9, మార్చి 2015, సోమవారం

విశ్వామిత్రుడు - ఆకలి

మనిషి భరించే అనేకమైన కష్టములలో ఆకలి అనేది అత్యంత భయంకరమైనది. ఇంతకు ముందు మనం చెప్పుకున్న అష్ట కష్టములలో యాచన అనేది ఆకలి తీర్చుకోవటం కోసమే కదా! అటువంటి ఆకలి మనిషిని ఎంత పని అయినా చేయిస్తుంది. మరి ఆ ఆకలి ఒక తపోధనుడయిన విశ్వామిత్ర మహర్షిచేత ఎటువంటి పని చేయించినదో  తెలుసుకుందామా?
ఇంతకూ ముందు సత్యవ్రతుని కారణంగా రాజ్యంలో తీవ్రమైన కరువు వచ్చినది అని తెలుసుకున్నాం కదా! ఈ సంఘటన ఆ సమయంలోనే జరిగినది. ఈ కరువు ప్రారంభం కాక మునుపే విశ్వామిత్రుడు బ్రహ్మర్షి పదవిని కోరి తపస్సు చేయటం కోసం తన భార్య బిడ్డలను వదలి, అరణ్యములకు వెళ్ళాడు.
కొంతకాలం తీవ్రమైన తపస్సు చేసాడు. అప్పటికి ఆ రాజ్యంలో కరువు వచ్చి 12 సంవత్సరముల కాలం అయింది. ఇంకా వర్షం పడలేదు. ఎక్కడా  పచ్చదనం అనేది లేదు. కాయలు కాసే చెట్లు  కాదుకదా, ఒక మొక్క కూడా లేవు. ఆ సమయంలో విశ్వామిత్రునికి తీవ్రమైన ఆకలి భాద మొదలయ్యింది. దానిని తీర్చుకొనుటకు అనేక మార్గములా ప్రయత్నించాడు. ఎక్కడా  ఒక్క ఫలం కూడా దొరక లేదు.
చివరకు ఆ అడవిలో ఒక ఇల్లు కనిపించినది. తీవ్రమైన ఆకలి భాద తట్టుకోలేక ఆ ఇంటికి వెళ్ళాడు. ఆ ఇంటి యజమాని నిద్రపోతున్నాడు. ఆకలి భాదను తట్టుకోలేని విశ్వామిత్రుడు నిద్రపోతున్న యజమానిని చూసి, అతనిని నిద్రలేపే ప్రయత్నం చేయకుండా, ఉట్టిపై ఉన్న కుండను క్రిందకు దించాడు. ఆ కుండలో వండిన కుక్క మాంసం ఉన్నది. మూత తీసిన మరుక్షణం అది కుక్క మాంసం అని  విశ్వామిత్రునికి తెలిసింది. కానీ తట్టుకోలేని ఆకలి కారణంగా, కుక్క మాంసం తినకూడదు అని తెలిసి కూడా తినటానికి నిర్ణయించుకున్నాడు.
సరిగా అప్పుడే ఆ ఇంటి యజమాని నిద్రలేచాడు. తన ఇంటికి ఒక దొంగగా వచ్చి, తన కుండను క్రిందికి దింపిన విశ్వామిత్రుడిని అనేక రకములయిన ప్రశ్నలు వేసాడు. ఆకలి మనిషిని ఇంతగా లొంగదీసుకుంటుంది అనే విషయం అర్ధమయిన విశ్వామిత్రుడు అతనికి నిజమును చెప్పాడు. ఆకలి కారణంగా పోతున్న ప్రాణమును నిలబెట్టుకోవటం ముఖ్యం కనుక ఆటవికుని ఇంటిలో పరమ దూష్యమయిన కుక్క మాంసం కూడా తినటానికి సిద్దమయిన విషయం చెప్పి, ఒకవేళ ఒక మునిగా తపస్సు చేసుకుంటున్న విశ్వామిత్రుడు కుక్క మాంసం తినటం వలన అతనికి పాపం వచ్చినట్లయితే, ఆ పాపం తనకు కాక, ఈ రాజ్యం మొత్తం ఆకలికి అల్లాడేలా చేసిన ఆ వరుణ దేవునికి వస్తుంది అని చెప్పాడు.
ఆ మాటలు అలా విశ్వామిత్రుని నోటినుండి వచ్చాయోలేదో అప్పుడే విపరీతమైన కుంభవృష్టి ప్రారంభం అయినది. అంటే రాజ్యమును ఆకలికి గురిచేసిన పాపం నుండి వరుణుడు తప్పుకున్నట్లు. 

కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి