పడుతుంటే, కొందరు ఇలా! వాళ్ళ వాదనలో కొంతవరకు కాదనలేని నిజాలు ఉన్నా, ఖండించవలసిన విషయం కూడా ఉంది మరి. మనం ఒక విషయం చెప్పినప్పుడు విని మనముందు అంగీకరించి, పక్కకు వెళ్లి మనలను చూసి నవ్వుకునే వాళ్ళు ఈరోజుల్లో చాలా ఎక్కువ. వారి విషయం పక్కన పెడదాం.
అసలు విషయానికి వస్తే, మన కొత్త సంవత్సరం అదేనండి మన పండుగ "ఉగాది" నాటికి వాతావరణంలో మార్పులు కనిపిస్తాయి, మరియు ప్రకృతి శోభాయమానంగా ఉంటుంది కనుక మన పండుగ గొప్ప. కనుక అది జరుపుకుందాం. అని  అనుకుంటే మంచిదే. మీరు చాల చక్కగానే ఆలోచించారు. మీరు అక్కడితో ఆగితే సాహబాష్!
కానీ ఈ ఆలోచనకి  పైత్యాన్ని జోడించి, కొంచెం రెక్కలు తొడిగి జనవరి ఒకటవ తారీకున పండగ చేసుకునే వారందరినీ అవహేళన చేస్తూ ఉండకండి.
అలాంటి వారు ఒక్క విషయం గుర్తు ఉంచుకోండి. మీరు ప్రతిరోజూ చేసే ప్రతి పనికి ఆ రోజు తారీకు వేస్తారు కదా! మరి అది కూడా ఆంగ్లసంవత్సర మానం ప్రకారం వేస్తున్నారు. అంతే కానీ మన తిధివారములు వ్రాయటం లేదు. మరి అప్పుడు మీరు కూడా ఇప్పుడు తమరు వెలివేసిన ఆంగ్ల సంవత్సర మానం పాటించక తప్పటం లేదు కదా!
ప్రపంచంలో ఒక్కో ప్రదేశంలో ఒక్కో సమయం ఉంటుంది. అది ఆయా స్థలములను బట్టి మారుతుంది. ప్రపంచం మొత్తం ఒప్పుకుంటున్న ఈ తేదీలను మీరు కాదనలేరు. కాదని మీరు ఒక్కరు తిధి, వార ములను ప్రామాణికంగా పాటించలేరు. ఒక వేళ పాటించినా అది మీకు తప్ప వేరెవరికీ అర్ధంకాదు.  మరి అందరు సంతోషంగా ఉంటున్న ఈ సమయంలో, మీరు పాలు పంచుకోగలిగితే మంచిదే, అలా కాని సమయంలో ఎదుటివారి సంతోషాని చూసి మనం కూడా సంతోషిద్దాం.

సరే ఈ క్రొత్త సంవత్సరం మనందరిలో మరింత మంచితనం నింపాలి, మనం కన్న కలలు నిజం చేసుకునే మార్గం చూపాలి, కొందరికి అయిన మనం కొంత సహాయం చేయగలగాలి, మన జీవితాలలో మరింత మధుర జ్ఞాపకాలు మిగలాలి, మనతో పాటు మన మిత్రులు, శ్రేయోభిలాషులు, బంధువులు, పరిచయస్తులు, పరిచయంలేనివారు అందరూ సకల సంతోషాలతో ఉండాలి. అందరికీ ఈ ఆంగ్ల సంవత్సరాది మంచి ప్రారంభంకావాలి.   


మన పాత మిత్రుడు 2015 మనకు మిగిల్చిన జ్ఞాపకాలు, అనుభవాలు ఒక్కసారి తలచుకుందాం. ఏమైనా తప్పులు జరిగి ఉంటే సరిదిద్దుకునే ప్రయత్నం చేద్దాం. 2015 కు వీడ్కోలు పలుకుదాం. అందరం సంతోషంగా నూతన సంవత్సరం - 2016 కి స్వాగతం పలుకుదాం. 

మీ 
దీపిక 

కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి